సదాశివం బోళా మనిషి. ఎంత పెద్ద విషయమైనా సున్నితంగానే మాట్లాడేవాడు. ఎవరికైనా సాయం కావాలంటే తనకి ఉన్నంతలో చేసేవాడు. అబద్దం, మోసం రెండూ ఘోరమైన పాపాలని అతను నమ్ముతాడు. అతను ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ గా పని చేస్తున్నాడు. అతను ఎప్పుడూ లేనిపోని బెనిఫిట్స్ చెప్పి, రేపు మీరు ఊహించనంత పెద్ద మొత్తం తొందరలోనే వస్తుందని అబద్దాలు చెప్పి ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించే ప్రయత్నం చేయలేదు. ఇన్‌కంటాక్స్ నుండి తప్పించుకునేందుకు మాత్రమే పాలసీ చేస్తాం అనే వారి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. దాంతో ఇరవై సంవత్సరాల క్రితం పాలసీ ఏజెంట్‌గా జాయిన్ అయినవాడు, సీనియర్ పాలసీ ఏజెంట్‌గా మాత్రమే మారగలిగాడు తప్ప ఏ మాత్రం పెద్ద ప్రమోషన్స్ చేజిక్కుంచుకోలేకపోయాడు. తనతో పాటు ఉద్యోగంలో చేరిన వారంతా, ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్లుగా కొనసాగుతున్నారు. ఉండబట్టలేక ఓసారి కేశవ అనే ఓ స్నేహితుడు, “ఏంట్రా శివం నువ్వు, సత్తెకాలపోడు లాగా ఇంకా మంచి చేస్తా, మంచిని బుజాలపై మోస్తా అని కూర్చుంటే నీ ఇంట్లో మంచం కూడా మిగలదు. అయినా కిందా మీదా పడైనా ఓ పైసా ఎక్కువ ఎలా సంపాదించాలి, తిమ్మిని బమ్మిని చేసైనా ఓ ఆస్తి ఎలా కూడబెట్టాలి అనే ఆలోచనే లేదేంట్రా నీకు. నీ ఈ అమాయకత్వం చూసే నీ స్నేహితుడు ఒకడు, నీ దగ్గర రెండు లక్షలు తీసుకు ఎగ్గొట్టాడు. అసలు ఇలా అయితే ఇంటర్ చదివే నీ కొడుకుని రేపు పెద్ద చదువులెలా చదివిస్తావ్. డిగ్రీ చదివే నీ కూతురికి మంచి సంబంధం ఎలా తెస్తావ్ రా?” అడిగాడు నెత్తీ, నోరు బాదుకుంటూ. “అన్నిటికీ ఈశ్వరుడున్నాడురా. మనం మంచి చేస్తే అదెక్కడికీ పోదు. అది ఈరోజు కాకపోతే రేపు నా బిడ్డలని కాపాడుతుంది” అని మామూలుగా నవ్వేసాడు. కేశవ చెప్పినట్టుగా, ఇది వరలో తన దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేసిన స్నేహితుడు, ఇప్పుడు ఓ సారి కలుద్దాం రమ్మంటే, హుటాహుటిన అతని దగ్గరకి వెళ్ళాడు సదాశివం. కానీ విధివశత్తూ, వస్తూ యాక్సిడెంట్‌కి గురయ్యాడు. అక్కడి వారు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో తండ్రిని అలా చూసిన కొడుకు కళ్ల నీళ్ళు పెట్టుకున్నాడు. “ఏడి నాన్నా ఈశ్వరుడు. అన్నిటికి ఆయనున్నాడంటావుగా. అలాగే మంచి చేస్తే ఎక్కడికీ పోదూ అనేవాడివి. ఇప్పుడు చూడు ఏం జరిగిందో” కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు మాధవ్. ఆ మాటలకి సదాశివం మాధవ్ తల నిమురుతూ “నువ్వే నా కంటికి ఈశ్వరుడిలా కనిపిస్తున్నావు రా మాధవా. మీ అమ్మకి అండగా నిలుస్తావు. మీ అక్క చదువయ్యాక ఓ అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసే పెద్దవవుతావు, నా తర్వాత ఈ ఇంటిని చక్కదిద్దే బాధ్యత తీసుకునే నీలోనే నాకు ఆ ఈశ్వరుడు కనిపిస్తున్నాడు” చెప్పాడు సదాశివం కొంచెం తడబడుతూ. “చేస్తా నాన్నా. నీకేమీ కాదు. ఒక వేళ దేవుడు చిన్న చూపు చూసి నీకు ఏదైనా జరిగితే, తప్పక నువ్వు లేని లోటు అమ్మ, అక్క మరిచిపోయేలా బాధ్యతగా ఉంటాను నాన్నా. కానీ నాలో ఈశ్వరుడు ఏంటి నాన్నా” అడిగాడు కళ్ళు ఒత్తుకుంటూ. “భగవంతుడంటే ఎవరు మాధవా. మనం కష్టాల్లో ఉన్నపుడు మనకి ఓ మార్గం చూపి మన కష్టం దూరం చేసేవాడు. మనం బాధలో ఉన్నపుడు మనల్ని ఓదార్చేవాడు. ఏ దిక్కూ తోచనపుడు మనకి తూర్పు దిక్కులా కనిపించి మనకి ఉపశమనం కలిగించేవాడు. ఇలా ఆయా సమయాల్లో మనకి ఆసరా ఇచ్చే ప్రతి మనిషిలోనూ నాకు ఈశ్వరుడు కనిపిస్తాడు. అలాగే నా తర్వాత నా కుటుంబానికి నువ్వున్నావ్, ఇపుడు నేను హాయిగా కన్నుమూయవచ్చు అనే సంతృప్తిని కలిగించావ్. కనుక నీలోనూ నాకు ఈశ్వరుడు కనిపించాడు” చెప్పాడు సదాశివం, కొడుకు చేతులు పట్టుకుంటూ. తర్వాత ఓ క్షణం బలంగా ఊపిరి పీల్చి, “అలాగే నేను పొద్దున ఓ స్నేహితుడి దగ్గరకి వెళ్ళాను. అతను నాకు ఇది వరలో రెండు లక్షలు బాకీ. కానీ తీర్చలేదు. నేనూ అడగలేదు. ఆ డబ్బుకి అప్పుడే వడ్డీ, అసలు నేనే చెల్లించి ఆ అప్పు తీర్చేశాను. కానీ ఇవాళ అతను హఠాత్తుగా పిలిస్తే ఎందుకో అనుకున్నాను. వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి వచ్చాడట. నేను ఇచ్చిన డబ్బుతోనే వాళ్ళ అబ్బాయిని అప్పుడు అమెరికా పంపాడట. ఇపుడు ఆ రుణం తీర్చుకుంటానన్నాడు. డబ్బిస్తాడనుకున్నాను. కానీ మీ అక్కయ్యని కోడల్ని చేసుకుంటానన్నాడు. కుర్రాడు కూడా మంచివాడేనని విన్నాను. మన చుట్టాలు అమెరికాలో ఉన్నారుగా. ఫోనులో వాకబు చేశాను. చూశావా, నే పోయే ముందే వాడిలో ఈ మార్పు. అక్క పెళ్లి కూడా నిశ్చయం అయింది. ఆ క్షణం వాడిలోనూ నాకు దేవుడు కనిపించాడు. అదే నాయనా మంచికున్న శక్తి. మనం మంచి మనసుతో మన పని మనం చేసుకుపోతూ ఉంటే తప్పక మన చుట్టూ ఉన్నవారిలోనే మనం దేవుడ్ని చూడవచ్చు. కనుక నీకు వీలైనంతవరకూ ఇతరుల మంచి కోరు, చేతనైనంత సాయం చేయి. అది తప్పక తిరిగివస్తుంది మాధవా” చెప్పాడు, కొంచెం ఆయాసపడుతూ. ఆ సాయంత్రానికి అతను కన్ను మూశాడు. తర్వాత కొద్ది వారాలకి సదాశివం కూతురి పెళ్లి అతని స్నేహితుడి కొడుకుతో జరిగిపోయింది. అతని కొడుకు ఇంటి ఆర్థిక అవసరాల కోసం పిజ్జా డెలివరీ బోయ్‌గా ఉద్యోగంలో చేరాడు. ఓ రోజు మాధవ్, పిజ్జా డెలివర్ చేయడానికి వెళ్ళిన చోట,అతని స్నేహితుడు రాము కనబడి, “అరె మాధవా, ఇంటర్ అయిపోయాక డిగ్రీలో జాయిన్ అయ్యావా” అడిగాడు అతని చేతిలోంచి పిజ్జా తీసుకుని. “భలే వాడివే. జాయిన్ అయ్యానుగా” చెప్పాడు డబ్బులు తీసుకుంటూ. “ఏ కాలేజీ” అడిగాడు ఆసక్తిగా. “డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో జాయిన్ అయ్యానుగా” చెప్పాడు మాధవ్. “కాలేజీ జాయిన్ అవ్వకుండా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదువుతున్నవా. ఓ పని చేయిరా, నీకు ఏమైనా సబ్జెక్టు తాలూకూ మెటీరియల్‌లో హెల్ప్ కావాలంటే నా దగ్గరికి రా. అలాగే నా వద్ద ఇపుడు ల్యాప్‌టాప్ కూడా ఉంది. నువ్ ఎపుడైనా వచ్చి నీకు కావల్సిన సమాచారం సెర్చ్ చేసుకుని వెళ్ళు. కానీ ఇలా చదివితే మంచి మార్కులు వస్తాయా. రేపు ఈ చదువుతో ఉద్యోగం అదీ వస్తుందంటావా.” “అన్నిటికి ఆ ఈశ్వరుడే ఉన్నాడు.” “ఆయనెప్పుడూ గుళ్లోనేగా ఉండేది” అన్నాడు స్నేహితుడు నవ్వేస్తూ. “లేదురా. నాకు నీలోనే ఈశ్వరుడు కనిపిస్తున్నాడు. స్నేహితుడు బాగా చదువుకోవాలని నువ్ పడుతున్న నిస్వార్థ తాపత్రయంలోనే దైవత్వం ఉంది. నీలోనే కాదు, అందరిలో ఉన్నాడు, అన్ని చోట్లా ఉంటాడు. మనకి ఎవరో ఒకరి రూపంలో సాయపడుతూనే ఉంటాడు. అలా అని మనం పూర్తిగా ఆయనపై భారం వేసి ఊరుకోక మన ప్రయత్న లోపం లేకుండా మన ధర్మం మనం, నీతిగా, నిజాయితీగా నిర్వర్తిస్తే నీలాంటి వాళ్ళ రూపంలో ఆయన తప్పక నాలాంటి వాళ్ళకి సాయపడతాడు. వస్తాను రాము” చెప్పి అక్కడినుండి కదిలాడు మాధవ్. ఇంతలో అతనికో ఫోన్ కాల్ రావడంతో ఆగి ‘హలో’ అన్నాడు. “బాబూ మాధవా” “ఔనండీ నేనే. మీరు?” “నా పేరు ఈశ్వర్. మీ నాన్నగారు యాక్సిడెంట్‌కి గురయ్యింది నావలనే. నన్ను కాపాడబోయి ఆయన ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. చాలా కష్టపడి మీ నెంబర్ తెలుసుకోగలిగాను. నేను ఈ మధ్యే యు.ఎస్. నుండి వచ్చాను. ఇక్కడ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మీకు అభ్యంతరం లేదంటే మీకు ఉద్యోగం ఇవ్వగలను. మీరు చదవాలన్నా నేను మిమ్మల్ని చదివించగలను. మీకు ఆర్థికoగా సహాయపడి చేతులు దులుపుకోవాలని కాదు నాయనా. నాకూ మీ వయసు పిల్లలే ఉన్నారు. కనుక మీకు సహాయపడే అవకాశం ఇవ్వకపోతే నేను జీవితాంతం మనోవేదనతో కుమిలిపోతాను” అని అతను చెప్తుండగానే మాధవ్ కళ్ళు చెమర్చాయి. ‘అవును ఒకరికి చేసిన మంచి ఎక్కడికీ పోదు. మా నాన్న చెప్పిందే నిజం అని మరోసారి రుజువైంది’ అనుకున్నాడు మనసులో.
బావుంది. ఇంకొంచెం ముందు కథని ఆపేసి ఉండాలనిపించింది.
Chala baagundhi Gangadhar Garu..Extremely touching n a beautiful message.. Haasyame kaadu meeru manchi emotional kadhalu kuda raayagalru.. My whole hearted wishes andi.. Me kadha me writing nannu chaala inspire chesindhi Sir… Thanks alot n keep rocking n keep inspiring us. All d best for future
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™