ఎక్కడి నించో వచ్చానా? ఎవరో సృష్టించారా? మనుషుల భయపెడుతున్నానా? మిమ్ముల కబళిస్తున్నానా? మందే లేని మాయరోగమై మిమ్ముల వణికిస్తున్నానా? అవునేమో, అవునవునేమో. మనుషుల బుద్ధే నాకొచ్చిందీ మనుషుల తెలివే నాకంటిందీ మనిషికి మల్లే ఆకలి పెరిగే అందర్ని మింగాల్సొస్తుందీ…
నల్లుల ఆకలి బల్లుల ఆకలి గర్జించే మృగరాజుల ఆకలి తిన్నవెంటనే తీర్తుందోయ్, తీరి, నిద్రపొమ్మంటుందోయ్. మనుషుల ఆకలి తీరనే తీరదు ఎంత తిండైన చాలదు చాలదు. భూమిని తొలిచీ డొల్లను చేసీ మసి బొగ్గుల్నీ, పెట్రోలియాన్ను మేంగనీసునీ, బాక్సైటునీ పచ్చని పచ్చని బంగారాన్నీ లెక్కలేనంత ఇనుప ఖనిజాన్ని ఎన్నెన్నెన్నో అమూల్యమైన ఖనిజ సంపదలు మింగేస్తున్నా మనిషి ఆకలికి అంతులేదుగా మనిషి ఆశలకి అంతులేదుగా. వేసిన బోర్లకి లెక్కలేదూ తోడే నీటికి అంతే లేదు భూజలమంతా ఇంకిపోయినా ఆశల మోసాలు లేస్తూంటాయే!
మహా మహా మహా పర్వతాలనీ నింగిని అంటే కొండల్నీ కంకరరాళ్ళుగ మార్చేశారు మంగళ గీతం పాడేశారు. ప్రాణవాయువుల పెంపొందించే చెట్లను నరికీ పొట్టలు పెంచీ విషవాయువులనీ గాలిలో కొదిలీ, నదీనదాలలో గరళం పోసీ ప్రకృతి నంతా ధ్వంసం చేసీ అక్కడితో ఆగక నింగికి కూడా రాకెట్లంపీ శాటిలైట్సంపీ ఓజోను పొరకూ తూట్లు పొడిచీ బుద్ధిజీవులం మేమేనంటూ విర్రవీగిన జాతి మీదేగా!
మేం గొప్పంటే మేం గొప్పంటూ నలుపు తెలుపుల కత్తుల పట్టీ సమాజాన్ని నడి మధ్యకు నరికిన మహానుభావులు మీరు, మీరేగా! గాలీ నీరూ నిప్పూ నింగీ భూమండలాన్ని నాశనం చేసిన మేధావులు మీ మానవులేగా!
నరకాసురుడూ భస్మాసురుడూ మతి లేని ఆ మహిషాసురుడూ హిరణ్యాక్షుడూ హిరణ్యకశిపులు ఇప్పటికీ బ్రతికున్నారోయ్ మీలోనే దాగు న్నారోయ్. చైనాలోనూ యూరప్‌లోనూ యుఎస్ఎ రష్యాల లోనూ జనాన్ని మింగిన ధాతువు నేనే. మీ దేశానికి వచ్చేసరికే నాలో శక్తి సగం నశించే! గంటలు కొట్టీ చప్పట్లు కొట్టీ చీకట్లో దీపాలు వెలిగించీ లాక్డౌన్ పెట్టీ క్వారంటైన్ లెట్టీ – నా పై యుద్ధం ప్రకటించారే! నన్నో విలన్‌గా చూపించారే!
భోజనశాలకు తాళం పెట్టీ వైను షాపుల్ని బార్లగా తెరిచారే స్కూళ్ళనన్నిట్నీ మూయించేసీ ఆన్లైనంటూ రంకెలు వేశారే. మీరు చెప్పేటి నీతులు గొప్పవి మీరు చేసేటి చేతలు తగనివి. డబ్బుల్లెక్కలు తెలియవు గానీ మీరే లెక్కలు కట్టింది నేను మింగింది లక్షకి తక్కువ మీరు మింగింది లక్షల కోట్లు.
అయినా బ్రదరూ నిజాన్ని చూడు చిల్లులు పడ్డ ఓజోన్ పొరకి నేనేగ అతుకులు వేసిందీ శవాలు తేలే దివిజ గంగను నేనేగ శుభ్రం చేసింది. ప్రపంచమంతా నిండిన వాయు కాలుష్యాన్ని మింగానే రసాయనాల్నీ విషవాయువుల్ని నేనే జల్లెడ పట్టానే! కంటికి దొరకని దేవిని నేను మీ మనుమళ్ళకి భావిని నేను. కొద్దో గొప్పో నష్టం కష్టం కలిగించే వుంటాననుకో!
మనుషులు చేసే మర్డర్ల ముందర కుత్తుక నులుమే కులాల ముందర మదమెక్కించే మతాల ముందర, వర్గాల ముందర వర్ణాల ముందర్ మాఫియాల మహమ్మారుల ముందర రౌడీ గూండా బాసుల ముందర నేనెంత నా శక్తెంత? ఆర్నెల్లున్నా ఆరేళ్ళున్నా మీ మనసుల్లో మార్పు రాదుగా మీ చేతల్లో దయ వుండదుగా బ్రతుకు శాశ్వతం కాదని తెలిసీ ఖాళీగా వెళ్ళాలని తెలిసీ తప్పులు చైక ఉండలేరుగా. అందుకే బాబూ అందుకే తండ్రీ ఆఖరి ఛాన్సు నేనిస్తున్నా ప్రకృతి మాతను శరణం వేడు ప్రకృతియే నీ నీడా తోడూ నా మాటింటే బ్రతికుంటావ్ కాదంటే నువ్వే చస్తావ్.
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు” అనే పుస్తకాలు వెలువరించారు.
ప్రచురించినందుకు ధన్యవాదాలు. నమస్సులతో…. BC
శరణు వేడుకోవాలి. అంతే. ఇన్ని చెప్పాక బుద్ది మారాలి. బాగా చెప్పారు
చాలా బావుంది సర్💐
👌👌కడిగి పారేసారు. . (మానవాళి చేసిన, చేస్తూన్న తప్పిదాల్ని వరుసపెట్టారు) చాలా చక్కని కవిత గురువర్యా
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™