గడియారంలో సమయం ఉదయం ఎనిమిది గంటలు చూపిస్తోంది. ఎంతో మంది జీవితాలు క్యాలెండర్లో మారే తేదీ మీద, గడియారంలో తిరిగే ముల్లు పైనా ఆధారపడి ఉంటాయి. భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ పేపరు చదువుతున్న ఆనంద్ గేటు శబ్దం విని అటుగా చూసాడు. పనిమనిషి పార్వతి కంగారుగా వచ్చి “అయ్యగారు! శంకరం మాష్టారు గారు ఇంటి తలుపు తీయడం లేదు, మీరు కొంచెం త్వరగా రండి” అని ఆయాసపడుతూ చెప్పింది. అది విన్న ఆనంద్ కంగారుగా చొక్కా తగిలించుకుని శంకరం ఇంటికి బయలుదేరాడు.
తన ఇంటికి శంకరం ఇల్లు రెండు వీధుల అవతలే అయినా మొట్టమొదటిసారిగా ఆనంద్‌కు శంకరం ఇల్లు చాలా దూరంగా అనిపించింది. ఇంటి కాలింగ్ బెల్ పదేపదే నొక్కినా గేటు తీయలేదు. దాంతో గేటు దూకి దబాదబామని తలుపులు బాదినా తలుపు తెరుచుకోలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆనంద్ కిటికీలు మూసిన ఆ ఇంటి తలుపును గునపంతో పగలగొట్టాడు. ఇంటి పడక గదికి వెళ్ళి చూసాడు. ఆ గదిలో శంకరం నిద్రలో ఉన్నట్టు కనిపించాడు. ముక్కు దగ్గర చేయిపెట్టి చూసి ప్రాణం పోయినట్టు అనుమానించాడు. తన స్నేహితుడైన ఆర్.ఎమ్.పి. డాక్టర్‌కు ఫోన్ చేసి పిలిపించి పరీక్ష చేయించి శంకరం చనిపోయినట్టు నిర్థారణకు వచ్చాడు. శంకరం ఇంటిముందు టెంట్ వేయించి, శవాన్ని ఇంటి మధ్య హాల్లో పడుకోబెట్టాడు. శంకరం మరణవార్త ఊరంతా దావానలంలా పాకింది. ఆ ఊరివారు మాత్రమే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా శంకరాన్ని కడసారి చూసేందుకు మెల్లమెల్లగా రాసాగారు. ఆ వస్తున్న జనాలను చూస్తున్న ఆనంద్‌కు ఒక్కసారిగా గతం మదిలో మెదిలింది.
***
శంకరం తండ్రి ఒక బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. శంకరం పెద్ద కొడుకు. ఈ పెద్ద కొడుకుకు ముందు ఒక కూతురు తరువాత ముగ్గురు కొడుకులు. ఈ పెద్ద కుటుంబాన్ని ఈదడానికి శంకరం తండ్రి సంపాదన ఒక్కటే ఆధారం. తల్లి అప్పు చేసి పప్పు కూడు తినే రకం. శంకరానికి మూడవ, నాలుగవ సంతానానికి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. శంకరం ప్రభుత్వ పాఠశాలకు వెళ్తూ ఖాళీ సమయాల్లో దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. అలా సంపాదించిన డబ్బును తండ్రికి ఇస్తుండేవాడు. దాంతో చదువు మీద పూర్తిగా ధ్యాస పెట్టలేక అత్తెసరు మార్కులతో పదవ తరగతి గట్టెక్కాడు. ఆ తరువాత ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చేరాడు. శంకరం మొదటి తమ్ముడు భాస్కర్ మాత్రం చదువు మీద శ్రద్ధ పెట్టేవాడు. అన్నలా ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ చదువుకోవడాన్ని నామోషీగా భావించేవాడు. శంకరం కూడా భాస్కర్ని చదువు మీదే దృష్టి పెట్టడమనేవాడు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు భాస్కర్ పదవ తరగతి స్కూల్ ఫస్ట్‌గా ఉత్తీర్ణత సాధించాడు. దాంతో ఒక క్రైస్తవ మిషనరీ సంస్థ భాస్కర్‌కి ఉచిత విద్య ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి పట్నానికి రమ్మని ఆహ్వానించింది. కాని శంకరం మాత్రం ఇంటర్ కంప్లీట్ చేయలేకపోయాడు. అలా శంకరం చదువుకుంటూ పనిచేస్తూ తమ్ముడికి కొంత డబ్బు పంపిస్తూ మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళను చూసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. పెద్ద కొడుకు అనే పెద్ద హారం మెడలో వేసి శంకరాన్ని అతని తల్లిదండ్రులు వాడుకోసాగారు. అలా శంకరం ఇంటర్మీడియట్ నాలుగు సంవత్సరాలు చదివాడు. ఆ తరువాత దూరవిద్యలో డిగ్రీ చదవడం మొదలుపెట్టాడు. మూడు సంవత్సరాలలో ముగించాల్సిన డిగ్రీ చదువు ముగించడానికి శంకరానికి అయిదు సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత చదువు వదిలేసి పూర్తిగా గుమాస్తాగిరి చేయడం మొదలుపెట్టాడు. అతని తమ్ముడు భాస్కర్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు.
ఒక వ్యక్తితో అవసరం ఉంటేనో లేక ఒక వ్యక్తి దగ్గర డబ్బు బాగా ఉంటేనో లేక ఒక వ్యక్తి దగ్గర సక్సెస్ ఉంటేనో అప్పుడే ఆ వ్యక్తిని ఈ ప్రపంచం గుర్తిస్తుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. అలా శంకరం తమ్ముడు భాస్కర్‌కు ఇచ్చే విలువ శంకరానికి అతని తల్లిదండ్రుల నుంచి కానీ సోదరీ సోదరుల నుంచీ కానీ దక్కలేదు. భాస్కర్ కూడా తనను చదువుకోమని ప్రోత్సహించిన అన్నను తక్కువగా చూసేవాడు.
ఒకసారి శంకరం భాస్కర్ పనిచేస్తున్న ఆఫీస్‌కు వెళ్ళాడు. భాస్కర్ని ఒక ప్రభుత్వ అధికారిగా చూసి శంకరం తెగ ఆనందపడ్డాడు. మధ్యాహ్నం సమయం కావడంతో భోజనానికి వెళదామని శంకరం భాస్కర్ని అడిగాడు. భాస్కర్ సుముఖత వ్యక్తపరచకుండా “నీతో కంటే నా పై అధికారితో కలిసి భోజనానికి వెళ్తే నాకు నలుగురిలో ఎక్కువ గౌరవం దక్కుతుంది” అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఆ మాటకు శంకరం మనసు చివుక్కుమంది. అలా బాధాతప్త హృదయంతో తమ్ముడికి వీడ్కోలు చెప్పి ఆఫీసు నుంచి బయట పడ్డాడు. ఈ సంఘటనతో శంకరం ఆ రోజు పస్తులు ఉన్నాడు. కాలక్రమంలో భాస్కర్‌కు ఒక పెళ్ళి సంబంధం కుదిరింది. అన్నకు పెళ్ళి కాకుండా పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు భాస్కర్. అందుకు అతనికి తల్లిదండ్రుల సహకారం తోడయింది. పెళ్ళి శుభలేఖలో ఆహ్వనితుల వరుసలో పెద్దకొడుకుగా శంకరం పేరు వేయకుండా వదిలేసారు. ఆ తర్వాత “ఎందుకు వేయలేదు” అని ఆడపెళ్ళివారు అడగడంతో పరువు కోసం “మర్చిపోయాం” అని సర్దిచెప్పి చివరికి అన్నీ శుభలేఖల్లో శంకరం పేరు పెన్నుతో రాసారు. అలా శంకరం తన సోదరుడి పెళ్ళి శుభలేఖలో, పెళ్ళిలో కూడా ప్రేక్షకపాత్ర పోషించాడు. ఆ తరువాత స్నేహితుల ధనసహాయంతో శంకరం దూరవిద్యలో బి.ఇడి చదివి విజయవంతంగా మొదటిసారే పూర్తి చేసాడు. ఆ విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. అలా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పర్మినెంట్ అయ్యేసరికి శంకరం వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు. ఆ సమయంలో శంకరం పనిచేస్తున్న పాఠశాలలో చేరిన ఒక అనాథ విద్యార్థి ఆనంద్. శంకరం అప్పటి నుంచి పెళ్ళి చేసుకోకుండా ఒక స్కూల్ టీచర్‌గా జీవనం సాగించాడు. ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పేవాడు. శంకరం ఉపాధ్యాయుడిగా పనిచేసిన విధానాన్ని మెచ్చి అతనికి ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కూడా వచ్చింది. ఆనంద్ లాంటి శిష్యులు చాలా మంది శంకరం దగ్గర తయారైనా ఆనంద్ ఒక్కడే శంకరాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. శంకరం సహాయంతో ఆనంద్ కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. మంచి సంబంధం చూసి శంకరం ఆనంద్కి పెళ్ళి చేసాడు. శంకరం ఉద్యోగానికి పదవీ విరమణ చేసాక సొంత ఇల్లు కట్టుకుని ఒంటరిగా ఉండసాగాడు. ఆ ఇంటికి కొంత దూరంలో ఆనంద్ ఇల్లు కట్టుకుని భార్యాబిడ్డలతో ఉండసాగాడు. తమతో కలిసి ఉండమని ఆనంద్ ఎన్నిసార్లు అభ్యర్థించినా “నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం” అని శంకరం ఆనంద్ అభ్యర్దనను సున్నితంగా తిరస్కరించేవాడు. శంకరం తమ్ముళ్ళ చూపు శంకరం ఇల్లు కట్టుకున్న తరువాతే శంకరం మీద పడింది. తమ్ముళ్ళపై శంకరం ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు .
***
“ఏవండీ” అని భార్య పిలవడంతో ఆనంద్ ఈ లోకంలోకి వచ్చాడు. “శంకరం మాష్టారి తమ్ముడు వచ్చారు” అని భార్య చెప్పడంతో ఆనంద్ శంకరం తమ్ముడితో కలిసి మాట్లాడటానికి సిద్ధమయ్యాడు. “మీకు ఇప్పుడే ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఇంతలో మీరే వచ్చారు” అని ఆనంద్ భాస్కర్‌తో కరచాలనం చేసాడు. శంకరం తమ్ముడు భాస్కర్ “నాకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి ఆనంద్” అని నిట్టూర్చాడు. ఆనంద్ “మాష్టారి మిగిలిన తమ్ముళ్ళు రాలేదా” అని అడిగాడు. దానికి భాస్కర్ “వాళ్ళిద్దరూ వేరే పనుల్లో బిజీగా ఉన్నారు” అని సమాధానం దాటవేయడానికి ప్రయత్నించాడు. ఆనంద్ భాస్కర్‌కు శంకరం చనిపోయిన వివరం చెప్పాడు. భాస్కర్ తన స్నేహితుడు రవి ద్వారా శంకరం వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడు. రవి కూడా శంకరం ఇంటికి వచ్చాడు. అలా రవి, భాస్కర్ ఇద్దరూ కలిసి శంకరం అంత్యక్రియలకు ఏర్పాటు చేయసాగారు.
ఇంతలో ఒక హాస్పిటల్ అంబులెన్స్ సైరన్ మ్రోగకుండా వచ్చి శంకరం ఇంటి ముందు ఆగింది. ఎవరికీ అర్థం కాకుండా అలా చూడసాగారు. ఆ అంబులెన్స్‌లో ఒక వ్యక్తి దిగి ఆనంద్ గురించి వాకబు చేయసాగాడు. అది గమనించిన ఆనంద్ ఆ వ్యక్తికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆనంద్ ఆ వ్యక్తిని భాస్కర్‌కు పరిచయం చేసాడు. “భాస్కర్ గారు, శంకరం మాష్టారు తన మరణానంతరం తన మృతదేహాన్ని వీరి హాస్పటల్‌కు రాసిచ్చారు. ఇవి దానికి సంబంధించిన కాగితాలు. మాష్టారు బ్రతికున్నపుడు స్వయంగా సంతకం చేసిన కాగితాలు ఇవి. ఆ కార్యక్రమానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. సాక్షి సంతకం కూడా చేసాను” అని ఆనంద్ భాస్కర్‌కు ఆ కాగితాలు అందచేసాడు. శంకరం అంత్యక్రియల ఖర్చు తప్పినందుకు భాస్కర్ మనసులో ఎంతో సంతోషపడసాగాడు. పైకి మాత్రం ఆ సంతోషం బయటకు కనపడనివ్వలేదు. జనమంతా శంకరాన్ని గొప్పగా పొగిడారు. తనకు జీవితాన్ని ఇచ్చిన శంకరంను ఆనంద్ లాంటి వారంతా కడసారి చూసారు. అందరూ కలిసి శంకరాన్ని అంబులెన్స్‌లో ఎక్కించారు. అలా అందరూ కలిసి శంకరంకు వీడ్కోలు పలికారు.
అంబులెన్స్ వెళ్ళిన గంటకు మరో వాహనం వచ్చి శంకరం ఇంటి ముందు ఆగింది. ఇద్దరు వ్యక్తులు కారు లోంచి దిగి ఆనంద్‌తో మాట్లాడసాగారు. ఆనంద్ వాళ్ళను కూడా భాస్కర్‌కు పరిచయం చేసాడు. “భాస్కర్ గారు! శంకరం మాష్టారు తన మరణానంతరం ఈ ఇంటిని ప్రభుత్వం వారికి రాసిచ్చి ఈ ఇంటిని ఒక అనాథ ఆశ్రమంగా మార్చమన్నారు. అలా ఈ ఇంట్లో అనాథ పిల్లలు, అనాథ వృద్ధులు, మతిస్థిమితం లేనివారు వయోభేదం లేకుండా ఆశ్రయం పొందవచ్చు. వీరు ఈ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు.” అని చెప్పాడు.
భాస్కర్‌కు ఒక్కసారిగా తన కింద భూమి కంపించిన ఫీలింగ్ కలిగింది. ఆ ఇల్లు శంకరం స్వార్జితం. ప్రభుత్వ అధికారులు కూడా పోలీసులతో సహా వచ్చారు. డాక్యుమెంట్ పేపర్లు కూడా పక్కాగా ఉండడంతో ఎలాగైనా ఇల్లు స్వాధీనం చేసుకుందామనే కుటిల ఆలోచనతో వచ్చిన భాస్కర్ ఆశలపై ఆనంద్ నీళ్ళు చల్లినట్టైంది. అలా ఇల్లు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ అధికారులు భాస్కర్‌కు, ఆనంద్‌కు ధన్యవాదములు చెప్పి వెళ్ళిపోయారు.
వచ్చిన పని విజయవంతం కాకపోవడంతో భాస్కర్ కూడా తిరుగు ప్రయాణానికి బస్టాండ్‌కు బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు. ఆనంద్ భాస్కర్‌ను తన బండి మీద ఎక్కించుకొని బస్ స్టాండ్‌లో దింపాడు. బస్ కోసం ఇద్దరూ బస్‌స్టాండ్ లో కూర్చుని ఎదురు చూడసాగారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ భాస్కర్ ఆనంద్‌తో “మా అన్నయ్య తన ఇల్లును ప్రభుత్వానికి రాసిచ్చిన సంగతి మీరు ఎందుకు నాకు చెప్పలేదు?” అని అడిగాడు. దానికి ఆనంద్ నవ్వుతూ “మీరు మీ అన్నగారి మరణానంతరం ఆస్పత్రికి రాసిచ్చిన ఆయన మృతదేహం గురించి అడుగుతారనుకున్నాను. అలా కాకుండా ఆయన స్వార్జితమైన ఇంటి గురించి అడిగారు. శంకరం మాష్టారు తన చిన్నతనంలో ఇంటికి పెద్ద కొడుకుగా కన్న తండ్రికి చేయూతనిస్తూ, చదువును నిర్లక్ష్యం చేసారు. అప్పుడు తల్లితండ్రులు ఆయనను ఒక పనివాడిగానే చూసారు. మాష్టారు నాకు ఈ విషయాలన్నీ ఎప్పుడో చెప్పారు. మాష్టారు మీ గెలుపులో ఆయన గెలుపును చూసుకున్నారు. మీ అన్నగారికి వైద్య విద్య చదవాలనే కోరిక. తాను చిన్నప్పుడు చదవలేని వైద్యవిద్య ఇప్పుడు చదివేవారికి తన శరీరం ఉపయోగపడాలనే గొప్ప ఆశయంతో తన మరణానంతరం ఆస్పత్రికి తన దేహాన్ని రాసిచ్చారు. మాష్టారి మృతదేహాన్ని వైద్య విద్యార్థులు చదువు నిమిత్తం మెడికల్ కాలేజీ ప్రయోగశాలలో ఉపయోగిస్తారు. తనలా ఎవరూ అనాథలా కాకూడదని మాష్టారు ఇంటిని ప్రభుత్వానికి రాసిచ్చి ఒక అనాథ ఆశ్రమంగా మార్చమన్నారు. తన మరణానంతరం మాత్రమే ఈ విషయాన్ని బహిర్గతం చేయమన్నారు” అని కళ్ళల్లోంచి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ తన సమాధానాన్ని ముగించాడు ఆనంద్.
ఇంతలో బస్ రావడంతో భాస్కర్ ఆనంద్‌ను మనసులో తిట్టుకుంటూ లేని నవ్వు ముఖం మీద పులుముకుని ఆనంద్‌కు వీడ్కోలు చెబుతూ బస్ వైపు అడుగులు వేసాడు. మారని భాస్కర్‌ను చూస్తూ చేయి ఊపుతూ సాగనంపాడు ఆనంద్.