మాకు కుర్తాళం స్వామివారికి చాలా దగ్గర చుట్టరికముందని మా పిన్ని చెబుతూ వుంటుంది కానీ నాకు అవి తెలియవు. పైపెచ్చు వారిని ఇలాంటివి అడిగి సమయము వృథా చెయ్యటమా? వేమన్న వీరి వంటి గూర్చేగా “తలలు బోడి అయినా తలపులు బోడియా?” అని ప్రశ్నించాడు.
వదిలించుకోవటమే జీవితములో చెయ్యవలసిన సాధన. అదే మనిషిని మనీషిగా మార్చేది. వస్త్రాల రంగు ఏదైనా తామరాకుమీద నీటిబొట్టుగా మారే యత్నం చెయ్యకపోతే కాషాయము కట్టినా, అడవులలో నివసించినా అర్థము లేదు. మొత్తానికి ఆయన స్వామివారి నిరాసక్తి అర్థమయ్యిందో లేక నా పుణ్యకాలము వచ్చిందో లేచి వెళ్ళిపోయారు.
స్వామి వారు తలుపు వెయ్యమని సైగచేశారు. రమ్య స్వామిణి లేచి తలుపు దగ్గర వేశారు.
స్వామివారు నిదానముగా, ఆదరముగా కరుణ కురిపించు చూపులతో “చెప్పమ్మా!” అన్నారు నాతో.
నేను మాట్లాడబోతూవుంటే నా గొంతు బొంగురుపోయి, కళ్ళు మళ్ళీ శ్రావణమేఘాలయ్యాయి. నేను కొంత నన్ను నేను సంభాళించుకొని “స్వామి మీరు అట్లాంటా వచ్చినప్పుడు నన్ను కరుణించి మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో బిక్ష చేసి మమ్ములను అనుగ్రహించారు. నాకు గురువు కావాలంటే మీరు గురు మంత్రము ఉపదేశించి ఒక లక్ష జపించమని చెప్పారు” అమటూ వుండగా
“ఏదీ ఆ మంత్రం చెప్పు” అన్నారు.
నేను ఆయన ఇచ్చిన మంత్రము చెప్పాను.
“సరి అయిన మంత్రమే అది” అన్నారు.
“స్వామి మీరు లక్ష జపించమన్నారు. నేను లక్ష పైన జపించినా నాకు గురువు దొరకలేదు. ఏమీ కాలేదు” అన్నాను. ఆ ఏమీ కాలేదులో ఏ మిరకిల్ జరగలేదన్న కొంత నిరాశ ధ్వనించినదేమో మరి……
స్వామి చిరునవ్వుతో “మీరు జపిస్తున్న మంత్రము సరి అయినదే. గురువు కావాలంటే చెయ్యవలసినదిదే. లక్ష చేయ్యగానే గురువు రావాలని కాదు, మీకు ఆ మంత్రము జపించే అర్హత వుందని. త్యాగరాజు 98 లక్షల జపము చేస్తే కానీ రామస్వామి దర్శనము కాలేదు. 17 లక్షల జపము చేస్తే కానీ నారాయణతీర్థులకు కృష్ణుని దర్శనము కలగలేదు. కాబట్టి లక్షకు దర్శనము కాదు. ఆ మంత్రము చెయ్యటానికి అర్హత మాత్రమే వస్తుంది” అన్నారు చిన్నగా నవ్వి.
స్వామివారు నాతో ఇంకా ఇలా చెప్పారు “మంత్రము మహాశక్తి వంతమైనది. అది భక్తి పూర్వకముగా జపించినప్పుడు ఆ మంత్రాధిదేవత మనముందుకు వచ్చి వుంటుంది. కానీ మనకు తెలియదు. ఆ దేవత మన కోరికలు తీరుస్తుంది. దానికి కొంత సమయము పట్టవచ్చు. అదే సిద్ధగురువులైతే అంత సమయము పట్టదు.”
“సిద్ధ గురువులు అంటే స్వామీ”
“హిమాలయాలలో సిద్ధాశ్రమమని వున్నది. గురువులు, సిద్ధులు అక్కడ వుండి భూ మండలములోని ప్రజలను పరిరక్షిస్తూ వుంటారు. వారిని కోరి, గురువు కోరిన వారిని వారు కనిపెట్టుకు వుంటారు. త్వరగా వారి అనుగ్రహము కలుగుతుంది. ఆ సిద్ధాశ్రమమును చూచిన కొందర విదేశీయులు వున్నారు. దాని మీద పుస్తకాలు, సినిమాలు కూడా వచ్చాయి” అన్ని కొంత సేపు ఆగి మళ్ళీ “ఈ మంత్రము చేసుకుంటూ వుంటే నీకు తప్పక గురుదర్శనము కలుగుతుంది” అన్నారు.
“మంత్రము చేస్తూ వుంటే తెలియక నిద్రలోకి జారుతున్నాను స్వామి. మళ్ళీ లేచి మంత్రము రిపీటు చేస్తున్నాను” కొద్దిగా సిగ్గుతో చెప్పాను.
ఆయన నవ్వి “పిచ్చితల్లి! అది శబ్దము నుంచి నిశబ్దములోనికి ప్రయాణము. అదే సాధన. నీవు అలా మౌనములోకి జారిపోవాలి” అన్నారు ఆదరణగా.
“మనస్సు అంటే ఏమిటి స్వామి? జడమా? స్పందనలు కల పదార్థమా? ఆత్మ అంటే మనస్సేనా? వేరు వేరునా? ఆలోచనల చిత్రమాలిక మనస్సా? దృశ్యమా? కోరికల పుట్టా? మనస్సు పరిపరి ఆలోచనలతో అటు ఇటూ పోతూ వుంటే ధ్యానము ఎలా కుదురుతుంది?” అడిగాను తలుసుకోవాలన్న జిజ్ఞాసతో.
స్వామి దానికి సమాధానముగా “మనస్సు అంటే ఇంద్రియముల వలన తెలుసుకునేది. ఆలోచనలు చెయ్యటము, అటు నిటు తిరగటము దాని పని. ఆలోచనల పరంపరే అది. దానిని ఆపాలని ప్రయత్నమెందుకు? ఆలోచనలు చెయ్యనీ. చూడు. దానితో పాటు తిరగక పట్టించుకోవటము సాధన చెయ్యి. మనస్సు పట్టించుకోపోతే నెమ్మదిస్తుంది. నెమ్మదించి తరువాత అన్నీ ఇంద్రియాలు నీ ప్రయత్నం లేకనే తగ్గిపోతాయి. అన్ని శరీరాలలో ఒక్క పరమాత్మ వ్యాపించి వున్నాడని ఈ మనస్సు ఒప్పుకోనీయదు. భేద దృష్టిని వదలదు. ఆ భేద దృష్టి వలననే దుఃఖము. ఈ మనసు అలవాటు ప్రకారము నడుస్తుంది. కానీ కొత్త ఆశ చూపించామంటే చాలు యేళ్ళ తరబడి జరుపుతున్న మంచి అలవాటును క్షణములో మరచిపోతుంది. మనసును నిగ్రహించటము సాధ్యము కాదు. (భగవద్గీతలో అందుకే కృష్ణుడు అది కష్టమని చెబుతాడు). జగత్తు మొత్తమునకు, ప్రపంచములో వున్న సమస్తమునకు మనస్సే కారణము.
చిత్తం కారణ మర్థానాం తస్మిన్ సతి జగత్త్రయమ్।తస్మిన్ క్షీణే జగత్ క్షీణం తచ్చికిత్స్యం ప్రయత్నతః॥ ( వైరాగ్యప్రకరణము 16. శ్లో.25)
దృశమాన పదార్థాలన్నీంటికి మనస్సే కారణము. మనస్సు పనిచేస్తూ వుంటేనే ఈ మూడు లోకాలు ఆ జీవునికి వుంటాయి. మనస్సు క్షీణించిపోతే ఈ జగత్తు గూడా క్షీణించిపోతుంది. అలా నీకు ధ్యానము ధృడమవుతుంది” అన్నారాయన.
“ధ్యానమునకు ధృడమగుటకు ఏదైనా షార్ట్‌కట్ వుందా?” అడిగాను. అన్నింటికీ మనకు షార్ట్‌కట్ కావాలి.
“ధ్యానము చెయ్యటమే” నవ్వారు.
తరువాత ఇలా చెప్పారు “రాత్రి వేళ ధ్యానము ఉత్తమము. రాత్రుల యందు గదిలో ఒక్క దీపము మాత్రమే వెలిగించుకు దాని వెలుతురులో ధ్యానము చెయ్యటము వలన ఫలితాలు త్వరగా వస్తాయి. రాత్రులు కుదరకపోతే పగలు గదిలో తెరలు వేసుకు ఒక చిన్న దీపపు వెలుతురో ధ్యానించు. ఫలితము తప్పక పొందగలవు” అని సెలవిచ్చారు.
“ఇలా చెయ్యగా నీ సాధన తీవ్రత కొలది నీకు మనస్సు, ఆత్మ వేరని తెలుస్తుంది. ఈ సాధన వల్లనే నీవు అంతర్ముఖమవగలవు. నీకిచ్చిన మంత్రము వలననే గురువును తెలుసుకోగలవు. నీవు పయనిస్తున్నదే సరి అయిన దారి.” అన్నారాయ ముక్తాయింపుగా.
నేను స్వామివారిని నా దారి సరి అయినదేనా? అని అడగలేదు. దత్తస్వామిని అడిగాను. కనీసము ఈ ప్రశ్నకైనా సమాధానము చెప్పు దత్తప్రభూ! అన్న నా ఆర్తి నా దత్తుడు విన్నాడు. నా ఆర్తికి, నా కన్నీళ్ళకు సమాధానము చెప్పాలనుకున్నాడు. నేను అరుణాచలము నుంచి వచ్చాక సంసార గొడవవలో కొట్టుకుపొయినా ఆ దయామయుడు మరువలేదు. నేను కాశీ మానుకుందామని తలిస్తే, మావారి నోటి వెంట ఈ ప్రయాణము చేయించి, ఎయిర్‌పోర్టులో స్వామి దర్శనము ఇప్పించి, ఇక్కడ ఈ పవిత్ర కాశీ క్షేత్రములో, గంగా నది వడ్డున స్పష్టముగా స్వామి రూపులో ఆ మాటలు వారి నోటి వెంట పలికించారు. ఇలా ఆలోచన కలుగగానే నాకు నా దత్తప్రభువుపై కలిగిన ప్రేమ, అనురాగము నేను వర్ణించ మాటలు చాలవు. ‘ఎంత దయ నీకు దేవా!’ నా హృదయము మరల మరల దత్తుని తలచుకు పొంగిపొరలింది. నా కృతజ్ఞత కనుల కనపడుతుండగా స్వామి వారు నిండుగా దీవించారు. నా చేతికి పండునిచ్చి “అభీష్టప్రాప్తిరస్తుః” అని పలికారు. నేను వారికీ రమ్యా మాతకు మళ్ళీ నమస్కరించి లేచాను. అప్పుడు ఆ గది తలుపులు తెరుచుకున్నాయి.
టైము చూస్తే ఒక గంట గడిచిపొయ్యింది. బయట కొందరు స్వామి వారిని కలవాలని ఎదురుచూస్తున్నారు. నేను ఆఫీసు గదిలోకి వెళ్ళి అన్నదానానికి కొంత డబ్బు కట్టి, నాకు అవకాశము వస్తే తప్పక వచ్చి కాశీలో నివసిస్తానని చెప్పి బయటకు నడిచాను.
చాలా రోజుల తరువాత నేను మనఃపూర్వకమైన హాయిని పొందారు. మరో వైపుగా నడిచి గంగ వడ్డుకు చేరాను.
గంగా నది నాకెంతో అపురూపమైనది. నాకు ఎంతో సాంత్వననిచ్చింది. నదిలోకి దిగి కొంచం నీళ్ళు తలపై చల్లుకున్నా.
‘కౌగిలించుకోవాలని వుంది నిన్ను’ అని గంగమ్మ తల్లికి చెప్పాను.
చాలా సేపు అలా కుర్చున్నాను.
గంగ వడ్డున రోజంతా హడావిడిగానే వుంటుంది. మరురోజు మాములు రోజు కాదుగా.
మరురోజు మహాశివరాత్రి.
నాకు కొన్ని అసలు నచ్చవు. భయం కూడా. అదే జనం. గుంపుగా ముగిన జనం మధ్యకు నే వెళ్ళను. మా వూర్లో కూడా పండగరోజు గుడికి వెళ్ళాలంటే చాలా నర్వస్‌గా వుంటుంది. నేను శివరాత్రికి శ్రీశైలము కూడా వెళ్ళను. గుడికి వెడితే మనస్సు శాంతముగా అవ్వాలని, ధ్యానము చేసుకు రావాలనే భావన వుండేది. అలాంటిది నేను మహాశివరాత్రికి వారణాశీ మహా నగరానికి వచ్చానంటే కేవలము శివాజ్ఞ. శివరాత్రి ముందు రోజైనా జనాలు చాలా ఎక్కువగానే వున్నాను. నేను గంగా నది వడ్డున నడుస్తూ వస్తు వుంటే ఇద్దరు నల్లని వస్త్రాలతో వున్న సన్యాసులు కనిపించారు. వారి వేషధారణలో తేడా. నల్లని బట్టలు. తలకు నల్లని తలపాగా. విభూది. కళ్ళలో అదో మాదిరి లోతైన చూపు. వింతగా అనిపించి వాళ్ళని ఫోటో తీయ్యబోతే ఇద్దరూ చేతులతో ముఖాలు కప్పుకున్నారు.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™