దూరంగా నడిచివస్తున్న శ్రీకాంత్‌ని ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు మల్లేష్. అతని చేతిలోని పార కింద విడిచి కళ్ళు చికిలించి తను చూస్తున్నది నిజమేనా అన్నట్టు అనుమానంగా వుండిపోయాడు. వస్తున్న శ్రీకాంత్ మల్లేష్‌ని గుర్తించి చెయ్యూపాడు. అంతే చేతులకున్న మట్టి దులుపుకుని, గట్టుమీదకి ఒక్కగెంతు గెంతాడు మల్లేష్.
“ఏంటీ యిట్లొచ్చావ్? బాగున్నావా?” అన్నాడు.
“అంతా బాగానే వుందిగాని నువ్వేంటి ఇక్కడ?” అన్నాడు శ్రీకాంత్.
“ఏముంది లాక్డౌన్ మూలంగా కంపెనీ వర్క్ ఆగిపోయింది, పని ఆగింది. జీతమూ ఆగింది. మళ్ళీ ఎప్పుడో తెలీదన్నారు. ఇప్పుడైనా ఇక్కడ అమ్మి అయ్యతాన వుందామని వచ్చేశా” అన్నాడు మల్లేష్.
“నాదీ అదే స్టోరీ”
“వుత్తినే కూర్చుంటే ఇక్కడ మాత్రం గడిచే మార్గం ఏది? అందుకే ఇక్కడికొచ్చా” అన్నాడు మల్లేష్.
మల్లేష్, శ్రీకాంత్ చిన్నప్పటి స్నేహితులు. ఇద్దరూ ఐయిదోక్లాసు వరకు కలిసి చదువుకున్నారు. ఇద్దరూ తెలివైనవాళ్ళే. కష్టపడి చదువుకుని పైకొచ్చినవాళ్ళు. తల్లీదండ్రీ కూలీనాలీ చేసి, కడుపులు కట్టుకుని బిడ్డల్ని చదివిస్తే, బాధ్యతగా గవర్నమెంట్ స్కాలర్షిప్లు తెచ్చుకుని చదువుకుని ఒకరు సాప్ట్వేర్ ఇంజనీరయి, మరొకరు ఎమ్ ఎస్సీ, బియిడీ చేసి ప్రయివేట్ కాలేజీలో లెక్చరర్ అయ్యారు.
కంపెనీ మూతపడి మల్లేష్ సొంతూరు వస్తే – చేసే కాలేజీ మూతబడి శ్రీకాంత్ వచ్చాడు – వాళ్ళు ఉద్యోగాల్లో చేరి రెండేళ్ళు కూడా కాలేదు. డబ్బు దాచుకునేంత టైమేది? ఊర్లోకి వచ్చిపడ్డారు.
ఇద్దరూ జీన్స్ ప్యాంట్లు వున్నారు. మల్లేష్ ఎర్రటి టీ షర్ట్ వేసుకున్నాడు. శ్రీకాంత్ పూర్తి చేతులున్న కాటన్ షర్టు వేసుకున్నాడు. ఇంతగా ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉండగా మేస్త్రీ వచ్చి ఇద్దర్నీ పలకరించాడు.
“అన్నా! పనిచేస్తా” అన్నాడు శ్రీకాంత్. అతని పేరు వివరాలు వ్రాసుకుని పని అప్పగించాడు.
ఇద్దరూ – ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ – ఒక లెక్చరర్ కలిసి పనిచేస్తున్నది ఉపాధిహామీ పేరున ప్రభుత్వం తాత్కాలిక భృతికోసం యిస్తున్న పని, అదే ఉపాధిహామీ పధకం.
రోజుకి 237/- రూపాయలు కూలీ – అదీ అపురూపంగా భావించి ఇద్దరు యువకులూ పనిలోపడ్డారు.
మేస్త్రీ రాంబాబు వచ్చి కబుర్లు పెట్టాడు. “ఇదేం కాలం నాయనా! ఎన్నడూ ఊహించలేదు సరికదా, అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉంది. పట్టణాల్లో పదవుల్లో వున్నవాళ్ళూ, ఉద్యోగాల వాళ్ళు దారి తోచనట్లు వచ్చి, ఈ పనుల్లో పడుతున్నారు” అన్నాడు.
నిజానికి వాళ్ళు ఈ కూలీనాలీ చేసినవాళ్ళు కాదు. వారికంత బాగా పని తెలీదు కూడా. కానీ అవసరం వాళ్ళని ఇక్కడికి నెట్టింది.
“బయటకు రావద్దు – ఇంట్లోనే వుండండి. మనిషికీ మనిషికీ కనీసం మీటరు దూరం వుండాలి. పెద్దవాళ్ళు బయటకు రావద్దు. నలుగురు గుమికూడ వద్దు, వీలైనంత వరకు తరచూ చేతులు సబ్బుతో కడుక్కోండి. మీ అరచేతులతో ముఖాన్నీ, ముక్కు, కళ్ళు, నోరు తాకకండి” అంటున్నారు.
“జ్వరమొచ్చినా, జలుబుచేసినా, తుమ్ములొచ్చినా వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి” అంటూ రోజూ హోరెత్తించేస్తున్నారు.
“బాబూ! మల్లేష్! నీకేమైనా అర్థమైందా?” అన్నాడు ఆకాశం కేసి చూసి దణ్ణం పెట్టి, లెంపలేసుకున్నాడు రాంబాబు.
“మనం ఏ పని చేశాము అన్నది ప్రశ్న కాదండి రాంబాబు. అన్నిపనులూ గొప్పపనులే. ఏదీ తక్కువ కాదు. ఏదీ ఎక్కువ కాదు నీ కప్పగించిన పని నువ్వు నిజాయితీగా చెయ్యి, దీనినే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. మన సమాజంలో కొన్ని గొప్ప పనులు మరికొన్ని చౌకబారు పనులు అని నిర్దేశించి, సమాజాన్ని విభజించి పాడు చేశారు” అన్నాడు శ్రీకాంత్ తను లెక్చరర్ కావడం వల్ల సహజంగా వున్న మాటల పొందికతో-
రాంబాబు ఎంతో ఆనందపడ్డాడు. “ఎంతయినా సదుకున్నాడు చదువుకున్నవాడే” అన్నాడు.
“ఈ ఉపాధిహామీ పధకాన్ని అందరూ చులకన చేసినవాళ్ళే. ఇదే ఈ రోజు ఆదుకుంటుందని ఎవ్వరూ వూహించలేదు”
ఈ లాక్డౌన్ సమయంలో ఈ పథకానికి ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. గత ఏడాది ఈ సమయంలో సుమారు ముప్పైవేలమంది (30,000) హాజరయ్యారు. కానీ ఇప్పుడో ఎనభైవేలమంది (80,000) వస్తున్నారు. పనులులేవు. డబ్బులు వచ్చేమార్గం లేదు. గవర్నమెంట్ ఉదారంగా, ఆదరంగా యిచ్చేది ఏం చాలుతుంది? అది అందరికీ అందుతోందా? అందరూ లబ్ధి పొందగలుగుతున్నారా చెప్పలేమండీ” అంటూ రాంబాబూ పెదవి విరిచాడు.
“అంత తేడా కనిపిస్తోందా కూలికొచ్చిన జనం లెక్కల్లో” అన్నాడు ఆశ్చర్యంగా మల్లేష్.
“నిజమే బాబూ! పోయినేడాదికీ ఇప్పటికీ పోలికే లేదనిపిస్తోంది” అన్నాడు.
“అవును. ఏదో విధంగా కష్టపడి గౌరవంగా డబ్బు సంపాదించుకోవాలని ప్రతి పౌరుడూ ఆశిస్తాడు. సాధ్యపడకపోతే అన్యమార్గాల కోసం వెతుకుతాడు”
“ఏప్రిల్ – మే నెలల్లో మరో అరవై అయిదు రూపాయల దాకా అలవెన్సు యిస్తారు. సమ్మర్ కదా” అన్నాడు రాంబాబు.
“ఈ పథకం ప్రవేశపెట్టిన వారు కూడా కలలోనైనా ఊహించి ఉండరీ పరిస్థితి” అన్నాడు శ్రీకాంత్.
“ఇదెక్కడి కరోనా! దాని పేరు తలుచుకుంటేనే భయం కలుగుతుంది. మందు లేదట, మనిషి నుంచి మనిషికి – అది కనిపించదు – ఏం చెయ్యాలో తోచదు”
శ్రీకాంత్ తల్లి అన్నం పట్టుకొచ్చి ఇద్దరికీ పెట్టి పాత దోస్తులను చూసి ఎంతో మురిసిపోయింది గానీ “సదూకున్న పోరగాళ్ళకీ మట్టీమశానం పనేమిటి?” అంటూ కంటతడి పెట్టింది.
ఊర్లో చెరువు పూడిక పనులు రోడ్లు మరమ్మత్తులు ఎక్కడ ఏ పని చేయాల్సి వుంటే అది చేయించటమే ఇక్కడ పని అవుతుంది, కూలి లేనివాడికి కూలీ చేతిలో పడుతుంది.
శ్రీకాంత్, మల్లేశ్ ప్రపంచం గురించి, భవిష్యత్తు గురించి ఎంతో మాట్లాడుకుంటూ విషయాలు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. రాజేష్ – మురళి – వేణు – నరసింహులు – నాగేష్ – ఇలా ఎందరో వారితో చదువుకున్నవారూ, చదువు మానేసినవారూ వచ్చి వీరి పనిలో చేరడం చూస్తూ ఆశ్చర్యపోతున్నారు.
“ఈ పథకం గురించి ఒకసారి మాష్టారు క్లాసు చెప్పినపుడు మనిద్దరం చాలా హేళన చేశాం గుర్తుందా” అన్నాడు శ్రీకాంత్.
మల్లేష్ నవ్వి “ఆఁ….ఆఁ…. ఎందుకు గుర్తులేదు బాగా గుర్తుంది. ఆ రోజు మనం అడిగిన ప్రశ్నలకి మాష్టారు జవాబు చెప్పలేకపోయారు”
“అవును కానీ ఇంటికెళ్ళి మా అయ్యతో అదే చెప్పాను. ఆయనేమన్నాడో ఇప్పటికీ గుర్తుంది. “చేసిన ప్రతిపనినీ చిన్నగా చేసి మాట్లాడకూడదు. తప్పు. పెద్దోళ్ళు ఎంతో ఆలోచన చేసి, నలుగురు మాట్లాడుకుని కదా ఇలాంటివి చేస్తారు” అన్నాడు.
“నీకేం తెలీదులే అయ్యా” అని కొట్టిపారేశాను.
అప్పటికి మా తాత బతికున్నాడు. ఆయన పేరే నాకు పెట్టేరంట ఆయన నన్ను చంటిగా అని పిలిచేవాడు. పాటలు బాగా పాడేవాడు. నాకాయన మాటలు, పాటలు భలే యిష్టంగా వుండేది.
“ఓ పాట మరీ పాడేవాడు, అది విని మా అమ్మ తిట్టిపోసేది. కోడల్ని చూసి తాత నవ్వేవాడు. పాట పాటే”
“అవునూ! నువ్వూ పాడతావుగా ఓ పాట పాడు” అన్నాడు శ్రీకాంత్.
“మంచిగానే చెప్పావ్ – మేస్త్రీగానీ వింటే పని పీకి, పైసలు చేతిలో పెడతాడు. అప్పుడు రోడ్డుమీద పాడుకుంటూ అడుక్కోవడమే” అన్నాడు గట్టిగా నవ్వుతూ.
“ఛా! అవేం మాటలు” అన్నాడు.
“అదంతే ఇంతకీ ఆ పాట పాడు నెమ్మదిగా పాడు.”
చిత్రమైనది విధి నడక-
పరిశోధనే ఒక వేడుక
రాజులే రారాజులే గానీ –
వీరాధివీరులే గా
విధిని గెల్చుట ఎవరి తరము?
దాని వెంట నడుచుటయె గానీ…
ఇంకా చాలా మాటలు నాకు రావు – ఓ రోజు నేనూ కలిసి పాడితే మీ అమ్మ బాగా బడితె పూజ చేసింది”
శ్రీకాంత్ మల్లేష్ చేతులు బొబ్బలెక్కిపోయాయి. అలవాటు లేని పని ఆ తల్లులు కళ్ళనీళ్ళతో కొబ్బరినూనె రాసి, వెన్నరాసి చూస్తూ వుండిపోయారు.
వాళ్ళిద్దరికే కాదు అక్కడికొచ్చి పనిచేస్తున్నవారంతా ఈ మోటపని ఎరుగని వారే. అందరి పరిస్థితి ఇదే.
అరవై అయిదు డెబ్బై ఏళ్ళ వాళ్ళు బయటికి రాకూడదు లోపల జాగ్రత్తగా ఉండాలి. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి పౌష్టికాహారం తినాలి.
“అసలు తిండికే ఇబ్బందిగా ఉంటే అందులో బలమైన ఆహారం ట… హీ…హీ…హీ…
కుర్రకారంతా పైకి నవ్వుతూ, లోపల్లోపల భయపడుతూ బాధపడుతూ, దిక్కుతోచకుండా, చేతికందిన పని చేసుకుంటూ అగమ్యగోచరమైన భవిష్యత్తు వైపు చూస్తున్నారు.
శుభ్రత పాటించాలి. మనిషికి మనిషికీ దూరం వుండాలి – చేతులు కలపటం ఆప్యాయతాలింగనాలు వద్దు.
కొన్ని వందల శ్రీకాంత్‌లు, మల్లేషులు – రాజేష్‌లు, రాంబాబులు దిక్కుతోచకుండా లాక్డౌన్లో చిక్కుకుపోయి వున్నారు.
పైనుంచి బాంబులు పడుతున్నాయా – గోతుల్లో దూరి ప్రాణాలు కాపాడుకోవాలా – లేదే.
అంతా జలమయమై ఏ చెట్టుపైన చిటారు కొమ్మపైననో ప్రాణాలు చేతపట్టుకుని – హెలికాప్టర్ విసిరే అన్నం పొట్లం కోసం ఎదురు చూస్తున్నామా – కాదే.
భూకంపంలో రాళ్ళమధ్య ఇరుక్కుపోయి -ఎవరొచ్చి చెయ్యి అందిస్తారా అని వణికిపోతున్నామా? – కానేకాదే. మరి ఇదేమిటి? ఈ కరోనా కంటికి కనిపించదు. ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏమో- మీరు జాగ్రత్తగా వుండండి!! అంతే –
జాగ్రత్తగా వుండటం అంటే అర్థం ఏమిటి?
1 Comments
KONDURI KASIVISVESWARA RAO
Madam Janaki Balagaru, Bhayam Bhayam kadha chadivanu. Mana jeevithamlo Ballu Vodalavuthayi alage Vodalu Ballu avuthayi ani cheppena nanudi aksharala Nizam Nizam ani manam thelusukovali. Life is a temporary shed. Some times we may life in
hamlet, some times in the town, some time times in the city. Our life is a drama, if we are rich life is a cinema. Life is a journey. Nobody is permanent here, but we have to life with hope. Again good days will come. The song is highlight of this story. Thank you madam. Special thanks to the Sanchika Editor garu and team members.
Konduri Kasivisveswara Rao, Writer