ఈ మధ్య తెలుగులో మంచి లఘు చిత్రాలు వస్తున్నాయి. లఘు చిత్రాలకు నిర్వచనం నాకు తెలీదు. ఇప్పటి దాకా 15-25 నిముషాల నిడివితో వున్న చిత్రాలు చూశాను. ఈ “నీలకంటం బార్” నిడివి 38 నిముషాలు. అయితే వొకటి మెచ్చుకోవాలి. ఇంకా విస్తరింపచెయ్యడానికి వీలు వున్న కథా వస్తువును సాగదీసి పూర్తి నిడివి చిత్రం చేసి వుండ వచ్చు. కాని అప్పుడు బిగువు తగ్గే ప్రమాదమూ వుంది, లాఘవమైన చేతుల్లో ఆ ప్రమాదం తప్పే వీలూ వున్నది. ప్రస్తుతం చిత్రంలో మాత్రం ఎలాంటి అనవసర వాక్యం, ఫ్రేం లేకుండా ఎక్కువగా సంభాషణలతోనైనా, తగినన్ని దృశ్య కథనాలతో చాలా చక్కగా చెప్పిన సినిమా ఇది.
కథలన్నీ కలిసేది బార్ లో. అది నీలకంట బార్. అర్థ రాత్రి దాటింది. మూడే బల్లల దగ్గర మనుషులు ఉన్నారు. వాళ్ళకు సేవలందించడానికి వొక సర్వర్ సంతోష్ (బాగా చేశాడు కిరణ్ యర్నం). మొదట్లోనే టైటిల్స్ అప్పుడు పాత్రలు కనబడవు కాని ఇద్దరి మధ్య సంభాషణ. ఒకాయన తన మేనల్లుడు ఏక్సిడెంటు చేశాడనీ, ఆ మనిషి పోయాడని, తన మేనల్లుడికి ఏమీ కాకుండా చూసుకోమని డబ్బు ఇస్తాడు. నేను చూసుకుంటాలే పో అంటాడు భాస్కరరావు (ఆకేష్). మనకు తొలిగా కనబడేది అతనే. మరో బల్ల దగ్గర ఇద్దరు కుర్రాళ్ళు మందు తాగుతూ మరో మిత్రుడి గురించి ఎదురుచూస్తూ వుంటారు. ఎనిమిదింటికి రావలసిన ఆ మిత్రుడు అర్థరాత్రి దాటాక వస్తాడు. వాళ్ళ అంటే వరుణ్, కార్తీక్, ధరం (శరత్ చంద్రశేఖర కస్తూరి,కొట్ల శ్యాం,అర్జున్ ఆనంద్ మెనన్) ల మధ్య ముఖ్యంగా మాలస (స్నిగ్ధ బావా) ఆమె భర్త సుచిత్ (వికాస్ దర్శన్) ల గురించి మాట్లాడుకుంటూ వుంటారు. మూడో బల్ల మీద రవీందర్, గణేశ్ (ప్రవీణ్ క్రిషన్, చిదురుల రాజేశ్) లు ఒక ఫ్లాట్ అమ్మకంలో తనకు ఎగగొట్టిన కమీషన్ గురించిన చర్చ జరుగుతుంటుంది. మనుషులు సంఘజీవి కదా. తమ మనసుల్లో వున్న కథలను స్నేహితులతో, ఇంకొకళ్ళతో చెప్పుకోనిదే కుదరదు. ఇప్పుడు ఒంటరిగా వున్న భాస్కరరావు ఎవరికి చెప్పుకోవాలి? సర్వర్ సంతోష్ ని పిలిచి కూర్చోబెట్టి కథ చెబుతాడు. నీలకంటం అంటే తెలుసా అని మొదలు పెట్టి క్షీర సాగర కథనం కథంతా చెబుతాడు. ఆ కథతో పాటే ప్రస్తుత కాలంలో జరుగుతున్న అలాంటి సాగర మథనం కథే parallel గా నడుస్తూ వుంటుంది. మనిషంత పాతదే ఆ కథ. అమృతాన్ని, అమృతానికి దారిచ్చే తాళాన్ని నొక్కి పెట్టిన తాబేలు, అమృతం, ఈ కాలపు అమృతం అయిన డబ్బు, మోహిని, ఈ కాలంలో మోహిని అవతారం ధరించే స్త్రీ, ప్రాణాలు తీసే హాలాహలం అన్నీ వున్నాయి. వేరు వేరు కథలు వొక పూసల దండలా గుచ్చి చెప్పే కథల సినిమాలు ఈ మధ్య బాగా వస్తున్నాయి. వొక్క కేరాఫ్ కంచరపాలెం తప్పించి అన్నీ నమ్మించేలా, నిజాయితీగా కలపగలుగుతున్నాయి వేరువేరు పూసలని. అన్ని పాత్రలూ మన ముందే వున్న ఈ బారులో కూడా కథలన్నీ చక్కగా గుచ్చిన పూసల గొలుసులా వుండడమే కాకుండా layered కథనం తో మనల్ని ఆకట్టుకుంటుంది. ఇక కథ గురించి వివరాలు మీరు యూట్యూబ్ లోనే చూడాలి. కథంతా చెప్పించుకున్న సంతోష్ ఏం నేర్చుకున్నాడో గానీ, అందరూ వెళ్ళిపోయాక బల్లలన్ని తుడుస్తూ కనబడతాడు.
మొదటి క్రెడిట్ స్క్రీన్ ప్లే, దర్శకత్వానికే. దర్శకుడు కొట్ల ధీరజ్. ఇతని గురించి ఎక్కువ తెలీదు. కాని ఇది చూసిన తర్వాత వొక మంచి దర్శకుడు మనముందుకు వచ్చాడని మాత్రం చెప్పగలను. ఇతని నుంచి మరిన్ని మంచి చిత్రాలు వచ్చే అవకాశం వుంది. కథను చెప్పడానికి ప్రత్యక్షంగా మనకు కనబడేది ఛాయాగ్రాహకుడు. అతను చేసే పని దర్శకుని విజన్ కు అనుకూలంగానే వుంటూ దాన్ని ప్రేక్షకుడి దగ్గరకు సునాయాసంగా చెర్చేపని సాంకేతికతతో పాటు కళాత్మకత(creativity) కలిగి వుండాలి. ఆ పని శాంతన్ రెడ్డి, కృష్ణ తేజా సహాయం తో బాగా చేశాడు. ఇందులో వొక పాత్ర చేసిన శ్యాం కొట్ల (అది కొట్లనా కోట్లనా ఇంగ్లీషులో చదివిన నాకు అర్థం కాలేదు) దీనికి మంచి సంగీతం కూడా సమకూర్చాడు. తర్వాత చెబుతున్నాను గాని మొదటే చెప్పాల్సిన మాట ఇది : నటులు అందరూ చాలా బాగా చేశారు.
ఈ లఘు చిత్రాన్ని చూడమనే నా శిఫారసు.
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™