[డా. సి. భవానీదేవి రచించిన ‘సాగరగీతం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


అదే నువ్వు అదే నేను
ఎప్పుడు నిన్ను చూసినా
సరికొత్తగా కవ్విస్తావు
కాలంకాటుకు నేనెంత కనలినా
తరళిత తరగలతో
చైతన్యం పొంగులు వారుస్తూ
అలలు అలలుగా అలరిస్తున్నావు
ఒక్కో అల ఒక యుగపాఠాన్ని
ఒరిపిడి పెట్టి వినమంటుంది
ఎంతటి ఘన గర్వితుడైనా
నిముషంపాటు నీ గాలి సోకితే
స్వస్వరూప ఙ్ఞానం వచ్చేస్తుంది
వేరు వేరు ఖండాల అంచుల్లో
విభిన్నంగా పిల్చుకుంటాంగానీ
భూమాతకు జలవస్త్రమన్నది
వేద వచనమంతటి సత్యం కదా!
సూర్యోదయంవేళ నీ తళతళలు
తన్మయ పులకాంకురాలు
మిట్టమధ్యాన్నపు వేడినురగలు
విస్మయ నైరూప్య నిట్టూర్పులు
సాయంసంధ్యలో అరుణిమలు
నదీ చెలియల సిగ్గుల మొగ్గలు
ఆజన్మాంత అవ్యాజ మమకారంతో
నన్ను చూడగానే నవ్వుతూ
తలుపుతీసే మా నాన్నలా
మైమరపించే నీ ఉరుకులాటలు
నిశ్శబ్ద నిర్మలామృత ప్రేమను
పంచిపెట్టే మా అమ్మలా
అగాధాలకందని నీ స్పందనలు
అందుకే నిన్ను చూడాలని
ఇన్ని దూరాలు దాటి వచ్చాను
కన్నప్రేమల మూటల పాటల్ని
కలకాలపు పెదవులతో పాడుతూ
జల హస్తాలతో కౌగిలించుకుంటూ
కన్నవాళ్ళని మరొకసారి
కళ్ళముందు నిలిపావు నేడు
నా కన్నీళ్ళ ఆనంద చారిక
సాగర గీతమై చేరింది చూడు!
3 Comments
అల్లూరి Gouri Lakshmi
మీ సాగర గీతం మా మదిలోని
ఎన్నో తలపుల్ని తడుముతూ హాయిగా సాగింది. చక్కని కవిత భవానీ గారూ..
Shyamkumar Chagal
అమ్మా నాన్న గురించి అద్భుతంగా రాశారు
పుట్టి నాగలక్ష్మి
‘సాగర గీతం’లో అలల చందాన్ని బహుచమత్కారంగా వర్ణించారు.అమ్మా, నాన్నల మనస్తత్వాలతో పోల్చి మెరిపించారు..ధన్యవాదాలుమేడమ్!