ప్రతిరోజు ఆశగానే మొదలవుతుంది
నిన్నటి కన్నా నేడు బాగుంటుందేనని
బహుశా రేపు కూడా ఇలాగే కొనసాగుతుందేమో
అయినా అదే ఆశ ను శ్వాసగా చేసుకొని
బతుకు బండిని నడుపుతూనే ఉంటాం
కలల సీతాకోకచిలుకలు ఎగురుతున్నప్పుడల్లా
విశ్వాసపు పూలను ఎరగా పెడుతుంటాం
కోరికల అశ్వాలు పరిగెత్తుతున్నప్పుడల్లా
సాధ్యాసాధ్యాల చిట్టాలతో అదుపు చేస్తుంటాం
ఎదురు చూపుల దారులలో
స్వప్న తారకల వెలుగులు ఆరబోసుకుంటూ
గుండె గూటిలో కలతల్ని దాచేసుకుంటూ
విజయతీరం వైపు సాగిపోతూనే ఉంటాం
బహుశా
కోరికలది, కలలది సముద్ర దాహమేమో
లోతే తెలియని అగాధాలతో
కమ్మగా మొదలైనా కన్నీటితో ముగుస్తాయి
సముద్రపునీరు, కన్నీరు కవల పిల్లలేమో
రుచిలోనూ, రూపులోనూ, విస్తారంలోనూ
తీరని దాహాలతో మనిషిని ముంచేస్తూంటాయి

శ్రీమతి రమాదేవి బాలబోయిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.
ప్రవృత్తిగా కథా, కవితా, నవలా రచయిత్రి. విమర్శకురాలు, సమాజ సేవకురాలు. సాంత్వన ఫౌండేషన్ ఫౌండర్.
ప్రాణంవాసన అనే కవితా సంపుటి, మీలిత-నవల వీరి రచనలు.
2 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
మంచి పోలికలతో
జీవితాన్ని ఆవిష్కరించావు.కవిత బాగుంది.
సంచికకు సు స్వాగతం.
అమ్మా..అభినందనలు నీకు.
రమాదేవి బాల బోయిన/మృదువిరి
థాంక్యూ సర్