సీ. 1
బాధ, సంతోషము, భక్తి, పరవశము
ఆగ్రహావేశములన్ని తెలుప;
మంచి, మర్యాదలు మరియు గౌరవమును
ప్రేమ, దయయు, మైత్రి కోమలముగ;
తెలుపగలము సుమ్మి తెలుగునందు మిగుల
మాతృభాష కనుక మక్కువగను:
అట్టి భాష మనము అరసికాపాడగా
పూనుకొనవలయు పుణ్యమదియె.
ఆ.వె.
అమ్మభాషయనిన యమృతమువంటిది,
గ్రోలుకొలది తీపి గోముగాను
ఎన్నియైన నేర్వ యితరభాషల నీవు
మరువవలదు నీదు మాతృభాష!
* * *
సీ. 2
భారతమ్ము మరియు భాగవతమ్ములు
రామాయణమువంటి రచనలెల్ల;
పరమభాగవతులు బమ్మెర పోతన
నన్నయాదికవుల వెన్నమనకు!
కథలు, గల్పికలును కావ్యనాటకములు,
నవల,రూపకములు నవ్యరుచులు;
కృతులు, కీర్తనలును, గేయములెన్నియో
సాహిత్యరూపున సంపదలివె.
ఆ.వె.
కాచుకొనవలయును కమ్మని నిధులను
అక్షరముల వ్రాసి లక్షణముగ
దోషరహితముగను భాష పలుకవలె
మాతృభాష పట్ల మమత కలిగి!

సమాజంలోని సమస్యలను, విషయాలను కథాంశాలుగా చేసుకుని కథారచన కొనసాగిస్తున్నారు నండూరి సుందరీ నాగమణి. వివిధ దిన, వార, మాసపత్రికలలో 350కి పైగా కథలు ప్రచురితమయ్యాయి. ‘అమూల్యం’, ‘నువ్వు కడలివైతే…’, ‘పూల మనసులు’ అనే కథా సంపుటాలు ప్రచురించారు. ‘స్వాతిముత్యం’, ‘తరలి రావే ప్రభాతమా’, ‘అతులిత బంధం’ అనే మూడు నవలలు ప్రముఖ పత్రికలలో ధారావాహికలుగా ప్రచురితమయ్యాయి.