రాజకీయ నాయకులు:
1975-85 మధ్య ఆకాశవాణి ప్రసార మాధ్యమాలలో తలమానికంగా చెలామణీ అవుతోంది. అందునా రాయలసీమ ప్రాంతవాసులకు కడప కేంద్రం అభిమానపాత్రమైంది. కడపకు పర్యటనకు వచ్చిన ప్రముఖులను నేను రహదారి బంగళాలోనో, బహిరంగ సభలలోనో కలిసి వారితో ఇంటర్వ్యూకి సమయం తీసుకునేవాణ్ణి. కొందరు స్టూడియోకి వచ్చేవారు. మరికొందరిని గెస్ట్‌హౌస్‌లలో కలిసి రికార్డు చేసేవాణ్ణి.
సంబంధిత శాఖలు గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి ప్రణాళికలు నేను పత్రికల ద్వారా చదివి, ఒక ప్రశ్నా పత్రావళి వారికి చూపేవాడిని. వారు 15 నుంచి 20 నిముషాలు అనర్గళంగా సమాధానాలు చెప్పేవారు. అప్పట్లో కడపకు చెందిన రాష్ట్రమంత్రి పి. బసిరెడ్డి. అయన పరిశ్రమల శాఖా మంత్రి. వారి ఆధ్వర్యంలో కలెక్టర్ సంజీవరెడ్డి చొరవ వల్ల కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి జె. వెంగళరావు కోడూరులో డిటర్జెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అలానే కేంద్ర మంత్రి టి.ఏ. పాయ్ ఎర్రగుంట్లలో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించారు.
1978లో రేణిగుంట రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి విచ్చేశారు. రైల్వేశాఖ మంత్రి కమలాపతి త్రిపాఠి, సహాయమంత్రి సి.కె. జాఫర్ షరీఫ్, ఉపమంత్రి మల్లికార్జున్ వచ్చారు. మంత్రులందరూ రైల్వే స్పెషల్ కోచ్‌లలో బస చేశారు. ఉదయం 8 గంటల లోపు నేను టేప్ రికార్డర్ పట్టుకుని వారి విడిది కోచ్‌ల వద్దకు వెళ్ళాను.
ఒక కోచ్ ముందు ఒక వ్యక్తి లుంగీ కట్టుకుని పచార్లు చేస్తున్నాడు. “Can we meet Honourable Minister Sri Jaffer Sharief sir?” అన్నాను. “Come on, come on” కోచ్ లోపలికి తీసుకెళ్ళి తమ ఆసనంలో కూచున్నారు. ఆయనే మంత్రి జాఫర్ షరీఫ్. 20 నిముషాల సేపు రైల్వేల ప్రగతిని గూర్చి ఇంటర్వ్యూలో చెప్పారు.
ఒకసారి తిరుమలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఎస్.వి. గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. ఆయనను రాష్ట్ర ప్రగతి గూర్చి ఇంటర్వ్యూ మొదలెట్టాను. తలుపులు మూసి ఉన్నాయి. ఎవరినీ లోపలకు అనుమతించకుండా పోలీసు బయట నిలబడ్డారు. ఇంతలో ‘టక్ టక్’మని తలుపు తట్టారు. వెంగళరావు సీరియస్ అయ్యారు. తలుపు తోసుకొని/తీసుకుని లోపలకి ఆయన కుమారుడు జలగం ప్రసాదరావు ప్రవేశించారు. “ప్రసాద్! నీ జ్వరం తగ్గిందా?” అన్నారు ముఖ్యమంత్రి.
స్టూడియో రికార్డింగ్‌కు వచ్చిన ప్రముఖుల్లో కొందరి వివరణ చెప్పాలి. రాయలసీమ అభివృద్ధి మండలి అధ్యక్షులు కె.బి.నరసప్ప తమ పర్యటనలో సాయంకాలం ఆరు గంటలకు రికార్డింగ్‌కి వస్తామన్నారు. మా సిబ్బంది ఎదురుచూస్తున్నాము. ప్రొద్దుటూరు సభలో పాల్గొని కడపకు రాత్రి 11 గంటలకు వచ్చారు. సరాసరి మా స్టూడియోకి వచ్చారు. “ఆలస్యమైంది బ్రదర్!” అన్నారు.
రాష్ట్ర విద్యాశాఖా మంత్రిగా 1978లో యువకుడు వై.ఎస్. రాజశేఖరరెడ్డి కడపకు వచ్చారు. కోఆపరేటివ్ కాలనీలోని మా తాత్కాలిక భవనాలకు రికార్డింగుకు వచ్చారు. ఆయన కార్యదర్శిగా అప్పుడు క్రిస్టఫర్ పనిచేసేవారు. విద్యాశాఖకు సంబంధించిన గణాంకాలన్నీ రాజశేఖరరెడ్డి గడగడా చెప్పేశారు.
మరో మారు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి మండలి వెంకట కృష్ణారావు స్టూడియోకి వచ్చారు. ఆయన నిగర్వి. ఆర్భాటాలకు తావివ్వని వ్యక్తి. పేరు గుర్తు పెట్టుకుని తర్వాత కలిసినప్పుడు ఆప్యాయంగా పలకరించే ఉత్తమ పురుషుడు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేదురుమిల్లి జనార్దనరెడ్డి హెలికాప్టర్లో కడపలో దిగారు. అప్పటి కలెక్టరు ఏ. యన్. తివారి. ఆయన తర్వాత గవర్నరు కుముద్‌బెన్ జోషి కార్యదర్శిగానూ, ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ వద్ద కార్యదర్శిగానూ వ్యవహరించి, కేంద్ర ఇన్ఫర్మేషన్ కమీషనర్‌గా రిటైరయి ఢిల్లీలో స్థిరపడ్డారు. ముఖ్యమంత్రి గారిని ఇంటర్వ్యూ చేయడానికి పది నిముషాల సమయం కేటాయించమని తివారీని అడిగాను. “టైం వుండదు” అని ఆయన అంగీకరించలేదు.
జనార్దనరెడ్డి గారు బహిరంగ సభలో పాల్గొనడానికి మందీ మార్బలంతో వెళుతున్నారు. జనం మధ్యలో వున్న నేను “నమస్కారం సార్” అన్నాను. “ఏం పద్మనాభరావ్! బాగున్నారా?” అన్నారు. మాదీ నెల్లూరు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంటర్వ్వూ చేశాను. “పది నిముషాలు ఇంటర్వ్యూ చేస్తాను సార్!” అన్నాను. “మీటింగ్ అయన తర్వాత చేద్దాం. గెస్ట్‌హౌస్‌కి రండి!” అన్నారు.
బహిరంగ సభలో కుటుంబ సంక్షేమ పథకాల గురించి తన చేతిలో ఉన్న ”స్లిప్స్’ ఆధారంగా 20 నిముషాలు అనర్గళంగా మాట్లాడారు. సాయంత్రం 6.30కు రహదారి బంగళాకు వచ్చారు. మా రికార్డింగ్ సిబ్బందితో మేం సిద్ధంగా ఉన్నాం.
“తివారీ! గొంతు సరిగా లేదు. నాలుగు తులసి దళాలు తెప్పించండి” అన్నారు ముఖ్యమంత్రి. రెవెన్యూ అధికారులు ఆఘమేఘాల మీద ఆ సంధ్యా సమయంలో ఎక్కడి నుండో పది తులసి దళాలు తెచ్చి ఒక వెండి భరిణెలో ముఖ్యమంత్రికి అందించారు. ఇంటర్వ్యూ మొదలుపెట్టాం. అనర్గళంగా 20 నిముషాలు నేను వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మీటింగులో ఆయన ప్రసంగం విన్నాను గాబట్టి ప్రశ్నలు వెతుక్కోలేదు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు ఆంధ్రప్రాంతంలో, రాయలసీమలో పర్యటించినప్పుడు చొరవ తీసుకుని వారితో ఇంటర్వ్యూలు చేశాను. ముఖ్యమంత్రి యం. చెన్నారెడ్డి, వ్యవసాయ మంత్రి పి. నరసారెడ్డి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి యం.బాగారెడ్డి, దేశీయ వైద్య విధాన మంత్రి టి. హాయగ్రీవాచారి, విద్యాశాఖా మంత్రి పి.వి.రంగారావులతో ఆయాశాఖల విషయాలపై ప్రశ్నలు సంధించి ప్రసారం చేశాం.
కేంద్ర హోం శాఖా సహాయమంత్రిగా 1980-85 మధ్య పని చేసిన పెండేకంటి వెంకట సుబ్బయ్య నాపై ఆదరాభిమానాలు చూపేవారు. నేను అనువదించిన ‘రామాయణంలో స్త్రీ పాత్రలు’ వారికి అంకితం ఇచ్చాను. బనగానిపల్లెలో ఆయన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం రికార్డు చేశాము. నంద్యాల నుండి పి.వి. నరసింహారావు ఎం.పి.గా ఎన్నికైన తర్వాత పి.వి. తరచూ నంద్యాల వచ్చేవారు. ప్రధానిగా వారి పర్యటనను పలుమార్లు రికార్డు చేశాను.
శ్రీమతి ఇందిరాగాంధీ 1977లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేట ఎన్నికల సభలో మాట్లాడారు. ప్రధాని ప్రసంగం కాపీని వెంటనే వారి ప్రెస్ సెక్రటరీ హెచ్.వై. శారదా ప్రసాద్ కందించాను. కేంద్ర ఇరిగేషన్ శాఖా మంత్రి కడప పర్యటనకు వచ్చినప్పుడు వారితో ఇంగ్లీషులో ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ నియోజకవర్గం నుండి గెలిచారు. అది వ్యవసాయ ప్రధాన ప్రదేశం. ఆంధ్ర ప్రదేశ్ కూడా వ్యవసాయ ప్రధాన ప్రాంతం. నేను ఉన్నావ్ ప్రదేశం ప్రస్తావన తీసుకురాగానే ఆయన ఎంతో సంతోషించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పలువురిని రికార్డు చేసిన ఘనత నాది. సహకార శాఖ మంత్రి నల్లారి అమరనాథ రెడ్డి (కిరణ్‌కుమార్ రెడ్ది తండ్రి), బి. శేషశయనరెడ్డి (న్యాయశాఖ). అయ్యప్పరెడ్ది (న్యాయశాఖ), డి. మునుస్వామి, అగిశం వీరప్ప, పి.వి. చౌదరి (దేవాదాయ శాఖ), కె. రోశయ్య, సి. దాస్ (ఇరిగేషన్), మైసూరారెడ్డి (హోం), ఆర్. రాజగోపాలరెడ్డి (వ్యవసాయం), యం. లక్ష్మీదేవి (స్త్రీ శిశు సంక్షేమ శాఖ), బల్లి దుర్గాప్రసాద్ (విద్యాశాఖ), సోమిరెడ్ది చంద్రమోహన్ రెడ్ది, ఆనం రామనారాయణ రెడ్డి, రవీంద్రనాయక్ (గ్రౌండ్ వాటర్) – ఇలా ఎందరో.
మంత్రులను ఇంటర్వ్యూ చేయడానికి చొరవ కావాలి. వారు విశ్రాంతి తీసుకుంటున్నారని పి.ఏ.లు చెబుతారు. ఎలానో సందు చేసుకుని ముఖాముఖీ వారిని కలిసేవాడిని. అప్పట్లో రేడియో ప్రాధాన్యం వల్ల వారు వెంటనే అంగీకరించేవారు. నేను తగిన హోం వర్క్ చేసుకుని ముందుగా ప్రశ్నలు వ్రాసుకుని వారికి చూపేవాడిని.
భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా కడప పర్యటనకు వచ్చారు. కడపలో అప్పట్లో చిన్న విమానాశ్రయం ఉండేది. ఆయన దిగి మంత్రి సామంతులతో ముందుకు నడుస్తున్నారు. విద్యాశాఖామంత్రిగా వారిని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయనకు నా ముఖం పరిచయం. నేను ఎదురుపడగానే “బాగున్నారా?” అన్నారు. చుట్టూ వున్న పరివారం ఆశ్చర్యంగా చూశారు. గెస్ట్ హౌస్‌లో వారిని ఇంటర్వ్యూ చేశాను. అది 1982. అప్పుడే మా నాన్నగారి షష్టి పూర్తి సంచిక వేస్తున్నాను. ముఖ్యమంత్రి సందేశం పేరిట నాలుగు వాక్యాలు వ్రాసాను. ఆయన సంతోషంగా సంతకం చేశారు.
1996లో నేను విజయవాడ ఆకాశవాణి డైరక్టరుగా నాగార్జున సాగర్‌లో ఆహుతుల సమక్షంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. భవనం వెంకట్రామ్ నాగార్జున సాగర్‌లో ప్రశాంత జీవనం గడుపుతున్నారని చెప్పారు. వారిని కలవడానికి మా రికార్డింగ్ యూనిట్‌తో ఆ సాయంకాలం వెళ్ళి కలిశాను. ఆయన ఎంతో ఆనందించారు.
పదవిలో లేని వారిని పనిగట్టుకుని పలకరించడం నా సహజ గుణం. పదవిలో ఉన్నవారిని అందరూ కలవడం అలవాటు. పదవిలో లేని వారిని కలవడం ధర్మం. వెంకట్రామ్ వెంటనే “రేపు మధ్యాహ్నం మా యింటికి భోజనానికి రండి” అన్నారు. “మా టీమ్ పదిమంది దాకా ఉన్నాం సార్! నేనొక్కడినే రావడం….” అంటూ సందేహించాను. “’అదేనయ్యా! అందరూ రండి!” అని షడ్రసోపేత విందు ఏర్పాటు చేశారు. ఆయన ఆప్యాయతకు ధన్యవాదాలు చెప్పి ఆయన అనుభవాలు రికార్డు చేశాము.
1987లో పెండేకంటి వెంకట సుబ్బయ్య బీహార్ గవర్నర్‌గా ఉన్నారు. నాకు ఢిల్లీ బదిలీ అయింది. నాకు క్వార్టర్స్ వెంటనే ఇవ్వలేదు. పది రోజులు ఢిల్లీ బీహార్ భవన్లో నేను వుండేందుకు ఆయన సహకరించారు. నాలుగు రోజుల తర్వాత ఆయన వచ్చినా నన్ను గెస్ట్ రూమ్ ఖాళీ చేయమని కోరలేదు. పదవీ విరమణానంతరం ఆయన హైదరాబాదులో వుండగా పలుమార్లు కలిశాను. అనంతపురంలో అనౌన్సర్ ఇంటర్వ్యూకొక అభ్యర్థి వచ్చారు. వెంకట సుబ్బయ్య సిఫారసు చేశారు గాని ఆ అభ్యర్థి సెలెక్ట్ కాలేదు.
రాష్ట్రపతిగా పదవీవిరమణానంతరం నీలం సంజీవరెడ్డి అనంతపురంలో బస చేశారు – స్వంత ఇంట్లో. రెండు సార్లు కలిసి – “మా స్టూడియోకి రండి సార్. మీ ఊరి ఆకాశవాణి!” అన్నాను. “నేను ఫోన్ చేసి వస్తానులే” అన్నారు. కాని అంతటి స్థాయిగల వ్యక్తి చిన్న స్టూడియోకి రావడం బాగుండదని కాబోలు రాలేదు. నేనూ మరీ మరీ అడగలేదు. ఇదీ రాజకీయ నాయక పరిచయ ప్రహసనం.
(మళ్ళీ కలుద్దాం).
తొలుత లెక్చరర్‌గానూ, తరువాత ఆకాశవాణి, దూరదర్శన్లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించి అడిషనల్ డైరక్టర్ జనరల్, దూరదర్శన్గా ఉద్యోగ విరమణ చేశారు. పద్యంపై మక్కువ కలిగిన అనంతపద్మనాభరావు 150కి పైగా అవధానాలు చేశారు. కథలు, నవలలు వ్రాశారు. అనువాద బహుమతులు పొందారు. ‘దాంపత్య జీవన సౌరభం’, ‘మన పండుగలు’, ‘తలపుల తలుపులు’, ‘అలనాటి ఆకాశవాణి’, ‘అంతరంగ తరంగం’, ‘కథామందారం’, ‘గోరింట పూచింది’ వంటి పుస్తకాలను వెలువరించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పలు అవార్డులు పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™