[బాలబాలికల కోసం ‘పనిష్మెంట్’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]


బడినుంచి ఇంటికొచ్చిన సుధీర్ ఎప్పటిలా కాళ్ళు కడుక్కుని, స్కూల్ డ్రస్ మార్చకుండానే టిఫెన్ పెట్టమని అమ్మని సతాయించలేదు. ఆటలకి కూడా వెళ్ళలేదు. వాణ్ణే గమనిస్తున్న సుమతికి వాడి వైఖరి అర్థం కాలేదు. ఎందుకలా వున్నాడు. స్కూల్లో ఎవరితోనైనా గొడవ పడ్డాడా. సుధీర్ అలాంటివాడు కాదు. మరి ఎందుకంత ఏ విషయంలో ధ్యాస లేకుండా వున్నాడు. నెమ్మదిగా పాలు కలిపి తీసుకొచ్చి సుధీర్ కిచ్చింది.
“ఏంటి నాన్నా అలా వున్నావు? ఒంట్లో బాగాలేదా?” తల్లి ప్రశ్నకి తల అడ్డంగా వూపాడు సుధీర్.
“ఏమైంది? మాస్టారు దేనికన్నా కోప్పడ్డారా?”
“లేదమ్మా.”
అకస్మాత్తుగా సుధీర్ నుంచి బాణంలా వచ్చింది ప్రశ్న.
“అమ్మా, నాకు దేనికన్నా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నీకు బాధగా వుంటుందా?”
“వుంటుంది నాన్నా. ఎందుకుండదూ. తెలిసీ తెలియక నువ్వు తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చానే అనే బాధ వుంటుంది. అయితే చిన్న చిన్న పనిష్మెంట్లతోనే పిల్లలు కూడా చెడు పనులు చెయ్యటం మానుకుంటారుకదా. అందుకని నీ బాధ చూడనట్లుంటాను. అంతేగానీ, నాకూ బాధ వుంటుంది.”
“ఇవాళ మా మూలంగా మా హెడ్ మాస్టారు పనిష్మెంట్ తీసుకున్నారు. నాకస్సలు నచ్చలేదు. నా స్నేహితులకెవరికీ కూడా.”
“ఏం చేశారర్రా? మీరేమన్నా అల్లరి పనులు చేశారా? అలా అయితే మిమ్మల్నే దండించాలి కదా. హెడ్ మాస్టారు పనిష్మెంట్ తీసుకోవటమేమిటి. కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పు.”
“అమ్మా, మూడో తరగతిలో చంద్ర వున్నాడు కదా. అతనేదో అల్లరి చేస్తే వాళ్ళ క్లాస్ టీచర్ కొట్టారుట. దానికి వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ టీచర్ మీదా, హెడ్ మాస్టార్ మీదా బాగా అరిచి వెళ్ళారుట. పిల్లల్ని ఎందుకు కొట్టేరు. మా పిల్లాడిని మేమెప్పుడూ కొట్టలేదు. మీరెందుకు కొట్టారంటూ. పిల్లల్ని కొట్టకూడదా అమ్మా?”
“పిల్లలు చిన్నవాళ్ళు కదరా. వాళ్ళకి పెద్దవాళ్ళకి మల్లే అన్ని విషయాలూ తెలియవు కదా. అందుకని అల్లరి చేస్తారు, చెప్పిన మాట వినరు, మొండికేస్తారు. పెద్దవాళ్ళు నెమ్మదిగా నచ్చచెప్పాలి. వినకపోతే ఒకటి రెండు దెబ్బలు వేసి భయపెట్టచ్చు. కానీ పిల్లలకి బాధ కలిగేంత హింసించ కూడదు.”
“వాళ్ళ టీచర్ కూడా మంచావిడే అమ్మా. చాలా అల్లరి చేస్తున్నాడని ఒక దెబ్బవేసి ఆవిడ పీరియడ్ అంతా బెంచీ మీద నుంచోబెట్టారుట. దానికి వాళ్ళ క్లాసులో మిగతా పిల్లలంతా నవ్వారుట. దానితో చంద్రకి చాలా కోపం వచ్చి ఏడుస్తూ ఇంటికెళ్ళాడుట. వెంటనే వాళ్ళ నాన్న వచ్చి ఆ టీచర్‌తో, మా హెడ్ మాస్టారుతో గొడవ పడ్డారు. హెడ్ మాస్టర్ గారు అంతా వివరంగా చెప్పారుట.”
“హెడ్ మాస్టారు సర్ది చెప్పారు కదా. వాళ్ళ నాన్న వెళ్ళి పోయుంటారు. అంతే కదా.”
“కాదమ్మా, చంద్రా వాళ్ళ నాన్న చాలా పెద్ద గోల చేసి పోలీసు కంప్లైంట్ ఇస్తానన్నారుట. పాపం టీచర్లంతా చాలా బాధ పడుతున్నారు.”
“మరి పనిష్మెంట్ అంటావేంటిరా?”
“ఇదంతా నిన్న జరిగింది కదా. ఇవాళ అసెంబ్లీలో ప్రేయర్ కాగానే మా హెడ్ మాస్టారు మాకందరికీ చెప్పారు. ‘మిమ్మల్ని మేము ఒక్క మాట అనకూడదు, ఒక దెబ్బ వెయ్యకూడదు. ఇంతమంది పిల్లల్ని ఒక్క మాటకూడా గట్టిగా అనకుండా అదుపులో పెట్టటం సాధ్యమయ్యే పనేనా. అందరి తల్లిదండ్రులకీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత మీకు కూడా వుంది. మీరు పిల్లల్ని చదువుకోసం, క్రమశిక్షణ నేర్చుకోవటంకోసం మాత్రమే స్కూల్‌కి పంపండి. ఎదిరించటానికి, వాళ్ళ ఆటలు సాగించుకోవటానికి పంపవద్దు. మేము చేసింది తప్పయితే మీకందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను’ అంటూ దేవుడు ముందు నాన్న పెడతారే, పడుకుని, అలా నమస్కారం పెట్టారు. అంతే కాదు. ఇంకా చాలకపోతే గుంజీలు తీస్తానని 50 గుంజీళ్ళు తీశారు. మాకందరికీ చాలా బాధ వేసిందమ్మా. ఏడుపు కూడా వచ్చింది.”
“మరి మీ హెడ్ మాస్టారుగారు మీకోసం పనిష్మెంట్ తీసుకుంటుంటే మీకు బాధగానే వుంటుంది. ఏడుపు కూడా వస్తుంది. మీ హెడ్ మాస్టారు అన్నట్లు మీరు స్కూల్‌కి దేనికి వెళ్తున్నారు. చదువు కోసం, క్రమశిక్షణ, మంచి బుధ్ధులు నేర్చుకోవటానికి. అవి నేర్పేదెవరు? ఇంటి దగ్గర మేమైతే, స్కూల్లో మీ టీచర్లు. ఇంట్లో నేనొక దెబ్బవేస్తే నాన్న దగ్గరకెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇస్తావు. అంత మాత్రాన నాన్న నామీద పోట్లాట కొచ్చేస్తారా. ఎందుకు కొట్టానని అడుగుతారు, నీ తప్పు నీకు తెలిసేట్లు చెప్పటానికి ప్రయత్నిస్తారు. అలాగే వాళ్ళ నాన్న కూడా చేసి వుండాల్సింది మీ టీచర్లమీద పోట్లాటకి రాకుండా. ఆయనలా పోట్లాటకి రావటంతో మీ టీచర్లు కూడా చాలా బాధపడి వుంటారు. అందుకే మీ అందరిలో ఒక చైతన్యం కలిగించటానికే మీ హెడ్ మాస్టారు అలాంటి పనిష్మెంట్ తీసుకున్నారు. దీంతో మీరేం నేర్చుకోవాలి? మీకు అమ్మానాన్నా ఎలాగో టీచర్లు కూడా అలాగే. మీరు తప్పు చేస్తే వాళ్ళు కోప్పడ్డారనో, ఒక దెబ్బ వేశారనో, వచ్చి ఇంట్లో కంప్లైంట్ ఇవ్వకూడదు. వాళ్ళెందుకు మీకు పనిష్మెంట్ ఇచ్చారో తెలుసుకుని, ఆ తప్పు ఇంకోసారి చెయ్యకుండా వుండాలి. అదే మాట టీచర్‌కి కూడా చెప్పాలి. అప్పుడు వాళ్ళూ, మీరూ అంతా హేపీ.. కదా. మీరు హేపీగా స్కూల్‌కి వెళ్ళచ్చు.”
“అవునమ్మా, నేనెప్పుడూ టీచర్ చెప్పినట్లే వింటాను.”
“గుడ్ బాయ్. అప్పుడు అంతా నిన్ను గుడ్ బాయ్ అంటారు.”

శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.