ఈ మధ్య భారతీయ సైనిక దళాల మీదా, ఇంటెల్లిజెన్సు మీదా, దేశభక్తిని చాటుకునే యే అవకాశాన్ని వదలకుండా సినెమాలు వస్తున్నాయి. వాటిలో “రాజీ” లాంటి మంచి చిత్రాలున్నప్పటికీ చాలా వరకు దేశభక్తి విషయంలో ఆర్భాటము, యుధ్ధోన్మాదమూ వగైరా బాలీవుడ్ మసాలాలు రంగరించుకుని వస్తున్నాయి. అలాంటిదే మరో చిత్రం రోమియో అక్బర్ వాల్టర్.
రోమియో (జాన్ అబ్రహాం) అలి వొక బేంక్లో కేషియర్ గా చేస్తుంటాడు. తండ్రి దేశం కోసం ప్రాణాలు విడిచిన వో సాహసవంతుడైన సైనికుడు. తల్లీ కొడుకులు మాత్రం మిగిలారు. తన ఉద్యోగం కాకుండా రోమియో కి నటన మీద ఆసక్తి యెక్కువ. వొక ప్రదర్శనలో వృధ్ధ కవిగా వేదిక మీద నుంచి కవిత్వం చదివి అందరినీ మెప్పిస్తాడు. అందరితో పాటు రా (Research and Analysis Wing) chief అయిన శ్రీకాంత్ రాయ్ ( జాకీ ష్రాఫ్) ని కూడా. అప్పుడే హిందీ చిత్రాల వాసన వచ్చేసిందా? అవును. మీరు ఊహించింది నిజమే. తర్వాతి సన్నివేశంలోనే చీఫ్ రోమియో ని కలిసి నీకు ఇంతకంటే గొప్ప పాత్ర ఇస్తాను, నువ్వు జీవించవచ్చు, దేశానికి సేవ కూడా చేసుకోవచ్చు అంటాడు. ముసలి పాత్రలో యెవరికీ అనుమానం రాకుండా కవితలు చదివిన అతను సులువుగా సరిహద్దులు దాటి, యెవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి మన దేశపు గూఢచారిగా పని చేసి సమాచారాలు అవలీలగా అందించగలడని చీఫ్ విశ్వాసం. యెంతైనా రోమియో హీరో కదా. యెలాంటి శిక్షణా లేకుండా రా లో కీలకమైన పాత్ర పోషించడం యేమిటి అని అనుమానం రాకూడదని, అది అతని రక్తం లోనే వుందని అతని తండ్రి గురించిన కథ అల్లారు. సరే రోమియో పేరు, వేషం మార్చి అక్బర్ ఖాన్ అవతారమెత్తి ముందు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో అడుగు పెడతాడు. అన్నట్టు అది 1971 అని చెప్పలేదు కదూ. అప్పటికి బాంగ్లాదేశ్ ఇంకా పుట్టలేదు. కేవలం తూర్పు పాకిస్తాన్, పడమర పాకిస్తాన్ మాత్రం వున్నాయి. 1971 ఇండో పాక్ యుధ్ధం, బాంగ్లాదేశ్ ఆవిర్భావానికి కొద్దికాలం ముందుగా జరిగిన కథ ఇది. చాలా మంది అనామక యుధ్ధ వీరుల లాగే రోమియో కూడా వొక యుధ్ధ వీరుడు అని చెప్పడం ఈ చిత్రం ఉద్దేశం.
అక్బర్ ఖాన్ కి అన్ని అవలీలగా అమరి పోతూ వుంటాయి. యెంతగా అంటే పాకిస్తాన్ లో వున్న పెద్ద మారణాయుధాల వ్యాపారి అయిన ఇసాక్ అఫ్రీది (అనిల్ జార్జ్) కు చాలా తక్కువ కాలంలోనే అతి నమ్మకస్తుడైన వ్యక్తిగా దగ్గరవుతాడు. అతని కొడుకైన నవాబ్ అఫ్రీది (షదాబ్ అంజద్ ఖాన్) కంటే కూడా. అక్బర్ మీద నిఘా పెట్టడానికి అతనితో పాటే భారతదేశంలో బేంక్ సహోద్యోగి గా నటించిన శ్రధ్ధా/పారుల్ (మౌని రాయ్) పాకిస్తాన్ లో కూడా అడుగు పెడుతుంది. ఇద్దరి మధ్యా రొమాన్సుకు అవకాశం లేనందున వొక పాట అయితే ఇరికించారు. సరే, అక్కడి సమాచారాలు రా చీఫ్ కి అందుతూనే వుంటాయి. వాటిలో ముఖ్యమైన సమాచారం బద్లిపుర్ లో బాంబుల దాడి జరగనున్నది అన్నది. దాన్ని యెలా అడ్డుకోవాలి, వగైరా మిగతా కథ. అక్కడ అంత మంది అధికారులనూ నమ్మించిన అక్బర్ ఖాన్ వొక కర్నల్ అయిన ఖుదాబక్ష్ ఖాన్ (సికందర్ ఖేర్) ను మాత్రం నమ్మిచలేకపోతాడు. ఫలితం అతను రోమియో మీద వొక కన్ను వేసే వుంచుతాడు. సరే ఇక్కడి నుంచి కథ యెలాంటి మలుపులు తీసుకుంటుందో తెర మీద చూడాల్సిందే.
కథగా కాస్త ఆసక్తికరంగానే కనబడే దీన్ని సరిగ్గా స్క్రీన్ప్లే లోకి తర్జుమా చేయలేక, అదీ రెండున్నర గంటల నిడివిగల చిత్రంగా తయారు చేసి ప్రేక్షకులకు కొంత విసుగు తప్పకుండా కలిగిస్తుంది కథ. ఆ కారణంగా గొప్ప చిత్రం కాకపోవడం అటుంచి కనీసం వొక డీసెంట్ వ్యాపార చిత్రంగా కూడా మిగలలేదు. వొక మనిషి మనస్తత్త్వం క్లిష్టమైన పరిస్థితుల్లో యెలా స్పందిస్తుంది అన్నది చక్కగా కథ అల్ల వచ్చు. ఇందులో కూడా వొక సన్నివేశంలో అతను భారతదేశం తరపున వెళ్ళిన గూఢచారి అయినప్పటికీ వొక ముస్లిం కాబట్టి అతను యెటు వైపు మొగ్గుతాడు అని చిన్న చర్చ వస్తుంది. అంతే. ఆశించిన ఫలితం మాత్రం కనబడదు. గుర్తుంటే రాజీ లో ఆలియా భట్, విక్కి కౌశల్ ఇద్దరి పాత్రలనూ చాలా చక్కగా తీర్చి దిద్దారు. రెండు పాత్రలుగా కాక ఇద్దరు మనుషులుగా చూస్తాము వాళ్ళని.
సరే రోబీ గ్రేవల్ దర్శకత్వం ఇంకా మెరుగ్గా చేయతగ్గది అనిపించుకునేలా వుంది. 1971 నాటి సమయాన్ని బాగానే రీక్రియేట్ చేశారు. చాయాగ్రహణం (తపన్ తుషార్ బసు) బాగుంది. నేపథ్య సంగీతం నేలబారుగా వుంది. పాటలు పెద్దగా గుర్తుపెట్టుకునేవిగా లేవు. రబ్బి షేర్గిల్ ని చూడటం, వినడం బాగుంది అదీ అతని “బుల్లెయా” పాటను వేరే లిరిక్స్ లో. సికందర్ ఖేర్, జాకీ ష్రాఫ్, అనిల్ జార్జ్, రఘుబీర్ యాదవ్ ల నటన బాగుంది. మిగతా వారిది పర్లేదు. చాన్నాళ్ళకి సుచిత్రా కృష్ణమూర్తిని చూస్తాము. ఇంతకంటే పెద్దగా చెప్పుకోవడానికి ఇందులో యేమీ లేదు. కనీసం సినెమా నిడివి అయినా తగ్గించి వుంటే తక్కువ ఇబ్బంది పడతారు ప్రేక్షకులు.
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™