(సాస్రమ్) కష్టం భోః కష్టమ్! సఖే పశ్య, దైవ సంపదం దురాత్మన శ్చన్ద్రగుప్తస్య, కుతః...
(స+అస్రమ్=కన్నీటితో), కష్టం భోః+కష్టమ్=అయ్యయ్యో! సఖే=మిత్రమా, పశ్య=చూడు, దురాత్మనః+చన్ద్రగుప్తస్య+దైవసంపదం=దుర్మార్గుడైన చంద్రగుప్తుడి (పట్ల) విధివిలాసం! కుతః=ఎందుకంటున్నానంటే –
కన్యా తస్య వధాయ యా విషమయీ
గూఢం ప్రయుక్తా మయా
దైవా త్పర్వతక స్తయా స నిహతో
యస్తస్య రాజ్యార్ధహృత్;
యే శస్త్రేషు రసేషు చ ప్రణిహితా
స్తై రేవ తే ఘాతితాః,
మౌర్య స్యైవ ఫలన్తి పశ్య, వివిధ
శ్రేయాంసి మన్నీ తయః 16
తస్య+వధాయ=అతడిని చంపడం కోసం, యా+విషమయీ+కన్యా=ఏ విషకన్య అయితే, గూఢం+మయా+ప్రయుక్తా= రహస్యంగా నా చే ప్రయోగించబడిందో (నేను నియమించానో), తయా=ఆమె చేత, దైవాత్=విధివశాత్తు, సః+పర్వతక+యః+తస్య+రాజ్యార్ధ+హృత్ (తేన)=తన అర్ధరాజ్యాన్ని హరించకుండా చంద్రగుప్తుడి పక్షాన, నిహతః=ఆ విషకన్య చేత చంపబడ్డాడు,
యే=ఎవరైతే, శస్త్రేషు+రసేషు+చ+ప్రణిహితాః=ఆయుధాల ప్రయోగం కోసం, విష ప్రయోగాల కోసం నియమింపబడ్డారో (ఉంచబడ్డారో), తే=వారంతా, తైః+ఏవ=ఆ శస్త్ర, విషాదులతోనే, ఘాతితాః=చంపబడ్డారు,
మత్+నీతయః=నా రాజనీతి ప్రయోగాలు, శ్రేయాంసి=శుభాలను, మౌర్యస్య+ఏవ+ఫలన్తి=చంద్రగుప్తుడి పట్లనే సత్ఫలితాలు చూపిస్తున్నాయి. పశ్య=చూడు.
చంద్రగుప్తుణ్ణి చంపడానికి రాక్షసమంత్రి సిద్ధం చేసిన విషకన్య, చంద్రగుప్తుడి అర్ధరాజ్యం ఆశించిన పర్వతకుణ్ణి చంపడానికి చాణక్యనీతి కారణంగా ఉపయోగపడింది. పోనీ – విషప్రయోగాలతో, ఆయుధాల ద్వారా గాని చంపడానికి మనుషులను ఏర్పాటు చేస్తే – వాటితోటే, చాణక్యనీతి వారందరినీ చంపేసింది. – చూడగా – నా ప్రయత్నాలన్నీ చంద్రగుప్తుడికి మేలు చేసే విధంగా పరిణమించాయి – అని రాక్షసమంత్రి ఆవేదన.
విషమాలంకారం అని కొందరు. ఇక్కడ ఉద్దేశించిన ప్రయోగాలు విరుద్ధంగా ఫలించడం ఇందుకు కారణం.
(విషమం వర్ణ్యతే యత్ర ఘటనా నురూపయోః – అని కువలయానందం).
శార్దూల విక్రీడతం – మ – స – జ -స – త – త – గ – గణాలు.
అమాత్య, తథాపి ఖలు ప్రారబ్ధ మపరిత్యాజ్య మేవ. పశ్య!
అమాత్య=మంత్రివర్యా, తథా+అపి=అలాగు అయినప్పటికీ, ప్రారబ్ధమ్+ఏవ=ప్రారంభించిన (ప్రారంభింపబడిన) పని, అపరిత్యాజ్యం+ఖలు=విడిచిపెట్టకూడదు కద! పశ్య=చూడు –
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్న నిహతా విరమన్తి మధ్యాః
విఘ్నైః పునః పున రపి ప్రతిహన్య మానాః
ప్రారబ్ధ ముత్తమగుణా న పరిత్యజిన్తి. 17
నీచైః=తక్కువ బుద్ధిగలవారి చేత, విఘ్నభయేన=అంతరాయం కలుగవచ్చనే భయంతో, న+ప్రారభ్యతే+ఖలు=(మంచిపని) ప్రారంభింపనేబడదు కదా! మధ్యాః=మధ్యస్థంగా ఆలోచించేవారు (సందేహగ్రస్తులు), విఘ్న+నిహతాః=అంతరాయాలతో దెబ్బతిన్నవారై, ప్రారభ్య=ప్రారంభించి (కూడ), విరమన్తి=మానుకుంటారు. విఘ్నైః=అంతరాయాల చేత, పునః+పునః+ప్రతిహన్యమానాః=మళ్ళీ మళ్ళీ దెబ్బలు తగులుతున్నా, ఉత్తమ+గుణాః=శ్రేష్ఠ గుణ సంపన్నులు, ప్రారబ్ధమ్=ప్రారంభించిన పనిని, న+పరిత్యజిన్తి=విడిచిపెట్టరు.
ఒక్కొక్క సమాచారం వింటూ విషాదం పొంది కృంగిపోతున్న రాక్షసమంత్రికి, సఖుడైన విరాధగుప్తుడు ధైర్యాన్ని కలిగిస్తూ అంటున్న మాటలివి – “నువ్వు తక్కువవాడివీ కాదు, సందేహగ్రస్తుడవూ కాదు; ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకుని ప్రారంభించిన పనిని కొనసాగించగల ధీరుడివి – కృంగిపోకు – ఉత్తిష్ఠ, జాగ్రత!” అని ఊరడిస్తున్నాడు.
ఈ శ్లోకం భర్తృహరి సుభాషిత త్రిశతిలో కూడా ప్రసిద్ధంగా కనిపిస్తుంది. తెలుగు కవి ఏనుగు లక్ష్మణకవి యీ శ్లోకాన్నీ విధంగా అనువదించాడు – పద్య రూపంలో:
పద్యం:
“ఆరంభింపరు నీచ మానవులు వి
ఘ్నాయస సంత్రుస్తులై
ఆరంభించి పరిత్యజింతుదురు వి
ఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహస్య మానులగుచున్
థృత్యున్నతోత్తాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ
ప్రజ్ఞానిధలల్ గావునన్.”
వసంత తిలకం – త- భ – జ – జ – గ గ – గణాలు
భర్తృహరి తెలుగు పద్యం – శార్దూల విక్రీడతం.
అపి చ. –
కిం శేషస్య భరవ్యథా న వపుషి,
క్ష్మాం న క్షిప త్యేష యత్?
కిం వా నాస్తి పరిశ్రమో దినపతే
రాస్తే న య న్నిశ్చలః?
కిం త్వఙ్గీకృత ముత్సృజన్ కృపణవ
చ్ల్ఛాఘ్యో జనో లజ్జతే
నిర్వ్యూఢం ప్రతిపన్న వస్తుషు సతా
మేత ద్ధి గోత్ర వ్రతమ్॥ 18
ఏషశేషస్య=ఆదిశేషుడికి, యత్+క్ష్మాం+న+క్షిపతి=భూమిని క్రిందకి తోసివేసినంత మాత్రం చేత, వపుషి=శరీరంలో, భరవ్యథా+న+కిమ్=మోత కష్టం లేదా ఏమి?, యత్+నిశ్చలతః+న+ఆస్తే=కదలని స్థితిలో ఉండనంత మాత్రం చేత, దినపతే=సూర్యుడికి, పరిశ్రమః+వా+నాస్తి+కిం=అలసట లేదా ఏమి?, కిమ్+తు=లేక, కానే కాదు; శ్లాఘ్యః+జనః=ప్రశంసాపాత్రుడు కాగల వ్యక్తి, కృపణవత్=దయనీయుడి మాదిరి, అఙ్గీకృతమ్+ఉత్సృజన్=ఒప్పుకొనిన పనిని విడిచిపెడుతూ (మానడమంటే), లజ్జతే=సిగ్గుపడతాడు.
ప్రతిపన్న+వస్తుషు+ఏతత్+నిర్వ్యూఢం=అంగీకరించి (స్వీకరించిన) పనుల విషయంలో- నెరవేర్చడమనేది, సతాం=గుణ సంపన్నులకు, గోత్ర+వ్రతమ్=వంశాచారం!
ఆదిశేషుడు భూమిని మోయడంలో అలసట పొందడం లేదు. సూర్యుడు క్షణం నిలబడకుండా (వెలుగును ప్రసాదిస్తూ) సంచరిస్తున్నా అలసిపోవడం లేదు. బాధ్యతగా ఒక పనిని ఒప్పుకున్న గుణవంతులు, దానిని విడిచిపెట్టాలంటే సిగ్గుపడతారు. ఎందుకు? ఆ విధంగా కర్తవ్యం నెరవేర్చడం వారికి వంశాచారంగా వస్తూంటుంది. – అని విరాధగుప్తుడు రాక్షసమంత్రికి ఆత్మవిశ్వాసం నూరిపోస్తున్నాడు.
అర్థాంతర న్యాసం. (ఉక్తిరర్థాన్తర న్యాసా స్యాత్ సామాన్య విశేషయోః – అని కువలయానందం). ప్రస్తుతాప్రస్తుతాలు రెండిటిలో ఒకటి ప్రస్తుతానికి, మరొకటి అప్రస్తుతానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ధీరులు, గుణవంతులు తమకు నిర్దిష్టమైన పనిని విడిచిపెట్టరని చెప్పడం ప్రస్తుతార్థమైతే, ఆదిశేష, సూర్య ప్రస్తావనలు అప్రస్తుతార్థం ద్వారా ప్రస్తుతార్థాన్ని సమర్థించడం ఇక్కడ విశేషం).
సఖే, ప్రారబ్ధ మపరిత్యాజ్య మితి ప్రత్యక్ష మే వైత ద్భవతామ్. తతస్తతః.
సఖే=మిత్రమా, ప్రారబ్ధమ్+అపరిత్యాజ్యం+ఇతి=మొదలుపెట్టిన పనిని విడిచిపెట్టరాదు అనేది, భవతాం+ప్రత్యక్షమ్+ఏవ=మీకందరికీ కనిపిస్తున్న విషయమే! – తతః+తతః= (సరే) ఆ పైన ఏమి జరిగింది?
తతః ప్రభృతి చన్ద్రగుప్త శరీరే సహస్రగుణ మప్రమత్త శ్చాణక్యః ఏభ్య ఏత దీదృశం భవతీ త్యన్విష్య నిగృహీతవాన్ పురవాసినో యుష్మదీయా నాప్తపురుషాన్॥
తతః+ప్రభృతి=అప్పటి నుంచి, చాణ్యక్యః=చాణక్యుడు, చన్ద్రగుప్త+శరీరే=చంద్రగుప్తుడి శరీర రక్షణ విషయమై, సహస్రగుణమ్+అప్రమత్తః=వెయ్యిరెట్లు జాగరూకుడై ఉన్నాడు. ఏభ్య+ఏతత్+ఈదృశం+భవతి+ఇతి=వీరి కారణంగా ఈ విధంగా జరుగుతుంది – అని, అన్విష్య=వెదికి (మరీ), పురవాసినః+యుష్మదీయాన్+ఆప్తపురుషాన్=నగరంలో ఉండే నీకు ఆత్మీయులైన వ్యక్తులను, నిగృహీతవాన్=బంధించాడు (పట్టుకున్నాడు).
(సోద్వేగమ్) కథయ కథయ, కే కేనిగృహీతాః?
(స+ఉద్వేగమ్=ఆందోళనగా) కథయ+కథయ=(ఏదీ) చెప్పు చెప్పు; కే+కే+నిగృహీతాః=ఎవరెవరు బందీలయ్యారు?
ప్రథమం తావత్ క్షపణకో జీవసిద్ధిః సనికారం నగరాన్నిర్వాసితః।
ప్రథమం+తావత్=మొట్టమొదటగా, క్షపణకః+జీవసిద్ధిః=సన్న్యాసి జీవసిద్ధి, స+నికారం=అవమాన పూర్వకంగా, నగరాత్+నిర్వాసితః=పట్టణం నుంచి బహిష్కరణకు గురయ్యాడు.
(స్వగతమ్) ఏతావత్ సహ్యమ్, న నిష్ప్రరిగ్రహం స్థానభ్రంశః పీడయిష్యతి. (ప్రకాశమ్) వయస్య, క మపరాధ ముదిశ్య నిర్వాసితః?
(స్వగతమ్=తనలో) ఏతావత్+సహ్యమ్=ఆ మాత్రం సహించవచ్చు, నిష్ప్రరిగ్రహం=ఇల్లు, సంసారం, ఆదిగా ఏమీ లేని వాడిని (సన్న్యాసిని), స్థానభ్రంశః=వెళ్ళగొట్టడం, పీడయిష్యతి=బాధిస్తుంది. (ప్రకాశమ్=పైకి) వయస్య=మిత్రమా!, కం+అపరాధం+ఉదిశ్య=ఏ అపరాధం (నేరం) ఉద్దేశించి, నిర్వాసితః=బహిష్కరణకు గురయ్యాడు?
ఏష రాక్షస ప్రయుక్త యా విషకన్యయా పర్వతేశ్వరం వ్యాపాదితవా నితి।
ఏషః=ఇతడు (జీవసిద్ధి), రాక్షస+ప్రయుక్తయా+విషకన్యయా=రాక్షసుడు ఏర్పాటు చేసిన విషకన్య చేత, పర్వతేశ్వరం=పర్వతరాజును, వ్యాపాదితవాన్=చంపించాడు, ఇతి=అని.
(స్వగతమ్) సాధు కౌటిల్య సాధు!
స్వస్మిన్ పరిహృత మయశః,
పాతిత మస్మాసు, ఘాతితోఽర్ధరాజ్యహరః;
ఏక మపి నీతి బీజమ్
బహుఫలతా మేతి యస్య తవ. 19
(స్వగతమ్=తనలో) సాధు+కౌటిల్య+సాధు=బాగు కౌటిల్యా, బాగు –
స్వస్మిన్=తనయందు, అయశః=అపకీర్తి, పరిహృతమ్=తప్పిపోయింది, అస్మాసు=మామీద, పాతితమ్=వచ్చిపడింది, అర్ధరాజ్య+హరః=సగం రాజ్యాన్ని అపహరించగల (పర్వతరాజు) వాడు, ఘాతితః=చంపబడ్డాడు, నీతిబీజం+ఏకః+అపి=(ఇక్కడ) రాజనీతి అనే మొలక (విత్తనం), యస్య+తవ=ఏ నీకు, బహుఫలతామ్+ఏతి=అనేక ఫలాలను కల్పిస్తున్నది (అట్టి నీకు అభినందనలయ్యా!).
ఏకః క్రియా ద్య్వార్థకరీ బభూవ – అని అంటూంటారు. ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అని తెలుగు నానుడి. జీవసిద్ధిని బహిష్కరించడం ద్వారా – తన మీద పడవలసిన అపకీర్తిని చాణక్యుడు విషకన్య చేత పర్వతరాజుని చంపించడం ద్వారా రాక్షసమంత్రి మీదకు మళ్ళించడం మొదటి ఫలం. చంద్రగుప్తునికి దక్కిన రాజ్యంలో సగం భాగం దక్కవలసిన పర్వతరాజుని చంపించడం ద్వారా, చంద్రగుప్తుడికి లాభం చేకూర్చడం. ఆ హనన నేరం జీవసిద్ధి ద్వారా జరగడం – ఇందుకు కారణం.
అర్థాంతర న్యాసం.
ఆర్యావృత్తం.
(ప్రకాశమ్) తతస్తతః..
(ప్రకాశమ్=పైకి) తతః+తతః= ఆ తరువాత (ఏమైంది)?
తత శ్చన్ద్రగుప్త శరీర మభిద్రోగ్ధు మనేన వ్యాపారితా దారువర్మాదయ ఇతి నగరే ప్రఖ్యాప్య శకటదాసః శూల మారోపితః।
తతః=ఆపైన, చన్ద్రగుప్త శరీరమ్+ అభిద్రోగ్ధుం=చంద్రగుప్తుని శరీరానికి కీడు చేయడం కోసం, దారువర్మ+ఆదయః=దారువర్మ మొదలైనవారు, అనేన+వ్యాపారితాః+ఇతి=వాని ద్వారా (చేత) నియోగింపబడ్డారంటూ, నగరే+ప్రఖ్యాప్య=పట్టణంలో చాటించి, శకటదాసః+శూలం+ఆరోపితః=శకటదాసుకి ‘శూలం ఎక్కించడం’ అనే శిక్ష పడింది.
(సాస్రమ్) హా సఖే శకట దాస. అయుక్తరూప స్త వాయ మీ దృశో మృత్యుః, అథవా, స్వామ్యర్థ ముపరతో న శోచ్య స్త్వమ్, వయ మే వాత్ర శోచ్యా, యే నన్ద కులవినాశేఽపి జీవితు మిచ్ఛామః।
(స+అస్రమ్=కన్నీటితో) హా+సఖే+శకటదాస!=అయ్యో, మిత్రమా శకటదాసా!, తవ+అయం+ఈదృశం+మృత్యుః=నీకు యిట్టి మరణ దండనం, అయుక్తరూపం=తగనిది, – వా=అలా కాదంటే, స్వామి+అర్థం+ఉపరతః (అసి)=మన ప్రభువు కోసం కనుమరుగైపోయావు (అనుకోవాలి). త్వం+న+శోచ్యః=నీవు విచారించదగినవాడివి కావు (నిన్ను గురించి విచారించనక్కరలేదు) – యే+నందకుల+వినాశే+అపి+జీవితం+ఇచ్ఛామః=నందవంశం నిర్మూలమైపోయాకా కూడా జీవించాలని కోరుకుంటున్నామో అట్టి – వయం+ఏవ+శోచ్యాః=మేమే విచారించదగిన స్థితిలో ఉన్నాము.
అమాత్య, స్వామ్యర్థ ఏవ సాధయితవ్య ఇతి ప్రయతసే॥
అమాత్య=మంత్రివర్యా, స్వామి+అర్థః+ఏవ=ప్రభువు నిమిత్తం గానే, సాధయితవ్యః+ఇతి=కృషి చేయవలసి ఉందని, ప్రయతసే=నీవు ప్రయత్నం కొనసాగిస్తున్నావు.
సఖే,
అస్మాభి రము మేవార్థ మాలమ్బ్య, న జిజీవిషామ్,
పరలోకగతో దేవః కృతఘ్నై ర్నానుగమ్య తే ॥ 20
సఖే=మిత్రమా!
అముం+అర్థం+ఏవ+ఆలంబ్య=ఈ ప్రయోజనాన్ని పట్టుకునే, అస్మాభిః+జిజీవిషామ్+న=మేము జీవించాలనుకోవడం లేదు.
పరలోక+గతః+దేవః=పరలోకానికి పోయిన ప్రభువు, కృతఘ్నైః (అస్మాభిః)=కృతఘ్నుడనైన నా చేత (అస్మాభిః=పూజ్యార్థంలో బహువచనం), న+అనుగమ్యతే=అనుసరించి వెళ్ళడం సంభవించలేదు.
మిత్రమా! మేము జీవించాలనుకోపోవడానికి అది కారణం కాదయ్యా. ప్రభువు మరణించగా, వారి వెంట మేమూ మరణించవలసిన మాట. అది జరగలేదనే విచారం – అంటున్నాడు రాక్షసమంత్రి. విరాధగుప్తుడు పలికే అనునయ వాక్యాలు రాక్షసమంత్రికి తన ప్రయత్నాలన్నీ విఫలమైన యీ వేళ రుచించడం లేదు.
కథ్యతా, మపర స్యాపి సుహృద్వ్యసనస్య శ్రవణే సజ్జోఽస్మి॥
అపరస్య+అపి+సుహృత్+వ్యసనస్య+శ్రవణే=మరొక మిత్రునికి తటస్థించిన ఆపదను వినడానికి, సజ్జితః+అస్మి=సిద్ధంగా ఉన్నాను.
ఏతదుపలభ్య, చన్దన దాసే నాపవాహిత మమాత్యకళత్రమ్॥
ఏతత్+ఉపలభ్య=ఈ శకటదాస శూలారోపణ శిక్ష గురించి తెలిసికొని, చన్దనదాసేన+అమాత్యకళత్రమ్+అపవాహితమ్=చందనదాసు (చేత) మహామంత్రి వారి (తమరి) భార్య (ను) దూరంగా తప్పించివేశాడు (వేయబడింది).
క్రూరస్య చాణక్యవటోః విరుద్ధ మయుక్త మనుష్ఠితం తేన॥
తేన(కార్యేణ)=అటువంటి పని చేసిన (చేయడం వల్ల), క్రూరస్య+చాణక్యవటోః=దుర్మార్గుడు కుర్రవాడు చాణక్యుని (యొక్క) పని – అయుక్తం+విరుద్ధం+అనుష్ఠితమ్ (ఇతి భావ్యమ్) =తగనిది, విరుద్ధమైనదిగా చేయబడినది (అని తలపోయాలి).
(దుర్మార్గుడు ఈ కుర్ర చాణక్యుడు తగని విధంగా, విరుద్ధంగా అటువంటి పని చేశాడనుకోవాలి).
అమాత్య, న న్వయుక్తతరః సుహృద్ద్రోహః।
అమాత్య=మంత్రివర్యా, సుహృత్+ద్రోహః=స్నేహితునికి (పట్ల) చేసిన అపకారం, అయుక్తతరః+నను!=తగదుగాక తగదు కదా!
తతస్తతః?
తతః+తతః=ఆ తరవాత (ఏమి జరిగింది?)
తతో యాచ్యమానే నానేన న సమర్పిత మమాత్య కళత్రం యదా, త దాతికుపితేన చాణక్యవటునా…
తతః=పిమ్మట, యదా+యాచ్యమానేన+అనేన (చాణక్యవటునా)+అమాత్య+కళత్రం=ఎప్పుడైతే యీ చాణక్య కుర్రగాడు మహామంత్రి వారి భార్యను అప్పగించమని కోరగా, న+సమర్పితం=అప్పగించబడలేదో, తదా=అప్పుడు, అతికుపితేన+చాణక్యవటునా=మిక్కిలి కోపించిన చాణక్య కుర్రగాడు (వాని చేత)…
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™