శతాబ్దంలో భారతీయ సాహిత్యంలో విలసిల్లిన విభూతులలో విశ్వనాథ సత్యనారాయణ అగ్రగణ్యుడు. ఆయన ఆవిర్భవించినకాలం భారతీయ జీవనంలోని అన్ని పార్శ్వాలలో వైదేశిక సాంసృతీక ధార ప్రభావితం చేయడమేకాక ప్రాభవం సంపాదించుతూ వున్నకాలం. ఈ సాంసృతిక ప్రభావాన్నెదిరించే ప్రయత్నంలో తొలిదశ సంస్కారోద్యమమైంది. మలిదశ నూతన కాలానికి అనుగుణంగా సనాతన ధర్మంలోని విలువలను వాఖ్యానం చేయడం సమన్వయం చేయడం ఆత్మవిశ్వాసంతో స్వీయసంస్కృతీ ప్రాభవాన్ని చాటడం, విశ్వనాథ వ్యక్తిత్వం ఆవిష్కారం పొందిందీ మలిదశలో. ఈ దశ యొక్క ప్రముఖ పార్శ్వం జాతీయోద్యమం.
విశ్వనాథ తన ఆంతర్యంలో దేశాన్ని ప్రతిఫలించుకునే నాటికి దేశంయొక్క సమగ్ర చైతన్యానికి కేంద్రమైన స్వయం సంపూర్ణమైన గ్రామీణ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. వృత్తులు పోయి పల్లె జనం పొట్ట చేత పట్టుకొని బస్తీలకు వలస వెళ్తున్నారు. గుమాస్తా ఉద్యోగాలకు పనికివచ్చేదే చదువయింది. గ్రామం చెడి, వృత్తులు నశించి, ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. ఆర్థిక వ్యవస్థతో పాటు సామాజిక సాంస్కృతిక వ్యవస్థల్లో విపరీత మైన వైక్లబ్యం సంభవించింది. క్రిస్టియన్ మిషనరీలు పాలక వ్యవస్థతో తాదాత్మ్యంపొంది దేశీయ మతాన్ని ఆచారాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆత్మవిశ్వాసరాహిత్యం, అనుకరణం ప్రబలిపోయినవి. గ్రామముతో సంబంధంలేని భూస్వాముల శోషణలో కొత్తగా గ్రామం దోపిడికి గురైంది. కులాల మధ్య ఉన్న సామంజస్యం తొలగి పరస్పరం అవగాహనా రాహిత్యం చోటు చేసుకున్నది.
సనాతనంగా వస్తూవున్న సజీవమూల్యాలు- అవి ఏనాటికైనా మానవజాతికి ఉన్నతిని దర్శింపజేసేవి కూడా ఈ అల్లకల్లోలంలో సాంస్కృతికంగా ప్రళయంలో నశించి పోతవేమోనన్న సంశయం కలిగింది. ఇంతకుముందు ఈ స్థితి మన దేశం మీదికి దండయాత్రకు వచ్చిన యవన, హూణ, తురుషాది జాతులవల్ల సంభవించ లేదు. వారితో సంఘర్షణ ముగిసినాక క్రమంగా వారీ దేశ జీవనస్రవంతిలో కలిసి పోయారు. ఈ క్రొత్త విపరీత పరిణామం బ్రిటీషువారి రాకవల్ల సంభవించింది,
గ్రామం ఒడిలో పెరిగిన విశ్వనాథ త్వరత్వరగా వస్తూవున్న ఈ పరిణామాన్ని, తన కన్నులతో చూచాడు. ఈ గ్రీష్మాతపమే ‘ఏక వీర’లోనూ ‘వేయిపడగల’ లోనూ ప్రతీకగా ఆరంభంలో గోచరిస్తుంది. ఆయన అశేష సారస్వతమంతా ఈ భయంకర పరిణామాన్ని చిత్రిస్తుంది. అన్నింటిలోనూ ఇదే ఇతివృత్తం. ముఖ్యంగా నవలలో దీని ప్రత్యక్ష కథనం చూడవచ్చు. ‘అంతరాత్మ’ (1917) నుంచి ‘నందిగ్రామ రాజ్యం’ (1976) దాకా అన్నింటిలోనూ ఈ సంఘర్షణవల్ల నలిగి పోయిన మనిషి చివరకు మౌలికమైన విలువలను ఎలా కోలుపోతున్నాడో చిత్రిస్తాడు. తన పాదు నుండి పెల్లగింపబడి నిస్సహాయంగా వేదనాభరితంగా రోదిస్తూ ఉన్న మానవుడు వీటిల్లో కనిపిస్తాడు.
నిత్య పరిణామశీలమైన ఈ జగత్తులో ఏదీ నిత్యమైందికాదని విశ్వనాథకు తెలుసు. నిత్యమైనది ఒక్కటే, అది ఆత్మపదార్థము. దాని ఆవిష్కారము సచ్చిదానందరూపముగా ఉంటుంది. జగద్రూపములో సత్య శివ సుందరములుగా అది వ్యక్తమౌతుంది. ఇవి దైవీగుణాలు. ఈ పరిణామగతిలో ఈ మౌలికాంశాలను పాథేయంగా తీసుకుపోవడం తప్పనిసరి. వీటి విస్తృతమైన అభివ్యక్తి అనేకానేకాలైన మానవీయ మూల్యాల రూపంగా ఉంటుంది. అవి లుప్తమైపోతున్నప్పుడు వాటి మూలాలను జాగ్రత్తగా చూపించి నిలబెట్టుకోమంటున్నాడు. ఆ మూల్యాలు అదృశ్యమైనకాలంలో జాతి అయోమయంలో ఉన్నప్పుడు వాటిని గుర్తించి మనకు వాటితో సాన్నిహిత్యం కలిగించిన చైతన్య గోప్త విశ్వనాథ సత్యనారాయణ.
ఈ ఇతివృత్తం ఆధారంగా ఆయన రచించిన ఈనాటి ఇతిహాసం “వేయి పడగలు’. ఇతిహాసం అన్ని కాలాలనూ ఒక బిందువువద్ద ముడి వేస్తుంది. వేయి పడగలలో ఈ కేంద్రం సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయన వ్యక్త జగత్తును ధరించిన వాడు. ఈ జగత్తు కాలమునందు అభివ్యక్త మౌతున్నది. ఈ కాలం లిప్త ఘటికా దిన మాన యుగాది రూపంగా అనుభూతమయ్యేది ఒకటి. దీనికి భిన్నంగా అనిర్దేశ్యంగా నిత్యభావాన్ని పొందినది మరొకటి. ఒకటి వ్యావహారికము, రెండోది పారమార్థికము. ఆయన పడగలు వ్యావహారికమైన కాలానికీ, ఆయనేమో నిత్యమైన కాలానికీ సంకేతాలు. అందుకే వేయిపడగలతో, గ్రామం నెలకొనడావికిముందే స్వామి ఉన్నాడు. పడగలు తరుగుతూ ఉన్నా చివరకు స్వామి మిగిలాడు. ఈ ఖండాఖండ కాలాలు ఈ విధంగా అనుసంధింపబడటంవల్ల ఈ నవల ఇతిహాసమయింది.
వేయిపడగలలో ఇతిహాసపరమార్థం మూడంచులలో గోచరిస్తుంది. ఒకటి దీనిలో వ్యక్తం అయిన ‘మానుష ప్రపంచం’. సమకాలీన జీవితంలోని సంక్లిష్ట లక్షణాన్ని కల్లోలాన్ని స్పష్టంగా చిత్రించడంలో మానవ జీవితంలోని సూక్ష్మసూక్ష్మ సన్నివేశాలకు రూపుకల్పించడం జరిగింది. ఈ మానుష వృత్త కథనమే దీనికి ప్రాణంపోసింది. గోపన్న కావచ్చు, నాయరు కావచ్చు, అసీరి కావచ్చు సుసానీ కావచ్చు. చిన్న పాత్ర అయినా దేని ప్రత్యేక లక్షణం దానిదే. రెండో అంచు – ఈ నవలలో చాలా పాత్రలు కొన్ని సంస్థలను, కొన్ని ప్రాథమిక మూల్యాలను ప్రతిఫలింపజేయడం కోసం ఏర్పడ్డవి. ఈ ప్రతీక లక్షణం చేత ఈ నవల ఉపరితలం దాటి లోతుల్లోని ఒక భూమికలో జీవిస్తూ ఉన్నది. ఇక్కడ చరిత్ర సాంఘిక పరిణామము, శిథిలమైన వ్యవస్థకూ వర్తమానానికీ నడిమి సంఘర్షణ ఇవన్నీ వ్యక్తం అవుతున్నవి. ఈ దశలో రచయిత ఇతిహాస రచయితకు ఉండే సాక్షి మాత్ర లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఆసక్తుడై కూడా అనాసక్తంగా ఉండటం ఇక్కడ వైరుధ్యం. ఈ వైరుధ్యం మొదటి అంచులలో ఉన్న లక్షణాన్ని రెండో అంచులో ఉన్న లక్షణాన్ని వింగడించకుండా చూడటంవల్ల వచ్చే ఇబ్బంది. ఒక వైపు సమాజంలో తొలగి పోతూ వున్న విలువలను గూర్చి విస్తృతంగా చెప్పినా పరమార్థతః ఈ గ్రంథం సమాజం యొక్క తొలివేరులను చారిత్రక భూమిలో దృఢంగా నెలకొల్పింది. పరివేగశీలమైన సమాజాన్ని చిత్రిస్తూన్న విశ్వనాథ ఈ నవల మూల చైతన్యంలో అనంతకాల చైతన్యాన్నీ మానవీయ మూలాలనూ నెలకొల్పడం నవలలో మూడో అంచు. ఈ మూడంచుల సంపుటీకరణం వేయిపడగలను చేసిందీ.
ఇతిహాసం యొక్క లక్షణం చెప్పవలెనంటే శ్రీ అరవిందులు సావిత్రిలో చెప్పిన ఈ వాక్యాలు సరిపోతవి.
“Here all experience was a single plan
The thousand fold expression of the one?”
SAVITHRI-II
‘ఇక్కడ సర్వమైన అనుభవమూ ఒకే ప్రణాళికకు చెందింది
ఇది ఏకత్వంయొక్క సహస్రముఖమైన అభివ్యక్తి’
ఈ నిర్వచనం “వేయిపడగలు”కు సంపూర్ణంగా అన్వయం అవుతున్నది.
II
“ఒకజాతి సర్వతః ఉన్మీలితమైనా రావచ్చు కాని శక్తి చావరాదు.” (25వ అధ్యాయం) వేయిపడగలకు కేంద్రమైన వాక్యమిది. మూలమునుండి పెల్లగించడం జరిగినా సహజంగా ఆంతరికమైన ప్రాణశక్తి నిలిచివుంటే దాన్ని పునరుజ్జీవింప జేసుకొనవచ్చును. ఈ అంశమే ఈ అధ్యాయంలో ప్రతీకాత్మకంగా చెప్పడం జరిగింది. ‘ఒక గొల్లవాడు ముసలియావునొక దానిని కబేలావానికమ్మ బోవుచుండెను. ఆ యావు శక్తి యుడుగనన్ని దినములు సమృద్ధిగా పాలిచ్చెను. గొల్లవాడు దానితో సుఖపడెను.’ ఈ సన్నివేశంలో పసరిక ప్రవేశించింది. పసరిక పైరుపచ్చ, ప్రకృతి, భూమికి ప్రతీక. పసరిక అధీనమైన ఆవు మళ్లీ ఉజ్జీవించింది. ఆ ఆవు “పరిలీనాగ్నియైన శమీవృక్షము వలె నెమ్మదిగా తేజోధి దేవతవలె” నడిచింది. జాతిశక్తి మళ్ళీ ఉజ్జీవనం పొందింది. అందువల్ల చీకట్లు ‘దాని నడచినంత మేర పరాభూతములైనవి.’ ఈ అంశం నవలలో సూచ్యాంశం. నవల ఉన్మూలితమైన జాతిశక్తి ఆంతర మైన ప్రాణశక్తి చేత మళ్ళీ పాదులో నిలబడి అంత దాకా ఆవరించి ఉన్న తమోమయదశ నుండి బయట పడిందని తాత్పర్యం. ఈ అంశాన్ని మూలంగా చేసికొని ఈ నవల జాతీయ పునరుజ్జీవన చైతన్యం ఎట్లా విజయంవైపుగా ప్రయాణం చేస్తున్నదో వ్యాఖ్యానించి చెప్పింది. అందువల్ల ఈ గ్రంథం నిరాశావాదాన్ని, ఓటమితత్త్వాన్ని ప్రకటిస్తున్నదనే వాదం నిరాధారమైనది, అందుకే గార్డినరు వీరిజాతిలోని శక్తి ‘చావలే’దని అంటాడు. ఈ శక్తిధరుడు మొదటి అధ్యాయం చివర దర్శనమిచ్చిన ‘మహాపురుషుడు’ ధర్మారావు. అతడు చివరి అధ్యాయంలో అరుంధతిని చూచి ‘నీవు మిగిలితివి. ఇది నా జాతిశక్తి’ అంటాడు. ఈ విధంగా వేయిపడగలు మొత్తం గ్రంథం ఈ శక్తి, ఉద్యమాన్ని నశించి పోకుండా నిలబెట్టడాన్ని సూచిస్తూవున్నది.
ఈనాడు పర్యావరణశాస్త్రం ప్రపంచ వ్యాప్తంగా ఏఏ అంశాలనుగూర్చి చర్చిస్తున్నదో వాటిని వేయిపడగలు అర్ధ శతాబ్దంముందే చర్చించింది. ప్రకృతిలో ఉండే సంతులనాన్ని భంగంచేయడంవల్ల మానవ జీవితం ఎంత దుఃఖభాజనమవుతున్నదో ఇంతటి అభినివేశంతో చర్చించిన నవల మన దేశంలోనే అరుదైనది. చెట్లను నిర్మూలించడం, మెట్టపొలాలను లేకుండా చేయడం, వాణిజ్య సస్యాలకు ప్రాధాన్యంవచ్చి తిండిగింజలు తగ్గిపోవడం ఇవన్నీ పాశ్చాత్య నాగరికత తెచ్చి పెట్టిన బస్తీల పెరుగుదలతో వచ్చిన ఇబ్బంది. ఇంతేకాక సృష్టి అంతా మానవుడి సుఖభోగాల కోసమే ఏర్పడిందని భావించినట్లు ఈ నాగరికత ప్రవర్తిస్తుంది. మిగిలిన జీవకోటికి ఆశ్రయ భూతమైన ప్రకృతి అంతా వికావికలు చేయబడింది. ఇరువదవ అధ్యాయములో ఈ కల్లోలం ఆశ్చర్యకరమైన విధంగా చిత్రింపబడింది. పృషన్నిధి అన్న మేఘ వృత్తాంతం. ఆ మేఘం ఆదివటంమీద విలుస్తుంది. ఆ చెట్టు, ఆ మేఘముల మైత్రి ఊరు పుట్టినప్పటినుండి కొనసాగుతున్నది. అంటే అనంత కాలం నుండి కొనసాగుతున్నది. అంటే అనంత కాలంనుంచీ ఈ దేశంలోని ప్రకృతిలో ఒక సామరస్యం ఉన్నది. అది ఈ క్రొత్త నాగరికతవల్ల విశ్లథమయింది. ఆదివటము విద్యుద్దీపముల కొఱకు విచ్ఛేదమైపోవడంవల్ల ఆ మేఘానికి ఆ గ్రామాన్ని గుర్తు పట్టడం కష్టమయింది. పృషన్నిధి అక్కడ కురియలేదు. అయితే పృషవ్నిధికి కూడా ఒక తుపాకిగుండు తగిలింది. ఈ గుండు సామరస్యాన్ని త్రోసివేస్తూ ఆక్రమిస్తూ వున్న నాగరికత. ఈ గుండువల్ల నాగరికతా మోహంలో ఆత్మ విస్మృతి పొందిన ప్రజల నూతన భావఝంఝ వల్ల ఈ మేఘము ఏదో నీరక్కరలేని ఒక గుట్ట పైభాగాన కూలబడిపోయింది. మేఘాన్ని ప్రియా సందేశ వాహకంగా కాళిదాసు నిర్మిస్తే, ఆధునిక కాలంలో పృథ్వీ చైతన్యంలో ప్రాకృతిక అసంతులనంవల్ల ఏర్పడ్డ విషాదాన్ని వ్యక్తంచేయడానికి ఈ పృషన్నిధిని తీర్చిదిద్దాడు విశ్వనాథ.
ఈ విధంగా నవల స్పృశించే పరిధి మానుష ప్రపంచాన్ని దాటింది. చెట్లనూ పుట్టలనూ పాములనూ పక్షులనూ మబ్బులనూ ఏనుగులనూ ఆవరిస్తూన్నది. చరాచర జగత్తు అంతా ఈ నవలలో చైతన్య సంపుటియై స్పందిస్తూవున్నది. అంతేకాదు. ఈ ప్రాకృతికమైన చైతన్య స్ఫురణను ఒక పాత్ర చేసి మానుష ప్రపంచంలో భాగంగా చేశాడు. ఆ అద్భుతపాత్ర పసరిక.
ఈ పసరిక కాపులయింట పుట్టిన బిడ్డ, కాపుకూ భూమికీ అవినాభావ సంబంధము. భూమిమీద ప్రాణస్పందంతో ఉండవలసిన సామంజస్యం పసరిక రూపం పొందింది. అందువల్లనే పసరికలో చెట్టులక్షణము, పాములక్షణము, మనిషిలక్షణము చెప్పడం జరిగింది. ప్రకృతిలో మానవునికి ‘అన్యత’ సామంజస్య రాహిత్యము నంభవించినంత వరకూ పసరిక క్షేమంగా ఉన్నాడు. అయితే మానవుడు ప్రకృతికి దూరదూరంగా ఎప్పుడు తొలగిపోయినాడో పసరికలో ఈ సామంజన్యం తొలగిపోయింది. ‘ఒక పడగవిప్పి పైరుపచ్చకు గొడుగుపట్టిన’ సుబ్రహ్మణ్యేశ్వరుడే కుంభీనసుని పేర పసరికను చంపివేయడం జరిగింది. కాలంలో వచ్చే మార్పును తన చైతన్యంలో ప్రతిఫలింపజేసుకునే గణాచారి ఈ చావుకు సాక్షిగా నిలచింది.
ఈ సన్నివేశంలో గణాచారి దుఃఖావేశముతో పాడినపాట ఈనాటి పరిస్థితులలో సకల ప్రపంచము దుఃఖించవలసిన సన్నివేశంలోని గాఢ విషాద స్వరాన్ని పట్టి యిస్తున్నది. ఇక్కడ వర్ణించిన సర్వప్రళయము ప్రకృతిలో సంభవిస్తున్న భీభత్సాన్ని సూచిస్తున్నది.
ఈ దృష్టిలో వేయిపడగలు అధ్యయనం చేయడం జరిగితే దాని అంతనూత్రం మనకు అందుతుంది. సమకాలాన్ని దాటిన దాని విస్తృతినీ, మానుష ప్రపంచాన్ని మించిన దాని విశ్వతోముఖత్వాన్నీ పట్టించుకోకపోతే అది మనకు అందీ అందకుండానే ఉంటుంది. అందువల్లనే వేయిపడగలలో కథనాంశం ఎంతముఖ్యమో సంభాషణలు అంతేముఖ్యము. సంభాషణలు ఎంతముఖ్యమో వర్ణనలూ అంతేముఖ్యం. ప్రధానంగా వర్ణనాంశాలన్నీ ఇతిహాస వరమార్థాన్ని మరొక భూమికనుంచి వ్యాఖ్యానం చేసే ప్రయత్నంచేశాయి. ఋతువర్ణనలు, సూర్యోదయాదులు వెన్నెలలు మొదలైనవన్నీ ఈ నవలలో పాత్రలు కాని పాత్రలు. కథాచైతన్య పరిధికి ప్రాగ్రూపాల (ఆర్కిటైపులు) వినియోగం చాలా ఎక్కువ. అసలు మూలమైన సుబ్రహ్మణ్యేశ్వరుడు వేయి పడగల పాము సృష్ట్యారంభంలోని ఆధారమైన అంశాలకు తొలిసంకేతం. సుబ్బన్న పేట ఆవిర్భావానికి హేతువుగా చెప్పబడ్డ కథవెనుక పృథువు భూమిని ధేనువుగా చేసి పాలను పిదకడం మొదలైన ప్రాగంశం నిలబడి ఉన్నది, దైవసాక్షాత్కారాలు, సాంకేతిక స్వప్నాలు, గ్రామ జీవనంలోవి పరంపరాయాతాలైన విశ్వాసాల ఈ గ్రంథంలో రహస్యవాద (మిస్టిక్) జానపద విజ్ఞానాంగాల వైపుల్యాన్ని ఎత్తి చూపిస్తున్నవి.
వేయిపడగలు సమష్టి మీద ఒక అంశాన్ని స్పష్టంచేస్తుంది. అది సృష్టిలోని ఒక అనుస్యూతంగా ప్రవహించే లయ. ఆ సృష్టిలయాంశం ఎక్కడ భగ్నమైనా రచయిత భరించలేడు, ఈ విశ్వలయ ప్రకృతిలోనైనా భగ్నమైతే మనస్సు చివుక్కుమంటుంది. ఎన్నో అఘాతాలను తట్టుకొంటూ ఈ లయను గిరిక జీవితంలో చెదరకుండా నిలబెట్టడం ద్వారా వేయిపడగలలో ఆధ్యాత్మిక ధర్మం పునరున్మీలితమైంది.
III
ఈ మహాగ్రంథం నేలను ధరించిన సుబ్రహ్మణ్యేశ్వరునితో ప్రారంభమయింది. నేలానింగీ ఈ రెంటి కల్యాణం ప్రధానాంశంగా వేణుగోపాలస్వామి కల్యాణం కథా ఫలస్వరూపంగా తీర్చిదిద్దబడింది. తరువాత మట్టమంతా ఉపసంహరణ ఖండం, ఆ ఉవనంహరణ చివరి మిగిలింది భవిష్యత్ దృష్టి వికాన హేతువు. పునారూపం పొందిన ప్రకృతితో నిత్యుడూ నిర్వికారుడైన వురుషుడు. ఈ ప్రకృతి పునారచన ప్రతి సృష్ట్యా రంథంలోనూ జరుగవలసిందే.
ఈ నిత్యమైన విశ్వవికాసం ఈ నవలలో ప్రతిపాద్యమైన అంశం. ధర్మారావు జగత్తును నడిపించే ధర్మవ్యవస్థనూ, గిరిక- ఈశ్వరాభిముఖంగా నిత్యమూ పరిణామం పొందే ప్రకృతి వేదననూ, పసరిక- ప్రకృతిలో ఉండే ప్రాథమికమైన సామరస్యాన్ని ప్రతీకాత్మకంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ సన్నివేశంలో గణాచారి నాల్గవ అంశమైన కాలాన్ని సూచిస్తూ వుంటున్నది.
ఈ నవల వెలువడ్డ నాటినుంచీ అదే ఒక ప్రపంచంగా దానిలో ప్రవేశించి ఆ అనుభవాన్ని పంచుకుంటూ వున్న భావుకలోకం ఉన్నది. ఈ భావుక లోకమునకు వేయిపడగల పాత్రలూ, సన్నివేశాలు అన్నీ సజీవాలు. ఈ భావుకులతో ఈ గ్రంథం జీవిస్తూ కాలపు పరిధులను అతిక్రమించింది. ఏ మహాగ్రంథమైనా దేశకాలాలను దాటే ఉజ్జీవించి వుండటానికి ఇదేకారణం.
కోవెల సుప్రసన్నాచార్య ప్రఖ్యాత కవి, విమర్శకులు. పలు గ్రంథకర్త. శ్రీ అరవిందో తత్వ చింతానామృత పానమత్తుడు. ప్రౌఢ గంభీరం వారి కవితా విమర్శ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™