అదిగో పులి అంటే ఇదిగో తోక అనే మనస్తత్వం బాగా ప్రబలిపోయింది సమాజంలో. దీనికి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా కావలసినంత దోహదం చేస్తున్నాయి. వాస్తవానికి రంగులు పులమటం, మసాలా జోడించటం ఆకర్షణీయంగా మార్చటం, తమ సిద్ధాంతాలకి అనుకూలంగా మలచటం, వ్యాఖ్యానించటం వాటి పని అని అర్థం చేసుకోకుండా సామాన్యులు నమ్మేస్తున్నారు. పైగా ఎవరైనా ఇది నిజం కాదేమో అంటే టీవీలో చెప్పారనో, వాట్సప్‌లో వచ్చిందనే నమ్మకంగా చెపుతారు.
కారణం ఏమంటే అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ. నిజం నీళ్ళ లాగా స్వచ్ఛంగా ఉంటుంది సాధారణంగా. నీళ్ళు ప్రాణం నిలవటానికి అవసరమే అయినా మనసు రంగునీళ్ళ మీదికే పోతుంది అదేమిటో మరి. ఏదైనా ఒక సంఘటన విన్నాక వెంటనే ఆలోచించకుండా నిర్ణయాలకి రాకూడదని పెద్దలమాట ఉన్నదే కదా! “వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనే వేగ పడక వివరింప దగున్…” అని. అయితే ప్రస్తుతం అంతటి అవసరం, అవకాశం కూడా ఉండటం లేదు. మన కోసం వాళ్ళే తమ కోణంలో ఆలోచించేసి, మన నెత్తిన రుద్దుతుంటే వాటిని వెర్రిగొర్రెలలాగా ఆహ్వానించి నెత్తిన పెట్టుకుని, బుర్రకెక్కించు కుంటున్నాం. బుర్రలో కొంచెం గుజ్జు ఉంది, అది పని చేస్తూనే ఉంది కదా!
ఉపయోగించుకుంటే గొర్రెలం కాక సింహాలుగా ఉంటాం.
ఎక్కడో ఏదో సంఘటన జరిగింది. జరిగిన దానిని జరిగినట్టు యథాతథంగా చెపితే చాలు నిజానికి. ఉహుఁ! అట్లా సరిపోదు. అది ఎవరి మీద బురద చల్లటానికి ఉపయోగించుకోవచ్చు? అన్న ఆలోచన చేసే వారే అధికం. ఆ పత్రిక గాని, రేడియో కాని, టీవీ కాని ఆ సంఘటనని తమ భావజాలాలకి అనుకూలంగా వ్యాఖ్యానించటం జరుగుతుంది. మెదడుని ఉపయోగించటానికి కూడా బద్దకం ఐన మనుషులకి ఈ వ్యాఖ్యానాలని నమ్మటం సుఖం. మెదడుని ఉపయోగించ వలసిన పని లేదు కదా!
ఎన్ని విధాలైన రంగులు ఆపాదించబడతాయో! మతం రంగు పూసే వాళ్ళు కొందరు, కులం రంగు అద్దేవాళ్లు కొంతమంది. రాజకీయ రంగు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యక్తిగత, సిద్ధాంత, వ్యాపార, వ్యవహార పరమైన ఇష్టానిష్టాలు, లాభనష్టాల బేరీజులు…. ఇంకా ఎన్నో అక్కడ పని చేస్తాయి.
మరొక పెద్ద సంఘటన నుండి దృష్టి మరల్చటానికి అతి చిన్న విషయాన్నొక దాన్ని పట్టుకుని, రకరకాల దృష్టి కోణాల్లో విశ్లేషించి, చీల్చి చెండాడి, ఆలోచించే అవకాశం లేకుండా చేయటం ప్రధానాంశం. పైగా వద్దనుకున్నా మన ఇంటికి, మన మధ్యకి వచ్చి మరీ రొద పెట్టటం జరుగుతోంది. ఇష్టంగానో అయిష్టంగానో వాటినే చూసి, చూసి ఆ భావాలు మనస్సులో తిష్ఠ వేసుకోవటం జరుగుతుంది. ఏ మాత్రం ఆలోచించినా ఆ వార్తావ్యాఖ్యలు ఎంత పక్షపాతంతో ఉన్నాయో, డొల్లతనంతో కూడుకొని ఉన్నాయో అర్ధమవుతుంది. కాని ఆలోచించం కదా!
ఈ మధ్య బాగా తెలిసిన వారిని కొద్దికాలం తరువాత కలవటం జరిగింది. ఎట్లా ఉన్నారు? అని అడిగితే చాలా బాగున్నాను అన్నారు. నిజంగానే బాగున్నారు అంతకుముందు చూసినప్పటికన్న. రహస్యం ఏమిటి? అని అడిగితే చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. “ఈ మధ్య వార్తాపత్రికలు చదవటం, టీవీ చూడటం మానేశాను” అన్నారు. మరి, ప్రపంచంలో ఏం జరుగుతోందో ఎట్లా తెలుస్తుంది? అన్న ప్రశ్నకి “రేడియో ఉంది కదా! అందులో వార్తని వార్తగా చెపుతారు. అనవసర విషయాలు జోడించరుగా!” అన్నారు.
ఏం వినాలో, చూడాలో మనకి తెలియదు అని బాగా అర్థమయింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™