[కొల్లా పుష్ప గారు రచించిన ‘పశ్చాత్తాపం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


ఆరోజు టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కొందరి ముఖాల్లో ఎనలేని సంతోషం, కొందరివి విషాద భరిత వదనాలు.
“నువ్వు పాసయ్యావా రాజి” అని అడిగింది ధరణి.
“లేదు” అంది కళ్ళు తుడుచుకుంటూ రాజి.
“ఇలాగే ఇంటికి వెళ్తే చంపేస్తారు, మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ . పరీక్ష పాస్ అవ్వకపోతే ఊరుకోనని చెప్పారు ముందే అందుకని మనం చచ్చిపోదాం” అన్నది ధరణి.
“అవును మా నాన్న, అమ్మ కూడా కూలి పని చేసి నన్ను చదివిస్తున్నారు. ఇప్పుడు పరీక్ష పోయిందని తెలిస్తే వాళ్లు కూడా బాధపడతారు. ఇప్పటికే అప్పుచేసి చదివిస్తున్నారు” అన్నది రాజి.
“అయితే పద” అన్నది ధరణి.
“ధరణి ఒకే ఒక్క సారి అమ్మా,నాన్నని చూసి వద్దాం తర్వాత చచ్చిపోదాం” అన్నది రాజి.
“సరే” అన్నది ధరణి.
***
హైదరాబాద్ విమానాశ్రయం చాలా హడావుడిగా ఉంది. ప్రసిద్ధ కంపెనీకి చెందిన విమానం ప్రమాదంలో పడిందని వార్తల్లో చెబుతున్నారు. అది విన్న ప్రజలు అందరూ హడావుడిగా విమానాశ్రయం చేరుకున్నారు.
అందరిలోనూ ఆందోళన, ఒక గంట గడిచాక “ప్రయాణికులకు ప్రమాదం లేదు” అన్న అనౌన్స్మెంట్ తో కొంచెం స్థిమిత పడ్డారు.
పైలెట్ చాకచక్యంతో అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్తున్నారు ఎయిర్పోర్ట్ వారు.
సురక్షితంగా తీసుకొచ్చిన పైలట్‌ను అందరూ అభినందనలతో ముంచేత్తుతున్నారు.
ముఖ్యమంత్రి కూడా వచ్చి అభినందనలు తెలిపారు
ఆ పైలెట్ ను మాట్లాడమని అందరూ అడగగా “నన్ను అభినందించిన ముఖ్యమంత్రి గారికి, పెద్దలకు నమస్కారం” అన్నది వినయంగా పైలట్.
ఇంతలో అమ్మ “నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉందమ్మా” అన్నాడు ఒక పెద్దాయన.
అటువైపు తిరిగి చూసిన పైలట్ రాజి అతన్ని గుర్తుపట్టి “నేను మాస్టారు టెన్త్ క్లాసులో ఫెయిల్ అయిన రాజీని, కూర్చోండి మాస్టారు” అన్నది ఆయన కాళ్లకు దండం పెడుతూ.
***
నేను పుట్టి పెరిగింది ఒక చిన్న పల్లెటూరులో చదువుకోవాలంటే 10 కిలోమీటర్లు ప్రయాణించి పట్నం బడిలో చదువుకునేవాళ్ళం నేను, ధరణి..
అన్ని సబ్జెక్టులు బాగానే చదివే వాళ్ళం కానీ ఇద్దరికీ లెక్కలు ఎక్కేవి కావు. మాస్టారిని అడగడానికి భయం. ఆ భయంతోనే ఫెయిల్ అయ్యాము నేను, నా ఫ్రెండ్.
ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాం. ఒక్కసారి అమ్మా, నాన్నని చూసి చచ్చిపోవాలని అనుకున్నాం.
***
“ఏమండీ మన అమ్మాయి ఎగ్జామ్ తప్పిందట” అన్నది భర్తకి కాఫీ ఇస్తూ సునంద.
“ఇంత కష్టపడి చదివిస్తే పరీక్ష ఫెయిల్ అయిందా? దానికి ఏం తక్కువ చేసాము, రాని దాని పని చెప్తాను” అన్నాడు చేతిలో కాఫీ కప్పు విసిరి కొడుతూ పరశురాం.
ధరణి భయపడి ఇంట్లోకి వెళ్లకుండా పక్కనే కడుతున్న మేడ మీదకి వెళ్లి అక్కడ నుంచి దూకేసింది.
***
రాజి మెల్లగా గుడిసెలోకి వెళ్ళబోయింది “ఏటే గంగ మన రాజి పరీక్ష తప్పిపోనాదంట” అన్నాడు చుట్ట వెలిగించుకుంటూ నరసయ్య.
“అవునయ్య పక్కింటి మేడబ్బాయి చెప్పిండు కానీ దాన్ని ఏమి అనబాకయ్యా అసలే బాధలో ఉంది దాన్ని ఏమన్నా అంటే ఏ రైలు కిందో బుర్ర ఎడతాది” అన్నది గంగ.
“నాకు తెలుసులే పోతే పోనీ పరీక్ష ఈ ఏడాది కాకపోతే మళ్ళీ రాత్తాది అందుకని పిల్లని చంపకుంటామా ఏంది. కడుపుకోత భరించగలమా” అన్నాడు చుట్టపడేస్తూ.
“అయ్యా” అంటూ తండ్రి కాళ్ళని చుట్టుకుపోయింది కూతురు రాజి.
కూతుర్ని లేవదీసి గుండెలకు హత్తుకుంటూ “పోతే పోనీ నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు అదే పదేలు” అన్నాడు నరసయ్య.
***
నా తల్లి, తండ్రి ఇచ్చిన ధైర్యంతో నేను మళ్ళీ చదివి పాసయ్యాను మామూలుగా నేనున్న పరిస్థితికి ఈ పెద్ద చదువులు చదవలేను కానీ ధరణి పేరెంట్స్ పశ్చాత్తాపంతో తమ కూతురి బతుకు ఇలా కావడానికి తామే కారణమయ్యామని కుమిలి పోయారు. ఆ పరిస్థితులలో వాళ్లకు చేయూతనిచ్చాను. వారు తమ కూతురు లాగా భావించి నా ఈ చదువుకు చాలా హెల్ప్ చేశారు. నాపై నలుగురు పేరెంట్స్ ఆధారపడి ఉన్నారు.
వాళ్లు నన్ను ఒక మంచి పొజిషన్లో చూడాలని అనుకున్నారు. అందుకే చాలా కష్టపడి ఈ పైలట్ ట్రైనింగ్ పరీక్షలు పాస్ అయ్యాను.
ఇంటర్వ్యూలలో చాలా బాగా రాసాను. అందుకు అవసరమైన డబ్బును ధరణి తల్లి,దండ్రులు ఇచ్చారు.
నేను కోరుకునేది ఒక్కటే ఏ కారణాల వలన అయినా పిల్లలు పరీక్ష ఫెయిల్ అవుతారని అనుకుంటే ముందుగానే వాళ్లకు ధైర్యం చెప్తే అప్పుడు ఇలాంటి ఆత్మహత్యలు జరగవు. పిల్లలు చనిపోయాక చేసేదేమీ లేదు కడుపుకోత తప్ప.. నేను ఇలా ఎదిగానంటే కారణం నా తల్లి,దండ్రులు వాళ్ళు చదువుకోకపోయినా నాకు అండగా నిలిచారు” అని ఆగింది రాజి.
“అరే.. ఇలా జరిగిందేమిటి?.. ఇద్దరూ తెలివైన పిల్లలే కాకపోతే లెక్కల్లో కొంచెం శ్రద్ధ తీసుకుంటే పాస్ అయ్యే వారే” అని అన్నారు మాస్టారూ కళ్ళు తుడుచుకుంటూ.
“ఇందుకు కారణం నేనే మాస్టారు” అన్నాడు ధరణి తండ్రి వీల్ చైర్ లో కళ్ళు, కాళ్ళు పోయిన ధరణిని తీసుకొచ్చి చూపిస్తూ. “ఆకలితో ఉన్న వాడికి గుప్పెడు అన్నం, బాధలో ఉన్న వారికి కొంచెం ఓదార్పు కావాలంటారు అది నేను నా కూతురికి ఇవ్వలేకపోయాను. రాజి తల్లి,దండ్రులకు ఉన్న సంస్కారం నాకు ఉండి ఉంటే నా కూతురు పరిస్థితి ఇలా అయ్యేది కాదు” అన్నాడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ, “దయచేసి ఇక్కడ ఉన్న అందరికీ విన్నవించుకుంటున్నాను పిల్లల పరీక్ష పోయిందని దండించకండి. చూశారుగా నా పరిస్థితి” అన్నాడు ధరణి తండ్రి పశ్చాత్తాపంతో.