నీ చూపులకు సూదులు తొడిగి కనపడ్డవాణ్ణళ్ళా కసిగా గుచ్చుతుంటావు నీ మాటలకు కొరడాను కట్టేసి పలుకరిస్తే చాలు చట్ మంటూ దాన్ని విసిరి వాతలు తేలేట్టుగా కొట్టేస్తుంటావు నీ పిడికిళ్ళలో ఎప్పుడూ రాళ్ళుంటాయేమో ఆనందంగా కాలం గడుపుతోన్న ఇళ్ళ కప్పులపై విసిరి అవతలివాళ్ళు ఆందోళన చెందుతోంటే విచిత్రంగా వింతగా వినోదంగా చూస్తుంటావు
ఎందుకు అందరినీ చీదరించుకుంటావు ఒంటి కాలిమీద అంతెత్తున ఎగురుతుంటావు మార్పు అనేది అరిస్తేనే, కండలూడేలా కరిస్తేనే వస్తుందా? ప్రోత్సాహంగా వీపుమీద మెల్లగా చరిస్తే రాదా! తిడితేనే, కాళ్ళూ చేతులూ విరక్కొడితేనే వస్తుందా? మెచ్చుకోలుగా భుజం తడితే రాదా!!
మంచితనాన్ని, మనిషిమీద నమ్మకాన్ని నీ బాల్యపు అనుభవాల దారిలో నీ యవ్వనపు అవకాశాల పోరాటాల బరిలో ఎక్కడో పొరపాటున పారేసుకున్నట్టున్నావు ఖాళీగా ఉన్న నీ చేతి సంచిని ఖాళీగా ఉంచడం ఎందుకని అనుకున్నావో దారిలో కనబడిన చెత్తబుట్టల్లోకి విసిరేయబడ్డ విషం కక్కుతోన్న విద్వేశాన్ని అసహ్యపు వాసనలు చిమ్ముతోన్న అశుద్ధంలాంటి అపనమ్మకాన్ని నింపుకుని అత్యంత జాగ్రత్తగా మోసుకుంటూ తిరుగుతున్నావు
నీవు వెళ్ళినకాడికళ్ళా ఆ అపనమ్మమకాలూ, ఆ విద్వేషాలూ వచ్చేస్తుంటే కారణం నువ్వేనని తెలుసుకోకుండా అక్కడంతా అవే నిండి ఉన్నాయంటూ అరుస్తూ అందరిమీదా ఎగిరెగిరి పడుతున్నావు
నీ వంటినిండా అంటుకున్న కుళ్ళు కడిగినా పోనంత కంపుకొడుతున్నావు నీ మనసులోకి మనిషి పట్ల విద్వేషాన్ని, అపనమ్మకాన్ని, అసహ్యాన్ని మందూ మాకులు తాగించి కక్కించినా ఖాళీ అవనంత ఎక్కించుకున్నావు
నీతో వేగలేము … నీ మాటల మాయలో పడి మాలో మేమే కొట్ఠుకుని చావలేము నీ పదాల, పద్యాల, చిత్రాల, నినాదాల గారడీలో మా స్నేహమయ వాతావరణాన్ని ప్రగతి బాటలో పరుగెడుతోన్న వర్తమానాన్ని బంగారంలాంటి భవిష్యత్తునూ బలిపెట్టలేము
మర్యాదగా వెళ్ళిపో చుట్టుపక్కల కనబడనంత దూరంగా వెళ్ళిపో వీడ్కోలు ఇచ్చేందుకు మేమందరం సిద్ధమయ్యాము వెళతావా? లేక మెడబట్టి గెంటించమంటావా??
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
Very good. Keep writing. Vijay Prasad.
ధన్యవాదాలు విజయ్ ప్రసాద్ గారూ…
చాలా బాగుంది. అభినందనలు
ధన్యవాదాలు సుదర్శన్ గారూ
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™