నాతో అలా తేలుతూ వుండు. చనిపోయావా? నువ్విప్పుడు ప్రాణం లేని మాసపు ముద్దా? ఏం చేస్తున్నావు? నా నోట్లో నీళ్ళు పోతున్నాయి. అవును కదా, ఏదో నాడు మనం అందరం పోవాల్సినవాళ్ళమే కదా. అబధ్ధం అబధ్ధం కాదు. నువ్వు క్రాక్ చెయ్యలేని వో కోడ్ మాత్రమే. బహుశా నేను ప్రయత్నిస్తున్నాను. ఏమైంది, నువ్వు నీటిలో శ్వాస తీసుకోలేవా. వింతగా వుందే. లేదు. నీళ్ళ అడుక్కి పో. ఊపిరి తీసుకో. బాగుంటుంది. నాకేం కనబడట్లేదు. …..
ఇవే చిత్రంలోని సంభాషణలు కొంచెం అటూ ఇటుగా. పలుమార్లు అవే. చిత్రం పదిహేడు నిముషాల “Come Swim”. దర్శకురాలు 26 ఏళ్ళ క్రిస్టెన్ స్టీవర్ట్. మొదట్లో ఒక అల, నెమ్మదిగా లేస్తుంది. తెరంతా అదే. నేపథ్యంలోని సంగీతం వేగమూ, వాల్యూమూ పెరుగుతూ వుంటాయి. ఆ లల్ వచ్చి ముంచేస్తుందా అన్నట్టు భయం గొల్పుతుంది ఎవరికైనా. అప్పుడు చూపిస్తుంది ఆమె ఆ వ్యక్తిని (జోష్ కాయే). భయంగా చూస్తున్నాడు అలను. నెమ్మదిగా నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. కిందనుంచి ఎవరో లాక్కుంటున్నట్టు. ఊపిరాడట్లేదు. ఆ తర్వాతి సీన్లో అతనే మంచం మీద నిద్రపోతున్నాడు. తలలో అవే సంభాషణలు. లేచి మంచి నీళ్ళు తాగుతాడు. ఎలా అంటే ఎన్నాళ్ళ నుంచో దాహం తీరనివాడిలా. ఇది కూడా చిత్రం మొత్తం వేరు వేరు సందర్భాల్లో వస్తుంది. అదే పనిగా, కసిగా, ఆర్తిగా మంచినీళ్ళు తాగడం. ఒక చీకటి బంధిఖానాలోంచి చెక్క గోడను పగులగొట్టి వెలుతురునూ, గాలినీ పీల్చుకుంటాడు. మరో సారి కలలో నీటి అడుగున తనే నిశ్చలంగా పడున్నట్టు. కారులో వెళ్తున్నా దాహం. వర్షం పడుతుంటే కారులో తలదాచుకుంటాడు. అతని చర్మం క్రమంగా కమిలినట్టు, చర్మ వ్యాధి వచ్చినట్టు అవుతుంది. అలా మొహమంతా అది పాకే వరకూ. అప్పుడు అతను కూడా కారులోంచి విసిరివేయబడి నేల మీద పాకుతూ వుంటాడు. ఆ రోజు ఆఫీసులో కంప్యూటర్ ముందు నిర్లిప్తంగా కూచుని వున్నాడు. తోటి ఉద్యోగి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి వెళ్తాడు. ఇన్ని రకాల మాంటేజెస్ తర్వాత, అతను వొక కొలను దగ్గర. పిల్లల స్వరం ఒకటి, రెండు, మూడు, గో. అతను నీళ్ళల్లోకి దూకుతాదు. కాసేపు ఇష్టంగా గడిపి, నెమ్మదిగా బయటకు వచ్చి రాతి మీద కూర్చుంటాడు. అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. అతని జీవితంలోని ఒక రోజులో రకరకాల అనుభవాలు, అనుభూతులు. భయం, అభద్రతా భావం, ఊపిరాడనితనం, దాహం తీరని తనం, పీడకల, నిశ్చింత నిద్ర, వెంటాడే జ్ఞాపకం. ఒక్కొక్కటీ, అన్నీనూ. ఉమ్మనీటిలో సుఖంగా వున్న ప్రాణం చివరికి ఈ లోకంలో పడ్డట్టు చివరి సీను. ఆ రోజు అతని పుట్టినరోజాయే. ఏదీ వాచ్యంగా వుండదు. అధివాస్తవిక చిత్రాల్లా, నిజ జీవిత చిత్రాల్లా, మనో చిత్రాల్లా, అన్నీ కలగలసిన గ్రాఫిటీ లా. ఇది వ్యాఖ్యానించగల చిత్రం తక్కువ, అనుభూతి చెంది ఆస్వాదించగల చిత్రం ఎక్కువ. అవును ఆస్వాదించగల అన్నాను, అన్ని రకాల అనుభవాలూ ఆస్వాదించతగినవే. భయంలో కూడా ఒక రకమైనటువంటి ఆనందం వున్నట్టు. 26 ఏళ్ళకే ఇంత చక్కని చిత్రం ఎలా తీయగలిగావు అని అడిగితే , ఇది నేను పదేళ్ళ ముందే తీసి వుండాల్సిన చిత్రం అంటుంది క్రిస్టెన్. ఏమనాలి. ఒక సినిమా తెర మీద పుట్టకమునుపు ఆ దర్శకుని కనుపాప మీద పుడుతుంది. దాని తెరమీదకు బదిలీ చేసేటప్పుడు తన క్రూ మొత్తన్ని అది “చూపించి” తెరమీద అచ్చుపడేలా చెయ్యాలి. భలే ప్రయాణం అది. ఇదంతా ఒక ప్రేలాపనలా తోస్తే యూట్యూబ్ లో సినిమా వుంది, చూసెయ్యండి. ఒక కల నుంచి మేల్కొన్నట్టు అనిపించకపోతే నన్నడగండి.
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™