[సుగుణ అల్లాణి గారు రచించిన ‘నీలో నీవై..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


గుండె అట్టడుగు పొరలను తట్టి చూడు
మమతల వెల్లువ ఉప్పొంగి పారదా!
అనుమానపు ముల్లును పెకిలించి చూడు
కళ్ల ముందు పచ్చనిపూల పల్లకి కనిపించదా!
మనుస్సు నొప్పించకుండా మాటాడి చూడు
స్నేహపు తోట నీ ముంగిట విరియదా!
అర్థించే చేతులకు ఆసరా ఇచ్చి చూడు
ఆనందమంతా నీ మదిలోనే నిలిచిపోదా!
నాదను స్వార్థాన్ని విడనాడి చూడు
అంబరమంత అభిమానం నీదై పోదా!
నీలోని అసూయను ఆవలకు నెట్టి చూడు
అవని అంతా నీకు అనుకూలమై పోదా!
ఎదనిండా ప్రేమను నింపుకుని చూడు
మది గదినిండా వెన్నెల వెలుగులే కదా!
ఒకసారి నీ అంతరంగం లోకి తొంగిచూడు
వన్నె తేలిన వ్యక్తిత్వం నిను పలకరించదా!

శ్రీమతి అల్లాణి సుగుణ పుట్టి పెరిగింది హైదరాబాద్లో. అత్తవారిల్లు కూడా హైదరాబాదే! పదవ తరగతి పూర్తవుతూనే పదహారేళ్లకు పెళ్లైతే, ఆ తర్వాత MA B.Ed వరకు చేయగలిగారు.
వారి శ్రీవారు మడుపు శ్రీకృష్ణారావు గారు విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి. వారికి ఒక్కగానొక్క కూతురు. ఆర్కిటెక్ట్. చదువు మీద అత్యంత ఆసక్తి, ప్రీతి కలిగిన రచయిత్రి అత్తగారు శ్రీమతి లక్ష్మీబాయి గారు సుగుణగారిని కాలేజీకి పంపి చదివించారు. ఆ ప్రోత్సాహమే ఈనాడు తాను రచయిత్రి/కవయిత్రిగా పరిచయం చేసుకొనే అవకాశం కలిగిందని చెప్పడానికి గర్విస్తారు.
ముప్పై సంవత్సరాలు వివిధ పాఠశాలలలో తెలుగు అధ్యాపకురాలిగా చేసి ప్రస్తుతం మనుమలతో ఆడుకుంటున్న అదృష్టవంతురాలినని అంటారు సుగుణ. ఈ విశ్రాంత జీవనంలో అప్పుడప్పుడు అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ iPad లో కథలు చదువుతూ చిన్న చిన్న కవితలు కథలూ రాస్తూ TV లో సినిమాలు చూస్తూ స్నేహితులను కలుస్తూ కావలిసినంత సంతోషాన్ని పంచుతూ ఆనందపడుతూ కాలం గడుపుతూ ఉంటారు.
3 Comments
సుగుణ అల్లాణి
నమస్తే సర్! నా రచనలను ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు సంచిక టీం కి హృదయపూర్వక ధన్యవాదములు
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ కవిత బాగుంది
అభినందనలు/శుబాకాంక్షలు
–డా కె.ఎల్.వి.ప్రసాద్
సుగుణ అల్లాణి
ధన్యవాదాలు సర్!