[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘మూలాలని మరచి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


వాడు అప్రయోజకుడిగా ఉన్నప్పుడు
నాన్న నిలువెత్తు ధైర్యంగా కనిపించేవాడు.
వీడు ప్రయోజకుడైనప్పటినుండి నాన్నతో
ఇక ఏ ప్రయోజనమూ లేదని..!
వాడు బుడి బుడి అడుగుల నుండి
వడి వడి అడుగులేసి..
అందలాల వరకూ..
అన్నమై పోషించిన అన్నపూర్ణ అమ్మని,
జంఝాటమని తలచి..
అవసరాలు, ఆడంబరాల
వెదుకులాటలో..
మానవత్వాన్ని అగాధాలలోకి వదిలి..
నిస్సహాయులైన
కన్న వాళ్లను గాలి కొదిలి..
కసాయి కబేళాకు పశువును తోలుతున్నట్టు..
తన మూలాలను కోసి అనాథాశ్రమాలకో
వృధ్ధాశ్రమాలకో విసిరేస్తున్నాడు.
నాగరికత పెరుగుతున్న నేపథ్యంలో
మానవ నైజంలో..
నకరాత్మకత పెచ్చు మీరుతున్నవైనం..
ఏమో! వాని సంతతి
రేపు వీనిని కూడా..
కబేళాకు పంపిస్తుందేమో!?
అలా జరగకూడదని ఆశిస్తే..
భావితరాలైనా..
మళ్లీ విలువల వైపు
అడుగులేస్తాయేమో!
చూద్దాం మరి..!

భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు,100 కవితలు రాశాను.