రోజురోజుకూ సమాజంలో చెడులు, దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒకచోట ఏదో ఒక అకృత్యం వెలుగు చూస్తూనే ఉంది. ఒక మనిషి మరో మనిషిపై ఏదో ఒక రూపంలో చేస్తున్నదాడి మానవత్వానికే సవాలుగా నిలుస్తోంది. మహిళలు, వృధ్ధులు, పసిపిల్లలు అన్న విచక్షణ లేకుండా మనిషి మనిషిపై సాగిస్తున్న రాక్షసత్వం మానవేతర జీవజాలంలో కూడా కనిపించదు. చివరికి క్రూరమృగాల్లో సైతం కారణ రహిత ఘర్షణ ఉండదు.
కాని బుధ్ధిజీవి అయిన మానవుల్లో మృగలక్షణాలు సమృధ్ధిగా గోచరిస్తున్నాయి. పంతాలు, పట్టింపులు, కక్షలు, కార్పణ్యాలు సాధారణమయ్యాయి. నేను, నా కులం, నా మతం, నా ప్రాంతం అన్న సంకుచిత ఉన్మాద భావనలు మానవ మస్తిష్కంలో వేళ్ళూనుకుంటున్నాయి. నా కులం కాని వాళ్ళు, నా మతం కాని వాళ్ళు, నేను చెప్పినట్లు విననివాళ్ళు శతృవులు అన్న భయంకర భావజాలం మానవ సమాజాన్ని ముక్కలు చేస్తోంది. ఆధునిక విజ్ఞానం దూరాలను దగ్గర చేసింది. కాని మనుషులను, మనసులను దగ్గర చేయలేకపోయింది. విజ్ఞానం విస్తరించిన కొద్దీ అజ్ఞానం పటాపంచలు కావలసింది పోయి వెర్రితలలు వేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.
నిజానికి దేవుడు మనిషిని బుధ్ధిజీవిగా, విజ్ఞాన స్రష్టగా, మంచీచెడుల విచక్షణ తెలిసినవాడుగా సృష్టించాడు. అంతేకాదు, మానవజాతి మూలాల రహస్యాన్నీ విడమరచి చెప్పాడు. మానవులంతా ఒకే జంట సంతానమన్నయథార్ధాన్ని ఎరుకపరిచాడు. సఛ్ఛీలత, నైతిక విలువలు, దైవభక్తి విషయాల్లో తప్ప ఎవరికీ ఎవరిపై ఎలాంటి ఆధిక్యతా లేదని స్పష్టం చేశాడు. కనుక కులం, మతం, జాతి, ప్రాతం, భాషల ఆధారంగా అడ్డుగోడలు నిర్మించుకోడానికి, సరిహద్దులు గీసుకోడానికి లవలేశమైనా అవకాశం లేదు.
కాని కులం, మతం, జాతి, భాష, ప్రాంతీయతలను ప్రాదిపదికగా చేసుకొని, మనిషి మరో మనిషిపై దాడికి దిగుతున్నాడు. ఇతరుల ధన మాన ప్రాణాలను హరిస్తున్నాడు. వారి గౌరవ మర్యాదలతో చెలగాటమాడుతున్నాడు. తల్లి, చెల్లి, ఇల్లాలు అని కూడా చూడకుండా స్త్రీలపై దౌర్జన్యాలకు తెగబడుతున్నాడు. సృష్టి మొత్తంలో శ్రేష్ఠజీవి అయిన మానవుడుతనస్థాయిని, శ్రేష్ఠతను, ఔన్నత్యాన్ని మరిచి విలువలకు తిలోదకాలిచ్చి, మానవుడిగా తను చేయకూడని పనులన్నీ చేస్తూ మానవత్వానికి కళంకం తెచ్చిపెడుతున్నాడు.
ఎందుకిలా జరుగుతోంది. దీనికి కారణమేమిటి? అజ్ఞానమా.. మూర్ఖత్వమా.. అహంకారమా..? వాస్తవమేమిటంటే, మానవుడు జీవన సత్యాన్ని గుర్తించడంలేదు. పుట్టుక, చావుకు మధ్యనున్న జీవన్నాటకమే సర్వస్వమని భ్రమిస్తున్నాడు. నేటి తరువాత రేపు ఎంత నిజమో, మరణం తరువాత మరణానంతర జీవితమూ అంతే నిజమన్న సత్యాన్ని విస్మరిస్తున్నాడు. ఇక్కడ ఈ జీవితంలో చేసిన ప్రతి పనికీ, పలికిన ప్రతిమాటకు రేపు ఆ జీవితంలో పరమ ప్రభువైన అల్లాహ్ సన్నిధిలో సమాధానం చెప్పుకోవాలన్న విషయాన్నేమరిచిపొయ్యాడు. అందుకే ఈ బరితెగింపు.
పరలోక జీవితాన్ని నమ్మి, దైవానికి సమాధానం చెప్పుకోవలసి ఉందన్నవిషయం మనసా, వాచా, కర్మణా విశ్వసించినట్లయితే మనసులో ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలూ తలెత్తవు. ఇతరులకు హాని చేయాలన్న తలంపే మనసులో రాదు. దేవుడు సమస్త మానవాళినీ సన్మార్గపథాన నడిపింపజేయాలని, మానవుల మధ్య పరస్పర ప్రేమ, సామరస్యం, సోదరభావం పరిఢవిల్లాలని, పుడమిపై శాంతి వర్ధిల్లాలని మనసారా కోరుకుందాం.
యండి.ఉస్మాన్ ఖాన్ చక్కని కవి. మంచి రచయిత
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™