[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల డా. చిలుకూరి శాంతమ్మ గారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]


“గురువు తానయినను హరుని తా జూపును
బ్రహ్మలోకమితడు పాఱజూపు
శిష్యునరసి తట్టి చీకటి బాపు రా
విశ్వదాభిరామ వినురవేమ!”
ప్రపంచంలో అత్యంత వృద్ధురాలైన ఫిజిక్స్ ప్రొఫెసర్ 97 సంవత్సరాల వయసులో అత్యంత ఉత్సాహముతో బోధన, పరిశోధన, ప్రచురణ కొనసాగిస్తున్న మహానుభావురాలు. స్ఫూర్తిదాయక వ్యక్తి,. స్త్రీశక్తికి ప్రతీక డా. చిలుకూరి శాంతమ్మగారు. భారతదేశంలోనూ మరియూ బ్రిటన్ రాయల్ సొసైటీ వారిచే ఫిజిక్స్‌లో ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ డిగ్రీ అందుకున్న మొదటి మహిళగా గుర్తింపు. 18 సంవత్సరాల వయసులో ఇంటర్మీడియట్ పరీక్షలో ఆల్‌రౌండర్‌గా ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ అందుకున్నారు. 87 సంవత్సరాల వయసులో వెటరన్ సైంటిస్టుల విభాగంలో 2016లో గోల్డ్ మెడల్ అందుకున్నారు. గత 6 సంవత్సరాలుగా తన స్వంత ఊరైన విశాఖపట్టణం నుండి 60 కిలోమీటర్లు ప్రయాణించి విజయనగరం లోని సెంచూరియన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్ధులకు పాఠం చెప్పి సాయంత్రానికి అందరు ఉద్యోగస్థులలాగే ఇల్లు చేరుతారు. అత్యంత నిరాడంబరంగా, అమాయకమైన మోముతో, మన పక్కింటి బామ్మగారిలాగా కనిపించే ఈ స్త్రీమూర్తిని చూస్తే ఆమె సాధించిన డిగ్రీలు, సమర్పించిన పరిశోధనాపత్రాలు, పొందిన పురస్కారాలూ, అంతర్జాతీయ సదస్సుల కోసం చేసిన విదేశీ యాత్రలూ, ఒకటేమిటి సరస్వతీదేవీ ప్రతిరూపం అనిపిస్తారు.


మానవ జీవితములో బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అనే నాలుగు దశలు ఉంటాయి. ఈ నాలుగు దశలనూ దాటి శతవత్సరాల పండుగ జరుపుకోబోయే ఈ అరుదైన శాస్త్రవేత్త జీవితము ఎందరికో ఆదర్శము. ఆమె గురించీ, భౌతికశాస్త్రము పట్ల గల ఇష్టముతో సాగించిన జీవితములో సాధించిన విజయాలను గురించి, ఈనాటి లోకం పోకడల పట్ల ఆమెకు గల అభిప్రాయాలను గురించి మన ‘వందే గురుపరంపరామ్..’లో తెలుసుకుందాము..
శాంతమ్మగారు 1929వ సంవత్సరం మార్చి 8వ తేదీన శ్రీమతి వనజాక్షమ్మ శ్రీ వంగల సీతారామయ్య దంపతులకు మచిలీపట్నంలో జన్మించారు.


మాతృమూర్తి వనజాక్షమ్మ
తండ్రి గురించి వివరాలు అడిగితే అమాయకమైన ఆమె మొహం జాలి కలిగేటట్లుగా పెట్టి “నేను మా నాన్నను చూడనే లేదు. మా అమ్మ కడుపులో ఉండగానే ఆయన స్వర్గస్తులయ్యారు.” అని చెప్తూ ఉంటే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
మార్చి 8వ తేదీన జన్మించడం కాకతాళీయం కావచ్చును కానీ.. ప్రపంచ మహిళా దినోత్సవం భవిష్యత్తులో ఇలాంటి వారికోసం జరుపుకోవాలని భగవంతుని అభిప్రాయం కావచ్చు.
‘నారు పోసిన వాడు నీరు పోయడా?’ అని పెద్దలు ఆశావహంగా ఒక మాట అంటూ ఉంటారు. అది శాంతమ్మగారి జీవితంలో రుజువయింది.
వీరి చిన్నాన్నగారు వంగల నరసింహ దీక్షితులు. అతను జిల్లా జడ్జిగా పనిచేసేవారు.


శ్రీ వంగల నరసింహ దీక్షితులు (చిన్నాన్న)
వారి కుటుంబంతో పాటుగా వనజాక్షమ్మగారిని, వారి పెద్ద కుమారుడిని, శాంతమ్మగారిని సుమారు 30 సంవత్సరాల పాటు తన కుటుంబం తోనే ఉంచుకున్నారు. తన పిల్లలతో సమానంగా వీరికి విద్యాబుద్ధులు నేర్పించారు.
అందుకే శాంతమ్మగారు వారి పట్ల కృతజ్ఞతతో ఇలా అంటారు.
“ఈ రోజు నేను ఏదైతే ఉన్నానో దాన్ని తీర్చిదిద్దినది మా చిన్నాన్నగారు. వారి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఎందుకంటే ఇంట్లో వారి కుటుంబమూ, మేము కలిపి మొత్తం 13 మందిమి ఉండేవారం. అంతమందికి అన్ని అవసరాలు తీర్చడం అనేది మా పిన్ని యొక్క చిన్నాన్న యొక్క గొప్పదనం మరియు సహృదయం. మాటలలో చెప్పలేనిది. అంతేకాదు. అందరినీ పెద్ద చదువులే చదివించారు. కుటుంబంలోని సభ్యుల మధ్య ఒక బంధం ఉండేది.”
అతను డిస్ట్రిక్ట్ జడ్జిగా బదిలీలపై అనేక ఊళ్ళు తిరుగుతూ ఉండేవారు. అందువలన పిల్లల ప్రాథమిక విద్య అనేక ఊళ్ళలో జరిగింది. కడప, కర్నూలు, నెల్లూరు, మదనపల్లి, రాజమండ్రి మొదలైన ఊర్లన్నీ వారి కుటుంబంతో పాటు వీరిని కూడా తీసుకు వెళుతూ ఉండేవారు.
వారు బదిలీపై విశాఖపట్నం వచ్చినపుడు శాంతమ్మను మిసెస్.ఎ.వి.ఎన్.కళాశాలలో ఎం.పి.సి.గ్రూపుతో ఇంటర్మీడియట్ లో చేర్చారు. 1945-47 రెండు సంవత్సరాలు కష్టపడి, చదివారు. పబ్లిక్ పరీక్షల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీలు కలిపి ఆల్‌రౌండర్‌గా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు. గోల్డ్ మెడల్ లభించింది. మహారాజా విక్రమదేవవర్మ నుండి భౌతిక, రసాయనిక శాస్త్ర విభాగంలో బంగారు పతకం అందుకున్నారు.
అప్పటి విద్యావ్యవస్థ చాలా ప్రశాంతంగా ఉండేది. అన్ని సబ్జెక్టులకు కలిపి 25 మంది ఉంటే అందులో ఆడపిల్లల సంఖ్య ఒకరిద్దరే!. ఇంట్లో పెద్దల పట్ల చాలా శ్రద్ధాభక్తులతో ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి మద్రాసురాష్ట్రముతో కలిసి ఉండేది.
ఈమెకు గణితం చాలా ఇష్టమైన సబ్జెక్టు అయినప్పటికీ ఫిజిక్స్‌ని ఇష్టంగా స్వీకరించారు.
తరువాత ఆంధ్ర యూనివర్సిటీ నుండి బి.ఎస్.సి. ఫిజిక్స్‌లో ఆనర్స్ చేశారు. తర్వాత ఎం.ఎస్సీ చేసారు. 1956 నుండి ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ బోధిస్తున్నారు. ఆమె మొదటి సంపాదన వంద రూపాయలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ.
మొదటినుండి ఆమెకు ఫిజిక్స్‌లో మెళకువలను తెలిపి తర్ఫీదు ఇచ్చిన గురువు ప్రొఫెసర్ కె. రంగధామరావుగారు (1898 -1970) వారి పట్ల ఆమె ‘గురువే దైవం’ అన్నట్లుగా వినమ్రతతో శిరసు వంచుతారు.


ప్రొఫెసర్ కె. రంగ ధామ రావుగారు (1898- 1970)
శాంతమ్మగారు నిరంతర పరిశోధకురాలు.
1956 నాటికి పీ.హెచ్.డి. కూడా పూర్తి చేశారు. బ్రిటన్ రాయల్ సొసైటీ వారి పరిధిలో ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. భారతదేశంలో ఆ రోజుల్లో ఫిజిక్స్‌లో డాక్టరేట్ చేసిన మొట్టమొదటి మహిళగా కూడా ఈమె రికార్డుని సాధించారు.
శాంతమ్మగారు ఆంధ్ర యూనివర్సిటీలో బి.ఎస్.సి ఆనర్స్ విద్యార్థులకు ఫిజిక్స్ బోధిస్తున్న సమయంలోనే చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆంధ్రా యూనివర్సిటీలో చేరారు. 1951 నుండి 1958లో వివాహం జరిగే వరకూ వారి మధ్య అమలిన నిష్కళంక ప్రేమ వర్ధిల్లుతూ చిగురులు వేస్తూనే ఉంది.
శాస్త్రిగారు తెలుగులో ఎం.ఏ. చేశారు, ‘తెలుగు సామెతలు’ అనే అంశముపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలోనే తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసారు. వీరు కృష్ణాజిల్లా వడ్డూరు గ్రామానికి చెందిన చిలుకూరివారు. శ్రీమతి సూరమ్మగారు, శ్రీ చిలుకూరి వీరావధానులుగారు దంపతులు. వీరికి అయిదుగురు మగపిల్లలు కాగా సుబ్రహ్మణ్యశాస్త్రిగారు మూడవవారు. ముగ్గురు ఆడపిల్లలు.


డాక్టర్ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు (1928- 2009)
చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సభ్యులు. శాంతమ్మ గారిని తీర్చిదిద్దారు. ఈరోజు ఆమెలో ఉన్న నిర్మలత్వం, నిష్కామత్వం, నిస్వార్ధత వారు తీర్చిదిద్దిన శిల్పమే శాంతమ్మ గారు.
తెలుగు ప్రొఫెసర్ అయిన డాక్టర్ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఆమెకు ఉపనిషత్తులను గురించి పరిచయం చేశారు. ఆమె వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈనాటి తరానికి ఉపయోగపడే విధంగా కొన్ని అంశాలుగా అనేక శీర్షికలతో ఒక పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు.
అమెరికా దేశపు వైస్ ప్రెసిడెంట్ భార్య ఉషా వాన్స్ కూడా అక్కడివారే! ఆమె చిలుకూరి వారి అమ్మాయి. శాంతమ్మగారు చిలుకూరి వారి కోడలు.
శాంతమ్మగారు చదువుకున్న కాలంలో లేని ఆధునిక సాంకేతిక పరికరాలూ వాటిని వినియోగము చేయడంలో ఆమె ముందుంటారు. అదేవిధంగా మారుతున్న పాఠ్యప్రణాళికలతో ఏ మాత్రమూ ఇబ్బంది పడకపోవడము ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
సబ్జెక్టు మీద ఇష్టం ఉన్నప్పుడు పాత కొత్త అని ఏమీ ఉండదు. సబ్జెక్టు మూలంలో సూత్రాలు అలాగే ఉంటాయి. అప్లికేషన్ లోనే మార్పు వస్తుంది. కొత్తగా వచ్చిన విషయాలను కూడా కలుపుకుంటూ వెళ్లడమే. ఆధునిక కాలంలో ముందుకు దూసుకు వెళుతున్న సాంకేతికతతో సమన్వయం చేసుకుంటూ విద్యార్ధులకు నచ్చేలా పాఠాలు చెప్పగలుగుతున్నారు.
ఈ సందర్భంగా ఆమె యూఎస్ఏ; యూకే; సౌత్ కొరియా; కెనడా మొదలగు అనేక దేశాలు పర్యటించి వంద రోజులు గెస్ట్ లెక్చరర్‌గా, విజిటింగ్ ప్రొఫెసర్‌గా కొంతకాలం వెళ్లి ఎంతోమందితో భౌతికశాస్త్ర విషయాలపై చర్చలు జరిపి, తన అనుభవాలను పంచుకున్నారు. పరిశోధన ఇంకా జరగవలసిన ఆవశ్యకతను తెలియచేసారు.
డా.శాంతమ్మగారు భౌతికశాస్త్రంలో పరిశోధన చేసిన అంశాలు:
ఆమె సబ్జెక్టు స్పెక్ట్రోస్కోపీ. డా.రంగధామరావుగారి శిక్షణలో అటామిక్ స్పెక్ట్రోస్కోపీ మరియు మోలెక్యులర్ స్ట్రక్చర్ మీద విశేష పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలకుగాను అనేకమైన అవార్డులు వచ్చాయి. వాటిలో వెటరన్ సైంటిస్టుల విభాగంలో 2016లో గోల్డ్ మెడల్ అందుకున్నారు.
వైబ్రేషన్ ఆప్టికల్ స్పెక్ట్రోస్కోపీ మీద పరిశోధన కొనసాగింపు చేస్తున్నారు.
రామన్ ఎఫెక్ట్; లేజర్ టెక్నాలజీ; పెట్రోల్ లో మలినాల గుర్తింపు; మొదలగు వాటిపై పరిశోధనలు చేసి, విశ్వవిద్యాలయాల్లో పత్ర సమర్పణలు చేశారు.
ఆంధ్రయూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో రీసెర్చరుగా లెక్చరరుగా, రీడరుగా ప్రొఫెసరుగా సుమారు 33 సంవత్సరములు అనేకమైన బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ కూడా 1989లో అక్కడే చేయడం జరిగింది. తిరిగి గౌరవ అధ్యాపకురాలిగా మరొక 6 సంవత్సరాలు కొనసాగింపుకి అవకాశం ఇచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అకడమిక్ సెనెట్ మెంబర్‌గా సుమారు 9 సంవత్సరములు ఉన్నారు.
ఆమె పర్యవేక్షణలో 17 మందికి పి.హెచ్.డీలు; నలుగురికి ఎం.ఫిల్. డిగ్రీలు; వచ్చాయంటే అదంతా విద్యార్థుల గొప్పతనమే! అంటారామె చిరునవ్వుతో.
సీనియర్ స్కాలర్ మరియు సీనియర్ రిసెర్చ్ ఫెలో అయిన డా. శాంతమ్మగారిని ప్రధాన పరిశోధకురాలిగా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ (C.S.I.R.); యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (U.G.C.); డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (D.S.T.; & D.O.E.) నిర్వహించే అనేకమైన ప్రాజెక్టులలో పరిశోధకురాలిగా నియమించబడ్డారు.
అమెరికాలోని ఓహియో యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, కొరియా మరియు శ్రీలంకలలో జరిగే అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లకు ఆహ్వానించి, ఆమె అనుభవాలను తెలుసుకుంటూంటారు.
చిన్నప్పటినుండి గణితంపై గల ఇష్టంతో ఆమె చేసిన కృషి:
కర్మ సిధ్ధాంతాన్ని నమ్మే ఆమె తనకు నిర్దేశింపబడిన ఏ పని అయినా భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. గణితంపై ఇష్టంగా పనిచేసే అవకాశం వచ్చింది.
ఆది శంకరాచార్యులవారు భారతదేశంలో తూర్పున పూరీలో, దక్షిణాన శృంగేరిలో, పడమర ద్వారకలో, ఉత్తరాన బదరీనాథ్‌లో చతురామ్నాయ పీఠాలు ప్రతిష్ఠించారు. పూరీలోని శంకర పీఠానికి చెందిన పీఠాధిపతులు శ్రీ జగద్గురు శంకరాచార్య భారతీకృష్ణ తీర్థ స్వామీజీ. వారు సంస్కృతము, ఫిలాసఫీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, హిస్టరీ, సైన్స్ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అంతేకాక అధర్వణ వేదములో గల వేదిక గణితం ఆధారంగా అనేకమైన గణిత సూత్రాలను 16 ప్రధాన సూత్రాలను 13 ఉప సూత్రాలు మొత్తం 29 సూత్రాలను ప్రతిపాదించారు.
పూరీ మఠానికి చెందిన శ్రీ జగద్గురు శంకరాచార్య వేదిక్ గణితంలోని పద్ధతులు సూత్రాలు మొదలైనవి క్రమపరిచారు. డా.శాంతమ్మగారు వీటి ఆధారంగా ఉపన్యాసాలకు అనుగుణంగా ఒక క్రమ పద్ధతిలో అనేకమైన ఉదాహరణలతో బేసిక్ మరియు అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి నోట్స్‌ను తయారుచేసి, సిద్ధపరిచి ఉంచారు. దీనికి కావలసిన అనేకమైన ఆర్థిక ఇబ్బందులను కూడా భగవంతుని దయవలన ఎదుర్కోగలిగారు. ఈ పనులు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్న శ్రీ ఎం.ఆర్. అప్పారావుగారు తరువాత డాక్టర్ ఎం. గోపాలకృష్ణారెడ్డి గారు వీటికి సంబంధించిన ఉపన్యాసాలు భారతదేశంలోనూ ఇతర దేశాలలోనూ కూడా ఇవ్వడానికి సంకల్పించారు. అనేకమైన వర్క్‌షాపులు పెట్టి, ఈ అంశాల మీద చర్చలకు ఏర్పాట్లు చేశారు. ఎంతోమంది గణిత విద్యార్థులు మాత్రమే కాక ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు దీనివలన ఉపయోగం పొందుతున్నారు. శ్రీ వంగల నరసింహ దీక్షితులు వారి శ్రీమతి అలివేలు స్మారక ధార్మిక సంస్థ ఈ ప్రాజెక్టుకి అవసరమైన సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.
స్వామివారి ఆశీస్సులతో ఆ సూత్రాలు ఆధారంగా ‘విలోకనం’ పేరుతో ఏడు పుస్తకాలను డా. శాంతమ్మగారు రచించారు. ఈ వేదిక గణిత ప్రాజెక్టును పుస్తకరూపంలో డాక్టర్ గోకుల కుమారి ఘనశ్యామదాసు షా ముద్రణకు సహాయం చేయగా, భారతీయ విద్యా కేంద్రం విశాఖపట్నం వారు ఈ పుస్తకాలను ప్రచురించారు.
ఈ ఏడు పుస్తకాలు యొక్క ముఖ్య ఉద్దేశం
గణితంలోని అనేక సమస్యలు సాధారణంగా మనం మేధను ఉపయోగించి పరిష్కరించుకోగలిగే విధంగా ఉంటాయి. ఈ గణిత సూత్రాల ఆధారంగా అనేక విధానాలలో సాధారణ నియమాలను ప్రతిపాదించారు. ఆ వేదకాలం నాటి సూత్రాలను ఈనాడు ప్రస్తుత విద్యా విధానంతో పోలిక చూసుకుంటూ కొత్త పద్ధతుల ద్వారా చెప్తున్నారు. ఈ పుస్తకము ఉపాధ్యాయులకు, పరిశోధకులకు మాత్రమేకాక గణితంపై అభిరుచి కలిగిన ఎవరైనా అర్థం చేసుకోగలిగినంత సులువుగా తయారుచేశారు. ఇందులోని సూత్రాలను ‘నిఖిలం’ అనే పేరుతో అందచేయడం వలన చాలా సులభం అయింది. ఈ విధానంలోని సూత్రాలు కంప్యూటర్ కి కూడా అనువైనవిగా ఉన్నాయి.
ఈనాడు భారతదేశ విద్యావ్యవస్థకు అవసరమైనవి 5 ప్రాథమిక విషయాలు.
అవి 1. సంస్కృత శిక్షణ 2. సంగీత శిక్షణ 3. శారీరక శిక్షణ 4. యోగ శిక్షణ 5. నైతిక శిక్షణ. వీటిలో మొదటిదైన సంస్కృతశిక్షణ అమలు చేయడానికి ఈ ప్రాజెక్టు అందరి భాగస్వామ్యంతో పూర్తి అయింది. వేదిక సూత్రాలు మీద ఆధారపడిన ఈ విధానము ఒకటి కంటే ఎక్కువ సూత్రాల ఆధారంగా అత్యంత సులువుగా విద్యార్ధులు చేయగలగడం. ఈ విధానము నూతనమైనది కనుక ఇందులో కూడా కష్టమైన విషయాలపైన మరికొంత పరిశోధన జరపవలసిన అవసరాన్ని తెలియజేస్తుంది.
ఉదాహరణ
In every stage of division one may look to the verification and validity of the general formula of Quotient × divisor + Remainder is equal to Dividend.
ఈ సప్త పుస్తకాలలో చెప్పబడిన విషయాలు
Operational techniques to workout Multiplication, Division, Squaring, Square roots, Cubing, Simple equations, Simultaneous equations of two or more variables, Factorization, Quadratic equations, Fractions, Trigonometry, Recurring Decimals, Divisibility, Partial Fractions, Solid geometry, Co-ordinate geometry, Differentiation, Integration, Logarithms, Combined operations, polynomials and power series etc are detailed in series of Lecture notes.


గణితం పట్ల అభిరుచి గల ఎవరైనా కొంత స్వయంకృషితో ఇవి చేసుకోగలిగే విధంగా సులభంగా మనకు అందించారు. వీటిని మన పాఠ్యప్రణాళికలో కూడా చేర్చినట్లైతే దేశంలో గణితమేధావులైన మానవ వనరు ఒక గొప్ప సంపదగా రూపొందుతారు అనడంలో సందేహం లేదు. ఈ విధానంలో నేర్పేందుకు అవసరమైన శిక్షణ ఉపాధ్యాయులకు అందించవలసిన అవసరం కూడా ఉన్నది.
ఆమె తన సుదీర్ఘ జీవనప్రయాణంలో ఎదుర్కున్న ఒడిదుడుకులను వాటిని అధిగమించిన విధానాన్ని ఇలా తెలియజేశారు..
“పుట్టకముందే తండ్రిని పోగొట్టుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా తండ్రి అంటే తెలియకుండా 97వ సంవత్సరంలో అడుగు పెట్టాను.
ఆర్.ఎస్.ఎస్. భావజాలంగల వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను. అతను ఆజానుబాహువు. మంచి వక్త. నాకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చారు. నా గురించి ఆలోచించేవారు. ఒకసారి అతని అవసరానికి నా సంపాదనలోంచి కొంత పైకము అందిస్తే తీసుకోవడానికి ఇష్టపడలేదు. బహుశా అతను సంఘ కార్యకలాపాలలో తిరుగుతున్నపుడు మా అవసరాలకు ఉపయోగపడుతుందనే పెద్ద మనసుతో అతను తీసుకోకపోయి ఉండవచ్చును. కానీ ఆ సమయంలో ఆయనను అర్థం చేసుకోలేక మాట పట్టింపుతో 30 ఏళ్ల వయసులో మా అమ్మను తీసుకొని వేరే వెళ్ళిపోయాను. అప్పటినుండి అమ్మ నా దగ్గరే ఉండేది. తరువాత అతను కూడా వచ్చేవారు. మా అమ్మ 104 సంవత్సరాలు బ్రతికింది. ఆర్.ఎస్.ఎస్. కార్యకలాపాలలో అతను తీరికలేకుండా తిరిగేవారు. స్వయంసేవక్‌గా ప్రారంభించి, ప్రాంతీయ, క్షేత్రసంఘచాలకునిగా, కేంద్ర కార్యకారిణి సదస్యునిగా చురుకుగా ఉంటూ, వేలాదిమందికి స్ఫూర్తిని ఇస్తూ ఉండేవారు.
1975లో శ్రీమతి ఇందిరాగాంధీగారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించారు. ఆ సమయంలో నా భర్తను అరెస్టు చేశారు. రెండు సంవత్సరాలు ఆయన కారాగారంలో ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత నా వద్దకు వచ్చారు. మేము ప్రత్యేకము పండుగలు అంటూ ఏమి చేసుకునేవారం కాము. ఆయన ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడే పండగ.
2000 సంవత్సరంలో నాకు రెండు మోకాళ్ళకు కీళ్ళ మార్పిడి జరిగింది. సుమారు 2004 నుండి అతనికి అనారోగ్యం ప్రవేశించింది. అతను మంచము నుండి లేవలేని పరిస్థితి. యూనివర్సిటీ దగ్గర ‘వివేకా హాస్పిటలు’లో ఉండేవారు. పూర్తిగా మంచానికే పరిమితమైన పరిస్థితుల్లో అతడిని దగ్గర ఉండి చూసుకుందికి ‘భరద్వాజ’ అనే అబ్బాయిని నియమించుకున్నాము. అతనికి రాత్రి పగలు సేవ చేశాడు ఆ అబ్బాయి.
హాస్పిటల్ కి దగ్గరగా మాకు చాలా విలువైన పెద్ద జాగా ఉండేది. దానిని ఆ హాస్పిటల్లో పనిచేసే నర్సులకు క్వార్టర్స్ కింద కట్టించమని వివేకా హాస్పిటల్ వారికి రాసి ఇచ్చేశారు. మాకు పిల్లలు లేనందువలన శాస్త్రిగారిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్న భరద్వాజను మా అబ్బాయిలాగ చూసుకున్నాము. సుమారు 80 సంవత్సరాల వయసులో 2009లో శాస్త్రిగారు దేహం చాలించారు.
భరద్వాజకి తల్లిదండ్రులు లేనందు వలన చదువు చెప్పించి, ఉద్యోగం వేయించి, పెళ్లి చేశాము. అతనికి ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఒకరికి ఒకరం ఆసరాగా మేమంతా కలిసే ఉంటున్నాము.” అని తన వైవాహిక జీవితాన్ని గురించి చెప్పారు.


డా. శాంతమ్మ గారు మనుమలతో ఆనందంగా
మన ప్రాచీన సాహిత్యమైన వేదాలు, పురాణాలలోని నిగూఢమైన విషయాలను చదివి తేలిక భాషలో పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు. సుబ్రమణ్యశాస్త్రిగారు కూడా అనేకమైన పుస్తకాలు రాశారు. వాటన్నిటినీ కూడా అనువదించి, ప్రచురణలు చేయించి, అందరికీ అందుబాటులో ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. తనకు అవసరమైన పనులన్నీ ఇప్పటికీ ఆమె కంప్యూటరుపై స్వయంగా చేసుకుంటారు.
సుమారు 2000 సంవత్సరంలో డా.శాంతమ్మగారికి రెండు మోకాళ్లు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో శస్త్రచికిత్స తప్ప గత్యంతరం లేకపోయింది. శస్త్ర చికిత్స జరిగిన కొద్దిరోజులకే మానసిక ధైర్యముతో రెండు కర్రలు పట్టుకొని ఎవరి సహాయం లేకుండానే నడవడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు అనాయాసంగా విశాఖపట్టణము నుండి విజయనగరం దాకా ప్రయాణం చేయగలుగుతున్నారు. నడవగలుగుతున్నారు. యూనివర్సిటీలో అన్ని అంతస్తులకు కూడా లిఫ్ట్‌లో వెళ్లి తరగతి గదిలోకి నడుచుకుంటూ వెళ్ళి, బోర్డుమీద సుద్దముక్కతో రాస్తూ పాఠం చెప్పగలరు. కంప్యూటర్లో డిస్క్‌లు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కూడా పాఠం చెప్పగలరు.


విద్యార్థులకు భౌతిక శాస్త్ర ప్రయోగాలు చేసి చూపిస్తూ


బోధన అంటే ఉపాధ్యాయుడు సుద్దముక్కా, నల్లబల్ల


తరగతి గదిలో నిలుచుని పాఠం చెప్పాలన్న విలువను పాటిస్తూ
డా.శాంతమ్మగారు ఎందరికో మార్గదర్శి. అభిమానించే అధ్యాపకులు, విద్యార్ధులు అనేకమంది. ఆమెకు ఇష్టమైన విద్యార్థులెవరో తెలుసుకోవడమంటే సులభం కాదు. ఎవరయినా ప్రశ్నిస్తే “75సం.లుగా అధ్యాపక వృత్తిలో ఉన్నాను. ఇన్ని తరాలుగా వెళ్ళిన పిల్లలందరూ నాకు అభిమానులే! అందరూ నాకు ఇష్టులే!” అంటారామె.
ఆమె అభిమానించే విద్యార్ధిని ‘నేను’ అంటూ ముందుకువచ్చిన వ్యక్తి డా. జి.ఎస్.ఎన్.రాజుగారు.
ఆమె పరీక్ష పేపర్లు మూల్యాంకనము చేసేటపుడు చాలా కఠినంగా చూస్తారు. అందువలన ఆమె సబ్జెక్టులో ఎక్కువ మందికి మంచి మార్కులు వచ్చేవి కావు. కానీ ఒక విద్యార్థికి మాత్రం నూటికి తొంభైనాలుగు మార్కులు వచ్చాయి. అప్పటినుంచి ‘అభిమాన విద్యార్థిని’ అని అనుకున్నారు. అతనే ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్స్లర్ గా పనిచేసిన డాక్టర్ జి.ఎస్.ఎన్.రాజుగారు. ఆంధ్రయూనివర్సిటీలో అతని పదవీకాలం ముగియగానే సెంచూరియన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్‌గా నియమింపబడ్డారు. అప్పుడు డా. శాంతమ్మగారు కూడా శిష్యునిపై గల అభిమానంతో సెంచూరియన్ యూనివర్సిటీకి ఆనరోరియంపై ప్రొఫెసర్ గా చేరిపోయారు. ఇప్పటికి సుమారు ఆరు సంవత్సరములు పూర్తి అయింది. అతను ఇప్పుడు ఛాన్స్లర్ కూడా అయ్యారు.


డాక్టర్ శాంతమ్మగారి అభిమాన విద్యార్థి సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ జి ఎస్ ఎన్ రాజుగారు
డా.శాంతమ్మగారు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై గల అభిమానంతో వాటిని అధ్యయనం చేస్తూ ఉంటారు. గీతాప్రెస్ గోరఖపుర్ వాళ్ళు “గీతాదైనందిని” పేరుతో డైరీలు ప్రచురిస్తారు. ఒక సం. ఆమెకు ఆ డైరీ అందినది. ప్రతిరోజూ ఎంతో శ్రధ్ధతో ఆమె రోజుకొక శ్లోకం భావం చదువుతూ గీతా సారాన్ని అవగతం చేసుకున్నారు. తాను తెలుసుకున్న భగవద్గీతను ‘Bhagavadgeetha-The divine Directive’ పేరుతో ఆంగ్లంలోనికి అనువదించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంస్కృత ప్రొఫెసరుగా పదవీవిరమణ చేసిన శ్రీ అక్కుభొట్లుశర్మగారు ఈ పుస్తకాన్ని అనువాదము చేసినపుడు తన అమూల్యమైన సలహాలు ఇచ్చి, పుస్తకానికి ముందు మాట రాశారు. ఆ పుస్తకాన్ని తన ప్రియ శిష్యుడైన డాక్టర్ జి.ఎస్.ఎన్.రాజుగారికి అంకితం ఇవ్వడం అతని వ్యక్తిత్వానికి, ఆమె నిరాడంబరతకు చిహ్నం.


డా. శాంతమ్మ గారి చేతుల మీదుగా భగవద్గీత ఆంగ్లానువాదం అందుకుంటూ రచయిత్రి
‘నడిచే ఎన్సైక్లోపీడియా’
డా.శాంతమ్మగారి యొక్క క్రమశిక్షణ, అంకితభావం, కష్టపడే తత్వం సహ అధ్యాపకుల ముందు, విద్యార్థుల ముందు ఉన్నతంగా నిలబడతాయి. ఆమె ఎన్నడూ తరగతిగదిలోనికి ఆలస్యంగా అడుగుపెట్టలేదు. అందుకే విద్యార్థులు అంటారు. “మేము డాక్టర్ శాంతమ్మగారి క్లాస్ ఎప్పుడు మిస్ అవ్వము అని. సబ్జెక్టు విషయంలో ఆమె ఎందరికో రోల్ మోడల్. ‘నడిచే ఎన్సైక్లోపీడియా’ అని” అంటారు ఆమె విద్యార్థులు అభిమానంగా.


సెంచూరియన్ యూనివర్సిటీ విజయనగరం
సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్స్లర్ అయిన డాక్టర్ జి.ఎస్.ఎ.న్ రాజుగారు ప్రపంచంలో అత్యధిక సంవత్సరములు ఫిజిక్స్ విద్యాబోధన చేసిన ప్రొఫెసర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం డా. శాంతమ్మ గారి పేరు ప్రతిపాదించి పంపించారు. ఆమెకు పోటీ ఎవరూ లేరు.
విశ్రాంతి తీసుకునే వయసులో శ్రమించడం ఎందుకని? అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు.
“పంచే కొద్దీ పెరిగేది విజ్ఞానం” అంటారామె. నేర్చుకున్న జ్ఞానం ఎక్కడకు పోదు. మనం ఇతరులకు ఉపయోగపడతాము.
గత 20 సంవత్సరాలుగా వేదిక్ మ్యాథమెటిక్స్ మీద గల ఇష్టంతో అభిమానంతో కృషి చేస్తున్నారు. వేదిక్ మ్యాథమెటిక్స్‌లో పీ.హెచ్.డి. చేస్తున్న ఒక అబ్బాయికి గీతం యూనివర్సిటీలో సహాయకురాలిగా ఉన్నారు. గీతం యూనివర్సిటీ వారు అనరోరియం ఇస్తూ కో-ప్రొఫెసర్‌గా నియమించుకున్నారు. వేదిక్ గణితంలోని 29 గణిత సూత్రాలను డిస్క్ లో పెట్టి ప్రొజెక్టర్ లో అందరికీ చూపిస్తుంటారు.
ఉద్యోగం ప్రారంభ రోజులలో రోజుకి 6 క్లాసులు బోధించేవారు. పదవీ విరమణ చేశాక ఇప్పుడు వారానికి ఆరు క్లాసులు బోధిస్తున్నారు.
E=MC. R=(av/is)h- బోర్డుపై సుద్దముక్కతో ఆమె రాసిన అక్షరాలు, వేసిన చిత్రాలూ చూస్తూంటే ఆమె జీవితంలో ఇంకా మిగిలి ఉన్న లక్ష్యం ఏమిటి అని తెలుసుకోవాలని అనిపిస్తుంది ఎవరికైనా.
గత 75 సం. లుగా విద్యార్థులకు బోధిస్తున్నా అలుపెరుగని బాటసారిలాగా బోధిస్తున్న ఆమె గొంతులో వయసురీత్యా వచ్చిన మార్పు తప్ప ఇంకేం మార్పు తెలియదు. తరగతి గదిలో ఆమె ఒక క్లాస్ రెండు గంటలు తీసుకుంటారు. అందుకోసం ఇంటిదగ్గర రెండు గంటలు ఆ సబ్జెక్టు మీద పనిచేస్తారు. రేపు తరగతిలో బోర్డు మీద ఏమి రాయాలి? లేదా ప్రజెంటేషన్‌లో ఏ డిస్కులు చూపించాలి? అన్నది ముందుగానే సిద్ధమై ఉంటారు.
పాఠం పూర్తి అయిన తర్వాత సాధారణంగా విద్యార్థులకు ఎక్కువ సందేహాలు ఉంటాయి. అవన్నీ ఆమె చుట్టూ చేరి వాళ్లు ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే ఓపిగ్గా వారికి వచ్చేంతవరకు బోధిస్తారు.


డా. శాంతమ్మ గారు బోధనకు బయలుదేరుతూ
ఇంక విద్యార్థులలో ఉండే తేడాలు సహజము. సుమారుగా తరగతి గదిలో 50 మంది ఉంటే ఒక 20మంది చాలా శ్రద్ధగా వింటారు. అప్పుడప్పుడు చాలా అల్లరి చేస్తారు వాళ్ళు.
ఇంక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసుకుంటే సిలబస్ చాలా బాగుంటుంది. కానీ అది ఎప్పుడు ఫలిస్తుంది అంటే చెప్పేవాళ్లు, వినేవాళ్లు, వాతావరణం ఈ మూడు కలిస్తే మంచి ఫలితం వస్తుంది.
టీచింగ్‌లో వచ్చిన మార్పులు పద్ధతులు మారాయి. సెల్ఫ్ డిసిప్లిన్ వలన జీవితంలో విజయాన్ని సాధించగలం ఇంట్రాస్ఫెక్షన్ నిర్విరామంగా మనలను మనం ప్రశ్నించుకోవడం ద్వారా మనం చేసే పనిలో గాని చేయబోయే పనిలో గాని స్వార్థం ఏదైనా ఉంటే అది మనకు కనబడుతుంది. అప్పుడు దానిని తొలగించుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా చేయవలసిన పనిని పూర్తి చేస్తుంది.
స్త్రీలపట్ల అమితమైన గౌరవము:
మహిళల గురించి ఆమెకు ఉన్నత భావాలు ఉన్నాయి. మహిళలు అంటే ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. స్త్రీలకు సహనము, శ్రమ, ఓర్పు, నేర్పు, క్షమ, దయ, కరుణ వంటి కొన్ని ప్రత్యేక దైవీశక్తులు ఉన్నాయి. పరిస్థితుల వలన తనకున్న ప్రత్యేక శక్తులను దిగజార్చుకుంటున్నది.
స్త్రీశక్తి ఇప్పుడు సమాజానికి చాలా అవసరం అదే సమయానికి ఆమెకు సమాజంలో రక్షణ కరువవుతోంది. అందువలన ఆమె ఆచి తూచి అడుగులు వేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
స్వీయ నియంత్రణ అనేది చాలా విషయాలకు అవసరం. ఉదాహరణకు ఆకలి వేసినప్పుడే తినాలి. మితంగా తినాలి. అతిగా తినకూడదు. శారీరకధర్మాన్ని పరిశీలిస్తూ ఉండాలి. మనం ఆహారాన్ని సమపాళ్లలో ఉండేటట్టు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పప్పు, నెయ్యి, పెరుగు సాధారణ భోజనం అవుతుంది. అది మనం రెగ్యులర్‌గా తీసుకుంటాము. కానీ ఎక్కడికైనా ప్రత్యేకమైన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అతిగా తీసుకుంటాం. కానీ తిరిగి వచ్చి సాధారణ స్థితికి రావాలి. ఈరోజు చూస్తే సమాజంలో ఆరోగ్యాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నారో చూస్తున్నాము కదా!
దీనికి మనసు ప్రధానం. మనసులోని ఆలోచనతో నీలో మథనం జరిగి నీవు చేసే పనితో ముడి పడుతుంది. అది మంచిదా? కాదా? అవసరమా? అనవసరమా? అనే ఘర్షణ మనలను జ్ఞానవంతులను చేస్తుంది. అలా కాకుండా ఏం కావాలో తెలియకుండా స్త్రీ పురుషులు పరుగులు తీస్తున్నారు.
విపరీతమైన విదేశీ అనుకరణ కూడా దీనికి కారణం.
చదువుకునే వయసులో లక్ష్యం నిర్ణయించుకొని ఆ దిశగా చదవాలి. అలాగే ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగం వచ్చింది కదా! అని సంతోషంగా ఉండదు. ఏ చిన్న అవకాశం దొరికినా విదేశాలు పారిపోతుంటే ఇక్కడ ఈ దేశానికి ఎవరు మిగులుతారు? అసలు ఎందుకు వెళ్లాలి? వెళ్లినా అక్కడ చదువుకున్న తర్వాత తిరిగి దేశానికి వచ్చి ఇక్కడ పని చేయాలి. అవకాశాలు ఉన్నాయా? అంటారు కదా! ఎందుకు ఉండవు నా దేశం నా కుటుంబం అనే భావన ఏది? అక్కడ సంపాదించిన డబ్బు ఇక్కడ తల్లిదండ్రులకు పంపిస్తే అది మనుషులకు ప్రత్యామ్నాయం అవుతుందా?
మన దేశానికి వచ్చి సమస్యలతో నిండిన మన దేశానికి మీ వంతు సహాయం చేయండి అని చెప్పాలనిపిస్తుంది వినే వాళ్ళు ఎవరు?
అరుదైన పురస్కారము:
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము మరియు భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త సమర్పణలో ప్రతి సంవత్సరం షష్టి పూర్తి చేసుకున్న కలాలకు జరిపే ‘మాతృవందనము’ కార్యక్రమంలో 2023లో సెంచూరియన్ యూనివర్సిటీలో తన శిష్య, ప్రశిష్యుల ముందు హైదరాబాదు నుండి వచ్చిన నిర్వాహకులు అత్యంత వైభవోపేతముగా చేసిన సన్మానము ఆమెకు కాదు. సాక్షాత్తు సరస్వతీదేవి పాదాలను అర్చించడమే!


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మరియు భాషా సాంస్కృతిక శాఖ వారిచే మాతృ వందనం సన్మానం అందుకుంటూ


సెంచూరియన్ యూనివర్సిటీలో మాతృ వందనం కార్యక్రమం జరిగిన తర్వాత డా. శాంతమ్మ గారి ప్రతిస్పందన
తాత్విక చింతన
97 సంవత్సరాల వృద్ధురాలు తన ఈ సుదీర్ఘ జీవితంలో చూసిన లోకం పోకడను తనదైన భాషలో తన భావాలను వ్యక్తపరుస్తూ భవిష్యత్తులోకి అలా చూస్తూ మాట్లాడుతూ ఉంటే ఆధ్యాత్మిక భావనలు కలిగి అనేక భాషలపై పట్టు ఉన్న ఆ తత్త్వవేత్త మాటలు వినడమే తప్ప ప్రశ్నలు లేవు.
డా. శాంతమ్మగారి మంచి ముత్యాల వంటి సూక్తులు
- జీవితం అంటే రిలాక్స్ అవ్వడం కాకుండా అందులో మనం సాధించగలిగేదేంటి? వ్యక్తిగతంగానా? సామూహికంగానా? అని ఆలోచించుకుంటూ పనిచేయాలి.
- ‘కాలం ఎంతో విలువైనది దానిని ఎవ్వరూ ఎప్పుడు వృధా చేయకూడదు.’ అదే ఆమె అందరికీ చెబుతూ ఉంటారు.
- తల్లిదండ్రుల మాట ఎప్పుడూ వినాలి.
- స్నేహితులకూ తెలిసిన వాళ్లకు మధ్య తేడాను గుర్తించగలగాలి. స్నేహితుల సంఖ్యపట్లా, వారితో గడిపే సమయం పట్లా స్వీయ నియంత్రణ ఉండాలి.
- భగవంతుడు స్త్రీ పురుషులను సృష్టించి ఎవరి పనులు వారికి నిర్దేశించాడు. ఈ విషయంలో ఎవరికి వారు గురువుగా తాము చేస్తున్న పని పట్ల నిర్హేతుకంగా సమీక్ష చేసుకొని తమను తాము బాగు చేసుకునే ప్రయత్నం చేయాలి.
అందరూ అడిగే ప్రశ్న ఈ వయసులో ఎందుకు ఇంత కష్టపడుతున్నారు?
“కష్టము శరీరానిదా? మనసుదా? అని తిరిగి మనలను ప్రశ్నిస్తారు. మనసు చెప్పినట్లు వినకండి. అది ఎప్పుడూ సుఖాన్నే కోరుతుంది. బుధ్ధిని ఉపయోగించండి. మీకు సరైన దారి చూపిస్తుంది.” అంటూ ఇలా చెప్పారు.
“భారతీయులకు ప్రత్యేకమైన కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. దైవాన్ని నమ్ముతాను.
దాని ప్రకారం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అది నాకు నచ్చిన పని నాకు వచ్చిన పని నేను చేస్తున్నాను.
ఇంతే కాదు నా దినచర్యలో భాగంగా ఉదయం తెల్లవారుజామున మూడున్నర నాలుగు మధ్యలో లేస్తాను. మా ఇంట్లో ఉన్న ఆరుగురికి వంట నేనే చేస్తాను. కొంత బాక్సులో పెట్టి నాతో తెచ్చుకుంటాను.
ఇప్పటికి కూడా ఏదో నోటికి వచ్చినది చెప్పడం కాకుండా పాఠాలు ప్రిపేర్ అవుతాను. పరీక్ష పేపర్లు తయారుచేస్తాను. మూల్యాంకనం చేస్తాను. ఎందుకంటే నేను పాఠం చెప్పే విద్యార్థుల గురించి నాకు బాగా తెలుసు. వారికి ఏవి రావో అవి మళ్ళీ చెప్పడం నా ధర్మం.
అలాగే విశ్వవిద్యాలయాలకు సబ్జెక్టు పరంగా అనేక పరిశోధనాత్మక పత్రాలు తయారు చేస్తూ ఉంటాను.
వేదిక గణితం మీద ఏడు పుస్తకాలు రాశాను. ఇప్పుడు ఉపనిషత్తుల మీద పుస్తకం రాయాలి అని అనుకుంటున్నాను.”
ఈ వయసులో ఇవన్నీ నాకు అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వారికి నా సమాధానం
“జీవించి ఉన్నంతకాలం, నడవగలిగినంత కాలం, ఓపిక ఉన్నంతకాలం, చెప్పగలిగినంత కాలం, చూడగలిగినంత కాలం, నేను చేయగలిగిన పని అందరూ నా నుండి ఆశించే పని నేను చేస్తాను. పనిలోనే దైవాన్ని చూస్తాను.”
అనే ఆమె ఆహార్యంలో, మాటలో, ఆలోచనలో, తాత్వికచింతనలో, నిలువెత్తు మానవతా స్వరూపాన్ని చూస్తూ, విడువలేక, చేతులు జోడిస్తూ మరల ఆమెను కలవాలని కోరుకుంటారు.


ప్రతిభను వరించి వచ్చిన సత్కారాలు ఎన్నెన్నో..
ఒక అరుదైన వ్యక్తిత్వం గల స్త్రీమూర్తి మనమధ్య తిరుగుతున్నారు. ఆమె జీవితం తెరచిన పుస్తకం. తనకంటూ ఏమి ఉంచుకోలేదు. కూడబెట్టుకున్న ఆస్తులూలేవు. రేపటి గురించిన భయము అసలే లేదు.


అక్షర యాన్ విజయనగరం జిల్లా రచయిత్రులతో డాక్టర్ శాంతమ్మ గారు తన అభిప్రాయాలను తెలుపుతూ
ఇలాంటివారి గురించేనా ఒక కవికలం ఇలా రాసింది.
“దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా?”
***
(మళ్ళీ నెల మరో గురువు పరిచయం)
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచిట అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం వెలువరించారు.
6 Comments
కొల్లూరి సోమ శంకర్
ఇది డా. శిరీషా రఘురాం గారి స్పందన: *చాలా ఉపయుక్తము, స్ఫూర్తి దాయకమైన వ్యాసాన్ని అందించారు. మీ విషయసేకరణా నైపుణ్యానికి, పరిశీలనా దృష్టికి హృదయపూర్వక నమస్సులు.
చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి నాన్నగారు ప్రియ శిష్యులు. నాన్నగారి సిద్ధాంతం గ్రంధానికి చిలుకూరి వారే పరిశోధక పర్యవేక్షకులు.
వారు జైల్లో ఉన్నప్పుడు కూడా జైలుకే వెళ్ళి వారితో చర్చించేవాట . ఆ విషయం మా అమ్మ గారు చెప్పేవారు.
అలాగే భార్యా భర్త యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు దారిలో నాన్నగారు కనబడితే శాంతా! కారు ఆపు అని కారు ఆపించి మరీ నాన్నగారిని ఎక్కించుకొని తీసుకు వెళ్ళేవారుట. నాన్న గార్ని ఆప్యాయంగా ఆచార్యా అని పిలిచేవారుట.
మీ వ్యాసం చదువుతుంటే నాన్నగారు, అమ్మగారు మాతో పంచుకున్న ఈ విషయాలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. స్ఫూర్తి ప్రదాత్రి అయిన డా. శాంతమ్మగారికి హృదయపూర్వక నమస్కారములు
డా. శిరీషా రఘురాం
ఆచార్య భావన గారి కుమార్తె
విజయనగరం.*
కొల్లూరి సోమ శంకర్
ఇది శ్రీ శేఖర్ గారి స్పందన: *చాలా అద్భుత ముఖాముఖి పరిచయం.. వారి జీవిత వివరాలు చక్కగా రాబట్టారు.. మంచి సంచికని అందజేసినందుకు ధన్యవాదములు..
శేఖర్, జాతీయ సంచాలకులు, సంస్కార భారతి.*
కొల్లూరి సోమ శంకర్
ఇది నేరెళ్ళ రాజకమల గారి స్పందన: *కొంతమందికి ఎంత వయసు వచ్చినా పని చేయడంలో సిద్ధహస్తులు. వారికి వయసుతో సంబంధం ఉండదు. పనితోనే సంబంధం ఉంటుంది .
నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. థాంక్యూ.
నేరెళ్ళ రాజకమల, బెంగుళూరు.*
కొల్లూరి సోమ శంకర్
ఇది డా. కడలి అన్నపూర్ణ గారి వ్యాఖ్య: *మీ యొక్క అపూర్వమైన కృషిలో నాకు స్థానం కల్పించినందులకు సర్వదా కృతజ్ఞురాలిని. ధన్యవాదములు.
డా. కడలి అన్నపూర్ణ.*
కొల్లూరి సోమ శంకర్
ఇది ఎం. కమల కుమారి గారి వ్యాఖ్య: *డా. చిలుకూరి శాంతమ్మ గారి ఇంటర్వ్యూ, వెబ్ మ్యాగజైన్ లో పెట్టి మాలాంటి వారందరికి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల మహిళను తెలియ పరచిన రచయిత్రి చివుకుల గారికి ధన్యవాదాలు.
ఎం. కమల కుమారి, విజయనగరం.*
కొల్లూరి సోమ శంకర్
ఇది ఆర్. శ్రీవాణీశర్మ గారి స్పందన: *వందే గురు పరంపరామ్ అనే శీర్షిక కింద మీరు పరిచయం చేస్తున్న, వివిధ రంగాలకు చెందిన అనన్య సామాన్యమైన గురువులు అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమైన వారు.
ఈ మాసం మీరు పరిచయం చేసిన ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ గారు, అత్యున్నత విద్యలోనూ, అన్ని గుణాలలోనూ, తనకు తానే సాటి అనిపించుకునే సరస్వతి దేవి ప్రతిరూపం. అంత ఉన్నతమైన వ్యక్తికి సంబంధించిన వివరాలను మాకు అందిస్తూ, ఎంతో చక్కటి వ్యాసాన్ని మాకు అందించిన మీకు, మీ కృషికి, హృదయపూర్వక ధన్యవాదాలు. శాంతమ్మగారికి భక్తి పూర్వక పాదాభివందనాలు.- ఆర్. శ్రీవాణీశర్మ.*