[కరుణకుమార్ రచించిన ‘సవర్లకొండ, ఇతర కథలు’ అనే కథాసంపుటిపై తన అభిప్రాయాన్ని అందచేస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]


ఇది పుస్తక సమీక్ష కాదు. ‘సవర్లకొండ’ పుస్తక పఠనానుభవం మాత్రమే.
‘సవర్లకొండ’ పుస్తకం నా చేతికి అందినప్పుడు పుస్తకం వెంటనే చదవాలన్న ఆసక్తి కలగలేదు. ఇందుకు కారణం, ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో నెలకొన్నివున్న కొన్ని పరిస్థితులు.
You are judged by the company you keep అంటారు. ఒక వ్యక్తి తరచుగా ఎవరి కంపెనీలో కనిపిస్తాడో ఆ కంపెనీ ఆధారంగా వ్యక్తి పట్ల కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. అవి అపోహలా? నిజమైనవా? అన్నది కాలక్రమేణా తెలుస్తుంది. సామాన్యులకయినా రచయితలకైనా ఈ సూత్రం వర్తిస్తుంది.
తెలుగుసాహిత్యంలో ఒక రచన ప్రాచుర్యం పొందటంలో రచన నాణ్యత కన్నా, రచయిత స్నేహ బృందాలు ప్రధాన పాత్ర వహిస్తాయన్నది నిర్వివాదాంశం. కొందరు కొన్ని గుంపులుగా ఏర్పడి, ఒక జట్టుగా కలసి, తమ గుంపుకు చెందినవారి రచనలనే, రచన నాణ్యతతో సంబంధం లేకుండా, పొగడుకుంటూంటారు. వారేం రాసినా అద్భుతమనీ, వారు రాసిందే సాహిత్యమనీ, ఇతరులు రాసేదంతా చెత్త అనీ బహిరంగంగా ప్రకటిస్తూంటారు. వ్యక్తిగతంగా కూడా అలాగే ప్రవర్తిస్తూంటారు. తమ రచనలు, తమ గుంపుకు చెందిన వారి రచనలు తప్ప మిగతా రచనలు తెలుగు సాహిత్యంలో లేవన్నట్టు, మిగతావారు రచయితలే కానట్టు వ్యవహరిస్తూ పదే పదే తమవారి రచనలనే ప్రస్తావిస్తూంటారు. ఇలా ఏర్పడిన జట్లలో జర్నలిస్టు రచయితలుండటంతో మీడియా కూడా వీరి చుట్టే తిరుగుతూంటుంది. అందువల్ల కూడా వీరి ప్రాబల్యం హెచ్చు. తెలుగులో రచయితగా గుర్తింపు పొందాలంటే, ఇలాంటి ఏదో ఒక గుంపులో చేరక తప్పదు. గుంపులో చేరాక వారు ‘ఇదే కథ,’ ‘ఇలాగే రాయాలి’ ‘ ఇదే సాహిత్యం’ అంటే తలూపాలి. ‘తందాన’ అంటే ‘తానా’ అనాలి. అలా అంటేనే, వీరు వేర్వేరు పేర్లతో వేర్వేరు ప్రాంతాలలో స్థాపించిన సాహిత్య సంస్థల అవార్డులు అందుకుంటారు. సంకలనాలలో వీరి రచనలు స్థానం పొందుతాయి. ప్రైవేట్ అవార్డులే కాదు, ప్రభుత్వ అవార్డులూ వీరికే వస్తాయి. సరిగా రాయటం రాకున్నా, ఏమీ రాయకపోయినా సాహిత్య ప్రపంచంలో పెద్ద పేరొస్తుంది. గొప్ప రచయితలుగా గుర్తింపు వస్తుంది. వీళ్ళని కాదంటే, ఎంత గొప్పగా రాసినా, ఈ ముఠాల వెలుగు జిలుగుల నీడల్లో ఒదిగి అనామకంగా మిగిలిపోవాల్సివస్తుంది. నేను వీరిని సాహిత్య మాఫియా ముఠాలంటాను. వారు ‘మేమంతా స్నేహితులం. తరచు కలుస్తూంటాం. అంతే’ అంటూంటారు తప్ప, తమవి మాఫియా ముఠాలని ఒప్పుకోరు.
రచయిత కరుణకుమార్ ఇలాంటి వారి నడుమ తరచు కనిపిస్తూండటం వల్ల, ఈ ముఠాల రచయితలంతా, వర్క్‌షాపుల్లో తయారయ్యే ఒకే రకమయిన వస్తువులా, ఒకే రకమయిన కథలు రాస్తూండటంతో, పైగా తమ వాడు కాబట్టి ఏమి రాసినా పొగడే వ్యవస్థకు చెందినవాడు కావటంతో, కథలు చదివేందుకు అంత ఉత్సాహం కలగలేదు. పుస్తకం అందంగా, ఆకర్షణీయంగా ఉన్నా అపోహల వల్ల పుస్తకం జోలికి పోవాలనిపించలేదు.
అందుకే, ‘సవర్లకొండ’ పుస్తకాన్ని నిరాసక్తంగా, అతి అయిష్టంగా ఆరంభించాను.
ఊహించినట్టే, పుస్తకానికి ముందుమాట చూడగానే విసుగుతో పాటూ నవ్వూ, జాలి కలిగేయి.
‘ఒక స్త్రీని తోడు చేసుకొని సంసారాన్ని ఈదమని అది (సమాజం) వేసిన బరువు కింద ఏ మగాడికైనా తప్పని అవిముక్త నలుగుబాటు’..
ఇక్కడ సమస్య ఒక స్త్రీని తోడు చేసుకోవటమా? ఒక స్త్రీ బదులు పది స్త్రీలు తోడుండాలా? లేక, స్త్రీనే అవసరం లేదా? ఎందరు స్త్రీలుంటే సమాజం బరువునుంచి విముక్తి వస్తుంది? అసలీ వాక్యాలకు అర్థం ఏమిటి? భారతదేశంలో ఒక స్త్రీకి ఒక పురుషుడన్నది సాంప్రదాయం కదా! లేక పెళ్ళి సంసారాలే అసలు సమస్యనా?
‘ముందుమాట’ నిండా ఇలాంటి అర్థవిహీనవాక్యాల అరసగుళికలుండటంతో, ఈ పుస్తకాన్ని చదవకుండానే పక్కన పారేసేయాలనిపించింది.
ముందుమాట చివరలో ‘కరుణ ఒక నిరక్షరాస్య కథకుడు’ అన్న వాక్యం కనబడటంతో, ముందుమాటే ఇలా వుంటే, ఇలాంటి ముందుమాటకు ప్రేరణ నిచ్చిన కథలింకా ఎలా వుంటాయో అని పుస్తకాన్ని పక్కన పారేయాలనిపించింది. నిరక్షరాస్య రచయిత అంటే, చదువు ఉన్నా మతి భ్రమించి అక్షర జ్ఞానం లేనివాడిలా, నిరక్షరాస్యుడిలా రాసే రచయిత అని అర్థం. పెద్ద రచయితలుగా పేరున్నవారే అర్థం పర్థం లేని అక్షరాల కూర్పే రచన అన్నట్టు రాసేస్తూంటే, ఇక, నిరక్షరాస్య రచయిత రచన ఎలావుంటుంది? పైగా, ముందుమాటలో ఇచ్చిన కథల వివరణ చదివితే, ఈ గుంపుల కథలలానే వున్నాయి కథలు. పైగా ప్రతి కథ వివరణ ముందు ఆడ మగకు సంబంధించిన జ్ఞాన గుళికలుండటంతో అన్నీ ఆ వర్క్‌షాపులో తయారయ్యే వస్తువుల్లాంటి కథలే అన్న అభిప్రాయం కలిగింది. ఇక పుస్తకం చదవటం వ్యర్థమనిపించింది. రచయిత రాసిన ముందుమాట చదివిన తరువాత, ఒక్క కథయినా చదవకుండా ఒక నిర్ణయానికి రావటం భావ్యం కాదు అనిపించింది. కాబట్టి నిరాసక్తంగా, అయిష్టంగా తొలి కథ ‘సవర్లకొండ’ చదవటం ఆరంభించాను.
కథ ఆరంభించిన తరువాత ఇది కూడా వర్క్‌షాప్ కథే అనిపించింది. నక్సలైట్లను పొగడుతూ, ప్రభుత్వాన్ని దోషిగా చూపిస్తూండే అలవాటయిన మామూలు కథ అనిపించింది. అలా అనుకుంటూండగా కథ ఒక మలుపు తిరిగింది. అందుకు ఆశ్చర్యపోతూ ముందుకు సాగుతూ.. కాస్సేపటికి అన్నీ మరచిపోయాను. కథ పూర్తయ్యేసరికి తెలియకుండానే హృదయలోతుల్లోంచి ఒక దీర్ఘమయిన నిట్టూర్పు వెలువడింది. ఇది కథ కాదు. నిజజీవితాన్ని, నిక్కచ్చిగా, నిజాయితీగా, ఒకే రంగు దృష్టిలో కాకుండా, కుడినుంచో, ఎడమనుంచో కాకుండా, అన్ని దిశలనుంచీ దర్శించి, అన్ని కోణాల్లో పరిశీలించి, అన్నిరంగుల మిశ్రమమైన స్వచ్చమైన శ్వేతవర్ణంలో ప్రదర్శించిన కథ అనిపించింది. ఈ రచయిత నిరక్షర/నిరక్షరాస్య రచయిత కాదు, అక్షరాల అర్ధం, వాటి వాడకం, వాటి శక్తి తెలిసిన ప్రతిభావంతుడయిన రచయిత అనిపించింది. ఈ రచయిత సాక్షర రచయిత. సుఅక్షర రచయిత.
కథ పూర్తయిన తరువాత తెలుగులో నిజంగా ఇలాంటి కథ ఒకటి వచ్చిందా? అన్న అపనమ్మకం కలిగింది. నమ్మకం కలగటం కోసం వెంటనే మరోసారి చదివేను. ఇప్పుడు కథ చదవటం మరింత బాగా ఎంజాయ్ చేశాను. రచయిత ప్రతిభ, కథ చెప్పే నేర్పును గమనిస్తూ చదివేను. ఈ రచయిత మామూలు రచయిత కాడు అన్నది స్పష్టమయింది.
కాళీపట్నం రామారావుగారు అంటూండేవారు, రచయితలు రెండు రకాలని. ఒకరు పెట్టు రచయితలు, రెండవది పుట్టు రచయితలు. పెట్టు రచయితలంటే, ప్రతిభ లేకున్నా, కష్టపడో, ఇతర మార్గాలనునసరించో రచయితగా గుర్తింపు పొందేవారు. పుట్టు రచయితలంటే, పుట్టుకతో ప్రతిభ, నైపుణ్యాలున్నవారు. స్వయం ప్రకాశకులు. వజ్రం లాంటివారు. అలాంటి వజ్రంలాంటి రచయిత ఈ రచయిత అనిపించింది మొదటికథ మూడోసారి చదివిన తరువాత.
రచయిత రచనా సంవిధానం, కథలో అతి విలువైన ఆలోచించవలసిన సత్యాలను అతి సులువుగా, మామూలుగా చెప్పటం, వర్ణనలు, ఏదో ప్రత్యేకంగా చెప్తున్నట్టు కాకుండా, పాత్రల వ్యక్తిత్వాల గురించి, మనస్తత్వాల గురించి కథ గమనంలో భాగం చేసి పాఠకుడు గ్రహించేట్టు చేయటం.. ఒక ఉత్తమ రచనకి ఉండాల్సిన లక్షణాలన్నీ మొదటి కథలో పుష్కలంగా వున్నాయి.
రచయిత శైలిలో గమనించాల్సిన అంశం – అమాయకులను వర్ణించినప్పుడు రచనలో అమాయకత్వం ధ్వనిస్తుంది. మోసగాళ్ళను వర్ణించేప్పుడు వ్యంగ్యం ధ్వనిస్తుంది. దారుణాన్ని వర్ణిస్తున్నప్పుడు, ఒక్క రక్తం చుక్క కనబడకుండా అతి భయంకర యుధ్ధాన్ని భావింపచేసే అత్యద్భుతమైన ప్రతిభ కనిపిస్తుంది.
సవర్ల వర్ణన ఇలా వుంటుంది.
‘సవర్లు గోచీలు పెట్తుకుంటారు. మగవాళ్ళు అడవి పందులను, ఎలుకలను, జింకలను వేటాడి తెస్తారు. పోడు చేసి కొర్రలను, జొన్నలను పండిస్తారు. పిల్లల్ని కంటారు. వాళ్ళకు దేవుడంటే తెలియదు. ప్రకృతే వాళ్ళకు భగవంతుడు.’
నాగరికుల దౌష్ట్యాన్ని వర్ణించిన తీరు ఇది.
‘నాగరీకుల్లో విశిష్టమైన లక్షణం ఏమిటంటే అమాయకులను సులభంగా గుర్తించగలరు. నాగరీకులు అక్కడే రెండు రోజులు బస చేసి సవర్ల జీవన విధానాన్ని అధ్యయనం చేసారు. ఆ గూడేనికి దగ్గరలో విస్తరించి ఉన్న నల్లరేగడి మట్టి తమను చేతులు చాచి ఆహ్వానిస్తున్నట్టు వాళ్ళకు అనిపించింది. అలా అనిపించటం న్యాయము, ధర్మము అని నాగరీకులు విశ్వసించి అడవికీ, మైదానానికీ రాకపోకలు పెంచారు. ఆ స్నేహంలో సవర్లకు వరిబియ్యం, చింతపండు, మిరపకాయలు అలవాటు చేశారు.
సవర్లతో స్నేహం బాగా కుదిరిందని నమ్మకం కలిగాక మైదానపు మనుషులు కొందరు సవర్ల ఆధీనంలో వృథాగా పడి ఉన్న నల్లరేగడి భూముల్ని కాసిన్ని గింజలు పండించుకోవడానికి అనుమతి అడిగారు.’
హాయిగా నవ్వుతూ, అందంగా వుండి, కత్తితో పొడిచినా అతను పొడిచాడాంటే ఎవ్వరూ నమ్మనంత నిర్మలంగా వుండే విలన్ లాంటి వర్ణన ఇది. ఈ వర్ణన ఎంత స్వాభావికంగా వుందంటే, నడుస్తున్న జీవితంలానే వుంది. ఎక్కడా రచయిత మంచి, చెడు అని తీర్పులు చెప్పటం లేదు. జరుగుతున్నదాన్ని జరుగుతున్నట్టు, సామాన్యంగా వర్ణిస్తున్నట్టే వుంది.
కథంతా ఇలా అతిశయోక్తులు, భయంకరమైన వాక్యవిన్యాసాలు, పదాల పదఘట్టనల అదురు లేకుండా మామూలుగా రాస్తాడు రచయిత. కానీ, అది చదువుతున్న వారి మనస్సులో ఆయా దృశ్యాలు సజీవంగా ప్రాణం పోసుకుని కనబడుతూ ఎనలేని ఆలోచనలను కలిగిస్తాయి.
ఈ కథలో రచయితను అభినందించాల్సిన విషయం ఏమిటంటే, అనేక లౌకిక రచయితల్లాగా నిజాన్ని మసిపూసి మారేడు కాయ చేయాలని ప్రయత్నించలేదు. కొండ ప్రాంతాల్లోని మత మార్పిళ్ళను నిజాయితీగా ప్రదర్శించాడు.
‘డబ్బు అనేది దేవుడికి చెందినదనీ, దాంట్లో దశమభాగం దేవుడి ఆలయానికే చెందాలనీ త్రికరణ శుద్ధిగా నమ్మిన క్రైస్తవ ఫాదర్లు పడమటివైపునుంచి వచ్చి తూర్పు కనుమలకు దేవుడ్ని పరిచయం చేసి సవర గ్రామాలలో చర్చీలను నెలకొల్పారు.’
ఇలా అతి అమాయకంగా, అతి సామాన్యంగా చేదు నిజాల్ని చెప్తూ సాగుతుంది కథ. కథ పూర్తయ్యేసరికి నడుస్తున్న చరిత్ర అర్థమవుతుంది. చేదు నిజాన్ని ఉన్నదున్నట్టు చూపినా ఆవేశకావేషాలు, దూషణలు, ద్వేషాలు లేకుండా ఆలోచనాత్మకంగా ప్రదర్శించిన రచయితను అభినందించకుండా వుండలేము.
ఇక ఆ తరువాత ఒకటొకటిగా కథలు చదువుతూ మొత్తం పుస్తకంలో కథలను ఏకబిగిన పూర్తిచేశాను.
అంటే, అపోహల వల్ల పుస్తకం చదవకుండా పక్కన పారేసినా, ముందుమాట చదివి వదిలేసి వున్నా ఒక చక్కని రచయిత రాసిన అతి చక్కని కథలను చదవకుండా వుండిపోయేవాడిని. ఇది ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో నెలకొని వున్న విషాద పరిస్థితిని ఎత్తి చూపిస్తుంది.
నిజం చెప్పాలంటే, కరుణకుమార్ కథలు ఏ మూసలో వొదగవు. ఏ ముఠాకూ పరిమితం కావు. వర్క్‌షాపుల రొటీన్ కథలకు పూర్తిగా భిన్నం. కరుణకుమార్ ఒక స్వతంత్ర రచయిత. తనకంటూ ఒక ఆలోచన, రచనాశైలి, స్పష్టమైన అవగాహన వున్న రచయిత. అందుకే ఈ సంపుటిలో ఒక కథ మరో కథలా లేదు. ఏ కథకాకథ ప్రత్యేకం. ఏ కథలోనూ ఏదో సిద్ధాంతాన్ని నిలపాలనో, ఏదో సందేశం ఇవ్వాలనో, ఏదో ఉద్యమాన్ని సమర్ధించాలనో తపన కనబడదు. తాను గమనించి, అనుభవించి, భావించిన నిజజీవితాన్ని నిక్కచ్చిగా నిజాయితీగా, in it’s raw form, తాను అర్థం చేసుకున్న రీతిలో ప్రదర్శించాలన్న తపన తప్ప మరోకటి ఈ రచయిత రచనలో కనబడదు. అది కూడా రచయిత స్వయంగా చెప్పినట్టు ‘ఒత్తిడికి గురై ఇవి చెప్పకపోతే కుదరదు అన్నంత ఉక్కబోతకు లోనైనప్పుడు రాసినవి’ అన్నది అక్షరాలా నిజం అన్న నమ్మకం కలిగిస్తాయీ కథలు.
ఈ కథల్లో ‘సాయమ్మ’ కథ ప్రత్యేకమైన కథ. ఇజాలు, ఉద్యమాలు, విముక్తులు లేని కాలంలో ఒక అవిద్యావంతురాలయిన మహిళ తన వ్యక్తిత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని నిర్మొహమాటంగా ప్రదర్శించటాన్ని చూపిస్తుందీ కథ. ఒకప్పుడు ఇలాంటివారు, అడుగడుగునా సమాజంలో కనిపించేవారు. ఆ కాలంలో ఇలాంటి విశిష్ట వ్యక్తిత్వమున్న మహిళల గాథలు కోకొల్లలు. ఇప్పటిలాగా శరీరం చూపించేహక్కు, ఇష్టమైనవాడితో ఇష్టమైనంతకాలం వుండే స్వేచ్ఛలు లేని ఆ కాలంలో తమ గౌరవానికి, మర్యాదకు ఏమాత్రం భంగం రానీయకుండా ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సాగించిన మహిళ కథ ఇది.
‘ఏకువున లెగిసి పోసుకుని, ఇల్లు, పిల్లల్ని సంగరించుకొని, సూర్య బగమానుడికి దండాంపెట్టీసి, పొలంకెల్లి పని సూసుకుని, నా మొగుడి నోటికి రుసిగా కావలసినవి ఒండెట్టిస్తే.. అదే సాలు’ అన్న సాయమ్మ ప్రశాంత జీవితానికి రాచబాటలాంటి మాటల్లోని విజ్ఞతను గ్రహించే తెలివి ఈనాటి ఉద్యమకారులకు, అభ్యుదయవాదులకు, యువతకుందన్నది సందేహాస్పదమే! కానీ, తాను సన్నిహితంగా సంచరించే గుంపు మెచ్చే మూస కథలకు సంపూర్ణంగా భిన్నమైన కథ రాసి, తన దారి తనదే అని నిరూపించుకున్నాడు రచయిత. తన వ్యక్తిత్వం, రచనలు తనవే అని స్పష్టంగా ప్రకటించాడు రచయిత ఈ కథతో. ఈ కథ తరువాత సమూహంతో సంబంధం లేకుండా రచనను ఒక స్వతంత్ర రచయిత సృజనలా చదువుతాము.
‘నాలుగు వందల తొంభై ఎనిమిది’ కథ, పురుషులపై వివాహంలో జరిగే మానసిక హింసను అతి ప్రతిభావంతంగా చూపిన కథ. ఇలాంటి, ఏటికి ఎదురీదే కథలు తెలుగులో అరుదు. పేరు, అవార్డులు సాధించాలనుకునే రచయితలు ఇలాంటి కథలు రాయరు. ఇవేవీ తనకు పట్టిలేవు, తాను రాయాలనుకున్నది రాస్తాననే అతి అరుదయిన వెన్నెముక కల రచయితల జాబితాలో చేరతాడీ కథతో ఈ రచయిత. ఈ కథలో గమనార్హమైన అంశం ఏమిటంటే, రచయిత తప్పంతా మహిళది అన్నట్టు చూపడు. వీరు తప్పు, వీరు రైటు అని తీర్పు చెప్పడు. రచయిత ఒక నిష్పక్షపాత సాక్షిలా నిలబడి, నిర్మోహంగా కథ చెప్తాడు. నిజజీవితంలో జరిగినట్టే, ఇరువైపులా ఇంతో కొంతో తప్పున్నా, సమాజంలో స్త్రీ పక్షపాత చట్టాల వల్ల పురుషుడెలా నిస్సహాయుడవుతాడో చూపిస్తూ, ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసే మనస్తత్వాలను ప్రదర్శిస్తూ, నాణేనికి రెండువైపులుంటాయని గుర్తుచేస్తుందీ కథ. ‘మేఘమాల’ కథలోనూ రచయిత కథ చెప్తాడు. పాత్రల వ్యక్తిత్వాలను చూపుతాడు. బలహీనతలను బోధపరుస్తాడు. నిస్సహాయతలను వివరిస్తాడు. ఎక్కడా ఇది మంచి, ఇది చెడు అని చెప్పడు. కథ చెప్తాడు. నిజ జీవితాన్ని కళ్ళముందు నిలుపుతాడు. సినిమాకు సంబంధించిన వారి గురించి ఇంత నిజాయితీగా, వారి మనస్తత్వాలను ఇంత లోతుగా ప్రదర్శించిన రచనలు వెతుక్కోవాల్సివుంటుంది. గమనిస్తే, పలు ఇలాంటి రచనలలో సినిమా ప్రపంచం ఎంత చెడ్డది అన్న వ్యాఖ్యాలుంటాయి. ఈ కథలో అలాంటివేవీ లేవు. ఈ కథను సినిమా బదులు మరో ప్రొఫెషన్ పెట్టి రాసినా సరిపోతుంది. సినిమా కూడా ఇతర ప్రొఫెషన్లలాంటిదే అని చెప్పకనే చెప్పాడు రచయిత.
ఈ పుస్తకానికే హైలట్ అనదగిన కథ ‘చీకటి’. ఒక నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా రాసినా ఈ కథా రచయిత కథను రూపొందించిన తీరు అమోఘం. ఒక సస్పెన్స్, హారర్ సినిమా స్క్రిప్టు రచించినట్టు రాశాడీ కథను. కథ కళ్ళముందు జరిగుతున్న అనుభూతి కలుగుతుంది. సామాజిక మనస్తత్వంలోని బలహీనతలను, నైచ్యాన్ని, మానవ మనస్తత్వంలో పరిస్థితులవల్ల కలిగే మానసిక వ్యాధుల స్వరూపాన్ని అత్యంత అద్భుతంగా, ఎక్కడా ఇదొక అబ్నార్మాలిటీ అని చెప్పకుండా చెప్పాడు రచయిత. ఇది సహజం కూడా. ఒక వ్యక్తిలోని మానసిక రుగ్మత ఎదుటి వారికి తెలుస్తుంది. ఆ వ్యక్తికి అది సహజంగానే అనిపిస్తుంది. అతడికది సత్యం. ఈ సత్యం, అభాసల నడుమ రచయిత కథను నడిపిన తీరు పరమాద్భుతం. ఈ కథను కథా కథన కౌశలానికి చక్కటి ఉదాహరణగా విశ్లేషించి వివరించవచ్చు. నిజానికి, ఈ కథ చదివిన తరువాత ఇతర కథలు చదవటం, సూర్యుడిని చూసిన కళ్ళతో ఇతరాలను చూడటం ఎంత కష్టమో అంత కష్టం. కానీ, ఆ కథల ప్రత్యేకత ఆ కథలదే.
‘సవర్లకొండ’ కథల సంపుటి ముఖచిత్రం ఉత్తమ స్థాయిలో వుంది. కవర్ డిజైన్ చేసిన ‘మహి’కి అభినందనలు. పుస్తకం నాణ్యత కూడా చక్కగా వుంది. పుస్తకం చూడగానే చేతిలోకి తీసుకోవాలనిపిస్తుంది. చదవటం ఆరంభిస్తే, పూర్తయ్యేదాకా పుస్తకం వదలలేము. చక్కని పుస్తకాన్ని అందించిన అన్వీక్షికి పబ్లిషర్స్‌కు ధన్యవాదాలు. విభిన్నమైన కథలు చదవాలనుకునే కథాభిమానులు తప్పనిసరిగా కొని చదవాల్సిన కథలివి. కథారచన నేర్చుకోవాలనుకునేవారూ, కథలను అధ్యయనం చేయాలనుకునేవారూ తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన కథల సంపుటి ఇది. ఇలాంటి కథలకు పాఠకాదరణ లభిస్తేనే, రచయితలు భిన్నంగా రాసేందుకు ముందుకొస్తారు. ప్రచురణకర్తలు పుస్తకాలు ప్రచురిస్తారు. తద్వారా, మూస కథలతో విలవిలలాడుతున్న తెలుగు కథాసాహిత్యం విభిన్నమైన కథలతో కళకళలాడుతుంది. తెలుగు సాహిత్యం పరిపుష్టమవుతుంది.
అయితే, ఒక చేదు నిజాన్ని చెప్పుకోవాల్సివుంటుంది. ఏ కంపెనీ వల్ల రచయిత పుస్తకంపై అపోహలు కలిగి పుస్తకం చదవకుండా పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చిందో, వారి వల్లనే ఇలాంటి పుస్తకం ఒకటి ఉన్నట్టు తెలుసుకునే వీలు కలిగింది. లేకపోతే, ఇలాంటి కథలు రాసే ఇతర రచయితలు అనేకులు రచయితలుగానే గుర్తింపు పొందటం లేదు. వారి కథలు కథలుగానే పరిగణించటంలేదు. సాహిత్య ప్రపంచంలో ఎవరికీ తెలియని చీకటి మూల వారు, వారి కథలు వొదిగి విస్మృతిలో పడుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. ఇలాంటి విభిన్నమైన కథలను రచయితలు విస్తృతంగా ఒక ఉద్యమంలా రాయాలి.
***


సవర్లకొండ, ఇతర కథలు (కథాసంపుటి)
రచన: కరుణకుమార్
ప్రచురణ: అన్వీక్షికి ప్రచురణలు
పేజీలు: 165
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్వీక్షికి ప్రచురణలు, హైదరాబాద్. ఫోన్: 097059 72222
ఆన్లైన్లో:
https://www.amazon.in/SAVARLAKONDA-Stories-by-Karuna-Kumar/dp/B0DQCNP8DC
~
శ్రీ కరుణకుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-karunakumar/

1 Comments
వారణాసి నాగలక్ష్మి
ఇంత నిక్కచ్చిగా నిర్మొహమాటంగా మీరే రాయగలరు! అభినందనలు

సమీక్ష చదవగానే పుస్తకం చదవాలనిపించింది. అది మీ విజయం. మీ నుంచి ఇలాంటి సమీక్షను రాబట్టిన
రచయితకు అనేక అభినందనలు