“అనుక్షణికం” తెలుగు సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలో ఒక అద్భుతమైన గొప్ప నవల అంటాను నేను. నేను చదివిన, విన్న సాహిత్యంలోకెల్లా ఇటువంటి రసాత్మకమైన, రమణీయమైన, ప్రయోజనాత్మకమైన నవల ఇంకెక్కడా లేదేమోనని నా సందేహం. ఉన్నచో అది నా అమాయకత్వం కావచ్చు. ఈ నవలను గురించి చెప్పాలంటే ముందు రచయిత ఈ నవలను గురించి ఏమన్నాడో చెప్పాలి. “ఇట్ ఈస్ ఏ నావెల్ అబౌట్ బీస్ట్లీనెస్ అండ్ సెయింట్లీనెస్ అండ్ బీస్ట్లీ సెయింట్లీనెస్ అండ్ సెయింట్లీ బీస్ట్లీనెస్”. “అనుక్షణికం ఒక సాంఘిక తాత్విక నవల”. తెలుగు పాటకులు చాలామంది ప్రేమలు పెళ్ళిళ్ళ నుండి, మాఫియాలు, డిటెక్టివ్‌ల నుండి, పగలు ప్రతీకారాలు, గూ౦డాలు హింసల రొచ్చు, రాజకీయాలు, బజారు బూతు నుండి బయట పడలేని బలహీనతలో ఉన్నప్పుడు ఈ నవల వచ్చింది. వాటన్నిటి నుండి విడివడి ఒక దశాబ్ద కాలంలో తెలుగు విద్యార్దులు ఒక విశ్వవిద్యాలయంలో వెలగబెట్టే వారి చదువులు, ప్రేమలు, రాజకీయాలు, గొడవలు, గ్రూపులు, ఆశలు, ఆశయాలు ప్రతిభావంతంగా చూపిన మనో వైజ్ఞానిక నవల ఇది. ఇది ఎక్కువమంది పాటకుల వద్దకు చేరలేకపోయిందా? వాళ్ళు ఈ నవల దరిదాపులకు రాలేకపోయారా? అనేది పెద్ద ప్రశ్న. ఏదేమైనా రసజ్ఞులైన ఆనాటి కొంతమంది సాహితి పిపాసను తీర్చిన, అద్భుత కథా కథన చాతుర్యం ఈ నవలలో మనం గమనిస్తాం. చదువరులను రసజగత్తులో ఓలలాడించిన మహోన్నతమైన చారిత్రక నవలగా కూడా చెప్పవచ్చనుకుంటాను. వివిధ రకాల వ్యక్తుల, భిన్నదోరణుల, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మానసిక, నైతిక, కామ, మోహ, మౌన ఆలోచన ధోరణులను అత్యంత రమణియంగా, ఆసాంతం సర్వాంగ సుందరంగా వర్ణించిన ఒక శతాబ్దపు తెలుగు నవల. ఆ నవలలోని పాత్రలు, సంభాషణల సోయగం, వాళ్ళ మేనరిజం, ఆయా ప్రాంతాల మాండలిక పదాలు, పలుకుబడి, ఆ ఒరవడి ఇంకోవిధంగా వుండవన్నంత సహజ సుందరమైన రీతిలో శిల్పీకరించిన తేట తెలుగు నవల ఇది. ఆంధ్రదేశంలోని ఓ దశాబ్దపు యువతి యువకుల తీరుతెన్నులను, సంభాషణా చమత్కారాలను, విపరీత మనస్తత్వాలను, విశేష ప్రతిభా పాటవాలను ఈ నవలలో వర్ణించిన తీరు, పాత్రపోషణలో చూపిన ప్రతిభ పండితుల నుండి పామరుల వరకు చకిత్చకితులను చేసిన అంశం. “అనంత వైవిధ్య మానవ స్వభావాన్ని కేవలం బ్రహ్మాండంలో అణుమాత్రమంత నేను స్పృశి౦చాను” అంటాడు రచయిత చండీదాస్. ఈ నవల ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా రాబోయే ముందు ‘అనుక్షణికం చదవడం మీ తాత్విక స్థాయికో నిదర్శనం, మీ అభిరుచికో నూతనత్వం’ లాంటి కాప్షన్స్‌తో మంచి అభిప్రాయాన్ని కల్గించి వుండేది. అంతకుముందే హిమజ్వాల చదివిన నాలాంటి వారికి చాలా ఉత్సాహాన్ని కలిగించింది. వారం వారం ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎప్పుడెప్పుడోస్తుందా? అని ఎదురు చూసే వాళ్ళం. ఆ నవల చదువుతూ మిత్రుల౦ చర్చించుకునేవాళ్ళ౦. ఆ నవలలో తారసిల్లినన్ని పాత్రలు ప్రపంచ ప్రసిద్ద నవల “వార్ అండ్ పీస్”లో గమనిస్తాం. మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన “కాశీ మజిలీ కథలు”లో ఎన్నో పాత్రలున్నా అందులో అనుక్షణిక౦లో పోషింపబడిన ‘యూనిటీ అఫ్ టైం’ గానీ, యూనిటీ అఫ్ ప్లేస్ గానీ, యూనిటీ అఫ్ క్యారక్టరైజేషన్ గానీ లేవు. అనుక్షణిక౦లోని పాత్రల మనోవిశ్లేషణ గాని, ఆ పాత్రల స్వాభావికమైన అవస్థలు గాని, అలజడులు గానీ, స్థాయి భేదాలు గానీ, ముఖ్యంగా సంక్షిప్తత గాని ‘వార్ అండ్ పీస్’లో గానీ ‘కాశీ మజిలీ కథల’లో గానీ నేను గమనించలేదు. వార్ అండ్ పీస్‌ను తక్కువ చేసి చెప్పడం నా వుద్దేశ౦ కాదు కాదు. అదొక మహత్తరమైన సాటి లేని నవల. భర్త విపరీత పశు వాంఛా దురాగతాలకు కనలి, కృశించి, బలి అయిపోయిన ఆత్మహనన – సీత. సీత చావుకు కారణాలు తెలిసి, అదే భర్తను కొంగున ముడి వేసుకుని, అతని చేష్టలనే ఒడుపుగా తిప్పికొట్టి, ధైర్యంగా ఎదిరించి, బెదిరించి తనచేప్పు చేతుల్లోకి నేర్పుగా భర్తను తెచ్చుకున్న ఛ౦డ ప్రఛ౦డిక – కనకదుర్గ. కనిపించిన ప్రతి ఆడపిల్లను పొందాలని ఆరాటపడే సరసుడు, వందనచేత చెంపదెబ్బ తిన్న విరసుడు, కస్తూరి లాంటి అమాయక ఆడపిల్లను లేవదీసుకుపోయి, వంచించి, ప్రజాపరం చెయ్యగల విజయుడు. సీత చావుకు కారకుడు, దుర్గ చేతికి చిక్కి, శల్యమైన పారాహుషార్ -విజయకుమార్. ప్రేమించిన వాడి వెంట నడవలేక, తండ్రి మాటను కాదనలేక, ఊగిసలాటలో మోసపోయి, చివరికి తండ్రి దిద్దుబాటుతో జీవితాన్ని సర్దుకున్న స్రవంతి. విద్యుదయస్కాంత కాంతి ఘాతం, తండ్రిని, సంఘాన్ని, నీతి తప్పిన ఎంతటి వాడినయినా నిలవేసి శిలువ వెయ్యగల నిత్య హోమాగ్ని, పోలిసుల ‘కిడ్నాప్‘కు చిక్కి, తెలివిగా తప్పించుకువచ్చి, అరుణ కాంతుల వెంట అరణ్యాలకు నడచిన విప్లవధాత్రి, రాడికల్ గాత్రి – గాయత్రి. సదవగాహనతో, లౌక్యంగా, అప్పుడప్పుడూ ఉగ్రంగా, నమ్మిన సిద్ధా౦తాల బాకాల నెత్తుకుని గమ్యం చేరాలనే క్రాంతి, తప్పిపోయిన ఇంతి రహస్యపు చేజాబు వెంట అదృశ్యమై పోయిన మౌన మోహనం – మోహనరెడ్డి. పుట్టటమే కాంతి పువ్వుగా పుట్టి, నమ్మలేని నిజంలా అన్పించి, తారాస్థాయిలో వీణా నాదాన్ని ద్రవంగా మార్చి, తేనెలో కలిపి, స్వరపేటిక తంత్రులుగా ఘనీభవి౦చినట్లుగా ఆ స్వరం – పాలు, వెన్నెల, మంచు, తేనే, కాటుక, విద్యుత్తు, మామిడి చివుళ్ళు, సూర్య కిరణాలు అన్నింటిని అనురాగంలో రంగరించి, కలిపి, జపాన్ చిత్రకారుల లాలిత్యపు గీతలతో, అజంతా చిత్రకారుల ముగ్ద రేఖలతో ఆకృతిగా మలిస్తే – అదే ఎలా సాద్యం? అందుకే స్వప్నరాగలీన ఒక స్వప్నం. అనురాగ పరస్పరాధీనత – ‘అనంత్‘ను అనంత కోటి వీణా స్వరాలతోమీటి, తెగిపోయిన తంత్రియై, అనాఘ్రాతమై, ఆశనిపాతమై, గిటార్ తీగల తీయని స్వరరాగ మోహావేశంలో పడి చలించి, జ్వలించి, స్ఖలించి, అనంత్ వొడిలో విశ్రమించి అనంత వాయువుల్లో కల్సి, ఎటకో కానరాని, తిరిగిరాని లోకాలకు ఎగిరిపోయిన పాలపిట్ట – అనురాగాలపుట్ట – స్వప్నరాగలీన. స్వప్న కోసమే ఎన్నో యుగాలనుండి నిరీక్షిస్తున్నట్లు, సంస్కారగుణ సంశోభితుడు, అభినవ సుకుమారుడు – ‘ ఏ నయా ఛో క్ రే కే సామ్నే ప్ఫిల్లిం హీరో స్ భీ కుచ్ నహీ హోతా’ – చేతి వేల్ల లో గిటార్ వాయిద్య సౌందర్య సిరులను దాచుకున్న సంగీత రసధుని, ప్రేమించిన దానిలో నిగూఢ౦గా మాత్రుమూర్తి ని దర్శించి, స్వప్నను నిజం చేసుకుని అలరించలేక, ఆనంద సందోహ డోలలపై ప్రేమించిన దాన్ని ఊగించలేక, రస నిష్ఠురమై, రతి నిష్పలమై, సంకెళ్లకు చేరువై, సంఘానికి దూరమై, స్వప్నలోకపు అలుపులేని మహాసౌఖ్యాలకు మెంటల్ హాస్పిటల్ కు ప్రయాణమై పోయిన – అనంతరెడ్డి మధ్య తరగతి మారణ హోమం. తల్లిని ‘కామంతో కొవ్వెక్కి ఎవడితోనో‘ అని పబ్లిక్‌గా అనగల్గి, ‘కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తానంటే‘ మేనమామను ‘నువ్వెవడి వి నా పెళ్లిని నిర్ణయించడానికి?’ అని అంతు లేని ఆత్మాభిమానంతో అందమైన అమ్మాయిని, అంతకుమించిన ఆస్తిని వదులుకొని, వెంటబడ్డ ఏడ౦తస్తుమేడ నళినిని ఓరకంట కూడా చూడకుండా, గొప్ప ఉపన్యాసకుడిగా వాసికెక్కి, నిక్కమైన నిజాయితీ పరుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, చింతమొద్దు లాంటి భార్య ‘గంగి‘ చింతలకు చిక్కి వేసారి, కాలప్రవాహంలో అధికార పరిష్వంగ లాలసకు లోనై, మధువును మరిగి, నీతిని నిప్పులోకి నెట్టి, కుర్చీ వెంట పరుగులు పెట్టి, కాల దన్నిన దాన్నే కాళ్ళా వేళ్ళా పడి, కుర్చీని దక్కించుకున్న రాజకీయ కంపులో కూరుకు పోయిన – గంగినేని రవి. మురికి గుంటలో వున్న దాన్ని అందలమెక్కిస్తే, నానా గడ్డీ కరిచి, బలిసి కొవ్వెక్కి, కామంతప్ప మరేమీ లేదని భావించి, సుఖాల తీపులకోసం, యువరక్తపు బాహువులకోసం, కార్లలో కేళీ విలాసానంద విందులకై పరితపించి, ఇంటివాడి నెదిరించి తిరుగుబాట పట్టిన చింత మొద్దులాంటి బ్లాక్ రోజ్ – ‘గంగి’. మనసుకు నచ్చినవాడు ‘రవి‘. నిజాయితీ జూసి నేయ్యమందబోతే, అందని ద్రాక్షపండులాగా అందకుండా ఆకాశాన తారకై ఎగిరిపోయాడు. అందిన పోకిరీ ‘అంకినీడు’ చచ్చుపుచ్చు వంకాయయితే, చిల్లర సినిమాలు తీసి ఉన్నదంతా ఊడ గొట్టుకొని ఏడుపు ముఖంతో ఇంటికివచ్చి కాళ్ళావేళ్ళా పడితే క్షమించి, కట్టుకున్నదానికి బదులు దాని చెల్లిలికి కడుపు చేస్తే, ముఖానికి పేడగొట్టి, గడ్డిపెట్టి, ’అయ్యో పాపం స్వంతమొగుడే గదా’ అని అంతలోనే కరుణించి, దీవించి, తను శుభ్రమై, మొగుడిని సరస శృంగారయాత్రకు తీసుకు పోగలిగిన అందాల జవ్వని, మాటలు నేర్చిన మోహిని, ఆమెపేరు నళిని. చిత్త కార్తె కుక్కలకు చక్కని పరిష్కారం విశ్లేషించి చూపిన రంగారెడ్డి, వేశ్యా వృత్తిలో కుడా విలువలు తప్పని, వారిలో కూడా ఆత్మీయానురాగాలుంటాయని, మానవత్వం కస్తూరిలా పరిమళింప జేసిన-కస్తూరి. ఆ చూపులు – కామ౦లో పుట్టి, కామంలో పెరిగి, కామంలో పండి, కామంతో నిండి మండే మహాకామం చూపుల రమణి – పేరు రమణే. సెక్సో౦పు, సెక్స్ సొంపు – ముద్ద్దుపెట్టుకోవడంకోసం కంపించి అలా ఒంపు తిరిగినట్లుగా వుండే పై పెదవి – ముఖం లాగానే ఒళ్ళు – సెక్సీగా – సెక్స్ కాంతి, సెక్సాకర్షణ, బొద్దుక్రిందకు చీరగట్టి – ఏపుగా పెరిగిన స్థనాలు – వేటినీ దాచని దేవతాంబర౦, పెదవి విరచడమో, కనుబొమ్మలు వొ౦చడమో, వొళ్ళు నాజూగ్గా విరుచుకున్నట్లుగా కదలడమో, పెదవి మునిపంట నొక్కటమో ‘అన్నింటిలోనూ సెక్సీతనం’. సగటు బ్రతుకుతో తృప్తిలేక, బోళాయి తనపు హైసొసైటీ హిపోక్రాటిక్ ఆర్భాటాలకు అట్టహాసాలకు ఆరాటపడి, సామాన్య పతిని ఈసడించుకుని, మాయల మరాఠి “ఇంద్రారెడ్డి “ మంత్రదండం వెంటనడచి, ‘సూర్య మహల్’ చిలుక పంజరం స్మగుల్డ్ సూర్యప్రకాష్ గుండు సూదులకు కందిపోయి, ఆక్రోశించి, ఏడుపులోంచి నవ్వి, మళ్ళీ నవ్వింది తార. నటించే నిజం తారగా మళ్ళీ నవ్వింది తార.. జీవితాన్ని నవ్వులాటగా చేసుకుని, పాపాలాల్ పైత్యానికి పెనుగులాడి, విసిగి వేసారి, అసహ్యపడి, అంతిమక్షణాల తారస్తనాల అంతిమ యాత్ర.- తార. ఇలా చెపుతూ పొతే ఎన్నో పాత్రలు, ఒకదానికొకటి పోలిక లేకుండా, ఎక్కడేగాని సుత్తిదెబ్బలు అనిపించుకోకుండా, ఆహ్లాదకరంగా, ఆసక్తిని గొలిపి, అబ్బురపరిచే పాత్రల గమనం ‘ఓవ్‘ అనిపిస్తుంది. వేదవతి, సుబ్రహ్మణ్యం, శాంత, చారుమతి, రామ్మూర్తి, విమల, నిర్మల, వరాహశాస్త్రి, వెంకటావధాని, వందన, రమాదేవి, రత్నాకర్ రావు, గంగారం, అంకినీడు, గోవర్ధనరెడ్డి, సూర్యప్రకాష్, మొదలగు పాత్రలు – వారి తీరు తెన్నులు, దారులు, గమనంలో పాటకులను వారి వెంట లాక్కు పోతూ, మనసంతా జరజరా ప్రాకి, మెదడంతా పురుగులాగా తొలిచి విభ్రమ కలిగిస్తారు. అయితే ముఖ్యంగా – ‘సెంటర్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అండ్ హార్ట్ ఆఫ్ ది నావల్’ – ఏ పాత్రను గురించి చెప్పకపోతే నవల పూర్తి గాదో ఆ పాత్ర – ఏ సిద్ధాంతాలకు, ఆదర్శాలకు, ఆజ్ఞలకు, అదుపులో లేకుండా, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లుగా వుండి, వేశ్యను పతివ్రతను సమదృష్టితో చూడగల, తార్కిక, తాత్విక రసపిపాసి; నవలలో తెల్లబోయి వేర్రిమొగం వేయించగలిగిన సంభాషణా చతురుడు, ఆకుకు అందకుండా పోకకు చిక్కకుండా, జనంలో ఏకాంతీకరిస్తూ, ఏకాంతంలో ఆనందించగలిగే; ప్రతి విషయాన్ని తరచి తరచి లోతులు చూస్తూ, మాటల కత్తులు విసురుతూ, వాదిస్తూ, వినోదిస్తూ, అన్నింట్లో వుంటూ, దేంట్లోనూ లేకుండా, ఈ ప్రపంచంతో తాదాత్య్మత చెందుతూ అనంత జీవన యాత్రా పధికుడు, నిరంతర చింతనా చైతన్య మహా విజ్ఞాన మేధో నిధి – మేకా కుమార వెంకట శ్రీపతి. ఈ నవల అతడితో మొదలై, అతడితోనే అంతమౌతుంది.
నవలను మొదులు పెట్టున తర్వాత నీకు తెలియకుండానే అందులో కూరుకు పోతావు. కాసేపైన తర్వాత ఓ చిరుగాలి మొదలై పెనుగాలిగా మారి నిన్ను దిక్కు తెలియని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చిరు చిరు జల్లులు మొదలై నిను తడిపి తుఫాన్ భీభత్సం అలల వెంట బడి ఆ అనుభవాన్ని తనివిదీరా ఆస్వాదించక తప్పదు. ఆ సంఘటనల, మనోహర దృశ్యాల, కమనీయ పలుకుల ప్రవాహ వాలులో నీవు కొట్టుకుపోవలసిందే. ఆ సంభాషణా చాతుర్యం, సహజాతి సహజ మాండలిక పదాల పోహళీ౦పు ఒరవడిలో నీవు ముగ్దుడవవాల్సిందే. అది ఆ నవల ప్రత్యేకత. సాహిత్యం మీద, సంగీతం మీద, చిత్రాలమీద, చిత్రకారుల మీద, సినిమాల మీద, తారల మీద, విరసం మీద, సరసం మీద, సెక్స్ మీద, ప్రేమల మీద, శోభనాల మీద, ఎమెర్జెన్సీ మీద, నీతుల మీద, వేదాంతుల మీద, రాజకీయుల మీద, చిత్త కార్తె కుక్కల మీద, ఇంకా ఎన్నో విషయాల మీద కామెంటరీ వినాల్సిందే. రచయిత వాస్తవాలను చెప్పేటప్పుడు దేనికీ తలవంచకుండా, వున్నది వున్నట్లుగా, తాననుకున్నట్లుగా, ఆ పాత్ర అంటోంది అన్నట్లుగా రాయడం ఆ రచయితకే చెల్లింది. అదో గొప్ప ధీరత్వం. శ్రీ శ్రీ, ఇందిరాగాంధీ, చెన్నారెడ్డి, వెంగళరావు ఆనాటి రాజకీయ నాయకుల మీద కామెంట్లు చెయ్యడం సాహసమే. ‘ఆ మాటలు ఆయా పాత్రలంటాయి ఆ విధంగా‘ అంటాడు రచయిత. అయితే ఆ నవలలో రాసిన సెక్స్ మాటల వల్ల ఆ నవల అత్యంత వివాదాస్పదమైంది. సెక్స్ పాళ్ళు ఎక్కువగా వున్నాయి, రెచ్చగొట్టే కామసంబంధమైన మాటలు విచ్చలవిడిగా వాడాడని వాపోయిన ఎంతోమంది పాటకులకు జవాబిస్తూ, “కాకికేమి తెలుసు సైకో అనాలిసిస్? జంతువుకేమి తెలుసు రసానుభూతి? మనిషికి ఆకలి తర్వాత అత్యంతావశ్యకమైంది లైంగికావసరం. నిఘంటువుల్లో లేనిది, సమయమ సందర్భం కానకుండా, అసభ్యంగా, అసహ్యకరంగా వాడితే గదా మీరంతా గగ్గోలు పెట్టాల్సినది. మనిషిలోని సహజమైన గుణరూపం ఎదురుగా వచ్చి నిలబడితే కలిగే తత్తరపాటు” అంటూ ‘సెక్స్ సెక్స్‘ అనే మహా నీతిపరులను నిలదీస్తాడు రచయిత. తాత్విక దృష్టితో చూసినప్పుడు, మానవ లైంగికా వసరంగా చూసినప్పుడు, ఏ పాఠకుల కోసం ఆ విధంగా రాశాడోనని, ఏ ఏ సందర్భాలలో, సమయాలలో ఆ భాషను ఉపయోగించాడోనని పరిశీలించినప్పుడు అసలందులో సెక్స్ లేదు, వాస్తవమైన వర్ణన తప్ప. మొత్తం మీద ఈ నవల సమగ్ర సాహితీ శిల్పం, శైలి, వస్తువు, ప్రయోజనం దృష్ట్యా చూసినప్పుడు; ”అనుక్షణికం” తెలుగు సాహితీ జగత్తులో ఓ మరపురాని, మిరుమిట్లు గొలిపే, కోటి టన్నుల మెగ్నీషియం కాంతి పుంజం. పందొమ్మిది వందలా డెబ్భై నుండి ఎనభై సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన రాజకీయ విశేషాలను, సంఘంలోని వివిధ ఆచార, వ్యవహార ఆలోచనా రీతులను, స్థల, కాల, నిర్దేశాలతో కూడిన సాంఘిక, ఆర్ధిక విశ్లేషణ ఈ నవల. పాత్రలను ఇంటి పేర్లతో పరిచయం చెయ్యడం, ఆ పాత్ర హోదా, ఆదాయ స్థాయిలను వివరించడం, ప్రతి విషయాన్ని పాత్రల ద్వారానే చెప్పించడం, రచయిత తానుగా ఎలాంటి జోక్యం చేసుకోకుండానే క్షణం క్షణం అనుక్షణం ఆ పదాల విరుపు, ఒడుపులతో నవలను నడిపిన తీరు – చదవాల్సిందే తప్ప వర్ణించలేం.
డి. రామచంద్ర రాజు
డి. రామచంద్ర రాజు. చక్కని కవి. విమర్శకుడు. వీరి రచనలు పలువురి ప్రసంశలు అందుకున్నాయి.
I grew up reading this novel. The character “Sripathi” made a deep impression on me. Even today after 35 years, I compare myself to this character. Remarkable. No other novel stayed with me so long. Salute to Vaddera Chandidas for this.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™