“మీ పేరు తేజస్వి. అవునా?”
“హల్లో! మిమ్మల్నే! వినిపించలేదా?”
చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తి ఎదురుగా ఉన్న అమ్మాయి వైపు చూసేడు తేజస్వి.
“మీరు కాలేజీ టాపర్ అనీ, పుస్తకాల పురుగనీ కేంపస్ సెలెక్షన్లో అల్రెడీ ఓ మాంచి ఉద్యోగం మీ కోసం కాచుకుని వుందనీ విన్నాను గానీ, మరీ యింతలా – ఎదురుగా ఓ ఆడపిల్ల నిలబడి, పలకరిస్తున్నా – వినబడనంత ఏకాగ్రత చదువులో ఉందని అనుకోలేదు.”
“మీరెవరో నాకు తెలియదు” అన్నాడు తేజస్వి.
“తెల్సుకునే ప్రయత్నం చేయొచ్చు కదా!”
“పరిచయం లేని వాళ్లతో మాట్లాడడం నాకు అలవాటు లేదు”
“అలవాటు అన్నది చేసుకుంటే వస్తుంది. యింత సేపు మాట్లాడేక పోనీ – మీరెవరు, ఏంటి? ఎందుకొచ్చేరు? అనైనా అడగొచ్చుగా”
“మీరెవరు, ఏంటి? ఎందుకొచ్చేరు?” అడిగేడు.
“అంటే నేనేం అడగమంటే అవే అడుగుతారు గానీ, కనీసం కూర్చోమనైనా అనరా?”
“మిమ్మల్ని కూర్చోమనడానికి ఇది నా యిల్లు కాదు. కాలేజీ స్థలం. నేను చెప్పక పోయినా కూర్చునే హక్కు మీకుంది”.
“అబ్బో! మాటలు రావంటూనే బాగానే మాట్లాడారే!” అంటూ తేజస్వి ప్రక్కనే కూర్చుని – “నా పేరు సుచరిత. యిదే కాలేజీలో చదువుతున్నాను. నేను మీకు తెలియక పోయినా మీ గురించి నేను చాలా విన్నాను. మిమ్మల్ని ఒక రిక్వెస్టు చేయాలని వచ్చేను. మీతో మాకు తెలియని సబ్జెక్టులు చెప్పించుకోవాలని నేనూ, మా రూంమేట్ రేఖ అనుకున్నాము” అంది.
“అబ్బెబ్బే! యింకొకరికి చెప్పేంత నాకేమీ తెలియదు” తత్తరపడ్తూ అన్నాడు.
“ఎందుకలా కంగారు పడ్తారు? ట్యూషన్ సంగతి ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి మీతో స్నేహం చేయాలని కూడా వచ్చేను”.
“నాకలాంటివి అలవాటు లేదండీ! నన్ను యిబ్బంది పెట్టకండి” మొహమాట పడ్తూ అన్నాడు తేజస్వి.
“దీనికి అలవాటేంటండీ!” అంటూ తనే చొరవ తీసుకుని- తేజస్వి చేతిలో ఉన్న పుస్తకం ప్రక్కన పెట్టి – తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసి తేజస్వి చేతికి కట్టి – “ఈ రోజు నుండి మనిద్దరం ఫ్రెండ్స్, సరేనా?” అంటూ తేజస్వి చేతిని తన చేతిలోకి తీసుకుని షేక్ హ్యాండ్ యిచ్చింది సుచరిత.
ఊహించని ఈ పరిణామానికి యిబ్బంది పడ్డ తేజస్వి మొదటి సారిగా తలెత్తి సుచరిత వంక చూసేడు. “ఎంత అందంగా వుంది” అని అనుకోకుండా ఉండలేకపోయేడు.
అలా తేజస్వితో మాటలు కలిపిన సుచరిత తనకీ, తన రూంమేట్ రేఖకీ – రోజూ తమ రూంకి వచ్చి ట్యూషన్ చెప్పడం తప్పనిసరి చేసింది సుచరిత.
సుచరితతో అలా మొదలైన పరిచయం ఎంత వరకు దారి తీసిందంటే – ట్యూషన్ సంగతి ఎలా వున్నా – సుచరితని చూడని రోజు ఏదో వెల్తిగా అనిపించేది తేజస్వికి. తనకి తెలియకుండానే సుచరితకి చాలా దగ్గరయినట్లు తేజస్వికి అర్థమయ్యే సరికి – సుచరితను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేని పరిస్థతికి చేరుకున్నాడు. మెల్లి మెల్లిగా వాళ్ల పరిచయం ట్యూషన్ దగ్గరే ఆగకుండా, ఫోన్లూ, చాటింగ్ లతో ప్రణయంగా మారింది.
ఓ రోజు – “సుచీ! నీలో ఏదో మేజిక్ వుంది. ఆడవాళ్లతో మాట్లాడడానికే సంకోచించే నన్ను నీ మాటలతో, చేష్టలతో నీ వాడిగా చేసుకుని నాకంటూ ఏమీ మిగలకుండా చేసేవు. జీవితమంటే నీతోటిదే అనిపిస్తోంది. నా హృదయస్పందనవి నువ్వు. నా ఊపిరిలో, నేను పీల్చే గాలిలో నువ్వే వున్నావు. నిన్ను చూడని రోజు పిచ్చెక్కినట్లు అనిపిస్తుంది తెలుసా?” అన్నాడు.
“వారేవా! క్యా బాత్ హై! ఇదంతా చెప్తోంది నువ్వేనా?” నవ్వుతూ అడిగింది సుచరిత.
“నాకీ మాటలు నేర్పింది కూడా నువ్వే! నా రోజు నీతోనే మొదలై, నా రాత్రి నీతోనే పూర్తవుతుంది తెలుసా! చివరికి నన్ను నిద్ర కూడా పోనివ్వకుండా ఎంత కవ్విస్తావో తెలుసా! నా జీవితంలో రంగులు నింపిన దేవతవి నువ్వు. ఏ మాయ చేసి, ఏ మంత్రమేసి నన్ను నీవాడిగా చేసుకున్నావు? నీలో వశీకరణ శక్తి వుందా?”
“నీకు తెలీదా! రోజు నీకిచ్చే టీ లో ‘వశీకరణ’ గుళికలు వేస్తున్నాను”
“నీకలా నవ్వులాటగానే వుంటుంది. నిన్ను కలిసేక నిన్ను వదిలి వెళ్లాలంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా! నీతో ఉన్నప్పుడల్లా – కాలం స్తంభించిపోతే బాగుండుననిపిస్తుంది”
“ఒక పుస్తకాల పురుగు యిలా ప్రేమ పాఠాలు ఎలా వల్లిస్తోందబ్బా! డిగ్రీలో నీ సబ్జెక్టు తెలుగా ఏంటి, యిలా కవిత్వం చెప్తున్నావు. యింకా నయం! నిన్ను హిప్నటైజ్ చేసి నా వలలో వేసుకున్నాననలేదు”
“అదే కదా జరిగింది మరి! లేక పోతే రోజంతా నీ ధ్యాసే ఎందుకుంటుంది నాకు”
“నీ లాగే నాకూ అనిపిస్తుందని నీకు తెలుసా! నువ్వు చెప్తున్నావు. నేను చెప్పడం లేదు. అంతే తేడా! నా ఊహకందనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ అవేవీ నీలాగా మాటలలో పెట్టి చెప్పడం లేదంతే1”
“అయితే పోనీ చేతలతో చెప్పవచ్చుగా”
“ఏయ్! ఒళ్లెలా వుందేంటి?”
“వచ్చి చూడకూడదూ! తపనతో ఎలా కాలిపోతోందో!”
“నీతో మాట్లాడుతుంటే టైమే తెలియదు బాబూ! ఈ రోజుకింక చాలు. అన్నట్లు అసలు విషయం మర్చిపోయేను. రేపు ట్యూషన్ లేదు”.
“అదేంటి! సడన్‌గా అంత షాకిచ్చేవు”
“రేపు నా పుట్టిన రోజు బాబూ! ఫ్రెండ్సు అంతా పార్టీ అని గోల పెడ్తున్నారు”
“ఓ మైగాడ్! రేపు ఏడో తారీఖు కదూ? అది ఎలా మర్చిపోయేను? యింతకీ నన్ను రేపు రావద్దంటావు అంతేనా?”
“నువ్వు లేని, నువ్వు రాని నా పుట్టిన రోజా! ట్యూషన్ లేదన్నాను గానీ, నిన్ను రావద్దన్నానా! మా ఫ్రెండ్స్ అందరికీ నిన్ను పరిచయం చేస్తాను. యూ ఆర్ ది గెస్ట్ ఆఫ్ ఆనర్”
“అంత మంది అమ్మాయిల మధ్య నాకు యిబ్బందిగా ఉంటుంది సుచీ!”
“అదేం కుదరదు. వాళ్లేం నిన్ను కొరుక్కు తినరులే”
ఏమో! నువ్వు తినగా మిగిలింది వాళ్లు తింటారేమోనని – అదే ‘నా తల’ ” అంటూ మార్చేసి “యింతకీ పార్టీ ఎక్కడ?”
“నీలా ఐదు నక్షత్రాల హోటళ్లకి తీసికెళ్లలేను బాబూ! సింపుల్‌గా ఉన్నంతలో మా రూంలోనే! రాకపోతే నీతో మాటలు బంద్” బెదిరించింది సుచరిత.
“అంత శిక్ష వద్దులే తల్లీ! ఈ దాసుడు నీ మాట ఏనాడు జవదాటేడు గనుక!” అన్నాడు తేజస్వి.
మర్నాడు సాయంత్రం సుచరిత రూంకెళ్లి కాలింగ్ బెల్ కొట్టేడు తేజస్వి. తలుపు తీసిన సుచరితని చూసి – చూపు తిప్పుకోలేక పోయాడు. అప్సరసలంటే ఇలాగే వుంటారా?
“హల్లో! లోపలికి రాకుండా అక్కడే నిలబడి ఏమిటా చూపు?” అడిగింది సుచరిత.
గదిలోకి రాగానే గులాబీల గుబాళింపు గుప్పుమంది – “హేపీ బర్త్ డే సుచీ! మెనీ హ్యాపీ రిటర్న్స్” అంటూ పూల బొకే అందించేడు.
“థాంక్యూ!, ఎంత బాగుందో” బొకే లోని పువ్వుల వాసన చూస్తూ అంది.
“అదేంటి! నీ ఫ్రెండ్సంతా ఏరి? లోపల గదిలో దాక్కున్నారా ఏంటీ, నన్ను భయపెట్టడానికి1”
“వాళ్లంతా వుంటే నీకు ఇబ్బంది అన్నావుగా. అందుకే అందరినీ లంచ్ కు పిలిచేను. యిందాకనే వెళ్లేరు”.
“బ్రతికించేవు తల్లీ! రేఖ ఏదీ మరి?”
“అది వాళ్ల అమ్మమ్మ పోయిందని వూరెళ్లింది. పది రోజుల దాకా రాదు” తలుపు గడియ పెడ్తూ అంది.
“అంటే మనమిద్దరమేనా ఇక్కడున్నది. నీకో సర్ప్రైజ్!, కళ్లు మూసుకో ఒకసారి” అన్నాడు.
“ఎందుకు?”
“మాట్లాడకుండా బుద్ధిగా మూసుకుంటావా లేదా?”
సుచరిత కళ్లు మూసుకోగానే – జేబులోంచి డైమండ్ రింగ్ ఉన్న బాక్స్ తీసి – “ఇప్పడు కళ్లు తెరువు” అని “ నా ఆరాధ్య దేవతా! నన్ను పెళ్లి చేసుకుంటావా?” సినిమా ఫక్కీలో మోకాలి మీద కూర్చుని ఉంగరం ఉన్న బాక్స్ సుచరిత ముందు వుంచేడు.
“ఓ మై గాడ్! ఏమిటిది?” ఆశ్చర్యపోయింది.
“సుచీ! నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టమైతేనే ఈ ఉంగరం నీ వేలికి తొడుగుతాను” అన్నాడు.
సుచరిత వంగి తేజస్వి నుదిటి మీద ముద్దు పెట్టుకొని తన భుజాల మీద చేతులు వేసి లోపల గదిలో ఉన్న మంచం మీద కూర్చో పెట్టి తనూ ప్రక్కన కూర్చుని చేయి ముందుకు జాపింది.
తేజస్వి సుచరిత వేలికి ఉంగరం తొడిగి ఆ చేతిని ముద్దు పెట్టుకున్నాడు.
“తేజూ! ఈ రోజు కోసం నేనెంత ఎదురు చూస్తున్నానో నీకు తెలుసా? నాకుగా నేను అడిగితే నువ్వు ఏమంటావో అని భయపడ్డాను. ఈ రోజుతో ఆ తెర తొలగిపోయింది” అంటూ తేజస్వి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మొహమంతా ముద్దులతో నింపేసింది సుచరిత.
“ఏయ్! ఏంటి?.. మనకి ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. యింకా పెళ్లి కాలేదు” అన్నాడు లేవబోతూ.
“ఏనాడైతే మన మనస్సులు కలిసేయో, అప్పుడే నీతో నాకన్నీ అయిపోయేయి.” అంటూ తేజస్విని లతలా అల్లుకుపోయి మంచం మీద పడుకునేలా చేసి “నా ముద్దులు నాకు తిరిగిచ్చేయి” అంది.
యింక నిగ్రహించుకోవడం తేజస్వి వల్ల కాలేదు. సుచరిత ఒళ్లంతా ముద్దులతో నింపేడు.
“సుచీ! యిన్నాళ్లుగా నీకు దగ్గరగా వుంటూ దూరంగా ఉండలేక ఎంత తపన పడ్డానో తెలుసా?”
“నేను అనాల్సిన మాటలు నువ్వంటున్నావు” అంది సుచరిత.
“యింకెంత! యింక రెండు నెలలు ఓపిక పడితే నేను ఉద్యోగంలో చేరిపోతాను. మీ వాళ్లతో మాట్లాడి నిన్ను పూర్తిగా నా దానిగా చేసుకుంటాను” సుచరితను పొదివి పట్టుకుంటూ అన్నాడు తేజస్వి.
“తేజూ! మనం కల్సినప్పుడల్లా ఏదో గిఫ్ట్ అంటూ నాకిస్తూనే వున్నావు. మనం ఇంక యిద్దరం కాదు- ఒకటని తెల్సిన ఈ రోజు నన్ను నేనే నీకు గిఫ్టుగా సమర్పించుకోవాలనుకుంటున్నాను. నన్ను నీలో కలుపుకుని నీ స్వంతం చేసుకోవా?” అంటూ పక్కనే వున్న లైట్ స్విచ్ ఆఫ్ చేసింది. వాళ్ల మధ్య కాలం స్తంభించిపోయింది.
రేఖ లేని ఆ పది రోజులూ ఎలా గడిచేయో వాళ్లకే తెలియలేదు.
మర్నాడు రేఖ వస్తుందనగా – “తేజూ! నన్ను నిజంగా పెళ్లి చేసుకుంటావు కదూ!” అడిగింది సుచరిత.
“ఆ మాట ముందు అడిగింది నేను” గుర్తు చేసేడు.
“అవుననుకో! కానీ….” సుచరితను మాట్లాడనివ్వకుండా తన పెదాలతో కప్పేశాడు.
“రేపు మీ రేఖ వస్తోందంటే దిగులేస్తోంది”.
“ఎందుకట?”
“నా గిఫ్టుని – నా దగ్గర నుండి దూరం చేస్తుందని”
నవ్వింది సుచరిత “అది ఫిజికల్ గానే కదా! మానసికంగా నేనెప్పుడూ నీతోనే వుంటాను”.
“చీకటి పడుతోంది. నేనింక వెళ్లనా?” అన్నాడు తేజస్వి.
బట్టలు సరి చేసుకుని వెళ్లడానికి సిద్ధమవుతున్న తేజస్వినితో – “నేనొక విషయం నిన్ను అడగాలనుకుంటున్నాను. నువ్వు కోప్పడకూడదు మరి” అంది సుచరిత.
“నీ మీద నాకు కోపమా? నెవర్” అన్నాడు సుచరితను దగ్గరికి తీసుకుంటూ-
పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. యింక మనం ఎక్కువగా కలవడానికి వుండదు. మనం ఒకరికొకరం దగ్గరయ్యేమే గానీ, యిన్నాళ్లూ, మీ వాళ్లెవరో ఏంటో వివరాలు తెల్సుకోలేదు”.
“ఏంటీ? నన్ను అనుమానిస్తున్నావా, పరీక్షలు రాసి నిన్ను వదిలి పారిపోతానని !”
“ఛ – అది కాదు. రేపు మా ఇంట్లో వాళ్లకి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే వివరాలు అడుగుతారు కదా!”
“అంటే వాళ్లు నా వివరాలు చూసి ఏ కారణం చేతనైనా వద్దంటే నన్ను పెళ్లి చేసుకోవా?”
“ఆ కోపమే వద్దన్నది. యిద్దరం ఒకటైనప్పుడు ఒకరి గురించి ఒకరు తెల్సుకోవడం తప్పు కాదుకదా!”
“అవునా! ఈ వివరాలు మన పరిచయం ప్రేమగా మారక ముందు అడగాలని తెలియలేదా?”
“ఏమనీ? ఈ రోజు నుండి మనం ప్రేమించుకుంటున్నాం – మీ కుల గోత్రాలు, మీ కెంత ఆస్తి వుంది. మీ అడ్రస్ వగైరాలు చెప్తావా?” అనా .. అలా అడగాలని నాకు తట్టలేదు. అందుకే ప్రేమ గుడ్డిది అంటారేమో!”
“ప్రేమ గుడ్డిదీ, కుంటిదీ కాదు గానీ, నా వివరాలే కదా, నీకు కావాల్సింది” అంటూ ప్రక్కన బల్ల మీద ఉన్న కాగితాలలోంచి ఒక తెల్లకాగితం తీసి.. వివరాలన్నీ రాసి.. “యిదిగో మేడం గారూ! నా బయోడేటాతో పాటు, మా కుటుంబం హిస్టరీ, జాగ్రఫీ కూడా రాసేను. ఇది చాలా లేక పోతే బాండ్ పేపరు తెచ్చి ‘నేను తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అని కూడా రాసి సంతకం పెట్టి యిమ్మంటావా?”.
“యిస్తే నాకభ్యంతరం లేదు. ఫ్రేం కట్టించుకుంటా! ముక్కు మీద కోపం దొరగారికి” అంది సుచరిత తేజస్వి ముక్కు పట్టుకుని ఊపుతూ.
“యింక నేను వెళ్తాను” తేజస్వి బయలుదేరబోతోంటే – “ఉండు నేను కూడా వివరాలు రాసిస్తాను” అంటూ బల్ల మీద పేపర్ తీసుకుంది.
“నాకక్కరలేదు. నేను నిన్ను నమ్ముతాను” అన్నాడు.
“అంటే నాకు నీ మీద నమ్మకం లేక నీ వివరాలు అడిగేనంటావా?” కోపంగా అంది.
“అలా అని నేను అనలేదే! వెళ్లే ముందర నాతో గొడవ పడాలని చూడక – నాకు తోచదు” అంటూ జేబులోంచి నోట్ల కట్ట తీసి “యిది నీ దగ్గర వుంచు! అవసరాలకి వుంటుంది” అంటూ సుచరిత చేతిలో పెట్టాడు.
“యిప్పటికే చాలా యిచ్చేవు, యింకా యిదెందుకు?” అంటూ తేజస్వికి డబ్బు తిరిగి యిచ్చేయబోయింది. కానీ అతను తీసుకోకుండా బై చెప్పి వెళ్లిపోయాడు.
పరీక్షలయిపోయాయి. ఆ సాయంత్రం రూంకి వచ్చిన తేజస్వితో – “మీ పుణ్యమా అని ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసేమండీ! ఇటు చదువు చెప్పడమే కాకుండా, మాకు కావాల్సినవన్నీ మేం అడగకుండానే తెచ్చిపెట్టడం.. మీ రుణమెలా తీర్చుకోవాలో తెలియడం లేదు” అంది రేఖ.
“అంత పెద్ద మాటలు వాడకండి – ఇటీజ్ నథింగ్” అన్నాడు తేజస్వి.
లోపల నుండి వచ్చిన సుచరిత “ఏంటే? భారీ డైలాగులు కొడ్తున్నావు. నీ బదులు కూడా ఆ రుణానుబంధాన్ని నేను తీర్చేస్తానులే!” అంది నవ్వుతూ.
“ఏంటీ! మీ పాటికి మీరు మాట్లాడేసుకుంటున్నారు. నాలుగు ముక్కలు మీకు- నాకు తెల్సింది చెప్పినంత మాత్రాన నాకు పోయిందేమీ లేదు గానీ- టేకిట్ ఈజీ!” అన్నాడు తేజస్వి.
“ఓకే తేజూ! మేమింక బయలుదేర్తాం, చెప్పేనుగా ఈ రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమా కెళ్తున్నామని” అంది సుచరిత.
“బై! గుడ్ లక్! బాగా ఎంజాయ్ చేయండి. ఈ టైం మళ్లీ రాదు” అన్నాడు తేజస్వి.
ఆ మర్నాడు పొద్దున్నే – రాత్రి తనకి వచ్చిన కల గురించి చెప్పాలని సుచరితకి ఫోన్ చేసేడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత చాలా సార్లు ప్రయత్నించినా అదే మెసేజ్ రావడంతో కంగారు పడి వాళ్ల రూంకి బయల్దేరాడు.
కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీసిన రేఖని చూసి “సుచరిత లేదా” అనడిగాడు.
“అదేంటి? మీకు చెప్పలేదా?.. వాళ్ల నాన్నగారికి సీరియస్‌గా వుందని ఫోన్ వస్తే రాత్రికి రాత్రే బయల్దేరి వెళ్లిపోయింది”.
“అవునా! తనకి ఫోన్ చేస్తోంటే స్విచాఫ్ అని వస్తోంది. అక్కడి పరిస్థతి ఎలా వుందో ఏంటో!” ఎలా తనని కాంటాక్ట్ చేయడం అనుకుంటూ, “నేను మళ్లీ ట్రై చేస్తాలేండి, బై” అంటూ అక్కడ నుండి బయలుదేరాడు.
వారం రోజులైనా సుచరిత జాడ తెలియలేదు. వాళ్ల నాన్నగారికెలా వుందో? అసలు సుచరిత ఊరు చేరిందా, దారిలోనే తననెవరైనా కిడ్నాప్ చేసేరా! లేక పోతే తనని ఎవరైనా ఏదైనా చేసి.. ఆ ఆలోచన ఒళ్లంతా గగుర్పొడిచేలా చేసింది.
రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారిపోయాయి. తేజస్వి ఉద్యోగంలో చేరి యాంత్రికంగా వెళ్లి వస్తున్నాడు. సుచరిత జాడ తెలియక పోవడంతో దాదాపు పిచ్చివాడైపోయేడు.
***
ఆ రోజు ఆదివారం. కాలింగ్ బెల్ మోగడంతో లేచి టైం చూసుకున్న తేజస్వి ఉలిక్కిపడ్డాడు. “పన్నెండైందా!” అనుకుంటూ…
తలుపు తీసి ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయేడు.
“అదేంటక్కా! చెప్పా పెట్టకుండా యిలా వచ్చేసేవేంటి?”
“ఏం చెప్తే రూంలో లేకుండా పారిపోయేవాడివా?” అడిగింది సుస్మిత.
“అవేం మాటలక్కా!నువ్వు కూర్చో! నేను బ్రష్ చేసుకుని వస్తాను” అంటూ, ఫ్రెషయి వచ్చిన తేజస్వి – “యిప్పుడు చెప్పు! ఏంటీ సడెన్‌గా యిలా ఊడిపడ్డావు” అడిగేడు.
“నీకసలు బుద్ధి వుందా? నువ్వు ఇంటికి ఫోన్ చేసి ఎన్ని రోజులైంది? ఏమైనా అంటే అప్పుడు పరీక్షలన్నావు – ఆ తర్వాత కొత్త ఉద్యోగంలో బిజీ అన్నావు. ఇవన్నీ కాదు గానీ అసలేం జరిగింది?. ప్రవరాఖ్యుడులాంటి నా తమ్ముడు ప్రేమలో పడలేదు కదా!” అని ప్రక్కనే కూర్చున్న తేజస్వి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది సుస్మిత.
అంతే!.. అంత వరకు అణుచుకున్న దుఃఖం ఒక్క సారి పొంగిపొర్లింది తేజస్వికి. ‘అక్కా!’ అంటూ సుస్మిత ఒళ్లో తల పెట్టి బావురుమన్నాడు.
“ఏమైంది తేజూ! చిన్న పిల్లాడిలా ఆ ఏడుపేంటి? ఏం జరిగిందో చెప్పక పోతే ఎలా తెలుస్తుంది” అంటూ సుస్మిత అనునయించేసరికి లేచి కూర్చుని కళ్లు తుడుచుకుంటూ – సుచరిత తనకి పరిచయం అయిన రోజు నుంచీ, తను వెళ్లి పోయిన రోజు దాకా జరిగినవన్నీ చెప్పేడు.
“యింత జరిగితే నాకెందుకు చెప్పలేదు? అమ్మా, నాన్నా పోయేక మనం ఒకరికొకరు మాత్రమే మిగిలేం. మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని ప్రమాణం చేసుకున్నామా లేదా?”
“ఇంతకీ సుచరిత వివరాలేం నీ దగ్గర లేవంటావు, కనీసం ఆ పిల్ల ఫోటో అయినా నీ దగ్గర వుందా?” అడిగింది సుస్మిత.
తన మొబైల్ తీసి సుచరిత ఫోటో చూపించేడు తేజస్వి.
అది చూసిన సుస్మిత అదిరిపడింది. “ఈ పిల్ల గురించా నువ్వింత వరకూ చెప్పింది!”
“ఏం! నీకు తెలుసా, తనెవరో!” ఆత్రంగా అడిగేడు.
“తెలియకపోవడమేమిటి? అప్పట్లో మా మరిది ఆనంద్ – ఆత్మహత్య చేసుకోబోతే – మీ బావ కాపాడేరని చెప్పేనే – అది ఈ అమ్మాయి వల్లనే. యిదే అతని జీవితంలో నిప్పులు పోసింది. సమయానికి మీ బావ చూడక పోతే చనిపోయేవాడు కూడా! ఇదెక్కడ దాపురించిందిరా నీకు?”
“అక్కా! నువ్వు చెప్పేదేం నాకర్థం కావడం లేదు. ఆనంద్ ఆత్మహత్య చేసుకోవడానికీ, సుచరితకీ ఏం సంబంధం?”
“నువ్వు చెప్తున్న సుచరిత ఒక కిలాడి – నెరజాణ – నీ దగ్గర కొచ్చినట్లే ఆనంద్ దగ్గరకి కూడా వెళ్లి, ప్రేమలోకి దింపి, వాడికున్నదంతా దోచుకుని, ఒక రోజు యిలాగే చెప్పా పెట్టకుండా పారిపోయింది. తన కోసం వెతికి, వెతికి తనేమైందో తెలియక, తను లేకుండా బ్రతకలేనని సూసైడ్ నోట్ పెట్టి నిద్ర మాత్రలు మింగేసేడు ఆనంద్”.
“నో! లేదక్కా! ‘నా సుచీ’ అలాంటి మనిషంటే నేనొప్పుకోను. మనిషిని పోలిన మనుషులుంటారంటారు! నువ్వెక్కడో పొరపడుతున్నావు.”
“అయ్యో! అలా నమ్మించే మోసం చేస్తారురా, ఇలాంటి ఆడవాళ్లు. మా ఆనంద్‌నే కాదు. ఆ పిల్ల ఇలా చాలా మందిని వాడుకొని వదిలేసిందని, ఆనంద్ ఫ్రెండ్స్ ద్వారా చాలా విషయాలు వెలుగులోకి వచ్చేయి.” చెప్పింది సుస్మిత.
“ఎందుకలా చేసిందంటావ్?” అర్థం కాక అడిగాడు తేజస్వి.
“ఒళ్లు కొవ్వెక్కి!.. అందంగా, ఎర్రగా, బుర్రగా ఉన్న వాళ్లని చూసి, డబ్బున్న వాడిని పసిగట్టీ, నంగనాచిలా వాళ్ల చెంతచేరి, తన కల్ల బొల్లి మాటలతో వాళ్ల మనసు కొల్లగొట్టి, తన కామవాంఛలు, కోరికలూ, అవసరాలూ తీర్చుకునే బజారు మనిషిరా అది. డబ్బు పోతే పోయింది. నువ్వు నాకు దక్కావు అంతే చాలు.”
సుస్మిత మాటలు నమ్మశక్యం కావడం లేదు తేజస్వికి. తనంత తానుగా తన జీవితంలోకి ప్రవేశించి, ‘ప్రేమంటే’ ఏంటో తనకి తెలియజేసిన సుచరిత అలాంటి మనిషంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అదే మాట చెప్పాడు సుస్మితతో.
“నువ్వు చెప్పేది నేను నమ్మనక్కా! పరీక్షలయి నేను ఉద్యోగంలో చేరగానే మీ అందరకి చెప్పి, తనని పెళ్లి కూడా చేసుకుంటానన్నాను. నా మీద నమ్మకం లేక, నా అడ్రస్ కూడా అడిగి తీసుకుంది. తన అడ్రస్ ఇస్తానన్నాతన మీద నమ్మకంతో నేనే తీసుకోలేదు” చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పాడు తేజస్వి.
“అయ్యో! కాలం మారిపోయిందిరా! దానితో పాటు మనుష్యులు కూడా.. తెల్లనివన్నీ పాలనీ, నల్లనివన్నీ నీళ్లని నమ్మే నీలాంటి వాళ్లకి తెలియని లోకం చాలా ఉంది. నీలాంటి అమాయకులనే ఇలాంటి ఆడవాళ్లు ఎంచుకుంటారు. అలాంటి కిలాడీలు నీ దగ్గర డబ్బు, దస్కం కొట్టేసి, నీ చేత వాళ్లకి కావాల్సిన ఖరీదైన గిఫ్టులు కొనిపించేక, ఆ తర్వాత వాళ్లింట్లో ఎవరికో బాగా లేదు, వెళ్లి వస్తానని చెప్పి, ఆ తర్వాత కనిపించకుండా మాయమౌతారు.”
సుచరిత తనను మోసగించిందంటే నమ్మలేకపోతున్నాడు తేజస్వి.
“నువ్వు చెప్పేదంతా నిజమా?.. నిజంగా ఇలాంటి ఆడవాళ్లు కూడా వుంటారా అక్కా?”
“అయ్యో, నేనెలా చెప్తే నీకు తెలుస్తుందిరా? నీలాంటి అమాయకులనే ఎంచుకుంటారు అలాంటి కిలాడీలు – వార్తల్లో ఎంత సేపూ – ఆడదానికి అన్యాయం చేసిన మగవాళ్ల గురించే ఎక్కువగా చెప్తారు గానీ, యిలాంటివి పరువు పోతుందని కొందరు బయటకు చెప్పరు.
తల్లితండ్రుల పెంపకం సరిగ్గా లేక పోయినా, పిల్లల ఎదురుగా పేరెంట్స్ కీచులాడుకున్నా, ఆర్థిక యిబ్బందుల్లో వున్నా- మగ పిల్లలే కాదు, కొంత మంది ఆడపిల్లలు కూడా ఈ మధ్య ఇలాంటి వాటిలో ఆరితేరిపోయారు. కాలం అలా మారిపోయింది. ఈ లివింగ్ రిలేషన్షిప్ – అదే సహజీవనం – తప్పు కాదని కోర్టులు కూడా తీర్పునివ్వడంతో విచ్చలవిడితనం మరీ ఎక్కువైంది.”
“అందరూ ఆడవాళ్లనే సపోర్టు చేస్తే – నాలాగా మోసపోయిన వారి గతేంటక్కా?”
“ఆధారాలు వున్న వాళ్లు కోర్టుకెళ్తారు. కానీ అలాంటి మోసగత్తెలు, నీలాంటి వాళ్ల దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడ్తారు. ఒక వేళ ఎవరైనా ఆధారాలు సేకరించి ఎదురు తిరగాలని చూస్తే, వాటిని తారుమారు చేసి – నీ లాంటి వాళ్లతో గడిపిన కాలాన్నీ, మీరు మాట్లాడిన మాటలని మీకు తెలియకుండా రికార్డు చేసి, మిమ్మల్నే దోషులుగా చేస్తారు. రోజూ ఎన్ని చూడడం లేదూ, యిలాంటివి టీవీలో, పేపర్లలో. సరేలే! ఇంక ఈ టాపిక్ వదిలేద్దాం!జరిగినదంతా ఒక పీడకలగా మర్చిపో! నీ జీవితంలోకి ఒక మంచి అమ్మాయిని నేనే వెదికి తెస్తాను.”
“ఆ అమ్మాయి మంచిదవచ్చు గానీ – నేను మంచివాడను కాదు కదక్కా!.. శీలం అన్నది ఒక్క ఆడదానికే కాదుగా?.. నేనూ, సుచరిత శారీరకంగా కూడా కలిసేం. నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించేను – నువ్వు నా జీవితంలోకి తీసుకురాబోయే మంచి అమ్మాయికి యివన్నీ నేను చెప్పగలనా? చెప్తే నన్ను పెళ్లి చేసుకుంటుందా?”
“లేదక్కా! నా పెళ్లి మాట ఎత్తవద్దు యింక! నన్నే నమ్ముకుని వచ్చిన ఒక అమ్మాయి జీవితాన్ని నేను నాశనం చేయలేను. అలా అని నిజాన్ని దాచి జీవితాంతం నాకు నేనుగా గిల్టీగా ఫీలవుతూ బ్రతకలేను” అన్నాడు తేజస్వి.
“నీకెంట్రా! మగమహారాజువి- అనే ఆడదాన్ని నేను కాదు గానీ, నువ్వు ఎక్కువ ఆలోచించకు. ఆ బజారు మనిషిని మర్చిపోలేక ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు నా తమ్ముడు, అని నాకు తెలుసు. అన్ని సమస్యలనీ కాలం పరిష్కరిస్తుందనే నమ్మకం నాకుంది.” అంది సుస్మిత.
సుస్మితని కారెక్కించి గదిలోకి వచ్చిన తేజస్వికి తలంతా భారమై పిచ్చెక్కినట్లుంది. కోపం, బాధ తట్టుకోలేక ఆఁ…ఆఁ అంటూ గట్టిగా అరిచాడు. సుచరితతో గడిపిన రోజులే మాటిమాటికి వెన్నంటుతున్నాయి. నమ్మించి మోసం చేసిందన్న ఆలోచనని అసలు భరించ లేకపోతున్నాడు.
“మీ టూ” అని గట్టిగా అరవాలన్పించింది. అవును. ఆడవాళ్లకేనా ‘మీ టూ’ ఉద్యమాలు?, అబ్బాయిలూ! అమ్మాయిల ప్రేమలో పడి జీవితాలు నాశనం చేసుకోకండి. అందరు అమ్మాయిలు ఒకలా ఉండరు. తస్మాత్ జాగ్రత్త! అని కాగితాలు ప్రింట్ చేసి కాలేజీల గోడల నిండా, ఊరంతా ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అంటించాలనిపించింది. అమ్మాయిలే కాదు, అమ్మాయిల చేత మోసగించబడిన అబ్బాయిలందరూ కూడా కలిసి ‘మీ టూ’ ఉద్యమం మొదలెడితే ఎలా ఉంటుంది?.. అన్న పిచ్చి పిచ్చి ఆలోచనలతో తిండి, తిప్పలు లేకుండా నీరసంతో మంచం మీద వాలి నిద్రలోకి జారుకున్నాడు.
రెండేళ్ల తర్వాత – ఓ రోజు ఫోన్ మోగుతుంటే తీసేడు తేజస్వి. అది అక్క దగ్గిర నుండి అని చూసి – “ అక్కా! చెప్పు అంతా బాగున్నారా?” అని అడిగేడు.
“మేమంతా బాగానే ఉన్నాం గానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బిజీగా వున్నావా?”
“లేదక్కా! చెప్పు – డ్రైవ్‌లో ఉన్నాను. ఆఫీసుకి వెళ్తున్నాను. ఈ ట్రాఫిక్ చూస్తే ఒక గంటైనా పట్టేటట్లుంది ఆఫీసు చేరేసరికి.”
“మనింటి పక్క వాటాలో ఈ మధ్య ఒక కుటుంబం దిగింది. కాన్పూర్ నుండి ట్రాన్స్ఫర్ అయి ఈ వూరికి వచ్చేరట – వాళ్లకి ఒక్కర్తే అమ్మాయి. నిన్ననే మాటల మధ్యలో తెల్సిందేంటంటే, వాళ్లమ్మాయికి పెళ్లి అయిన ఏడాదిలోనే కార్ ఏక్సిడెంటులో భర్త చనిపోయేడని – ఇది జరిగి రెండేళ్లు దాటినా మళ్లీ పెళ్లి చేసుకోమంటే తను ససేమీరా ఒప్పుకోవడం లేదని వాళ్లమ్మ గారు కళ్లనీళ్లు పెట్టుకుంటూ చెప్పేరు.
ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, ఆ అమ్మాయి పేరు లాస్య, ఆ పిల్ల అక్కడే మీ ఆఫీసులోనే ప్రోజెక్టు హెడ్‌గా పనిచేస్తోందంట. వాళ్లది చాలా మంచి కుటుంబం. ఆ అమ్మాయి ఫోటో చూశాను వాళ్లింట్లో. మీ కిద్దరికి ఈడు, జోడు బాగుంటుంది. రేపు దశమి. మంచి రోజు. నువ్వు ఈ సారి కాదనకుండా నా మాట విని తీరాలి. నువ్వు ఇబ్బంది పడకుండా నీ సంగతి వాళ్లకి చెప్పేను. వాళ్ల అమ్మాయికి కూడా వాళ్లనే చెప్పమన్నాను. అందరికీ ఇష్టమైతేనే ముందుకు వెళ్దాం అని కూడా వాళ్లతో చెప్పడమైంది. అటు వైపు నుండి వాళ్లు ఓకే అన్నాకే నీకిప్పుడు చెబుతున్నాను. ఇంక అక్కడ మీ ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒకరికొకరు నచ్చితే – అప్పుడు మీ ఇద్దరి వీలును బట్టి మీ పెళ్లి గురించి మాట్లాడుకోవచ్చు. నీకు ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే – మీ ఇద్దరికి జీవితంలో అన్యాయం జరిగినందుకు, దేవుడు మనకి ఈ అవకాశం కల్పించాడని నాకన్సిస్తోంది. నా మాట కాదని తీసి పారేయక. ఈ సంబంధం కూడా నువ్వు వద్దంటే నేనిక నీతో మాట్లాడనంతే. ఏ సంగతీ నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పు” అంటూ తేజస్విని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసింది సుస్మిత.
ఆ రోజు రాత్రి తేజస్వి నిద్ర పోదామని మంచంపై వాలేడే గానీ, గుండెల్లో ఒకటే అలజడి. సుచరిత జ్ఞాపకాలు వీడడం లేదు. మనసంతా అల్లకల్లోలంగా ఉండడంతో, ఆలోచనల మధ్య ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నాడు.
కిటికీలోంచి సూర్యకిరణాలు ముఖం మీద పడి మెలకువ రావడంతో, కళ్లు నులుముకుంటూ లేచి వీధి తలుపు తీసి కింద పడి వున్న పేపర్ తీసి టీపాయ్ మీద పెట్టి, ఫ్రెషప్ అయి, టీ తాగుతూ పేపర్ తీశాడు చదువుదామని. అందులో చూసిన వార్తతో చేతిలో ఉన్న టీ కప్ తొణికిసలాడింది. ఒక్క సారిగా గుండె దడదడలాడింది.
పేపర్లో ‘కిలాడి లేడి’ అని పెద్ద అక్షరాలతో రాసి దాని కింద సుచరిత కలర్ ఫోటో కనిపించింది. ఫోటో కింద రాసిన వార్త సారాంశం – “ఎంతో మంది మగాళ్లని తన అందంతో, తెలివితేటలతో ‘ప్రేమ’ అంటూ ముగ్గులోకి దింపి, వాళ్లని తన చాకచక్యంతో పూర్తిగా దోచుకుని – ఆ తర్వాత ఏదో కారణం చెప్పి, తన ఆచూకీ తెలియకుండా మాయమవ్వడం ఈ నెరజాణ ‘మోడస్ అపరెండి’ (modus operandi). ఎప్పటిలాగానే ఒక నెల క్రితం ధనుష్ అనే ఓ కుర్రాడి దగ్గర డబ్బు, ఖరీదైన వస్తువులు అన్నీ తీసుకుని – వాళ్ల అమ్మమ్మ గారు బాత్రూమ్లో జారి పడ్డారని, రెండు రోజుల్లో చూసి వస్తానని చెప్పి, నెల రోజులైనా రాకపోయే సరికి తన గురించి వివరాలు తెలియకపోవడంతో దేవదాసులా మారి తన ఎడబాటును భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోటు రాసి పెట్టి నిద్ర మాత్రలు మింగేశాడు ధనుష్. సమయానికి ఇంట్లో వాళ్లు చూసి హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో అతను బ్రతికి బయట పడడం జరిగింది. ఆ తర్వాత ధనుష్ వాళ్ల నాన్న గారికి పెద్ద పెద్ద వాళ్లతో ఉన్న పరిచయాలతో తమ దగ్గరున్న కొద్ది పాటి వివరాలతో – స్వాతిగా పేరు మార్చుకున్న సుచరితని – ఎట్టకేలకు పట్టుకొని, చివరికి కోర్టు ఆర్డరుతో జైలుకు తరలించేరు.”
ఆ వార్త చదివిన తేజస్వి చాలా సేపటి దాకా కోలుకోలేక పోయాడు. జుట్టు పీక్కుంటూ గదంతా కలియ తిరిగాడు.
ఏంటి ఇదంతా?.. ఎందుకిలా జరిగింది నాకు? ఇలాంటి అమ్మాయి మాయలోనా నేను పడింది. సుచరిత గురించి అక్క చెప్పినదంతా విన్న తర్వాత కూడా ఎక్కడో ఏదో ఒక మూల చిన్న ఆశ ఉండేది. తనని వెతుక్కుంటూ సుచరిత తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుందని. కానీ, ఇప్పటి పేపర్లో వార్త చూసిన తర్వాత అక్క చెప్పినదంతా నిజమేనని రుజువైంది. తను కూడా సుచరిత మోసగించిన వాళ్లలో ఒకడిగా మిగిలిపోయాడన్నమాట. ఇంత బరితెగించిన ఆడవాళ్లు కూడా ఉంటారా?..
ఆలోచనలతో సతమతమవుతున్న తేజస్వి – ఒంట్లో బాగా లేదని చెప్పి, ఆ రోజు ఆఫీసుకి సెలవు పెట్టాడు. గదిలో ఉండబట్టలేక రోజంతా తిండి కూడా తినకుండా ఎక్కడెక్కడో పిచ్చివాడిలా రోడ్ల మీద తిరిగి తిరిగి, రాత్రికి గదికి చేరి – ఏదోనిర్ణయానికి వచ్చిన వాడిలా – మంచం మీద వాలాడు.
మర్నాడు సుస్మిత ఫోన్ చేసి ఏం నిర్ణయించుకున్నావని అడిగితే – “నీ యిష్టం అక్కా! కానీ నాకు కొంచెం టైం కావాలి” అని అడిగాడు.
“నువ్వు ఒప్పుకున్నావు అంతే చాలు.. నీకిష్టమైనంత టైం తీసుకో. ఆ తర్వాత లాస్య, నువ్వు మాట్లాడుకుని మీ నిర్ణయం నాకు చెబితే నేను, లాస్య వాళ్ల పెరెంట్స్ కి కూడా చెప్పి మీ పెళ్లికి ముహూర్తం కుదర్చమని చెబుతాను. సరేనా?” గొంతులో సంతోషం ఇనుమడిస్తోంటే తమ్ముడితో అంది సుస్మిత.
“అలాగే” అన్నాడు తేజస్వి.
రెండు నెలల తర్వాత లాస్య, తేజస్విల పెళ్లి – లాస్య కోరిక మీద- ఎక్కువ హడావుడి లేకుండా దగ్గిర బంధు మిత్రుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది!!.
రెండేళ్ల తర్వాత –
ఒక రోజు స్వీటు బాక్సు చేతిలో పట్టుకొని వచ్చిన లాస్య తల్లి సురేఖ “నువ్వు ముందు నోరు తెరూ!” అని సుస్మితకి మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వకుండా తన నోట్లో ఒక లడ్డూ కుక్కి – మీకు మేనకోడలు కావాలా, మేనల్లుడా? “ అని నవ్వుతూ అడిగింది.
ఒక్క క్షణం అర్ధం కానట్టు చూసిన సుస్మిత – “ఓ మైగాడ్! నిజంగానే! వీడు నాకు చెప్పనే లేదు చూశావా?..” అంటూ ఫోన్ తీసింది – లాస్య, తేజస్విలతో మాట్లాడి ఇద్దరినీ విష్ చేద్దామని!.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కుసుమ వేదన-17
కల్పిత బేతాళ కథ-16 ఒక వరం నాలుగు కోరికలు
నా జీవన గమనంలో…!-24
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 48: నాగులపాడు
పేదవాడి గారడీ
చావా శివకోటి మినీ కవితలు 2
అవధానం ఆంధ్రుల సొత్తు-7
మార్మిక సోయగాలపై వెలుగు – ‘కిన్నెరసాని పాటలు – సమీక్ష’
‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం-5
కర్ర ధైర్యం!!
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®