తెగింపుతో పయనమే,
అక్షరానికి అసలైన ఆభరణం.
తలవంచని నిబద్ధతే..
తరతరాలుగ నిలిచే కీర్తి కిరీటం!!
ప్రలోభానికి లొంగే అక్షరానిది,
నిర్దిష్ట లక్ష్యం లేని పయనం,
నిరంతరం భీతితో వణికే-
పసలేని పనితనం!!
నిజం కొరకై నిరంతర శోధన..
అరాచకాలపై అక్షర యుద్ధం,
అసాంఘిక శక్తులపై నిఘా,
తతిమ్మా క్లిష్ట కార్యాలు
అక్షరానికి నిత్య బాధ్యతలు!!
సమాజానికి నిజం తెలిపేదీ,
మంచికి సమున్నతమైన-
స్థానం కల్పించి ప్రోత్సహించేదీ..
అక్షరమనే పదునైన ఆయుధం!!
అలసత్వం ఆవహించిన అక్షరం,
స్వార్థం బాహువుల్లో ఒదిగిన-
అక్షర అసమర్థ పయనం,
అన్యాయంతో అంటకాగే,
ఉత్తుత్తి పోరాట నటన..
సమాజాన్ని నట్టేట ముంచే..
మోసపూరిత కాలకూట విషం!!

సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్‌లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.