ఎర్రాప్రగడ అప్పటి నెల్లూరు జిల్లా గుడ్లూరు వాసి. క్రీ.శ.1280 -1360 మధ్య కాలంలో జీవించి ఉంటాడని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం భావించారు. ఆయన రచనలు – భారతంలో అరణ్యపర్వ శేషం, హరివంశం, నృసింహపురాణం లభిస్తున్నాయి. రామాయణం అలభ్యం. సాహిత్యంలో ఆఖ్యాన పద్ధతికి నన్నయ్య, నాతకీయ పద్ధతికి తిక్కన, వర్ణనాత్మక పద్ధతికి ఎర్రనలు ఆదిగురువులు. కవిత్రయ కవులలో ఆయనకు స్థానం లభించింది. ప్రబంధ పరమేశ్వరుడని బిరుదు. శంభుదాసుడనీ ప్రఖ్యాతి.
ఎర్రన తాతగారైన ఎరపోతసూరి మనుమని భావంలో కనిపించి నృసింహపురాణం రాయమని ప్రోత్సాహించాడు. రామాయణ హరివంశాలు నరాంకితాలు. నృసింహపురణం అహోబల లక్ష్మీనృసింహస్వామి కంకితం. నాకు తెలిసిన జ్ఞానంతో ఈ కావ్యం పురాణంగా వ్రాస్తున్నానని చెబుతూ –
‘కతిపయాక్షర పరిగ్రహ జనితంబైన నైసర్గిక చాపలంబు కతంబున’ అన్నాడు. అంతటి వినయ సంపద అతనిది.
అద్దంకిలో ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో చేరాడు. అతని తమ్ముడు మల్లారెడ్డి ద్వారా రాజాశ్రయం లభించింది. “నా తమ్ముండు ఘనుండు మల్లరధినీ నాథుండు” అని హరివంశంలో వేమారెడ్డి గుర్తు చేస్తాడు.
ఇందులో పురాణ లక్షణాలు తక్కువ. ప్రబంధ శైలి ఎక్కువ. మూల కథ బ్రహ్మాండ పురాణంలోనిది. నరసింహావతారానికి రంగస్థలం అహోబలం. అందుకే గ్రంథం చివరిలో ఆ క్షేత్ర మహత్యము వర్ణించబడింది. అయితే ఇది పాండురంగ మహత్యం వంటి క్షేత్ర మహత్యాల కోవలోకి రాదు. అక్కడి మహిమలను తెలిపే ఉపాఖ్యానాలు, క్షేత్రసేవ, పతితులు పవిత్రులై తరించడం వంటివి లేవు. అందువల్ల ఇది స్థలపురాణం కాదు. బ్రహ్మాండ పురాణంలోని కథ ఆధారం – విష్ణు పురాణంలోకి కథ కూడా జోడించాదు. నృసింహావతారానికి మూలకారణం ప్రహ్లాదుడు. ఆతని చరిత్ర ఇందులో కావ్య వస్తువు. ఇందులో ప్రహ్లాద రక్షణకు అవసరమైన నృసింహావతారమే ప్రస్తావించబడింది. మూలకథకు ప్రబంధోచిత వర్ణనలను ఎర్రన జోడించడం రమణీయం.
ఈ కథకు మూలబీజం – సనకసనందనాదులు విష్ణుని ద్వారపాలకులైన జయవిజయులను రాక్షస జన్మనెత్తమనడం, దానితో ప్రారంభమై హిరణ్యకశిపుని దురాగతాలతో విజృభించి ప్రహ్లాదుని రక్షణతో ముగుస్తుంది కథ.
పురాణాలకు, క్షేత్ర మహత్యాలకు వర్ణనలు అవసరం లేదు. ఈ నృసింహపురాణంలో ప్రబంధానికి సరిపడే అష్టాదశ వర్ణనలు పెక్కు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా సముద్ర వర్ణన, గర్భిణీ వర్ణన, పుత్రోదయ వర్ణన ప్రముఖాలు. వీటిని సాధారణంగా పురాణ కవులు వర్ణించరు.
మనుచరిత్ర వంటి ప్రబంధాలకు, నృసింహపురాణానికీ ముఖ్య భేదం కనిపిస్తుంది. వాటిలో నాయకులు మనుషులు. ఇందులో అహోబల లక్ష్మీనారసింహుడు నాయకుడు. అందువల్ల ఈ కథ దేవతా నాయకం. కథ విషయానికి వస్తే ప్రహ్లాద చరిత్రలో పూర్వభాగమే వుంది. ఉత్తరభాగం లేదు. హిరణ్యకశిపుడు మరణించిన పిదప ప్రహ్లాదుడు రాక్షస రాజ్యానికి పట్టాభిషిక్తుడవుతాడు. పరమభాగవతోత్తములో ‘ప్రహ్లాద నారద పరాశర పండరీకాదుల’లో ఒకడైనాడు.
హరిభట్టు అనే మరొకకవి ఎర్రనకు తర్వాత చాలాకాలనికి ‘ప్రహ్లాద చరిత్ర’ రచన చేశాడు. ఎర్రన ఉద్దేశం ప్రహ్లాద చరిత్ర రచన కాదు. నృసింహ పురాణం కాదు. నృసింహావతరం ప్రధానం. అందుకే పురాణ, ఇతిహాసాలు అనువదించే రోజుల్లో ఎర్రన ప్రబంధ లక్షణాలు గల ఈ గ్రంథం వ్రాశాడు. శ్రీనాథుడు ఎర్రనను స్తుతిస్తు శబ్దవైచిత్రిని పేర్కొన్నాడు:
సీ:
“పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ
సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు”
అంటే రమణీయమైన, చమత్కార భరితమైన మాటల కూర్పు, అలంకారాలు, చతురోక్తులు, సుభాశితాలు – ఎర్రనలో పరిపూర్ణంగా ఉన్నాయని శ్రీనాథుని భావన. నృసింహపురాణంలోనూ, హరివంశంలోనూ శబ్దవైచిత్రి పుష్కలం.
దేవక్రదుడనే ముని నైమిశారణ్యంలో పుణ్యాత్ములైనట్టి మహర్షుఅకు బ్రహ్మాండ పురాణంలోని కథను తనకు పెద్దల ద్వారా తెలిసినంత చెబుతానని ప్రస్తావించాడు. శ్వేతద్వీపంలో వైకుంఠమనే పట్టణం ప్రశస్తం. ఆ ఊరిలో పుణ్యకాంతలు లక్ష్మీనారాయణుల వివాహ సమయంలో దంపతులకు సేసలు పోసిన పురంధ్రులు. ఆ నగరానికి రాజు అచ్యుతుడు. ఆర్తరక్షాపరాయణుడైన ఆ నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి భక్తులపాలిట పారిజాతంగా నివసిస్తున్నాడు.
ఆ విష్ణుమూర్తి ఇందిరాదేవితో సరససల్లాపాలలాడుతున్న సమయంలో ఒకనాడు ఆ మందిరం వాకిట దిక్పాలరు, సిద్ధులు, గంధర్వులు, చారిణులు, సమ్మర్ధంగా స్వామిని దర్శించడానికి తొందరపడుతున్నారు. అంత తొక్కిసలాట సమయంలో సనక, సనంద, సనత్కుమారా, సనత్సుజాతలనే బ్రహ్మకుమారులు నలుగురు ముకుంద దర్శనానికి అక్కడకు వచ్చి సరాసరి మందిరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ద్వారపాలురైన జయవిజయులు వారిని వారించి కొంచెం వేచి వుండమని సూచించారు.
వెంటనే ఆ మునులు కోపించి, మీరు రాక్షసులై జన్మించడని వారిని శపించారు. ఆ విషయాన్ని దివ్యదృష్టితో గ్రహించిన విష్ణువు సతీసమేతంగా ద్వారం వద్దకు వచ్చి మునులను శాంతపరిచాడు. “మునుల శాపం వూరకపోదు. మీరు ఆ జన్మల తర్వాత నన్ను చేరుకోగలరు. ముందుగా కశ్యపునకు దితికి సంతానంగా జన్మిస్తారు. మీ వంశంలో ప్రహ్లాద విరోచన బలి ప్రముఖులు జన్మిస్తారు” అని జయవిజయులకు ఊరట కలిగించాడు. వారు హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా జన్మించారు.
హిరణ్యకశిపుడు గంధమాదన పర్వతంపై బ్రహ్మదేవుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. అనేక సంవత్సరాల తపస్సు జరుగుతుండగా ఇంద్రుడు దేవగురువు వద్దకు వెళ్ళి తన పదవిని కాపాడమని వేడుకొన్నాడు. అతడు నారాయణ మంత్రాన్ని రాక్షసరాజు కుపదేశించాడు. తన నగరానికి వెళ్ళి రంభాద్యప్సరసలను ఏకాంతంగా పిలిచి హిరణ్యకశిపుని తపోభంగం చేయమని ఆజ్ఞాపించాడు. అందులో తిలోత్తమ గంభీరంగా మాట్లాడి ఇతర అప్సరకాంతలలో కలిసి గంధమాదన పర్వతానికి చేరుకొంది.
హిరణ్యకశిపుని మనసు చలించలేదు. సిగ్గుతో తల వొంచుకుని అప్సరసలు వెనుదిరిగారు. అతని అకుంఠిత దీక్షకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. “నాకు అమరేంద్ర పదవి కావాలి” అన్నాడు రాక్షసరాజు. “దేవాదుల చేత నరుల చేత ఆకాశంలో, భూమిపైనా, పాతాళాన నాకు మరణం లేని వరం ఇవ్వు” అన్నాడు. ‘తథాస్తు’ అన్నాడు బ్రహ్మ. వెంటనే దైత్యదానవ రాక్షస కులానికి పట్టం గట్టారు అసురులు. అప్పటి నుండి అతని ఆగడాలు పెచ్చుమీరాయి. అష్టదిక్పాలకులను ఆట పట్టించారు. వారందరూ వాసుదేవుని శరణువేడారు.
హిరణ్యకశిపుని భార్య లీలావతి ఒకనాటి రాత్రి ఒక స్వప్నం కనింది. అది శుభ సూచకమని శుక్రాచార్యులు సెలవిచ్చాడు. ఆమె గర్భవతి అయి, పుత్రుని ప్రసవించింది. అతనికి ప్రహ్లాదుడని నామకరణం చేశారు. అతనికి విద్యాభ్యాసం చేయించారు. అతడు విష్ణుభక్తి పరాయణు డయ్యాడు. ఒకనాటి గోష్ఠిలో ప్రహ్లాదుడు విష్ణుభక్తి పారమ్యాన్ని తండ్రికి వివరించగా అతడు మండిపడి అనేక రకాలుగా శిక్షించమని ఆదేశించాడు. అగ్నిలో త్రోయించాడు. పాములచే కరిపించాడు. ప్రహ్లాదునికి ఏ విధమైన అపకారము జరగలేదు. ప్రహ్లాదుడు ఎన్నో హితవచనాలు పలికాడు. కొండ శిఖరంపైకి ప్రహ్లాదుని ఈడ్చుకునిపోయి క్రిందకి తోశారు. భూమి అతనికి పూలసెజ్జగా మారింది.
చివరకు శంబరాసురుని ప్రహ్లాదునిపైకి తోలారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని అంతమొందించాడు. శుక్రాచార్యుడు ప్రహ్లాదునికి నీతిబోధ చేశాడు. హిరణ్యకశిపుడు రోషించి – “ఈ స్తంభంలో హరిని చూపగలవా?” అని ప్రశ్నించాడు. ఆ స్తంభంలోంచి నరసింహావతారంలో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. దానవరాజు దివ్యాస్త్రాలు ప్రయోగించాడు.
ఉ:
శ్రీ నరసింహరూపమునఁ జెన్నుఁ గఁ దోఁచే సహస్రకోటి సం
ఖ్యానము లైన బాహువులయం దొడగూడిన చక్రమున్ విల
భ్యానుపమాన శత్రునివహంబులచే నొకమాత్రలోన న
ద్దానవ సేనయంతను ద్రగ్గెఁ దదీశుఁడు బెగ్గడిల్లఁగన్.
(నృసింహపురాణం, పంచమాశ్వాసం, 92)
హిరణ్యకశిపుని తన తొడలపై నిడుకొని విష్ణుమూర్తి సంహరించాడు.
ప్రహ్లాదుడు ఆ స్వామిని ప్రసనుణ్ణి చేసుకొన్నాడు. ఈ పర్వతమ్ అహోబల నామంతో ప్రసిద్ధి పొందగలదని సెలవిచ్చాడు విష్ణువు. ఆ సమయంలో మందాకినీ నది అక్కడికి విచ్చేసింది. దానిని భవనాశిని పేరుతో పిలిచారు. పక్కనే లక్ష్మీవనం వెలిసింది. ఆ పర్వతానికి వేదాద్రి అని నామకరణం చేశారు.
ప్రహ్లాదుని దానవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశారు. విష్ణువు అతనిని దీవించి ‘క్రమంగా నీకు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య సిద్ధులు కలుగుతాయ’ని ఆశీర్వదించాడు.
ఈ విధంగా ఎర్రాప్రెగడ కథాసంవిధానం రమణీయంగా సాగి ఆంధ్రసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. తరువాతి కాలంలో వచ్చిన పోతన చేతిలో ప్రహ్లాద చరిత్ర మందార మకరంద రసతుందిలమై ప్రసిద్ధి కెక్కింది. నృసింహపురాణాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులవారు 1960లో శతావధాని వేలూరి శివరామ శాస్త్రిచే పరిష్కరింపజేసి ప్రచురించారు.
తొలుత లెక్చరర్గానూ, తరువాత ఆకాశవాణి, దూరదర్శన్లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించి అడిషనల్ డైరక్టర్ జనరల్, దూరదర్శన్గా ఉద్యోగ విరమణ చేశారు. పద్యంపై మక్కువ కలిగిన అనంతపద్మనాభరావు 150కి పైగా అవధానాలు చేశారు. కథలు, నవలలు వ్రాశారు. అనువాద బహుమతులు పొందారు. ‘దాంపత్య జీవన సౌరభం’, ‘మన పండుగలు’, ‘తలపుల తలుపులు’, ‘అలనాటి ఆకాశవాణి’, ‘అంతరంగ తరంగం’, ‘కథామందారం’, ‘గోరింట పూచింది’ వంటి పుస్తకాలను వెలువరించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పలు అవార్డులు పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™