వేంపల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.
“భగవంతుడా,వానలు అసలు కురిపించవద్దు స్వామీ” దేవుని ప్రార్థించాడు రైతు.
“ఎందుకలా?” విస్మయంగా ప్రశ్నించాడు దేవుడు.
“వానలు కురిస్తే ఎంతో ఆశతో ఎన్నో కష్టాలకోర్చి మేము పైరు సాగు చేస్తామా, మా అదృష్టం కొద్దీ దిగుబడి బాగా వచ్చినా దళారుల పీడతో గిట్టుబాటు ధర దక్కదు. అంతేగాక” జవాబు అర్ధాంతరంగా నిలిపాడు రైతు.
“ఏదో చెప్పబోతూ సగంలో ఆపేశావేం?”అడిగాడు భగవంతుడు.
“సాగు కోసం చేస్తున్న అప్పులు, వాటికి వడ్డీలు తీర్చలేక, అవమానాలతో ఆత్మహత్యలకు కూడా పాల్పడక తప్పదు” పూర్తి చేశాడు రైతు.
“పంటలే లేకుంటే ఎలా బతుకుతారు?” మరో ప్రశ్న వేశాడు దేవుడు.
“సాయం చేయాల్సిన సర్కారు దొరలు మా ఓట్ల కోసం ఎన్నో ఏళ్ల నుండి ‘రైతు సహకారం’ ,’అన్నదాత తోడ్పాటు’ వంటి పథకాలతో మమ్మల్ని బిక్షగాళ్లను చేసి మా మొహాన ముష్టి విదిలిస్తున్నారు. దానికే బాగా అలవాటు పడిపోయాం, అవమానాలు, ఆత్మహత్యలకంటే ఆ ముష్టి మెతుకులే మేలు కదా” బతుకు మీద ఆశతో బదులిచ్చాడు రైతు.
ఆ సమాధానానికి భగవంతుడు మాటరానివాడిలా ‘మౌనం’ దాల్చాడు.
“సునందా వచ్చే గురువారం నాడు మన మొదటి పెళ్లి రోజు కదా నీకు కానుకగా ఏం కొనివ్వమంటావు” భార్యను అడిగాడు మురళి.
“ఓ మంచి లేటెస్ట్ మోడల్ వాషింగ్ మిషన్ తీసుకురండి” చెప్పింది సునంద.
“పట్టుచీర కోరుకుంటావనుకున్నానే” అన్నాడు మురళి నవ్వుతూ
“అదేం వద్దుగానీ ప్రతి నిత్యం ఇంట్లో ఉపయోగపడుతుంది కదా వాషింగ్ మిషన్ కొనుక్కురండి” అంది సునంద.
“అది తప్పా వేరే ఇంకేదైనా కోరుకో సునీ” చెప్పాడు మురళీ.
“చాకలి సుబ్బమ్మకు ప్రతినెలా పదిహేను వందలు ఖర్చు చేస్తున్నాం మిషన్ కొంటే ఆ సొమ్ము మిగులిపోతుందిగా “చెప్పింది సునంద.
“సారీ సునందా ఏమనుకోకు వాషింగ్ మిషిన్ కొనడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు” కాస్తంత గంభీరత ధ్వనించింది మురళి గొంతులో.
“ఎందుకలా?” ప్రశ్నించింది సునంద మోహం గంటు పెట్టుకుని.
“చాకలి సుబ్బులుకు మనం ప్రతినెలా ఇచ్చే పదిహేను వందలు మొత్తం మనకు అస్సలు ఓ లెక్క లోనిది కాదు కానీ ఆమెను దోభిగా తీసేస్తే మనలాంటి వాళ్ళపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న ఇలాంటి చిన్న చిన్న కులవృత్తులు వాళ్ళు ఎలా బ్రతకాలి” అర్థం చేసుకోమన్నట్లు చెప్పాడు మురళి.
“కరీం నిన్న షాప్ తెరవలేదు, ఊళ్ళో లేవా?” మటన్ కొట్టు కరీంను అడిగాడు వెంకట్.
“ఒక పెద్దావిడకు చాలా సీరియస్‌గా వుంటే అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్ళాల్సి వచ్చింది సార్” చెప్పాడు కరీం.
“ఆదివారం రోజునే కదా నీకు ఎక్కువ మంది కస్టమర్లు వచ్చేది, ఆ పని వేరొకరికి పురమాయించలేకపోయావా? ఇంతకీ ఎవరావిడ?” ప్రశ్నించాడు వెంకట్ .
“సిటీకి అవతల నా స్నేహితుడు నిర్వహిస్తున్న ‘అమృతసదన్’ వృద్దశ్రమంలో రత్నమ్మ అనే పెద్దావిడ సార్” బదులిచ్చాడు వెంకట్.
“ఏమైంది ఆవిడకు ఇప్పుడెలా వుంది?” వెంకట్ మరో ప్రశ్న.
“ఆమెకు సీరియస్‌గా వుందని వెంటనే రమ్మని తన కొడుక్కి ఆశ్రమం వాళ్ళు కాల్ చేస్తే ఊళ్ళో లేనని క్యాంప్ నుండి రావడానికి వారం పడుతుందని చెప్పాడట సార్, సమయానికి వేరే ఎవరూ లేక నా ఫ్రెండ్ నన్ను సాయం కోరితే వెళ్ళా” చెప్పాడు కరీం.
ఆ సమాధానానికి ఎవరో చెంప మీద భాధినట్లు అనిపించింది వెంకట్ ఉరఫ్ వెంకటరమణకు, క్రితం రోజు భార్యతో జాలీగా సినిమాకు వెళ్ళడం కోసం ఆశ్రమం వాళ్ళకు క్యాంపులో వున్నట్లు చెప్పిన అబద్దం గుర్తుకువచ్చి.
“నాన్నా నాకు గాగుల్స్ కొనివ్వకుంటే కాలేజీకి అస్సలు వెళ్ళను” ఇంజినీరింగ్ ఫస్టియర్ స్టూడెంట్ బ్లాక్‌మెయిలింగ్.
“ఫ్యాక్టరీలో గొడవ వల్ల నెలన్నరగా సమ్మెలో వున్నాం, జీతాలు రావడం లేదు. పరిస్థితి అర్థం చేసుకోరా” అభ్యర్థించాడు తండ్రి.
“గాగుల్స్ లేకుంటే మిగతా పిల్లల ముందు నామోషిగా వుంటుంది. నీకు జీతాలు వచ్చేవరకూ కాలేజీ మానేస్తాలే.” మరో రకంగా బెదిరించాడు కొడుకు.
“సరేలేరా, మీ అమ్మ చెవుల్లోని కమ్మలు అమ్మేసయినా నీకు ఆ రంగు కళ్ళద్దాలు కొనిపెడతా గానీ కాలేజీ మాత్రం మానకు.” ఓ మెట్టు దిగొచ్చాడు తండ్రి.
“ఆఫ్ట్రాల్ అవేం బోడి కమ్మలులే నాన్నా. నేను పెద్ద ఇంజినీర్ అయ్యాక అమ్మ ఒంటినిండా మొయ్యలేనన్ని నగలు కొనియ్యనా!” ఎలాగైనా తనపంతం నెగ్గిందన్న మందహాసం విరిసింది కొడుకు పెదాలపై.
పాతికేళ్ల తర్వాత…..
“చత్వారంతో కళ్లు బొత్తిగా కనిపించడం లేదు, నాకు ఆపరేషన్ చేయించాలిరా, అలాగే మీ అమ్మకు కూడా” మెల్లగా గొణిగాడు తండ్రి.
“ఏమయ్యింది అమ్మకు?” కొడుకు గొంతులో విసుగు ధ్వనించింది.
“మోకాళ్ల నొప్పులతో నడవలేక పోతోంది” మెల్లగా చెప్పాడు తండ్రి.
“మరో రెండు నెలల్లో ఏదో స్వచ్ఛంద సౕంస్థ వాళ్లు సిటీలో భారీ ‘ఐ’క్యాంపు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయబోతున్నారట, అప్పటి వరకు ఆగలేరా?” నెలకు లక్షరూపాయలు జీతం సంపాదించే ఇంజినీర్ కొడుకు సమాధానంలో భరించలేని కోపం.
రెడ్డి నాగరాజుగారి కథలు ఆ మధ్య కాకతాళీయంగా కంటబడ్డాయి. చిన్నవి కావడంతో అక్కడికి అక్కడికే చదివేశా! ! మొన్న చదివిన కథలు ఇప్పుడు చదివి కథలు మొత్తం 8. చిన్న వృత్తులు చేసుకునే శ్రామికుల పట్ల మధ్య తరగతి జీవులలో ఉండే సానుభూతి కధాంశాలుగా తీసుకుంటున్నారు. మొన్న చదివిన గంజి కథమాదిరిదే ఈసారి కానుక. నాకు బాగా నచ్చాయి. చిన్న పిల్లలు పెద్దల పట్ల భవిష్యత్తులో బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించవచ్చన్న ఆలోచనతో రాసిన ‘ ‘సమాధానం’ గతంలో నేను చదివిన వీరి ఇలాంటి కథను పోలివుంది- భవిష్యత్తులో మా ఎలా జరగనుందో ద్రాష్టిక కోణంలో రచయిత స్పందించడం ఆహ్వనించదగ్గ అంశమే | అయితే అంతకు మించి వర్తమానంలో పెద్దల బాలల హక్కుల పట్ల బొత్తిగా అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్న తీరూ కథల ద్వారా తెలియచేయమని నాగరాజుగారికి విజ్ఞప్తి! మొత్తానికి సమకాలీన సమాజ చట్రం నుంచి పక్కకు పోకుండా మధ్య తరగతి జీవుల దృక్కోణం నుంచి తేలిక పదాలతో హాయిగా చదువుకునే కథలే ఆలోచనా స్పోరకంగా, అవసరమైనప్పుడు చురకలు వేస్తూ చక్కగా సాగుతున్నవి. మద్యం, చీటీపాటల మోసం, సినిమా వల్ల చితికి పోయిన చిన్న కళలు, పటాటోప ప్రదర్శనగా పూజలు పునస్కారాలు, తెలుగు భాషమీదసమాజం చిన్నచూపు, స్త్రీల టీవీ పెచ్చి, కాపీ కొట్టే కధారచయితలు, సామాజిక మాధ్యమాల మత్తులో పిల్లలున్న సంసారులు కూడా చెడుతోవలు తొక్కడం,సినిమాల రంధిలో పడి చదువు పాడు చేసుకునే విద్యార్థులు,.. ఇలాంటి వైవిధ్య భరితమైన అంశాలను ప్రధాన వస్తువులుగా మలచుకుంటూ ఇలాగే చమత్కారం తగ్గకుండా మరన్ని అందిస్తారని.. అందించే సామర్ధ్యం గల రచయిత గనక వేంపల్లి రెడ్డినాగరాజుగారిని ఓ అభిమానిగా కోరుకుంటున్నాను . రచయిత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కథలను నా ఫేస్ బుక్ స్టేటస్ కు షేర్ చేసుకుంటున్నాను. మంచి కథలకు వేదికగా నిలుస్తున్న సంచిక నిర్వాహకులకు మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను !
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™