[శ్రీ టి.ఎస్.ఎస్. మూర్తి రచించిన ‘ఫలము, పైకము – ఫలితము’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]


రిటైరైన నేను పెన్షన్ డబ్బులతోను, జబ్బుల టెన్షనుతోనూ బ్రతుకుతున్నాను. అప్పుడప్పుడు మనశ్శాంతిని వెతుక్కుంటూ గుడికి వెళతాను.
ఒక రోజు, ఎప్పుడూ వెళ్ళే గుడికే వెళ్ళాను. గర్భగుడిలో దైవ దర్శనం చేసుకుని, యథాప్రకారం బయట మెట్ల ప్రక్కన ఉన్న గోడ మీద కూర్చున్నాను. లేచి వెళుతూ, సంచిలో ఉన్న వాటిలోంచి కొన్ని పళ్ళు, జేబూలోని చిల్లర పైసలు ఆ గుడి మెట్ల మీద కూర్చున్న పేదవారికి ఇచ్చి వెళ్ళడం మొదలు పెట్టాను.
వాళ్ళలో ఒక గ్రుడ్డివాడు కూడ ఉన్నాడు. అప్పటికి నా చేతిలో చిల్లర అయిపోయి ఒక్క బత్తాయి పండు మాత్రమే మిగిలింది. జేబులో చెయ్యి పెడితే ఒక పది రూపాయల నోటు బయటకి వచ్చింది. రెండూ అతని చేతిలో పెట్టి, మిగతా మెట్లు దిగి చెప్పులు తొడుక్కుని బయలుదేరాను.
ఇంతలో మా పక్కింటి వాళ్ళ మనవరాలు స్కూటీ మీద వచ్చి, “తాతగారు, నేను కూడ గుళ్ళోకి వెళ్ళి వస్తాను, మీరు ఆ ఎదురుగా ఉన్న పూల కొట్టు దగ్గర కూర్చోండి. ఇద్దరం కలిసి నా బండి మీద వెళదాము,” అంది. సరే అని అలా కూర్చున్నాను.
కొద్ది సేపటికి ఆ అమ్మాయి తిరిగి వచ్చింది. ఇద్దరం రోడ్డు దాటుతూ ఉండగా నా దృష్టి ఆ గ్రుడ్డివాడిపై పడింది. ఒక్కసారి ఆగి గమనించాను. అతని కాళ్ళ దగ్గర బత్తాయి పండు తొక్కలన్నీ పడి ఉన్నాయి. కానీ, చూస్తూ ఉండగానే, ఆ గుడ్డి వృద్ధుడు తన జేబులోంచి ఒక్కొక్క నోటూ తీసి, వాటిని బాగా తడుముతూ తన ప్రక్కనే కూర్చున్న ఒక మధ్య వయస్కుడికి ఇచ్చాడు. ఇద్దరూ లెక్క చూసుకున్నారు. అవన్నీ కట్టగట్టి ఆ రెండో అతను తన జేబులో పెట్టుకున్నాడు. తరువాత చిల్లర పైసలు కూడ ఒక మూట కట్టి తీసుకున్నాడు. ఆ రెండో అతనికి అన్ని అవయవాలూ బాగానే ఉన్నాయి. అప్పుడు సమయము సుమారు పదకొండున్నర. గుడి కట్టేసే సమయం. అతను ఆ గ్రుడ్డి వాడిని మా ముందరే ఇంకొక స్కూటీ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు.
అంటే, పండు మాత్రమే అతను తినగలడు. ఆ అవకాశం వదులుకోకుండా తినేశాడు. డబ్బులన్నీ ఇచ్చేయవలసిందే. కాదా? లేకపోతే ఎందుకు ఇచ్చేశాడు? మరి వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ గ్రుడ్డివాడికి కమిషన్ ఏమైనా వస్తుందా? .. ఏమో? .. ఒక్కసారిగా ఇన్ని ప్రశ్నలతో బుర్ర వేడెక్కిన నాకు చిన్నప్పుడు మా మాష్టారు గారు చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చింది, “మంచి చేయడం ధర్మం, కానీ సూక్ష్మం తెలుసుకుని చేయడం అవసరం” అని.

శ్రీ టి.ఎస్.ఎస్. మూర్తి ఎం.ఎ.(ఆంగ్లం) చదివారు. EFLU నుంచి PGDTE, M.Phil చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. గత 28 సంవత్సరాలుగా బోధనారంగంలో పని చేస్తున్నారు. CAT, GRE, GMAT, SAT, CLAT, TOEFL, IELTS వంటి పోటీ పరీక్షలకు గాను ఇంగ్లీష్, వెర్బల్ లాజిక్ కంటెంట్ రూపొందిస్తారు. ట్రైనర్స్ ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తారు.
విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దేశ విదేశాల్లో ఉన్నత విద్యని అభ్యసించాలనుకునేవారికి కౌన్సిలింగ్ ఇస్తారు.
మూర్తి తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలలో రచనలు చేస్తారు. గత మూడేళ్ళుగా మూడు భాషలలోనూ కథలు, కవితలు, పాటలు వంటి రచనలతో yoursreasonably.art.blog అనే బ్లాగ్ నిర్వహిస్తున్నారు.
విద్యార్థుల కోసం “TSSMurty’s Classes” అనే YouTube Channel ప్రారంభించి ఆంగ్లభాషలో English, Verbal Logic/Reasoning వీడియోలు పోస్ట్ చూస్తున్నారు.
YouTube Channel:
https://youtube.com/@TSSMurty?si=v1752iU4Hzv7SWno
1 Comments
ASURI HANUMATHSURI
ధర్మ సూక్ష్మము ను తెలిపిన నీ కథ గొప్పగా ఉంది మూర్తిగారూ !