ప్రపంచవ్యాప్తంగా 123 దేశాలలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. దక్షిణాసియాలోని మడ అడవులలో రమారమి 50% భారతదేశంలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 404 చ.కి.మీ విస్తీర్ణంలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. కోరంగి అడవులు చాలా ప్రసిద్ధి.
పశ్చిమబెంగాల్లోని ‘సుందర్బన్’ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అటవీప్రాంతం. ఒరిస్సాలోని బీతర్లోనూ విస్తారమైన మడ అడవులున్నాయి. నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలలో ఈ అడవులు ఏర్పడతాయి. నదులలో ప్రవాహంతో బాటు కొట్టుకువచ్చే ఒండ్రుమట్టి నదీ ముఖ ద్వారాలలో పేరుకుపోతుంది. ఆ కారణంగా ఇక్కడి నేలలు అత్యంత సారవంతంగా ఉంటాయి. ఇక్కడి నేలలోని నీటిలో సముద్రం, నది రెండింటికి సంబంధించిన లక్షణాలు – మిశ్రమధర్మాలు ఉన్న కారణంగా ఇక్కడి అడవులలో వైవిద్యం అపారం.
గంగానది, యమున, కృష్ణా, గోదావరి, మహానది వంటి నదుల ముఖద్వారాలు అనేక జీవజాతులకు నెలవులు. పీతలు, చేపలు, రొయ్యల వంటి జలచరాలు తమ సంతతికి వృద్ధి చేసుకోటానికి ఇక్కడి చిత్తడినేలలు ఎంతో అనుకూలంగా ఉండటంతో సురక్షితమైనవిగా భావిస్తారు. కారణం ఆల్గే, ఫంగై వంటి అనేక సముద్ర జీవులతో బాటు వివిధరకాలు పోషకాలూ వాటికి లభిస్తాయి. సుమారు ఇరవై రకాల చేపలు, సముద్రపు తాబేళ్ళు, మొసళ్ళు వంటి సముద్ర జీవులు ఈ అడవులకు ఆనుకొని ఉన్న తీరజిల్లాల్లో మనుగడ సాగిస్తూ ఉంటాయి. అనేక జాతుల పక్షులు సైతం ఈ అడవులకు వలసవస్తూ ఉంటాయి. పశ్చిమబెంగాల్‌లోను ‘సుందర్ బన్’ – ‘రాయల్ బెంగాల్ టైగర్స్’కు ప్రసిద్ధి. తుఫానుల సమయంలో రక్షణ కవచాలు గానూ మడ అడవులు ఉపయోగపడుతున్నాయి.
1996, 99 తుఫానుల సమయంలో 70 కిలోమీటర్ల విస్తీర్ణంలో 3300 హెక్టార్ల భూమిని మడ అడవులే కాపాడాయి. ఈ అడవులు తీవ్రమైన వేగంతో వచ్చే గాలులను సైతం నిరోధించగలవు. 200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులనూ ఇది నిరోధించగలవు. తీర జలాలనుండి వచ్చే వివిధ కాలుష్యాలను అడవులు వడబోస్తాయి. పెద్దఎత్తున బొగ్గుపులుసు వాయువును శోషించుకుంటాయి.
మడ అడవులలోని అపురూపమైన వైవిధ్యం అనేక వ్యాధులకు ఔషధ వనరులనూ అందిస్తోంది. మడ చెట్టుకు చెందిన వివిధ భాగాలు మూర్ఛ, ఆస్తమా, అల్సర్స్ వంటి మొండి వ్యాధుల చికిత్సలో వినియోగించబడుతున్నాయి. లక్షలాదిమంది మడ అడవులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆ రకంగా ఈ అడవులు అనేకమందికి బ్రతుకుతెరువు చూపిస్తున్నాయి. కనీసంగా చూసినా 1 హెక్టారుకు ఏడాదికి 10,000 డాలర్లు ఆదాయం ఉంటుందని అంచనా. ధాయ్‌లాండ్‌లో సమర్థవంతమైన విధానాల కారణంగా ఆ ఆదాయం 37వేల 920 డాలర్లుగా ఉన్నట్లు అంచనాలు చెప్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 1 లక్షా 50వేల కిలోమీటర్ల విస్తారంలో 123 దేశాలలో లెక్కలకు, అంచనాలకు అందని జీవవైవిద్యంతో అలరారుతున్న మడ అడవులు ప్రకృతి సమతౌల్యంలో కీలకమైనవి. మనవాళికి ప్రకృతి వరప్రసాదంగా లభించిన ఈ అడవులు వివిధ అవసరాల నిమిత్తం విపరీతమైన వేగంతో విధ్వంసానికి గురి అవుతున్నాయి. విధ్వంసం ఇలాగే కొనసాగితే 2030 నాటికి 60% పైగా మడ అటవీప్రాంతం అంతరించిపోతుందని నిపుణులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
మనదేశంలో శాస్త్రీయంగా మడ అడవుల పరిరక్షణ కార్యక్రమం మొదలైనది పశ్చిమ బెంగాల్‌లోని ‘సుందర్బన్’ నుండే. 2001లో యునెస్కో సుందర్బన్ను ‘బయోస్పియర్ రిజర్వ్’గా ప్రకటించింది. అంతేకాక ప్రపంచ వారసత్వ సంపదగానూ ‘సుందర్బన్’ విస్తరింపబడింది. గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాల మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ‘స్వామినాధన్ రిసెర్చి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఆ సంస్థ సహకారంతో మూడు జిల్లాలలో 520 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ విజయవంతంగా జరిగింది. ప్రజలలో అవగాహన కల్పించి వారిలో పర్యావరణ పరిరక్షణ పట్ల జాగరూకతనూ పెంచడం ద్వారా ‘స్వామినాధన్ ఫౌండేషన్’ ఈ అద్బుతాన్ని సాధించగలిగింది. ప్రజల భాగస్వామ్యం ఉన్న ఏ లక్ష్యాలైనా అద్భుతమైన ఫలితాలను సాధించి తీరతాయి అనడానికి ఇదొక ఉదహరణ.
ప్రస్తుతం డా. ఎం.ఎస్.స్వామినాధన్ ఫౌండేషన్ తరపున ఈ అడవుల పర్యవేక్షణ బాధ్యతను డా. సుబ్రమణియమ్ నిర్వహిస్తున్నారు.
కోస్టల్ జోన్ అధారిటీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల రికార్డులలో ఈ మడ అడవులకు సంబంధించిన సమగ్రమైన సమాచారం ఉంటుంది. ఈ అటవీప్రాంతాలో C.R.Z చట్టం క్రింద నోటిఫై అయి ఉంటాయి. అటవీ పరిరక్షణ చట్టాలలో కూడా మడ అడవుల పరిరక్షణకు సంబంధించి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. వీటిని నిర్మూలించి నాశనం చేసే హక్కు ఎవ్వరికీ లేదు. తప్పని పరిస్థితులలో చెటును కొట్టవలసి వస్తే ’కోస్టల్‌జోన్ అధారిటీ’ నుండి ప్రత్యేక అనుమతులను పొందవలసి ఉంటుంది. మహారాష్ట్ర, కేరళ, రాష్ట్రాలలోనూ మడ అడవులను నరకటం నిషేధమే!
పలు మడ అడవులను యునెస్కో ‘బయోస్పియర్ రిజర్వ్’గా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. స్థానికుల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా మడ అడవుల సంరక్షణ, సమగ్రాభివృద్దుల దిశగానూ యునెస్కో కృషిచేస్తున్నది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™