శ్రీ వేంకటాచలాధీశం, శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం, శ్రీనివాసమహం భజే।
కలియుగ ప్రత్యక్ష దైవమై సప్తగిరులపై అవతరించిన శ్రీనివాసుడి వైభవాన్ని తరతరాలుగా తమదైన శైలిలో వర్ణించారు – వర్ణిస్తున్నారు. 2005 నుండి 2010 జూన్ వరకు ఆ శ్రీహరి కొలువులో తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను పనిచేసే మహత్తర భాగ్యాన్ని అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఏ.పి.వి.ఎన్. శర్మ కల్పించారు. కృతజ్ఞతాపూర్వకంగా నేను వారి జీవిత చరిత్రను వ్రాశాను. గవర్నరు శ్రీ ఇ.యస్.ఎల్. నరసింహన్ 4 ఫిబ్రవరి న రాజ్‌భవన్ దర్బారు హాలులో ఆ గ్రంథాన్ని ఆవిష్కరించారు. తిరుపతిలో నేను పనిచేసిన అయిదు సంవత్సరాలలో ఏ.పి.వి.ఎన్. శర్మ, కె.వి.రమణాచారి, ఐ.వై.ఆర్. కృష్ణారావులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు. నా స్మృతి పథంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను మీతో పంచుకునే అవకాశం ‘సంచిక’ కల్పించింది.
శ్రీవేంకటాచల క్రీడా పర్వతంపై స్వయంభువుగా దివ్య అర్చావతార రూపంలో శ్రీనివాసుడు కొలువయ్యాడు. కోరిన వరాలిచ్చే రాయడుగా కోట్లాది భక్తుల కొంగుబంగారంగా నిలిచాడు. రాజులు, సామంతులు, జమీందారులు, కోటీశ్వరులే కాక సామాన్య భక్తులు కూడా స్వామి సేవలో తరించారు. ఆధ్యాత్మిక భావజాలంలో భక్తిమయ హృదయంతో ఆలోచించినప్పుడు ఎందరో భక్తశిఖామణులు స్వామికి సమర్పించిన సేవా కైంకర్యాలు గుర్తుకు వస్తాయి.
శ్రీ వేంకటేశ్వరుని లీలలు అనేకం. ఎవరి అనుభూతి వారిది. క్షణకాల దర్శనమాత్ర సంతృప్తితో ఆనంద నిలయం నుండి బయటపడి, ఆ తల్లి వకుళమాతకు నమస్కరించి, పక్కనే తీర్థాన్ని స్వీకరించి, ప్రదక్షిణ మార్గంలో విమాన వేంకటేశ్వరునికి ప్రణమిల్లి, హుండీలో తమ తమ మొక్కులు చెల్లించి, యోగ నారసింహుని దర్శించి. వెండివాకిలి వద్ద భక్తుల తోపుడును తట్టుకొని, ఇంకా ముందుకు సాగి స్వామి ప్రసాదం స్వీకరించి, మహాద్వారం గుండా వెలుపలకు వచ్చి సమీపంలో నిలుస్తాం. అప్పటికి గాని మనలను కమ్మిన తన్మయత్వం నుండి బయటపడం.
ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామికి వజ్రకవచం అలంకారం చేస్తారు. ఈ కవచాన్ని గొప్ప మహారాజులు తయారు చేయించలేదు. ఆ కవచ సమర్పణ వెనుక అద్భుతమైన ఒక వృత్తాంతం దాగి ఉంది. కర్ణాటాంధ్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కృష్ణ దేవరాయలు స్వామి వారిని ఎన్నో మార్లు దర్శించి అనేకాభరణములు కానుకగా సమర్పించాడు. ఆలయ ప్రాంగణంలో రాయలవారు తిరుమల దేవి, చిన్నాదేవులతో కాంస్య విగ్రహ రూపంలో రంగ మండప పరిసరాలలో కనిపిస్తారు.
కర్ణాటకలోని మైసూరు దగ్గర కొల్లెగాల వీరన్న అనే సాధారణ వ్యాపారస్థుడు జీవించేవాడు. స్వామివారు అర్చావతార రూపంలో వెలవడానికి ముందు నిజశరీరంతో కనిపించేవారు. తొండమాన్ చక్రవర్తికీ, వసుదానునికీ రాజ్య భాగ పరిష్కారం విషయంలో స్వామి సహకరించాడు. ఆపైన శిలా రూపంలో వెలిశాడు. భక్తులకు కేవలం స్వప్న సాక్షాత్కారం చేసేవాడు. వీరన్న పరమ వైష్ణవ భక్తుడు. ఆయనకు శ్రీమన్నారాయణ కలలో కన్పించి –
“వీరన్నా, నాకు నీవు వజ్రాల కవచం చేయించి సేవించు” అని సెలవిచ్చాడు. వీరన్న నిద్ర నుండి లేచి, భార్యకు బంధుమిత్రులకు కల గురించి చెప్పాడు. భగవంతుడు ప్రసాదించిన ఐశ్వర్యం వుంది, భక్తి భావం వుంది. బంగారంతో వజ్రాలు పొదిగిన కవచాన్ని నగిషీలు చెక్కించి తయారు చేయించాడు. కవచం చేతిలోకి వచ్చింది.
వీరన్న మనసులో అనేక ఆలోచనలు మెదిలాయి. ఈ కవచాన్ని ఏ ఆలయంలో, ఏ విగ్రహానికి సమర్పించాలి అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నాడు. తమ గ్రామంలోని ఆలయ అర్చకులను సంప్రదించాడు. వారి సలహా మేరకు ఒక శుభముహూర్తంలో ‘మేల్కోట్’ లోని శ్రీ చెలువ నారాయణ స్వామి ఆలయానికి తీసుకెళ్లి అర్చకులకు అప్పగించాడు. వారు ఆగమోక్త విధానంలో ఉత్సవమూర్తికి ఆ వజ్రకవచాన్ని అలంకరించే ప్రయత్నం చేశారు. ఆ విగ్రహానికి అది సరిపడలేదు. అర్చకులు ఆ కవచాన్ని కళ్ళకద్దుకొని వీరన్నకు ఇచ్చివేశారు. “శ్రీమన్నారాయణా! నా వంటి సామాన్య భక్తుని పరీక్షిస్తున్నావా? స్వామీ నీ లీల ఏమి? నా కైంకర్య లోపమా?” అని ఉద్విగ్న హృదయంతో కన్నీళ్ళ పర్యంతమైనాడు. ఆలయంలోని పండితుడు ఒక సలహా ఇచ్చాడు.
“వీరన్నా! నీ భక్తి తాత్పర్యాలలో లోటు లేదు. శ్రీరంగంలోని రంగనాథుని దివ్యమూర్తులకు ఈ కవచం అలంకారప్రాయమవుతుంది. అక్కడికి వెళ్ళు” అన్నాడు. వీరన్న కర్ణాటక నుండి బయలుదేరి తమిళనాడు లోని శ్రీరంగం చేరుకున్నాడు. కావేరి నదీస్నానం చేసి శ్రీరంగనాథుని ఆలయప్రాకారంలోకి భక్తితో అడుగు మోపాడు. మనసంతా సంతోషంతో నిండిపోయింది. శ్రీరంగనాథుని ఉత్సవమూర్తికి తాను చేయించిన వజ్రకవచం అలంకరించబోతున్నారు.
ఆలయంలో ఉత్సవమూర్తికి అలంకారం చేస్తున్నారు. వీరన్న అర్చకులకు నివేదించాడు. ఆలయ ధర్మాధికారి పర్యవేక్షణలో ఆ వజ్రకవచాన్ని తొడిగే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ‘హతవిధీ’ అంటూ వీరన్న అపరాధ క్షమాపణ కోరుతూ లెంపలు వాయించుకున్నాడు. “రంగనాథా ఏమిటీ పరీక్ష?” అని వాపోయాడు.
అర్చకులు సముదాయించారు. “వీరన్నా, భగవంతుడి నిర్ణయం మరోలా ఉంది. నీ శ్రమా, కైంకర్యము వృథా పోవు” అని ఓదార్చారు. మార్గాంతరంగా కంచిలోని వరదరాజ స్వామికి సమర్పించనున్నారు.
వీరన్న మది మదిలో లేదు. ‘తీర్థయాత్రలలో ఇది మూడో మజిలీనా? స్వామికి కైంకర్యం జరుగుతుందా?’ అని సందేహం. అయినా విప్రోత్తముల ఆదేశానుసారం కంచి వెళ్లి కామాక్షీదేవికి ప్రణమిల్లాడు. “తల్లీ! నన్ను దీవించి కృతార్థుడిని చెయ్యమ్మా” అని మొరపడ్డాడు. అక్కడినుండి విశాల ప్రాంగణంలోని వరదరాజ స్వామి ఆలయ ప్రవేశం చేశాడు. మానసిక తృప్తి లభించింది. అప్పుడే ఉత్సవమూర్తులను తిరువీధుల సంచారానికి అర్చకులు అలంకరిస్తున్నారు. అక్కడి పెద్దలు అలంకార భట్టార్కు కవచాన్ని అప్పగించామన్నారు. రెండు రాత్రులు ఇక్కడ గడపమన్నారు. వీరన్న పరితప్త హృదయంతో అక్కడ గడిపాడు. ఉదయం సాయంకాలం వరదరాజ స్వామి నిత్య పూజలో పాల్గొన్నాడు. “వరదా, భక్తవరదా” అని చేతులెత్తి నమస్కరించాడు. అలంకారం చేస్తున్న అర్చక స్వామి ఎంత ప్రయత్నించినా కవచం అమరలేదు. వెంటనే అప్రయత్నంగా ఆయన నోట వెంట “ఇది తిరుమలలోని మలయప్పస్వామికి సరిపోవచ్చు. తిరుమల వెళ్ళు వీరన్నా” అనే మాటలు వెలువడ్డాయి.
ఏడుకొండల స్వామి దర్శనానికి బయలుదేరాడు.
వీరన్న అలిపిరి మెట్ల దారిలో నడక ప్రయాణం కొనసాగించాడు. తిరుమాడ వీధులలో ప్రదక్షిణంగా తిరిగి పుష్కరిణి స్నానం చేసి వచ్చి వజ్రకవచంపై ఆ జలాలు భక్తితో చల్లాడు. వినయ వినమ్రుడై, ఆలయ పేష్కార్కు దానిని అందించాడు. శుభముహూర్తంలో మలయప్పస్వామికి దానిని వారు అలంకరించారు. అతికినట్టుగా సరిపోయింది. వీరన్న ఆశ్చర్యపోయాడు.
“గోవిందా! గోవిందా!” అంటూ తన్మయత్వంతో గంతులు వేశాడు. ఈ వజ్రకవచం కన్నడ లిపిలో ‘కొల్లేగల్ వీరన్న శెట్టి సేవ’ అని వ్రాసి ఉంది ఎంతటి అదృష్టవంతుడో వీరన్న.
జ్యేష్ఠ మాసంలో చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన రోజు మొదలుపెట్టి పూర్ణిమ నాటితో ముగిసేలా మూడు రోజులు వైఖానసాగమోక్తంగా జూన్ మాసంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. కంకణ భట్టర్ జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నాడు మొదలు పెడతారు. పదిహేను రోజుల ముందుగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకు గత సంవత్సరం సమర్పించిన స్వర్ణ కవచాన్ని సడలిస్తారు.
మొదటిరోజు మాధ్యాహ్నిక ఆరాధన పూర్తికాగానే ఉభయ దేవేరులతో కూడిన స్వామికి సంపంగిశాలలోని యాగశాలలో అష్టోత్తర శత కలశ స్నపన తిరుమంజనం 108 కలశాలతో నిర్వహిస్తారు. దేవస్థానం పక్షాన శ్రీ కార్యనిర్వహణాధికారి దంపతుల చేత సంకల్పం చెప్పిస్తారు. భక్తులు కూడా ఆర్జిత సేవగా జ్యేష్ఠాభిషేకంలో మూడు రోజులు పాల్గొనవచ్చు. ముందుగా బుక్ చేసుకోవాలి.
ఉత్సవమూర్తులకు 12 రకాల ద్రవ్యాలతో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు నీళ్ళు, చందన ద్రవంతో విశేష స్నపన తిరుమంజనం జరుగుతుంది. తొలి రోజున వీరన్న సమర్పించిన మనోహర వజ్రకవచాన్ని అలంకరించి తిరుమాడ వీధులలో ఉత్సవంగా ఉభయ దేవేరి సమేత స్వామిని ఊరేగిస్తారు. రెండో రోజు సాయంత్రం ముత్యపు కవచం అలంకరించి ఊరేగిస్తారు. మూడోరోజు స్వర్ణ కవచంతో మలయప్పస్వామి వీధులలో ఊరేగిస్తారు. ఈ విధంగా వీరన్న ఎన్నో ఏళ్ల క్రితం సమర్పించిన కవచం స్వామివారి సేవకు ఉపయోగపడడం వీరన్న అదృష్టం.
(సశేషం)
తొలుత లెక్చరర్‌గానూ, తరువాత ఆకాశవాణి, దూరదర్శన్లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించి అడిషనల్ డైరక్టర్ జనరల్, దూరదర్శన్గా ఉద్యోగ విరమణ చేశారు. పద్యంపై మక్కువ కలిగిన అనంతపద్మనాభరావు 150కి పైగా అవధానాలు చేశారు. కథలు, నవలలు వ్రాశారు. అనువాద బహుమతులు పొందారు. ‘దాంపత్య జీవన సౌరభం’, ‘మన పండుగలు’, ‘తలపుల తలుపులు’, ‘అలనాటి ఆకాశవాణి’, ‘అంతరంగ తరంగం’, ‘కథామందారం’, ‘గోరింట పూచింది’ వంటి పుస్తకాలను వెలువరించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పలు అవార్డులు పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™