మళ్ళీ పిలిచింది. సమాధానం రాలేదు, కనీసం ములుగు కూడా వినిపించలేదు. అయ్యో… అంటూ ఒక్కసారి అక్కడ కూలబడిపోయింది. రోడ్డు మీద కూచున్న రాధకి ఏం కనిపించలేదు, కాని, చుట్టూ చేరిన వాళ్ళు అనుకుంటున్నది వినిపించింది.
“బాగా రక్తం పోతోంది. ముందుకి ఒరిగిపోయాడు. తల ముందూ, వెనక బాగా తగిలినట్లుంది. కారు పైకీ కిందకీ, ముందుకి, వెనక్కీ, అటూ ఇటూ ఊగడంతో తలకి బాగా తగిలాయి.”
“వాడెవడో ఫాస్టుగా వచ్చి కారుని కొట్టేసాడు. ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. కారుకేం అయిందో అందులో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో కూడా చూడలేదు, ఆగను కూడా ఆగలేదు. అలా వెళ్ళిపోయాడు. ఎంత నిర్లక్ష్యం! నంబరు ఏదో కొంచెంగా కనిపించిందిట కాని దానితో పెద్దగా లాభం ఉండదు. పూర్తిగా నంబరుంటేనే అతీ గతీ ఉండదు, ఇంక సగం నంబరంటే ఇంతే సంగతులు….”
“ఆసుపత్రికి తీసుకెళ్ళాలి..పాపం…”..ఎవరో అన్నారు.
రెండు ఐసు దిమ్మెల మధ్య ఉండిపోయినట్లుగా మొద్దుబారినట్లుంది రాధ పరిస్థితి. ఏం చెయ్యాలో తెలీడం లేదు. పిచ్చిగా చూస్తూ, నోరు తెరుచుకుని, మాధవ్‌ని చూస్తోంది. ఆతృత, అయోమయం, భయంతో కర్తవ్యం తెలీని దానిలా ఉండిపోయింది.
వాళ్ళ మాటలు విన్న రాధకి కర్తవ్యం తెలిసింది. వెంటనే వాళ్లని చూస్తూ అంది, చేతులు చాచి అంది.
“ఆయన్నిబయటికి తీద్దాం. ఆసుపత్రికి తీసుకెళ్దాం…”
అందరూ ఆమెని ఓసారి చూసారు కాని, ముందుకు ఎవరూ రాలేదు. మరోసారి దీనంగా చూస్తూ, జాలిగా అడిగింది.
“దయచేసి కొంచెం సాయం చేయండి. అందరం కలిసి పట్టుకుని బయటికి తీద్దాం…. నా ఒక్కదానితో అవడంలేదు.ప్లీజ్ …” వణుకుతున్న గొంతుతో చేతులు జోడించింది.
“సారీ…. మేడం…. ఏమీ అనుకోకండి. ఇలాంటి వాటిల్లో తల దూర్చలేము. నూట ఎనిమిదికి మాట్లాడితే సరి, అంతా వాళ్ళే చూసుకుంటారు, అంతే కాదు మేడమ్… వాళ్ళ దగ్గర ఫస్ట్ ఎయిడ్ సరంజామా కూడా ఉంటుంది… ముందు ఫస్ట్ ఎయిడ్ అందాలి…. అదే ముఖ్యం. అది అందితేనే ప్రాణం నిలబడుతుంది… ఎవరి దగ్గరైనా సెల్ ఉంటే కొంచెం చేయండి.”
అక్కడ నుంచున్న వాళ్ళల్లో ఒకరు సెల్ గబ గబా తీసి చేసారు. రెండుసార్లు, చేసాకా కలిసింది. అతని ప్రతీ కదలికను, చేస్తున్నదంతా గమనిస్తున్న అందరూ ఆతృతగా చూస్తున్నారు. అతను సెల్ ఆఫ్ చేస్తూ అందరినీ ఓ సారి చూసి ,సెల్ ని జేబులోఉంచుకుంటూ అన్నాడు. అందరు అతడి మొహాన్ని ఆతృతగా చూస్తున్నారు.
“ఓ అరగంట పైనే పడ్తుందిట. అక్కడ ఎక్కడో హైవేలో ఉన్నారుట. ఏ హైవేలో ఉన్నారో.. చెప్పలేదు, అరగంట అంటారు కాని, ఇంకా ఎక్కవే అవుతుంది. ఓ గంట కూడా కావచ్చు. కాని, ఈ ప్రమాదం జరిగినదానికి దగ్గరలో ఎక్కడైనా నూటెనిమిది ఉందేమో కనుకుంటాము, ఉంటే వాళ్ళకి చెప్తాం. మీకు సాయం చేయడానికి వెళ్ళమని చెప్తాం అని అన్నారు.”
రాధ బెంగగా చూసింది. …అరగంటా…! గంటా! దగ్గరలో మరో నూటెనిమిది లేకపోతే…. ఈ లోపల…. ఏదయినా జరిగితే…..! ఎవరిది తప్పు….! ఎవరు జవాబు ఇవ్వాలి! రోడ్డు పైన జరిగే ఈ ప్రమాదాలకి జవాబుదారీలెవ్వరు?
అంతలో ఓ పోలీసు వాహనం మెల్లిగా శబ్ధం లేకుండా వచ్చిఆగింది.. అందులోంచి ఇద్దరు పోలీసులు దిగి,కారు దగ్గరికొచ్చి పరీక్షగా ,కారుని,కింద కూచున్న రాధని,కారులో ఉన్న మాధవ్‌ని, చుట్టూ ఉన్న మనుషులని చూసి కారులోకి తొంగి చూసారు. అటూ ఇటూ వెళ్తున్న వాహనాలు కూడా మెల్లిగా ఆగినట్లే ఆగి, మెల్లిగా వెళ్ళిపోతున్నాయి.
ఆ తరవాత పోలీసులు రాధ దగ్గరికి వచ్చి మిగిలిన వాళ్ళలాగే నుంచున్నారు.
రాధ ఆశగా వాళ్ళని చూసింది.
‘కొంచెం మా హస్బెండ్‌ని బయటికి తీయడంలో సాయం చేయండి.. అంబులెన్స్ రావడానికి టైము పడ్తుందిట. అది వచ్చే లోగా మనం ఆసుపత్రికి తీసుకెళ్ళి పోదాం….”
వాళ్ళిద్దరు… ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. ఆ తరవాత రాధని చూసారు.
“సారీ… మేడం… ఈ ఏరియా మా లిమిట్స్ లోకి రాదు… క్షమించండి… మేము ఏం చేయలేము…”
రాధ పిచ్చి పట్టినట్లుగా చూసింది.
“మరి మీ ఏరియా ఎక్కడ…..”
ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దాటాక….” అంటూతన ఎడం చేత్తో ఆవైపు చూపిచాడు.
“ఈ యాక్సిడెంటు చేసిన కారు కూడా ఆ వైపునుంచే వచ్చింది. ఎర్ర లైటు పడ్డాక కూడా తన కారుని ఆపకుండా వచ్చేసాడు. తప్పు మాది కాదు. తప్పు పూర్తిగా ఆ కారు వాడిది. అందుకని మీరు మాకు సాయం చేయాలి…. ముందు ఆ మనిషిని తీసేందుకు సాయం చేయండి… ప్లీజ్…”
“తప్పు ఎవరిదైనా కాని మేము మీకు సాయం చేయలేం. మా జురిస్డిక్షన్ లోకి ఈ ఏరియా రాదు. జాలిపడి, మేము సాయం చేసినా ఆ తర్వాత మేము ఎన్నింటినో ఎదుర్కోవాలి. అందుకని,మేము ఏం చెయ్యలేము.. మా ప్రాబ్లెంస్ మాకుంటాయి అవి మీకు చెప్పలేము. అయినా ప్రమాదం ఇక్కడ కదా జరిగింది. మేము ఇప్పుడు వెళ్ళి పోలీస్టేషన్లో రిపోర్ట్ చేస్తాం. వాళ్ళు వస్తారు, అన్నీ రాసుకుంటారు. తరవాతది, అంతా వాళ్ళే చూసుకుంటారు. మీకు సాయం చేస్తారు” అంటూ ఓ సారి కారు చుట్టూ తిరిగి, అన్ని కోణాల్లోంచి చూసి, మరో సారి లోపలికి, అందరినీ చూసి… “అయినా ఈమధ్య ఈ రోడ్డు ప్రమాదాలు మరీ ఎక్కువైపోయాయి…” అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ అందరిని చూస్తు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
రాధకి ఏడుపొచ్చేసింది. పిచ్చి దానిలా అందరిని చూసింది.
పోలీసులు ఇంత కఠినంగా ఉంటారా….! ఓ మనిషిని, అందులో గాయపడ్డ మనిషిని కారులోంచి బయటికి తీసి, ఆటోలో కూచోపెట్టడానికి ఇంత ఆలోచన చెయ్యాలా… ఓ ప్రమాదం జరిగిన మనిషికి సాయం చేయడానికి ఇలాగా ప్రవర్తిస్తారా….! చావు బతుకుల్లో ఉన్న మాధవ్‌ని చూసినా కూడా జాలి కలగలేదా…! వీళ్ళకి ఎథిక్స్ ఉండవా..! ఉన్నా దానికన్నా, వేసుకున్న యూనిఫారంకే ప్రాముఖ్యత ఇస్తారా…!
వెంటనే రాధ అందర్నీ నీళ్ళు నిండిన కళ్ళతో చూసింది. ఆ చూపుకి అర్థం అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది.
“సారీ… మేడం… పోలీసులే సాయం చేయడానికి ముందుకి రానప్పుడు, మేము కూడా ఎలా వస్తాం .మేడమ్,”
“అలా అనకండి. ఒక్కసారి ఎలాగో, ఆటోలో తీసికెళ్లి దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో చేర్పించేద్దాం… ఆ సాయం చేస్తే చాలు. ఏదైనా ఖాళీ ఆటో కనిపిస్తే ఆపండి… ప్లీజ్.. కొంచెం జాలి పడండి. అతను మీలాంటి మనిషండి… తొందరగా తీసుకెళ్తే ప్రమాదం తప్పుతుంది” పిచ్చి దానిలా అటూ ఇటూ తిరుగుతూ అక్కడున్న వాళ్ళని చేతులు చాపి బతిమాలింది.
“మీరు అన్నది రైటు, మేడమ్… కాని… ఈ విషయం అంతటితో ఆగిపోదు. ఇది మెడికో లీగల్ కేసు. చెయ్యి పెట్టక పోతేనే నయం….”.
“లేదు… లేదు మీరు మాకు సాయం చేసిన వాళ్ళని నేను చెప్తాను…” చేతులు జోడించింది.
“సారీ మేడమ్. ఇది అంత సులభంకాదు…. అనుకున్నంత తేలిగ్గా… ఈ …హిట్ అండ్ రన్ కేసులు తేలవు, ఎప్పటికీ తెగవు… మీరన్నట్లుగా ఆసుపత్రికి తీసుకెళ్తాం. డాక్టర్లకి వెంటనే తెలిసిపోతుంది ఇది లీగల్ కేస్ అని. సాయం చేసిన పాపానికి మా పేర్లు రాసుకుంటారు… ఆ తరవాత… మాకు నరకం చూపిస్తారు… ఏఁవిటో కోర్టులు సాక్ష్యాలు… అంటారు. ఈ తిరగడాలు అవి మా వల్ల కాదు…. మీకు…. ఈ తిరగడం… అదీ ఎలాగూ తప్పదు… కానీ మీరు తిరగడానికి, మేం తిరగడానికి తేడాలున్నాయి… అది మీకు తెలుసనుకుంటాను…. ఆరెండు ఒకటి కాదు… కదా మేడమ్……”
నోరు తెరుచుకుని అలాగే వాళ్ళని చూసింది.
ఆమె లోని శక్తి పూర్తిగా ఎవరో చేత్తో తీసేసినట్లుగా, నిస్త్రాణగా అయింది. అలాగే లేని బలాన్ని తెచ్చుకుని మాధవ్ వైపు తొంగి చూసింది… స్పృహలో లేడు. రక్తంతో వేసుకున్న బట్టలు తడిసి పోయాయి. ఒంటి మీద, జుట్టులో అక్కడక్కడా ఉన్న గాజుముక్కలు అవి గుచ్చుకున్న చోటు నుంచి సన్నగా మెల్లిగా చెంపల మీదుగా,రక్తం కారుతోంది.
వెంటనే వైద్యం అందకపోతే… మాధవ్ పోవడం ఖాయం… ఏం చెయ్యాలీ…?
రెండు అరచేతుల్నీ, ఒకదానిలో ఒకటి ఉంచి, గట్టిగా ఊపుతూ, గుండెలకి ఆనించి దేవుడిని ప్రార్థించింది. కళ్లు మూసుకుంది.. ఏదో గుర్తొచ్చినట్లు ఒక్కసారి కళ్ళు తెరిచి మాధవ్ వైపుచూసింది..
రాధకి ఏం చేయాలో అర్థం కాలేదు.బుర్ర పనిచేయడం లేదు.
“పాపం అంబులెన్స్ కూడా రావడానికి సమయం పడుతుందిట….. యిప్పుడు ఆ మనిషి సంగతి ఏఁవిటీ… ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపల ఏదైనా జరిగితే… ఇప్పడికే ఆలస్యం అయింది..” అని ఓ మనిషి అన్నాడు.
“అవును, మనం ఇలా నుంచోడం ఏం బాగాలేదు, ఏదైనా ఖాళీ ఆటో కనిపిస్తే ఆపండి. అందరం కలిసి సాయం పట్టి యెలాగో ఓలాగా ఈ మనిషిని కూచోపెట్టి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్దాం…….”
“…భలేవారండి. ఆ మనిషిని మనం తీసుకెళ్ళడం ఏఁవటీ…? ఇది అన్నంత సులువు కాదండి… కేసు బాబూ కేసు… అయ్యో పాపం… పోనీ అని మనం తీసుకెళ్తే… కొరివితో తల గోక్కున్నట్లే… ఇంక ఇంతే సంగతులు……” అని అందర్నీ చూసాడు… ఆ యువకుడు.
“నమ్మకం లేదా… నేను నా అనుభవం మీద చెప్తున్నాను… ఓ సారి ఇలాగే ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది… నేను నా షాపులోంచి జరిగినది చూస్తున్నాను. నా కళ్ళ ముందే, నేను చూస్తూండగానే పెద్ద ప్రమాదం జరిగింది. ఏం జరిగిందో చూడడం కోసం దుకాణం బయటికి వచ్చాను. యాక్సిడెంటు, జాలి పడ్డాను. ఏదో చెయ్యాలనుకున్నాను.
అందుకని అలా చూస్తూ ఊరుకోలేక పోయాను… ఓ మనిషి ఛావు బతుకుల్లో ఉంటే చూస్తూండడం మంచిది కాదనిపించింది… ఓ సాటి మనిషిగా సాయం చేయడం ధర్మం అనిపించింది. ఆసుపత్రికి తీసుకెళ్ళానుకున్నాను. సాయం చేసాను… నా డబ్బే చాలా ఖర్చయింది… అయినా బాధపడలేదు. ప్రైవేటు ఆసుపత్రి అయితే, చాలా డబ్బు అవుతుందని తెలుసు. అంత నేను పెట్టుకోలేను. ఒక వేళ పెట్టినా ఎవరి దగ్గర వసూలు చేయగలను.? అందుకని… దూరం అయినా సరే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాను… అయినా కూడా చాలానే డబ్బు అయింది… వాళ్ళు వెంటనే చేర్చుకోలేదు. కొన్ని గంటలు అలా కారిడార్‌లో స్టెచరు మీదే ఉంచారు. అంతంత సమయం పడ్తుందని నేను అనుకోలేదు. నాకేమో దుకాణం మీద బెంగ… ఎంత సేపని అక్కడ కూచుంటాను! వెళ్ళిపోవాలి. ఆ మాటే వాళ్ళతో అన్నాను. కాని వాళ్ళు వెళ్ళనిస్తే కదా…. పోలీసులు వచ్చే వరకూ అలాగే ఉండాల్సి వచ్చింది..! ఇంక వాళ్ళ ప్రశ్నలు మొదలయ్యాయి.
ఈ గాయపడ్డ మనిషికి మీరేం అవుతారు…. అన్న ప్రశ్నతో మొదలు పెట్టారు… జవాబు ఇచ్చాను. అంతటితో ఊరుకోలేదు… మీరే ఎందుకు తెచ్చారు… అని అడిగారు. నేను ఆ ప్రశ్నకి తెల్లబోయాను.. అది అర్థం లేని ప్రశ్నఅనిపించింది. మీరే యాక్సిడెంటు చేసి భయపడి తీసుకొచ్చారా… అని కూడా అడిగారు. ఇలాంటివే ఎన్ని ప్రశ్నలు వేసారో చెప్పలేను… దాదాపు పిచ్చి పట్టినట్లయింది… నా అదృష్టం బావుంది… ఆ అబ్బాయికి కొంచెం తెలివి వచ్చింది. జరిగింది ఏఁవిటో చెప్పాడు… నేను ఇంటికి రాగలిగాను.
ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆ అబ్బాయి బతికాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ పోయి ఉంటే… నాకు నరకమే మిగిలేది… అందుకని చెప్తున్నాను… మనం ఇలాగే చూడాలి అంతే. చూడడం మాత్రమే చెయ్యాలి….”
అక్కడ ఉన్న వాళ్ళందరితో పాటూ రాధ కూడా వింది. వెంటనే ఆ మనిషి వైపు చేతులు,తల అడ్డంగా ఊపుతూ అంది.
“అదీ ఇదీ ఒకటి కాదు. వాళ్ళకి నేను చెప్తాను. నేను కోరాను కాబట్టి, మీరు నాకు సాయం చేసారని చెప్తాను.” అని రాధ అంది.
చుట్టూ ఉన్న వాళ్ళు జాలిగాచూసారు కాని ఎవరూ ముందుకు రాలేదు…
అంతలో ఓ కారు జరిగిన ప్రమాదాన్ని, అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ, మెల్లిగా వెళ్తూ, కొంచెం ముందుకి వెళ్ళి, మళ్ళీ, వెనక్కి వచ్చి ఆగింది. ఆ కారు అందరిని దాటుకుంటూ వెళ్ళడం, వెనక్కి రావడం, ఆగడం అక్కడున్న అందరూ చూసారు.
చిరిగిన బట్టలతో, రేగిపోయిన జుట్టుతో,నుదుటి నుంచి అక్కడక్కడా కారుతున్న రక్తంతో కారుకి దగ్గరలో రోడ్డుమీద కూచుని ఉన్న రాధని, చుట్టూ ఉన్న మనుషులని చూస్తూ, ముందు సీట్లో ఉన్న ఓ ఇద్దరు, చెరోవైపు నుంచి కారు తలుపులు తీసుకుని దిగారు.
రాధ వాళ్ళ వైపు చూసింది… నోటమాట రాక చేత్తోనే కారుని, భర్తని చూపించింది…
ఆ ఇద్దరు తెల్ల పాంటు తెల్ల టీ షర్టు వేసుకుని ఉన్నారు. కాస్త దూరంలో ఓ పెద్ద పార్క్ ఉంది. చాలా మంది జాగింగ్‌కి వెళ్తూంటారు. వీళ్ళు కూడా అక్కడికేనేమో…. ఆ ఇద్దరిలో ఒకతను తన జేబులోంచి సెల్ తీసి, రాధని చూస్తూ అడిగాడు… “అంబులెన్స్‌కి ఫోన్ చేసారా” అని.
“చేసాం కాని, కొంచెం సమయం పడ్తుందిట. ఆ విషయం తెలిసి పది నిమిషాలు కూడా అవలేదు…” అన్న సమాధానం గుంపులోంచి వచ్చింది.
“పోలీసులు ఎవరూ రాలేదా”
“వచ్చారు కాని ఈ ఏరియా వాళ్ళ పరిధిలోకి రాదని వెళ్ళిపోయారు….” అని మరొకళ్ళు అన్నారు.
“అలాగా…” అంటూ మరో వైపుకి తిరిగి సెల్లో మాట్లాడాడు…
మరో రెండు నిమిషాల్లో పోలీసు వాహనం వచ్చి ఆగింది… అందులోంచి దిగిన వాళ్ళని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు అంతకు ముందు వచ్చిన వాళ్ళే…
వాళ్ళిద్దరూ వస్తూనే, ఎంతో నమ్రతతో వినయంగా,కారులో వచ్చిన వాళ్ళకి సాల్యుట్ కొట్టి, ఓ పక్కగా ఎంతో మర్యాదగా నుంచున్నారు. వాళ్ళు ఎందుకు వెల్ళిపోయారో… ఏం చేయడానికి వెళ్ళాల్సి వచ్చిందో సంజాయిషీని అంతే మర్యాదగా ఇచ్చారు.
“అంబులెన్స్ కోసం ఆగడం అవివేకం…. ఆటో మాట్లడండి…” అని వాళ్ళకి ఆదేశం ఇచ్చి వెళ్ళి పోయారు. కానీ, ఖాళీ ఆటో వెంటనే దొరకలేదు.
ఇది అంతా చూస్తున్న రాధ ఏదో గుర్తొచ్చినట్లు గబుక్కున లేచి, పరుగు లాంటి నడకతో వెళ్ళి కారు తలుపు తీసి, తన హాండ్ బాగ్ కోసం చూసింది. ఎక్కడా కనిపించలేదు. కారు అటూ అటూ బలంగా ఊగడంలో సీటు మీద ఉండాల్సినది సీటులో లేదు. మాధవ్ కాళ్ళ దగ్గర కింద పడి ఉంది. బాగా వంగితేనే గానీ చేతికి అందలేదు. అతి కష్టం మీద మాధవ్ కాలుని పక్కకి జరిపి, దాన్ని తీసింది. అందులోంచి సెల్ తీస్తూ, కారులోంచి బయటికి వచ్చి, ఫోన్ చేసింది.
మరో పది నిమిషాలకి ఓ రెండు కార్లు వచ్చి ఆగాయి. డ్రైవింగ్ సీటు దగ్గరనుంచి, తలుపు తీసి వస్తున్న వాళ్ళని చూడగానే రాధకి ఎక్కడ లేని బలం వచ్చింది. వాళ్ళిద్దరూ నారాయణ, ప్రశాంత్.
వాళ్ళు, ఇంజినీరింగ్ కాలేజిలో మాధవ్ స్నేహితులు. కాంపస్ ఇంటర్వ్యూలో అందరూ ఒకే కంపెనీలో చేరినా, తరవాత మారిపోయారు. అయినా వాళ్ళ స్నేహం కొనసాగుతూనే వచ్చింది. ఈ యాక్సిడెంటు జరిగిన దానికి, దగ్గరలోనే ఉంటున్నారు.. వాళ్ళుంటున్నది అక్కడికి దగ్గరే అన్న సంగతి రాధకి అప్పడు గుర్తొచ్చింది. అందుకే, వాళ్ళకి ఫోను చేసింది. వాళ్ళు,ఈ విషయం వినగానే బయల్దేరి వస్తారని తెలుసు.
వాళ్ళు వస్తూనే రాధ దగ్గరికి వచ్చారు. ఆమె వాళ్ళని చూడగానే ఏడ్చేసింది., వాళ్ళిద్దరూ గబ గబా మాధవ్ దగ్గరికి వెళ్ళి ఎలా బయటికి తీయాలా అని ఇద్దరూ ఆలోచించారు. రాధ కూడా వాళ్ళ దగ్గర నుంచుంది.
“మాధవ్ కార్లో ఉన్నాడు, మరి నువ్వు ఎక్కడ ఉన్నావ్…” అని రాధ వైపు చూసారు.
“నేను ఆ పళ్ళ వాళ్ళ దగ్గర. ఇదిగో ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వస్తూంటే ఎర్రలైటు పడింది. మాధవ్ కారు ఆపేసాడు. నేను కారు దిగి అదిగో అక్కడ ఉన్నసీతాపళ్ళు కొందా మనుకున్నాను, ఆకుపచ్చ లైటు పడగానే నా దగ్గరికి వచ్చేయమని చెప్పి, నేను రోడ్డుకి పక్కగా ఉన్న పళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అసలు ఇంకా ఏమీ కొననే లేదు. అంతలోనే…. వాడెవడో కుడి వైపునుంచి అతి వేగంగా వచ్చి, కారుని కొట్టేసి, ఆగకుండా వెళ్ళిపోయాడు” అతి కష్టంమీద చెప్పింది.
వాళ్ళిద్దరూ కార్లో ఉన్న మాధవ్ ని చూసి తలని ఊపుతూ,రాధని చూసారు.ఆమె కూడా వాళ్ళనే ఆశగా చూస్తోంది.
“మనం వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళలి… మాధవ్ పరిస్థితి కొంచెం భయంగానే అనిపిస్తోంది” అన్నాడు నారాయణ.
“అవునా… అంటే… అంటే…” భయంగా అని ఏడ్చేసింది.
“అంటే…. తలకి బాగా దెబ్బలు తగిలి, రక్తం పోతోంది కదా అని అన్నాను. అంతే. … మరేం భయం లేదు….. ఈ సమయంలో గవర్నమెంటు హాస్పిటల్ కష్టం. అది చాలా దూరం. ఎంత తొందరగా వైద్యం జరిగితే అంత మంచిది. అందుకని మనం దగ్గర్లో సురక్ష నర్సింగ్ హోం అని ఓ ఇరవై నాలుగ్గంటల ఆసుపత్రి ఉంది. పైగా ఎమర్జెన్సీ కూడా ఉంది….. అక్కడికే తీసుకెళ్దాం. ప్రశాంత్ …. నువ్వు నీ కార్లో రా…. వాళ్ళిద్దర్నీ తీసుకుని నేను, ముందు వెళ్తాను.”అని అన్నాడు నారాయణ.
దేవుడి మీద నమ్మకం ఆ క్షణంలో ఉందో లేదో కానీ నాకు స్నేహితుల మీద ఉంది. కళ్ళు మూసుకుని అనుకుంది. కారులోంచి మాధవ్‌ని తీయడం కష్టం అయింది. కారులో పడుకోపెట్టడం ఇంకా కష్టం అయింది.
అక్కడ ఉన్న వాళ్ళు సాయం పట్టగా, మాధవ్‌ని నారాయణ కారులో వెనక పడుకోపెట్టారు. రాధ అతని కాళ్ళని తన ఒళ్ళో పెట్టుకుంది. వెంటనే కారు సురక్ష వైపుగా దూసుకు పోయింది. ఆ ఆసుపత్రి నిజంగానే దగ్గర. మరో పదిహేను నిమిషాల్లో సురక్షకి చేరుకున్నారు.
ఓ పెద్ద కాంపౌండులో సురక్ష హాస్పటల్ ఉంది. రోడ్డుకి అవతల చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల లాంటివి ఉన్నాయి. ఆసుపత్రి బయట కూడా ఓ నాలుగైదు. టీ బళ్ళు టిఫిన్ బళ్ళు ఉన్నాయి. అవే కాకుండా, మందుల దుకాణాలు. జనరల్ దుకాణాలు పళ్ళబళ్ళు అన్నీ కూడా అంత పొద్దున్నే తెరిచి ఉన్నాయి. వాటి ముందు, సైకిళ్ళూ, మోటారు సైకిళ్ళూ ఓ రెండు, మూడు ఖాళీ ఆటోలూ ఉన్నాయి. వాటిని చూస్తూ దాటుకుంటూ గేటు లోంచి వెళ్ళి, ఆసుపత్రి ముందున్న ఆవరణలోకి ప్రవేశించారు.
(ఇంకా ఉంది)
గంటి భానుమతి పేరుపొందిన కథా రచయిత్రి, నవలా రచయిత్రి. అత్యంత ఆసక్తికరమైన కథలను అలవోకగా స్పృశిస్తారు. “జీవన పోరాటం”, “అమ్మకో ఉత్తరం”, “సాగర మథనం” వంటి కథా సంపుటాలు; “ఆ ఇద్దరు”, “తప్పటడుగు”, “ఆఖరి ప్రయాణం” వంటి నవలలు రచించారు.
అంతా దేవుడి దయ అనేస్తాం.మనం మటుకు అడుగు ముందుకు వేసి ఒక్కరికి సాయం చెయ్యం.ఇది నిజంగా మన దేశం లో పరిస్థితి.మానవత్వమే లేని.మానవ జాతి.మనది..చాలా బాగుంది.
వసంత లక్ష్మి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సత్యాన్వేషణ-29
తెలుగుజాతికి ‘భూషణాలు’-27
తెల్లకోటు – నల్ల మరక
అంతరాల ఈ తరం మార్పు
పాఠకుల మనసుల్ని దోచే ‘దోని గంగమ్మ’ కథ
దేశ విభజన విషవృక్షం-67
అడవికాచిన వెన్నెల
వాక్కులు-1
మరుగునపడ్డ మాణిక్యాలు – 78: ద ఫేవరెట్
నీలమత పురాణం-81
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®