[డా. చిత్తర్వు మధు రాసిన ‘ది సిగ్నల్’ అనే సైన్స్ ఫిక్షన్ కథని పాఠకులకు అందిస్తున్నాము.]


అది ఒక అద్భుతమైన దృశ్యం!
చుట్టూ నల్లటి చీకటి, దాంట్లో మెరిసే నక్షత్రాలూ, గేలక్సీలూ, నీలీ, ఊదా రంగులలో మెరిసే దూది లాంటి నెబ్యులాలు. నక్షత్ర దర్శిని లేక ది స్టార్ గేజర్ అంతరిక్ష నౌకలో ముందు అద్దంలోంచి చూస్తుంటే, ఒక అతిలోకమైన, అసాధారణమైన, విశ్వపు దృశ్యం ఆవిష్కృతం అవుతోంది. ఎందుకంటే ఎదురుగా ‘గెలాక్టిక్ హేలో’ (Galactic Halo) అంటే పాలపుంత చివరి అంచు చుట్టూ ఉన్న తెల్లటి కాంతి వృత్తాకారంలో మెరుస్తూ కనిపిస్తోంది.
మిల్కీ వే అంటే పాలపుంత. గెలాక్సీ మధ్య నుంచి కనీసం 26 వేల కాంతి సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చిన నక్షత్ర దర్శినిలో ఆ నౌక కెప్టెన్ అదితి ఈ క్షణం కోసమే ఎదురుచూస్తోంది.
పాలపుంతలో ఎన్నో డజన్ల కొద్దీ గ్రహకాలనీలు మానవులవి ఉన్నాయి. కనీసం 150 గేలాక్సీలో గుర్తించబడిన భాషలు ఉన్నాయి.
నక్షత్ర దర్శిని కనీసం 1000 మీటర్లు పొడుగున్న పరిశోధన నౌక. అంతరిక్షపు రంగులేని చీకటిలో నౌక మెరిసే బహిర్ కవచం మీద ఆ 150 భాషలలో దాని పేర్లు రాసి ఉన్నాయి. అది తెలుగులో కూడా ఉంది, నక్షత్ర దర్శిని. ఇంగ్లీషులో స్టార్ గేజర్. ఇంకా గుర్తించబడిన ఇతర భాషలలో పేర్లు రాయబడి ఉన్నాయి.
కనీసం 26 నెలలు భూమి నుంచి సుమారు కాంతి వేగంతో ప్రయాణం చేసి గెలాక్సీ అంచుకు చేరుకుంది నౌక. పాలపుంత గెలాక్సీనీ, గెలాక్సీలో నక్షత్రాలు, వివిధ రకాల అంతరిక్ష విషయాలనీ, పరిశోధించేందుకు ఏర్పడిన నౌక. కాంతి వేగంతో ప్రయాణించే సాధనాలు కలిగిన నౌక. సుమారు 150 మంది అంతరిక్ష యాత్రికులు దాంట్లో ఉన్నారు. సగానికి సగం మంది పైగా ‘క్రయోజెనిక్ స్లీప్’ అంటే అతి శీతలమైన వాతావరణంలో నిద్రలో ఉంటారు. మిగిలిన వారు విధులలో పనిచేస్తుంటారు. ఇప్పుడు ఇప్పుడు కెప్టెన్ అదితికి సహాయంగా 12 మంది శాస్త్రవేత్తలు సిగ్నల్ ఆపరేటర్లు, ఒక డాక్టర్ మెలకువగా ఉన్నారు. వారందరూ అంత దూరం ప్రయాణించి పాలపుంత అంటే మిల్కీ వే గెలాక్సీ అంచుకు చేరుకున్న కారణం ఒకటే.
ది సిగ్నల్.
2345 కామన్ఈరా సంవత్సరంలో మానవులు పాలపుంత గెలాక్సీ అంతా చాలా గ్రహాల్లో కొద్ది కొద్దిగా వ్యాపించి కాలనీలు నిర్మించి మానవ ఆవాసాలు నిర్మించుకున్నారు. సమాచార వ్యవస్థలూ, ప్రయాణ సాధనాలూ గ్రహాంతర యానాలలో ఇప్పుడు ఊహించలేని అభివృద్ధి జరిగింది. దీనికి కారణం ‘క్వాంటం పార్టికల్స్’ గురించి జరిగిన పరిశోధనలు! క్వాంటం ఫిజిక్స్ సహాయంతో జరిగిన కొత్త కొత్త ఆవిష్కరణలు. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం డ్రైవ్‌తో ప్రయాణాలు, కాంతి వేగం కంటే కొంచెం తక్కువ వేగంతో సాథ్యంఅయినాయి. గెలాక్సీలో అన్ని వైపులా కొన్ని పరిశోధనా నౌకలు ఇంకా కొత్త పరిశోధనలు చేస్తూ వివిధ రకాల సమాచారం కోసం ఇంకా దాగి ఉన్న రహస్యాలు కనుగొనడం కోసం పర్యటన చేస్తూనే ఉన్నాయి. నక్షత్రదర్శిని వాటిలో ఒకటి.
ఇప్పుడు నక్షత్రదర్శిని పాలపుంత గెలాక్సీ సరిహద్దు దాకా రావడానికి కారణం చాలా ముఖ్యమైనది. చాలా కాలం నుంచి గెలాక్సీలో మహాశూన్యం అనే ఒక ప్రాంతముందనీ దానిలో ద్రవ్యం గానీ శక్తి గానీ ఏమీ ఉండదని అనుకునేవారు. దాని పేరే ‘ద గ్రేట్ వాయిడ్’. ఇది సుమారు భూమి నుంచి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో గెలాక్టిక్ హాలో అనబడే పాలపుంత అంచుల్లో ఉన్నది అనుకునేవారు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్రాంతం నుంచి ఒక వింతైన సిగ్నల్ అంతరిక్షంలో పాలపుంతలోని అన్ని గ్రహ కాలనీలకి రావడం కనుక్కున్నారు. ఆ సిగ్నల్ యొక్క భావం ఏంటో దాన్ని అర్థం చేసుకునే కోడ్ ఏమిటో ఏ శాస్త్రజ్ఞులూ కనిపెట్ట లేకపోయారు. ఇప్పుడు కెప్టెన్ అదితి సారథ్యంలో ఆ సిగ్నల్ ది గ్రేట్ వాయిడ్ నుంచి వస్తోందని కనిపెట్టగలిగారు. పాలపుంత అంచుకి దగ్గరకొస్తుండగానే మహా శూన్యం నుంచి వచ్చే సిగ్నల్ తీవ్రత ఎక్కువైంది. పాలపుంత సరిహద్దు నుంచి మరెన్నో అంటే సుమారు లక్ష కాంతి సంవత్సరాలు వెళ్తే కానీ పక్కనున్న ఆండ్రోమేడా గెలాక్సీ రాదు. కాబట్టి సిగ్నల్ మహా శూన్యం నుంచే వస్తోందని కెప్టెన్ అదితి భావించి ఈ ప్రాంతానికి వచ్చింది.
అంతరిక్ష నౌక ముందు భాగంలో ఉన్న విశాలమైన అద్దంలో నుంచి నల్లటి కంబళి మీద మెరిసే వెండి చుక్కల లాగా అందమైన ముగ్గులు వేసినట్టు నక్షత్రాలు మెరుస్తున్నాయి. అక్కడక్కడా నెబ్యులాలు దూది పింజల్లా మెరుస్తూ తేలిపోతున్నాయి. నలుపు ఊదా రంగులలో నీలిరంగు శ్వేతవర్ణము కలిసిన అల్లికలా ఉంది అంతరిక్షం.
“సిగ్నల్‌కి చాలా దగ్గరగా వచ్చాం. నేను ఈ కోడ్ బ్రేక్ చేయగలుగుతున్నాను. ఇది మహా శూన్యం నుంచే వస్తోంది” అన్నాడు, సైంటిస్ట్ చైతన్య ముఖర్జీ, ఆమె పక్కన నిల్చుని.
“ఖచ్చితంగా ఎక్కడనుంచి వస్తోందో తెలుసుకోవాలంటే మనం మహా శూన్యంలోకి ప్రవేశించాలి.”
“అది ప్రమాద మేమో ఆలోచించుకోండి కెప్టెన్!” అన్నాడు అతను.
అదితి సామాన్యమైన అంతరిక్ష యాత్రికురాలు కాదు. ఎంతో అనుభవం కలిగినది. ఆమె వయసు సుమారు అరవై సంవత్సరాలు ఉంటాయి. ఎంతో ధైర్యం కలిగి, అంతరిక్ష రహస్యాలు పరిశోధించాలని జీవితం అంకితం చేయాలి అనే ఆదర్శానికి కృతనిశ్చయంతో పదిహేను సంవత్సరాల వివిధ అంతరిక్ష ప్రయాణాల అనుభవం కలిగి ఉంది.
“ఎన్ని కాంతి సంవత్సరాలో ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు దీని యొక్క ప్రారంభ స్థలం ఇక్కడ మనకు దొరికింది. ఇది ఎందుకు వస్తోందో దాని అర్థమేంటో ఈ శూన్యంలో నుంచే ఎందుకు వస్తోందో తెలుసుకోవాలంటే మనం తిరిగి వెళ్లొద్దు. ముందుకే పోదాం. మహాశూన్యం లోకి ప్రవేశిద్దాం!” అన్నది గంభీరంగా అదితి.
“ఆ లోపలి ‘వాయిడ్’ అంటే శూన్యంలో నౌకని ప్రవేశ పెట్టి కొంత మంది నావికులని షటిల్ ద్వారా పంపి అన్వేషణ చేద్దాం. అందరినీ అలర్ట్ చేద్దాం. క్రయోజనిక్ (అతి శీతల వాతావరణం. దూర ప్రయాణాలకి కాంతి సంవత్సరాల పాటు అంతరిక్ష యాత్రికులని ఈ వాతావరణంలో నిద్రలో వుంచుతారు. దీనివల్ల శరీరంలో రసాయనిక ప్రక్రియలకి తక్కువ శక్తి సరిపోతుంది) నిద్రల నుంచి అందరిని లేపండి! మీ కంప్యూటర్స్ మీద వచ్చే సిగ్నల్‌లో మీరు కనిపెట్టిన సిగ్నల్ కోడ్ అర్థం చూపించండి, పదండి!” అన్నది.
మూడవ సహస్రాబ్ది లోని ఒక ఇంజినీరింగ్ అద్భుతం నక్షత్ర దర్శిని అంతరిక్ష పరిశోధన నౌక. రూపానికి పనికి అమోఘమైన కలయిక. దాని బహిర్ కవచం కాంతివంతంగా మెరుస్తుండే ఒక ప్రత్యేకమైన లోహంతో తయారు చేయబడింది. అంతరిక్షపు కఠినమైన వాతావరణానికీ, కాంతి వేగానికి దగ్గరలో ప్రయాణిస్తుంటే దానికి తట్టుకునే లాగా, అంతరిక్షపు శూన్యం వల్ల నిరోధకత తగ్గినప్పుడు, మళ్లీ గ్రహాలకు నక్షత్రాలకు దగ్గరైనప్పుడు వాతావరణంలోనూ ఆ తర్వాత అంతరిక్షంలో వచ్చే మార్పులు సమస్యలు తట్టుకునే విధంగా నిర్మించారు.
నౌక లోపల మధ్య భాగంలో ఒక బ్రిడ్జి మీద షిప్ యొక్క కమాండ్ సెంటర్ నిర్మించబడింది. ఇక్కడ అధునాతనమైన ‘హోలోగ్రాఫిక్’ ప్రతిబింబాలుగా కంప్యూటర్ సమాచారం కనిపిస్తుంది. వివిధ రకాల శబ్దాలు, చిత్రాలు, వీడియోలు సంజ్ఞలతో, నోటి మాటలతో కంట్రోల్ చేయగలిగే తెరలు, మాడ్యూల్స్‌తో ఉంటుంది. నౌకని అన్ని చోట్లా కృత్రిమ మేధ గమనిస్తూ ఉంటుంది. కృత్రిమ మేధ స్పీకర్ల ద్వారా నావికులకి సూచనలు హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సలహాలు ఇస్తుంది. షిప్ మధ్యలోని కింద భాగంలో అంతరిక్ష యాత్రికులు నివాసం ఉండే చిన్న గదుల్లో ‘హేబిటేషన్ మాడ్యూల్స్’ ఉంటాయి. వీటిల్లో టాయిలెట్లు, పడకలు, వ్యక్తిగత కంప్యూటర్లు ఉంటాయి. వినోదానికి వీడియో సినిమాలు, సంగీతపు రికార్డులు వినే సాధనాలు ఉంటాయి. సహజంగా వుండే వాతావరణం కోసం ‘హైడ్రోపోనిక్’ ఉద్యానవనాలు చెట్లతో పువ్వులతో నిండి ఉంటాయి. కొన్ని చోట్ల ‘ఏరోపోనిక్’ ఉద్యానవనాలు ఉంటాయి. హైడ్రోపోనిక్ ఉద్యానవనాలు అంటే అంతరిక్షంలో కృత్రిమ ఎరువులతో నీటితో పెంచబడే పూల మొక్కలు కూరగాయ మొక్కలు తోటలు మొదలైనవి. ఇవి మానవ వ్యర్థపదార్థాల నుంచి రీసైకిల్ చేసి ఎరువుగా వాడి పెంచబడిన తోటలు. ఏరోపోనిక్ అంటే వేలాది మొక్కల వేళ్లు గాలిలో ఉంటే వాటి మీద ఎరువులు బలాన్నిచ్చే ఖనిజాలు నిండిన నీరు పంపులతో చల్లబడుతూ ఉంటుంది. ఈ మొక్కల నుంచి ఆహారం తయారు చేసుకుంటూ ఉంటారు. ఇది కాకుండా కనీసం కొన్ని సంవత్సరాలకు సరిపడిన డబ్బాల్లో జాగ్రత్తపరచబడ్డ ఆహారపదార్థాలు ఉంటాయి.
షిప్ మెంబర్లలో కొంతమంది వంట చేసే వాళ్ళు కూడా ఉంటారు. మధ్య భాగంలో, యాత్రికుల నివాసాలు ఆ పక్కన పరిశోధన చేసే ప్రయోగశాలలు ఉన్నాయి వివిధ రకాల గ్రహాల వాతావరణాలు వాటిలో వాతావరణం నివసించే జీవులు, వాటి నిర్మాణం తెలుసుకొని కనిపెట్టి నిర్ణయించే శాస్త్రం క్జీనోబయాలజీ. ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్షంలో కనిపించే కొత్త వింత విషయాలు పరిశోధించే పరిశోథకులని క్జీనో బయాలజిస్ట్ అంటారు.
చివరలో హ్యాంగర్లు, అంటే వాటిలో చిన్న పరిశోధన ప్రయాణ నౌకలు ఉండే స్థలాలు ఉన్నాయి. ఈ హ్యాంగర్లలో డ్రోన్లు, స్పేస్ షటిల్స్ లాంటి చిన్న వాహనాలు పార్కింగ్ చేయబడి ఉంటాయి. ఇవి పెద్ద నౌక నుంచి డాకింగ్ పోర్ట్‌ల ద్వారా అప్పుడప్పుడు ఇతర గ్రహాల వాతావరణంలోకి పరిశోధనలు చేయడానికి లేక అక్కడ పరిస్థితులు చూసి మళ్ళీ వచ్చి చేరటానికీ ఉపయోగిస్తారు.
నక్షత్రదర్శిని ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజన్లతో ఇంత దూరం కాంతి వేగంతో ప్రయాణిస్తుంది? ఎక్కువగా క్వాంటం పార్టికల్స్, అధిక శక్తివంతమైన అణువుల కంటే చిన్నవైనవి, వాటి శక్తిని వాడుకుంటున్నారు. వాటి నుంచి శక్తి సృష్టించి కాంతి ప్రయాణం చేయగలిగే ఇంజన్లు తయారు చేశారు. ఇవి ముఖ్యంగా అతి దూర ప్రాంతాలకు నౌకను నడిపిస్తాయి. దూర ప్రయాణానికి సబ్ ఫోల్డ్ స్పేస్ ఇంజన్లు ఒక ప్రత్యామ్నాయంగా వాడతారు. ఇవి స్పేస్ టైమ్‌ని వంచి ఎన్నో వేల కాంతి సంవత్సరాలు కొన్ని భూమి సంవత్సరాల సమయంలో ప్రయాణించగలవు. ఇంకా వార్మ్ హోల్స్ సృష్టించి స్పేస్‌ని టైమ్‌ని వంచి సుదూర అంతరిక్ష ప్రాంతాలని దగ్గరగా కలిపి అక్కడకు ప్రయాణించగలవు. ఇదిగాక విశ్వంలోని డార్క్ మేటర్ నుంచి అంతులేని శక్తి సృష్టించి సరఫరా చేసే రియాక్టర్లు ఉన్నాయి. రియాక్టర్లలో నౌకకి శక్తి నడిపేందుకు, పరిశోధనకు, నౌక లోపల మానవులకి తగిన ఆక్సిజన్ ఉండే వాతావరణం, భూమ్యాకర్షణ పోలిన శక్తిని సృష్టించగలిగే కలిగించే ఏర్పాటు ఉంది. చివరిగా గెలాక్సీలు వివిధ నక్షత్రాల కాంతి నుంచి కూడా శక్తిని సృష్టించగలిగే సోలార్ విండ్ ప్యానల్స్ కొన్ని వేల పరదాలు పైకప్పులో ఉన్నాయి. ఏదైనా ‘సూర్యుడు’ అంటే నక్షత్రం దగ్గరికి వచ్చినప్పుడు వాటిని ఆన్ చేసుకొని శక్తిని పొందవచ్చు. ఇదంతా సహస్రాబ్దిలోని అద్భుత సాంకేతిక ప్రగతి.
అంతరిక్ష ప్రయాణంలో దాడి చేసి అపాయం కలిగించ గలిగే రేడియేషన్, లేక వివిధ రకాల వింత ప్రాణులు, తెలియని పార్టికల్స్, తెలియని శక్తి కలిగిన ఆయుధాలన్నింటినీ ఎదుర్కొనే శక్తి ఈ నౌకకి ఉంది. నౌకకి ఈ ఎనర్జీ షీల్డ్‌లు కవచంలా పని చేస్తాయి. ప్లాస్మా టర్రెట్స్ అనే ఆయుధాలు దాచిపెట్టే చోటులో ప్లాస్మా గన్స్‌తో పనిచేసే ఆయుధాలు ఇక్కడ ఉంటాయి. అవి నిలకడగల పునాది మీద నిలబడి ఉంటాయి. అటూ ఇటూ తిప్పి శత్రువులను ధ్వంసం చేయగలిగే ఆధునిక ఆయుధాలు. అవి డైరెక్షన్ మార్చుకుంటూ శత్రువులను విధ్వంసం చేయగలవు. వీటికి కూడా శక్తి అణు రియాక్టర్లు, డార్క్ మేటర్ రియాక్టర్ వల్ల వస్తుంది. అంతరిక్షంలో షిప్‌కు ఎదురుగా వచ్చే శిథిలాల ముక్కలు (space debris), శత్రు నౌకలు, ఉల్కలూ, ఇతర రకాల టార్గెట్స్‌ని శక్తివంతంగా ఎదుర్కోగలవు.
అలాంటి ‘నక్షత్రదర్శని’కి ప్రస్తుత ముఖ్య కెప్టెన్‌గా అదితి బ్రిడ్జి మీద శాస్త్రవేత్తలతో హోలోగ్రాఫిక్ కంప్యూటర్ తెరల మీద పెద్ద శబ్దంతో వస్తున్న సిగ్నల్ దృశ్యాలను చూస్తోంది. ప్రతీ క్షణానికి శబ్దం ఎక్కువై తెరల మీద అక్షరాలు సంఖ్యలు, కొశ్ఛన్ మార్క్ లాంటి చిహ్నాలు, కామాలు, డాలర్స్ లాంటి సింబల్స్‌తో సందేశం మరీ దగ్గరగా వస్తున్నట్లు అనిపిస్తోంది.
“ఇది మహా శూన్యం మధ్య నుంచే వస్తోంది” అన్నది నౌకలోని కృత్రిమ మేధ స్త్రీ కంఠ స్వరంతో. “అపాయం.. అపాయం.. గుర్తు తెలియని సిగ్నల్!!! జాగ్రత్త వహించండి.!”
జీనో బయాలజిస్ట్ రాబర్ట్ రెడింగ్టన్ అమెరికా దేశస్థుడు.
“నేను బ్రేక్ చేయగలిగాను. పురాతనమైన మానవజాతి లాంటి జాతి నుంచి వచ్చిన సందేశం ఇది. పూర్తి వివరాలు తెలియాలంటే మనం ‘ది గ్రేట్ వాయిడ్’ అనే మహా శూన్యంలోకి వెళ్లి విశ్లేషించాలి” అన్నాడు.
“నిజానికి శూన్యం కాదు లోపల ఏముందో తెలియదు. అక్కడ ఏదో పెద్ద నిర్మాణం ఉంది. చాలా పెద్దగా కొన్ని వేల కిలోమీటర్ల పొడవున వున్న ఆకారంలో నుంచి సిగ్నల్ వస్తోంది” అంది కృత్రిమ మేధ.
“అర్థం ఏమైనా తెలిసిందా రాబర్ట్?” అని అడిగింది అదితి.
“నాకు అర్థమైనంత వరకు అది పాలపుంతలోని గెలాక్సీ కాలనీలకి ఒక హెచ్చరిక. ‘ప్రమాదం, ఒక మహా ప్రమాదం ముంచుకొస్తోంది’ అని చెబుతోంది. ఎలా ఎప్పుడో తెలియదు కానీ. అతి త్వరలో!”
“ఏమిటది?”
ఇప్పుడు బ్రిడ్జి మీద పదిమంది అంతరిక్ష నావికులు చేరి కెప్టెన్ చుట్టూ నిలబడి కంప్యూటర్ తెరవైపు చూడసాగారు.
“ది రిఫ్ట్” అన్నది కృత్రిమ మేధ. కృత్రిమ మేధ ముద్దు పేరు ఆల్ఫా.
“అంటే ఏమిటో ఆల్ఫా, నీకు తెలిస్తే క్లియర్‌గా చెప్పు” విసుగ్గా అంది అదితి. ఆల్ఫా మాట్లాడలేదు.
రాబర్ట్ గొంతు సవరించుకున్నాడు. “తమ నాగరికత ‘ది రిఫ్ట్’ అనబడే ఒక విశ్వపు శక్తి వల్ల నాశనమైంది అనీ, దాన్ని తప్పించుకోవటానికి ఒక పెద్ద అంతరిక్ష కాలనీ లాంటి నౌకను తయారు చేసి పారిపోవటానికి ప్రయత్నిస్తూ మహా శూన్యంలో చిక్కుకుపోయాం” అనీ చెప్తున్నారు. “మీరంతా జాగ్రత్తగా ఉండాలి! అతి త్వరలో పాలపుంత మధ్యకి కూడా వచ్చి ఈ మహాశక్తి ‘రిఫ్ట్’ మీ గ్రహ కాలనీలను నాశనం చేస్తుంది. జాగ్రత్త! అని అర్ధమైంది” అన్నాడు.
నమ్మశక్యంగా లేదు.
“రిఫ్ట్ అంటే?”
“కాస్మిక్ ఉత్పాతం! అణువుల కంటే ఇంకా చిన్నవైన క్వాంటం అణువుల భయంకరమైన సుడిగుండాల లాంటి ఒక కాస్మిక్ వైపరీత్యం. అది కొన్ని కాంతి సంవత్సరాల వేగంతో మనకు దూరంగా మనం వచ్చిన దారిలోనే వచ్చింది. నేను దాని కో-ఆర్డినేట్స్ కనుగొనగలిగాను. అది మహా శూన్యం నుంచి వస్తోంది.”
“అంటే మనం, అదేమిటో, మహా శూన్యంలోకి ప్రవేశించి చూడాల్సిందే!” అన్నది అదితి.
“వద్దు! వద్దు!” అన్నాడు నికోలాయ్. అతను ఒక రష్యన్. “దానికి బదులు మనం భూమి లోని కంట్రోల్ సెంటర్‌కి మెసేజ్ ఇద్దాం. వాళ్ళు ఏం చేయాలో ఆలోచిస్తారు.”
హోలోగ్రాఫిక్ కంప్యూటర్ మీద అక్షరాలు సంఖ్యలు యూనివర్సల్ టైమ్‌లో చూపిస్తున్నాయి మూడు సంవత్సరాల 10 నెలల 20 రోజుల మూడు గంటల 40 సెకండ్స్కి ‘రిఫ్ట్’ అనే క్వాంటం తుఫాను పాలపుంత మధ్యలో ఉన్న భూమి కాలనీలోకి చేరుకోవడానికి సమయం.. అంతకు ముందే కొన్ని గ్రహ కాలనీలు ధ్వంసమై కూడా వుండవచ్చు.
అన్ని వేల కాంతి సంవత్సరాల దూరం ఆ సందేశం భూమికి వెళ్లాలంటే దానిని ‘క్వాంటం ఎంటాంగిల్ మెంట్’ ప్రక్రియ ద్వారా పంపాలి. కనీసం ఒక నెల పడుతుంది. తిరిగి సమాధానం రావడానికి మరో నెల. కెప్టెన్ అదితి ఆలోచిస్తోంది. ఠీవిగా, పొడుగ్గా, చామనచాయతో, కత్తిరించిన నెరిసిన జుట్టుతో, తీవ్రమైన ముఖకవళికలతో భారతీయ మూలాలు కలిగి ఉంది అదితి. తన విధులకి అంకితభావంతో పనిచేసే నాయకత్వ లక్షణాలున్న ఒక అంతరిక్ష యాత్రికురాలు.
“మనం అంతరిక్ష ప్రమాదాల అన్వేషణ, ఇంకా నివారణకు వచ్చాం. మన పాలపుంత కంట్రోల్ సెంటర్‌కి సందేశం పంపుదాం. కానీ ది వాయిడ్ అనబడే మహా శూన్యంలోకి ప్రవేశించాల్సిందే! వీలుంటే రిఫ్ట్ అనే ఉత్పాతాన్ని ఎదుర్కొని అది ఎలాంటిదో తెలుసుకోవాల్సిందే. ఎంత త్యాగమైనా సరే చేసి దాన్ని అరికట్టాలి..!”
మిగిలిన కొందరు వద్దని ఏదో చెప్పబోతే “నో దట్ ఈజ్ ఏన్ ఆర్డర్!” అంది అదితి దృఢంగా. “మహాశూన్యం లోకి ప్రవేశించండి! కో-ఆర్డినేట్స్ రెడీ చేయండి. అందర్నీ శీతల నిద్ర నుంచి బయటకు తీసుకొచ్చి అప్రమత్తం చేయండి!” అంది.
“ఎమర్జెన్సీ! ఎమర్జెన్సీ! కోడ్ ఆరెంజ్!” – అంటూ ఆల్ఫా నౌక స్పీకర్లలో నుంచి అందరికీ చెప్పసాగింది. నక్షత్రదర్శిని అనబడే స్టార్ గేజర్ మరికొన్ని యూనివర్సల్ గంటల కాలంలో ది వాయిడ్ అనే శూన్యం లోకి ప్రవేశించింది.
***
మహా శూన్యంలోకి ప్రయాణించిన కొన్ని గంటలకే నిజానికి అది శూన్యం కాదని తెలిసిపోయింది. సిగ్నల్ తీవ్రతలు మరింత తీవ్రమై అవి వచ్చే చోటు కూడా తెరమీద కనబడింది. ధ్వని తరంగాలకు ప్రతిధ్వని వచ్చిన సమయం బట్టి దాని ఉనికి దూరం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు.
“దీనికి ‘ఎకో’ లేక ప్రతిధ్వని అని పేరు పెట్టవచ్చు” అంది కెప్టెన్ అదితి. అది కొన్ని వందల కిలోమీటర్ల పొడవున్న పెద్ద దీర్ఘ చతురస్రాకార ఆకృతి. దగ్గరకు వచ్చినాక అది నిజానికి ఒక బ్రహ్మాండమైన నల్లని తిమింగలం ఆకారంలో ఉన్న అంతరిక్ష నౌక లాంటి నిర్మాణం అని తెలిసింది.
“నలుగురు టీం మెంబర్లు షటిల్ లో వెళ్లి దాంట్లో ఏం ఉందో చూడండి” అజ్ఞాపించింది కెప్టెన్.
ఒక షటిల్ నక్షత్రదర్శిని పక్క భాగంలోని డాకింగ్ ద్వారం నుంచి బయలుదేరి ప్రతిధ్వని వైపు వెళ్లింది.
మళ్లీ ముఖర్జీ వచ్చాడు.
“కెప్టెన్! ఆ సందేశం పూర్తిగా అర్థమవుతోంది. ఇది ఒక పురాతన నాగరికత. ఆ జాతి పేరు వేరియన్స్. వారు పాలపుంత గెలాక్సీలో ఉన్న PV132 చుట్టూ ఉండే వల్కన్ అనే గ్రహం వారు. వారి నక్షత్ర కుటుంబానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక అస్తిత్వ ప్రమాదం ఏర్పడింది. అంతరిక్షం నుంచి ఒక మహా ద్రవ్యరాశి పార్టికల్స్ ఏర్పడి వారి నాగరికతని గ్రహాలని విధ్వంసం చేయబోతోందని వారు కనుక్కొన్నారు. అది తప్పించుకోటానికి వాళ్ళు కొన్ని శతాబ్దాల కృషి చేసి ఈ ప్రతిధ్వని అనే మహా అంతరిక్ష నౌకను తయారు చేసి విశ్వంలోకి పారిపోయారు. అయినా కానీ వారిని ఆ ద్రవ్యరాశి వెంటాడి నిర్మూలించింది. దాని పేరే ది రిఫ్ట్. ‘ది రిఫ్ట్ అనే మహాశక్తి గెలాక్సీలోని ఇతర గ్రహాలని ధ్వంసం చేయడానికి రాబోతోంది. జాగ్రత్త’ అనే ఈ సందేశం అర్థం. ఇది వివరంగా విడగొడితే ఈ శక్తి గురించిన వివరాలు గణిత భాషలో సమీకరణలు కో-ఆర్డినేట్లు లభిస్తున్నాయి. ఈ సిగ్నల్ గెలాక్సీ అంతటికీ వెళ్తోంది. దీని మూలం ఇక్కడి నుంచే వస్తోంది” అన్నాడు.
కెప్టెన్ అదితి అదే సమయంలో షటిల్ టీమ్ నుంచి వచ్చిన కాల్ అందుకుంది.
“కెప్టెన్ ఇది చాలా అద్భుతం! ఆశ్చర్యంగా ఉంది. ఎన్నో గదులు, మానవ నివాసాలు, కొన్ని చోట్ల శిథిలమైన పరికరాలు, ఈ జాతి మానవుల అస్థిపంజరాలు కూడా ఉన్నాయి. జనరేటర్లు ఇంకా శక్తినిస్తున్నాయి. ఎందుకంటే లైట్లు వెలిగి ఆరుతున్నాయి. కానీ ప్రాణవాయువు లేదు. ఈ ప్రతిధ్వని నిర్మాణం అంతా ఒక పెద్ద సమూహం పారిపోవడానికి ఏర్పాటు చేసినట్లు ఉంది.”
కెప్టెన్ అదితి అంది. “అవన్నీ పరిశీలించి చూడండి! ఆ వినాశకర శక్తిని ఎలా నిర్మూలించాలో అధ్యయనం చేయాలి. ఈ విషయం మన భూమి అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపాలి. ఎలా?”
ఆ తర్వాత నక్షత్రదర్శిని బ్రిడ్జి మీద నావికులందరూ ఎన్నో సమావేశాలు జరిపారు. కొందరు “వెనక్కి వెళ్లిపోదాం!” అన్నారు. కొందరు “ప్రతిధ్వని లోకి వెళ్లి ఆ రిఫ్ట్ని ఎక్కడ ఉందో ఎలా దాని ఉనికిని కనిపెట్టాలో తెలుసుకోవాలి!” అన్నారు.
“ముందు ఒక సందేశం తయారు చేసి గెలాక్సీలో అన్ని గ్రహాలకి పంపండి! ప్రతి యూనివర్సల్ గంటకి అది ప్రసారం కావాలి. కనీసం కొన్ని సంవత్సరాలకు దశాబ్దాలు అయినా అది అన్ని గ్రహ కాలనీలకీ చేరుతుంది. ఈ లోపల మనం ఏం చేయాలో ఆలోచిద్దాం.”
నక్షత్ర దర్శిని నుంచి ఈసారి గెలాక్సీకి చెందిన 150 భాషల్లో మళ్లీ మరో సిగ్నల్ ఇవ్వబడి ప్రసారం అవటం ప్రారంభమైంది. అథునాతనమైన క్వాంటం కమ్యూనికేషన్స్ ద్వారా అయినా సరే అది వివిధ గ్రహాలకు చేరడానికి కొన్ని దశాబ్దాల నుంచి శతాబ్దాలు పట్టొచ్చు.
***
“ఈ ప్రతిధ్వని అనబడే నిర్మాణంలో కృత్రిమ మేధ కూడా ఉంది. అయితే ఇది పాడై పోయి పురాతనమైంది. ఏవేవో గజిబిజి సందేశాలు ఇస్తోంది” అన్నాడు చెంగ్ లీ కృత్రిమ మేధస్సు నిపుణుడు. ఇతను ప్రతిధ్వనిని పరిశోధన చేయడానికి వెళ్లిన జట్టు నాయకుడు. “ఈ ఏఐ పాడైపోయినట్లు ఏదేదో గజిబిజిగా మాట్లాడుతోంది కెప్టెన్! ఈ గోడల్లోంచి రకరకాల సందేశాలు వస్తున్నాయి. మాకు అర్థమైంది ఏమిటంటే ‘రిఫ్ట్ గెలాక్సీని నశింపజేస్తుంది. పారిపోండి పారిపోండి త్వరగా’ అంటోంది. ఇంకా అది ఇక్కడే ఉంది. కేవలం ఇక్కడ తాత్కాలికంగా నిరోధించబడి ఉంది అని నాకు అనుమానంగా ఉంది.”
కొద్దిసేపటికే మళ్లీ సందేశం. “కెప్టెన్! ఇది ఒక అంతరిక్ష నౌకనే. దీని మధ్య భాగం నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి. ఇక్కడ దీని మధ్య భాగంలో న్యూక్లియర్ ఇంజన్లు, క్వాంటం డ్రైవర్లను పోలిన పరికరాల లోంచి శక్తి తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి. ‘ది రిఫ్ట్’ ఇక్కడే బంధించబడి ఉంది అనిపిస్తోంది.”
“మీరు తిరిగి వచ్చేయండి.”అంది కెప్టెన్ అదితి.
***
“‘ది రిఫ్ట్’ అనబడే విధ్వంసక అణువుల శక్తి వైరియన్స్ గ్రహ జాతి వారి ‘ప్రతిధ్వని’ (ఎకో) అనబడే అంతరిక్ష నౌకలో బంధించబడి మహా శూన్యంలో ఉంది. దాన్ని నిర్మూలించడానికి మనం మన దగ్గరున్న అణు రియాక్టర్లని దానిలో పేలిస్తే ఎలా ఉంటుంది!” అన్నది కెప్టెన్ అదితి.
“వద్దు కెప్టెన్! అది ఆత్మహత్యాసదృశం. దానిలోకి న్యూక్లియర్ షటిల్ పంపితే గొలుసు రియాక్షన్ వల్ల మనం అందరం అంతరించిపోతాం!” అన్నాడు చెంగ్ లీ.
“మనం భూమికి కాని ఇతర కాలనీలకి కానీ తిరిగి వెళ్ళి ఇదంతా చెప్పే అవకాశం, కాల వ్యవధి లేదు. చాలా సమయం పడుతుంది. దీనిని నేనే నిర్మూలిస్తాను. ఒక షటిల్లో వెళ్లి అణ్వాయుధాల్ని అక్కడ పేల్చడానికి టైమర్ పెట్టి తిరిగి వేగంగా రాగలను! నాతో ఎవరైనా ధైర్యంగా వచ్చేవాళ్ళు ఇద్దరు రావాలి. రాగలరా?”
నిశ్శబ్దం.
“ఇది ప్రమాదం కెప్టెన్. మీకేమన్నా అయితే? మీరు లేకుండా మేము ఎలా తిరిగి వెళ్తాం? మాకు ఎవరు నాయకత్వం వహిస్తారు?” అన్నాడు చైతన్య ముఖర్జీ.
“నాకైతే ఎవరూ లేరు. ఒంటరిని. గెలాక్సీని కాపాడటానికి నాకేమైనా పర్వాలేదు. మీకు కుటుంబాలున్నాయి. భవిష్యత్తు ఉంది. మీరు నక్షత్రదర్శినిని మహా శూన్యం నుంచి బయటికి తీసుకుని దూరం తీసుకుని వెళ్ళండి. నేను ఒక షటిల్లో ప్రతిధ్వనిలో ప్రవేశించి అణ్వాయుధాలు వున్న రియాక్టర్ని కనెక్ట్ చేసి తిరిగి వేగంగా వస్తాను. మళ్ళీ మీతో డాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను.”
“మీరొక్కరే వద్దు కెప్టెన్! నేనుకూడా వస్తాను.” ముందుకు వచ్చాడు నికోలాయ్. “నేను కూడా” అన్నాడు జాన్ పాల్. నికొలాయ్ ఒక రష్యన్, మరొకడు ఫ్రెంచి జాతీయుడు.
“నేను కూడా వస్తాను” అనబోయిన చైతన్య ముఖర్జీని ఆపింది అదితి.
“చైతన్య ముఖర్జీ! నువ్వు కెప్టెన్‌గా ఉండు! సిగ్నల్స్ కోడ్ బ్రేక్ చేయడం పంపటం నీకే తెలుసు. మీరు తిరిగి వెంటనే వెళ్ళిపొండి. గెలాక్సీలో కాలనీలకి ఈ రిఫ్ట్ని ఎలా ఎదుర్కోవాలో పరిష్కారం తయారుచేసుకోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. శతాబ్దాలు కూడా పట్టొచ్చు. మీరు వారికి చెప్పండి. అదృష్టం ఉంటే నేను తిరిగి వస్తాను.”
మరికొద్ది గంటలకి నక్షత్రదర్శినిలోని పక్క ద్వారంలో నుంచి ఒక చిన్న అంతరిక్ష వాహనం – కెప్టెన్ అదితి, మరి ఇద్దరు అంతరిక్ష యాత్రికులున్న షటిల్ మహా శూన్యంలోకి ప్రవేశించింది. ఆ లోపల నక్షత్రదర్శిని శూన్యం లోంచి బయటకు వచ్చి గెలాక్సీ అంచు నుంచి తిరిగి వెనక్కి వెళ్లే ప్రయాణానికి తిరుగుముఖం పట్టింది.
***
ఎంతో విశాలంగా పొడుగుగా ఉన్న ‘ప్రతిధ్వని’ లోకి షటిల్ ప్రవేశించింది. ఇక్కడ ఏవేవో పెద్ద మోటార్లు తిరిగిన శబ్దాలూ, వెలిగి ఆరే కాంతులూ భయం గొలుపుతున్నాయి. కెప్టెన్ అదితి ప్రతిధ్వని మధ్యలోకి ప్రయాణించి అజ్ఞాపించింది. “రిలీజ్ ది న్యూక్లియర్ డివైజ్ విత్ టైమర్. రన్! కం బాక్! (అణుబాంబు టైమర్ తో పెట్టి వేగంగా తిరిగి రావాలి)”
తీసుకువచ్చిన కొన్ని రియాక్టర్లు, టైమర్, అక్కడ పెట్టి మళ్ళీ తిరిగి పరిగెత్తుకుంటూ వారు షటిల్‌ను చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో షటిల్ నుంచి ఇన్‌ఫ్రారెడ్‌తో టైమర్ ఆన్ చేయడానికి సంకేతం పంపారు అతివేగంగా తిరిగి శూన్యం బయటకు ప్రయాణించసాగారు.
టైమర్ పెట్టడం వల్ల మరికొద్ది గంటల తర్వాత వినాశనం తథ్యం. కానీ వారు శూన్యం ద్వారం నుంచి బయటకు వచ్చిన మరుక్షణంలోనే లోపల రియాక్టర్ పేలింది. కొంచెం ముందుగానే..! భయంకరమైన విస్ఫోటనం జరిగింది. ఆ మంటలు, ఎలెక్ట్రాన్లు, పార్టికల్స్ అతివేగంగా వారి షటిల్‌ని చుట్టుముట్టాయి. కానీ ఆ మంటలు షటిల్ బయటి కవచాన్ని మండించలేకపోతున్నాయి. ఎందుకంటే వాటి కవచం అగ్ని ప్రమాదానికి, రేడియేషన్కీ తట్టుకునేట్లుగా తయారు చేయబడింది. పక్క నుంచే ఆ కిరణాల తాకిడి, ఆ విస్ఫోటనం అతి త్వరగా పాకుతూ నక్షత్రదర్శిని వెనకాలే కూడా వెంబడించసాగింది. ఆ మంటల వేగం నక్షత్రదర్శిని వేగం కంటే అధికంగా ఉంది. షటిల్లో అదితి కెప్టెన్, నికోలాయ్, జాన్ పాల్ హాహాకారాలు చేస్తున్నారు. నక్షత్రదర్శిని పరిశోధనా నౌకను దాని బయటి కవచం (shield) చుట్టూ మంటలు చుట్టుముట్టాయి. దాంట్లో కొంత భాగం ధ్వంసమైంది. ప్రమాదం తప్పించుకోవడానికి కొంతమంది అంతరిక్ష యాత్రికులు షటిల్‌లలో డాకింగ్ పోర్ట్‌ల నుంచి బయటికి వచ్చి వేగంగా దూరంగా పారిపోసాగారు. అవన్నీ నల్లగా అయిపోయిన ఆకారాలతో మంటలు తగిలినా ఎగురుతూనే వెళ్తూ ఉన్నాయి.
“అయ్యో” అంది కెప్టెన్ అదితి. “ప్రతిధ్వని గ్రహాంతర నౌక లోని మహాశక్తిని నిర్మూలించ గలిగామని అనుకున్నాం, కానీ కొంత శక్తి బయటికి తప్పించుకుని రానే వచ్చింది. ఈ షటిల్ లోనే మనం మనల్ని కాపాడుకుని మనని గెలాక్సీ కంట్రోల్ నుంచి, ఎవరైనా వచ్చి రక్షించే దాకా కాలం గడుపుకోగలగాలి.”
ఆమె సహచరులు చెంగ్ లీ, నికోలాయ్ కూడా షాక్ నుంచి తేరుకుని అన్నారు. “ముందుగా దగ్గరున్న గెలాక్సీ రెస్క్యూ ఫోర్స్‌కి భూమిలోని కేంద్రానికి సిగ్నల్స్ పంపుదాం. మనం సౌరశక్తి ప్యానెల్‌తో శక్తిని సృష్టించుకుని ప్రయాణించవచ్చు. మన దగ్గర ఒక నెల రోజుల వరకు మాత్రమే సరిపడా ఆహారం ఉంది. అంతే.” అన్నారు. “మన సహచరులు నాలుగు షటిల్స్‌లో బయటపడ్డారు. వారు కూడా గెలాక్సీ అంతటికీ సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఏం జరుగుతుందో!
ఐతేనే మనం ప్రాణాలకి అపాయం వున్నా, వాటిని పణంపెట్టి గెలాక్సీకి వచ్చే ప్రమాదం కాపాడాము. ఎస్.ఓ.ఎస్ పంపండి. ఎవరైనా వచ్చి రక్షిస్తారనే ఆశతో దైర్యంగా ఎదురు చూద్దాం.”
ఒక పక్క సగం ధ్వంసమైన నక్షత్రదర్శిని దూరమైపోతోంది. కానీ మళ్ళీ విశాలమైన నల్లటి అంతరిక్ష వాతావరణంలోకి నాలుగు షటిల్స్ నుంచి వివిధ రకాల భాషలో కోడ్లతో నలుమూలలలా సిగ్నల్స్ ప్రసారం కాసాగాయి.
SOS, SOS ఎస్.ఒ.ఎస్!!!
పురాతనమైన ఆ సందేశాలు పాలపుంత గెలాక్సీలో అనేక దిశల్లో వెళ్లసాగాయి.
మేము నక్షత్రదర్శిని స్పేస్ క్రూ.. ది రిఫ్ట్ని సమర్థవంతంగా నిర్మూలించాము. కానీ మా నౌక విధ్వంసమైంది. మేము చిన్న షటిల్‌లలో తప్పించుకుని తిరిగి వస్తున్నాము.
త్వరగా వచ్చి మమ్మల్ని కాపాడండి! SOS! SOS!
కొత్త సిగ్నల్స్ మళ్లీ పాలపుంత కాలనీలోకి ప్రయాణం చేయసాగాయి. అవి ఎన్ని కాంతి సంవత్సరాలకి ఎక్కడికి చేరతాయో సరిగ్గా చేరతాయో కూడా తెలియదు. ఆ సిగ్నల్స్ ఎప్పుడు ఏ శాస్త్రజ్ఞులు ఏ అంతరిక్ష కేంద్రంలో కనిపెట్టగలరో తెలియదు. అవి కాంతి వేగంతో ప్రయాణిస్తూ వెళ్తూనే ఉన్నాయి. ఎన్నో రహస్యాలను దాచుకున్న విశ్వంలో కొన్ని మిలియన్స్ గెలాక్సీలలో ఒక్కటి అయిన పాలపుంత అంచు నుంచి కొత్త సిగ్నల్స్ మళ్లీ అన్నివైపులా కొత్త ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. ఎప్పుడో ఎవరికో బోధపడతాయి.
కానీ అదితి ఆమె టీమ్ త్యాగాలు మాత్రం మానవాళికి ఆదర్శంగా మిగిలిపోతాయి.

తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత మధు చిత్తర్వు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన వీరు మెడికల్ థ్రిల్లర్లు రాయడం స్వాభావికం. “ఐ.సి.సి.యూ”, “బై బై పోలోనియా”, “ది ఎపిడమిక్”, “కుజుడి కోసం”, “నీలీ – ఆకుపచ్చ” వంటి నవలలు రచించారు.