యుధిష్ఠిర శకానికి 1100 సం॥ల క్రితమే మగధస్థాపన జరిగింది. కలిపూర్వం 36కి ముందు -1100+36+ బి.సి.ఇ.3102 –4238 సం॥ల క్రితం స్థాపించ బడింది. అంటే మగధరాజ్యస్థాపనకు పూర్వం ఆ వంశానికి మూలపురుషులైనవారు 7 తరాల వారున్నారు – సంవరణుడు మొదలు మగధరాజ్యస్థాపకుడైన ప్రధమ బృహద్రధునివరకు. ఆ ఏడుగురికి సంబంధించిన 700 సం॥ల కాలాన్ని కలిపితే (4238+700) 4938 సం॥ అవుతుంది. అంత కాలం నుండి మగధరాజ్యానికి మూలపురుషుల వంశాల పరంపర వస్తున్నదని తెలుస్తోంది. భారతయుద్ధంలో మగధరాజైన సహదేవుడు (జరాసంధుని కొడుకు) మరణించాడు. అతని దాయాదైన సోమాధి (సోమాపి), మగధకు రాజయ్యాడు. మగధరాజధాని పేరు గిరివ్రజం (రాజగృహం).
యుధిష్ఠిరుడు హస్తినను పాలిస్తున్న కాలంలోనే మగధను బార్హద్రథవంశానికి చెందిన సోమాపి అన్న రాజు పాలించాడు కలి పూర్వం 36లో. క.పూ. 36 నుండి బి.సి.ఇ. 3138–2132 వరకు 22మంది బార్హద్రథులు 1006 సం॥రాలు మగధ సామ్రాజ్యాన్ని పాలించారు. వీరిలో చివరివాడు రిపుంజయుడు బి.సి.ఇ. 2132 వరకూ పాలించాడు.
మగధకు రాజైన రిపుంజయుని అతని మంత్రి చంపి అతని కూతుర్ని తన కొడుకైన ప్రద్యోతనునికిచ్చి వివాహం చేసి మగధకు రాజుగా చేసాడు. ప్రద్యోతనుని నుండి ఆ వంశంలో చివరి రాజైన నందివర్ధనుని వరకు 5గురు రాజులు 138 సం॥లు పాలించారు. ప్రద్యోతుడు బి.సి.ఇ. 2132 నుండి బి.సి.ఇ 2109 వరకు పాలించాడు.
శిశునాగుడన్నవాడు నందివర్ధనుని చంపి, తాను రాజయ్యాడు మగధకు. శిశునాగుడి నుండి చివరి వాడైన మహానంది వరకు మొత్తం 10 మంది, 360 సం॥లు పాలించారు బి.సి.ఇ. 1994 నుండి 1634 వరకు.
కలిశకం 1468 సంII అంటే బి.సి.ఇ. 1634లో హస్తినాపుర చక్రవర్తులలో ఆఖరివాడైన క్షేమకుడు, అయోధ్య రాజులలో ఆఖరివాడైన సుమిత్రుడు పుత్రసంతానం లేక మరణించారు. అందువల్ల మగధరాజు చక్రవర్తియై మగధసామ్రాజ్యాన్ని విస్తరింపచేసి ప్రాముఖ్యత సంపాదించాడు.
శిశునాగ వంశంలో 4వ వాడైన క్షేమజిత్తు రాజ్యకాలంలో అయోధ్య రాజవంశంలో 23వ వాడైన శుద్ధోధన మహారాజు కుమారుడైన సిద్ధార్థుడు (గౌతమబుద్ధుడు) జన్మించాడు బి.సి. 1887 సం॥లో, బి.సి.ఇ. 1868లో సన్యసించాడు. 1807లో నిర్యాణం చెందాడు. బుద్ధుడు 80 సం॥లు జీవించాడు. రానురాను వైదిక ధర్మం క్షీణించసాగింది. యాగాల్లో పశుహింస జరగడం వల్ల ప్రజలు విసిగిపోయారు. ఆ సమయంలో సిద్ధార్థుడు సన్యసించి వేదవిరుద్ధ మతాన్ని ప్రజల్లో బోధించాడు.
మగధసామ్రాజ్యం క్షత్రియుల చేతుల్లోంచి క్షత్రియేతరుల-నందుల (శూద్రుల) చేతుల్లోకి వెళ్ళింది. మగధరాజైన మహానంది యొక్క అక్రమసంతానం మహాపద్ముడు అంటారు. మహాపద్ముడు మగధరాజైన మహానంది యొక్క సేనాని. కుటిల నీతితో రాజును బంధించి యౌవ్వనంలో వున్న రాజు భార్యలలో ఒక భార్యతో 8మంది సంతానాన్ని కన్నాడు. తన పేరుని మహాపద్మనందుడుగా మార్చుకుని 1634-1546 వరకు పాలించాడు. ఈతడు తన పాలనలో చాలామంది క్షత్రియులను సంహరించి క్షత్రియేతరులను సామంతరాజులుగా చేసుకొన్నాడు. ఈ రాజులకు సహాయంగా బ్రాహ్మణులను మంత్రులుగా చేసుకొన్నాడు. ఇప్పటి నుంచీ బ్రాహ్మణులలో ఆధ్యాత్మికత పతనమవనారంభించి, వారు విషయ లోలురుగా మారారు. వీరు కత్తిపట్టి క్షాత్ర వృత్తి కూడా అవలంబించసాగారు. మహాపద్మనందుని మంత్రి రాక్షసుడనే పేరుగల బ్రాహ్మణుడు. మహాపద్మనందునితోపాటు అతని 8మంది కుమారులను కలిపి నవనందులనేవారు. ఈ నందులు చాలా దుర్మార్గులు. వీరు సుమాల్యుడు మొదలైన 8 మంది సోదరులు 1546-1534 వరకూ 12 సం॥లు రాజ్యం చేసారు.
మౌర్యసామ్రాజ్య స్థాపనలో చాణక్యుడి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆ విషయాలు తెలుసుకుందాం :
చాణక్యుడన్న బ్రాహ్మణుడు నందులవల్ల అవమానం పొంది, వీరిని పదవీచ్యుతులను చేస్తానని ప్రతినపూని అన్నంత పనీ చేసి, మహానందుడు, మురలకు జన్మించిన చంద్రగుప్తుని రాజుగా చేసాడు. అప్పటి నుండి మగధను మౌర్యులు పాలించారు.
చంద్రగుప్తుడు మౌర్య వంశానికి మూలపురుషుడు. ఇతనే చంద్రగుప్త మౌర్యునిగా ప్రసిద్ధిగాంచాడు. మన ఆధునిక చరిత్రలో చెప్పినట్టు ఈ చంద్రగుప్తుడు గ్రీకురాజైన అలెగ్జాండరుకు సమకాలికుడు కాదు. ఇతను మౌర్యచంద్రగుప్తుడు. అలెగ్జాండరు సమకాలికుడు గుప్తచంద్రగుప్తుడు. ఇద్దరు చంద్రగుప్తులున్నారు. (1) మౌర్యచంద్రగుప్తుడు, (2) గుప్తచంద్రగుప్తుడు. అలెగ్జాండరు బి.సి.ఇ 327 సం॥లో భారతదేశంపై దండెత్తాడని ఆంగ్లేయ చరిత్రకారులన్నారు. అప్పటి చంద్రగుప్తుడు గుప్త చంద్రగుప్తుడు, అంతేకాని మౌర్య చంద్రగుప్తుడు కాదు.
చంద్రగుప్తునితో కలిపి 12మంది రాజులు మగధను బి.సి.ఇ.1534-1218 వరకూ 316 సం॥లు పాలించారు. చంద్రగుప్తమౌర్యుడు చాణక్యుని అండలో ధర్మంగా పాలన చేసాడు. వేదధర్మాన్ని పాటించాడు. చాణక్యుడు చంద్రుగుప్తునికి మంత్రిగా రాక్షసమంత్రిని నియోగించి, తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
చంద్రగుప్తుని కొడుకైన బిందుసారుడు బౌద్దమత భావాలు కలిగివున్నా కూడా వైదిక ధర్మాన్ని గూడా గౌరవించేవాడు.
బిందుసారుని కుమారుడైన అశోకుడు మౌర్యవంశంలో 3వ తరంవాడు. కళింగ యుద్ధం తరువాత హింసను విడనాడి బౌద్ధధర్మ దీక్షను స్వీకరించి బౌద్ధాన్ని రాజమతంగా చేయడం వల్ల వైదిక ధర్మానికి ప్రజల్లో ప్రచారం, పోషణ తగ్గిపోయింది. బౌద్దానికి ప్రచార, పోషణలు ఎక్కువయ్యాయి. దానివల్ల తరువాత వచ్చిన రాజులు బలవంతులు కాలేకపోయారు. రాజ్యమంతా అల్లకల్లోలమైపోయింది. అట్టి స్థితిలో మౌర్యవంశం పతనమవసాగింది.
మౌర్యరాజుల్లో ఆఖరివాడు బృహద్రథుడు. ఇతను బౌద్దధర్మాన్ని అవలంబించి నిర్వీర్యుడిగా మారాడు. బౌద్దం మూలాన దేశంలో క్షాత్రం నిర్వీర్యమైపోయింది. రాజవద్ద సైనికులుండేవారు కాదు. బౌద్ధసన్యాసులు రాజులను గుప్పిట్లో పెట్టుకొని యుద్ధం చేయడం మహాపాపమని బోధిస్తూ, ధనాన్ని బౌద్ధారామాల నిర్మాణం కోసం బౌద్ధ సన్యాసుల కోసం ఖర్చు పెట్టించారు. ఈ సమయంలో విదేశీయుల దండయాత్రలు జరగడం మొదలయ్యాయి. బృహద్రథుడు స్త్రీలోలుడు, పిరికివాడు. రాజ్య వ్యవహారాలు నిర్లక్ష్యం చేస్తాడు. దీనివల్ల శకహూణాదులు విజృంభించసాగారు. రాజ్యంలో అరాచక స్థితి కలిగింది. ప్రజల ప్రాణ, మాన వితాలకు భంగం కలగడం మొదలైంది. ఈ సమయంలో ధర్మ సంరక్షణకోసం బ్రాహ్మణులు ఖడ్గ ధారణచేసి రాజ్యాధికారం చేపట్టడానికి అవకాశం కలిగింది. ఇట్టి స్థితిలో మౌర్యవంశాన్ని అంతంచేసి సుంగ/శుంగవంశ బ్రాహ్మణులు రాజ్యాధికారం చేపట్టారు.
బృహద్రథుని మంత్రి పుష్యమిత్ర సుంగుడు, (మంత్రికుమారుడని కొందరంటారు) బృహద్రధుడ్ని చంపి తాను భారతదేశ చక్రవర్తిగా అయ్యాడు. ఇతన్ని పతంజలి మహర్షి తీర్చిదిద్దాడు. రాజ్యమతాన్ని అనుసరించి ప్రజలు సంచరించే స్వభావం కలిగివుండడం మూలాన ప్రజలలో బౌద్దమత భావాలు సన్నగిల్లి, వైదిక ధర్మాలను ఆచరించి, వర్ణధర్మాలను నిలబెట్టసాగారు. ఈ బ్రాహ్మణ రాజులు వేదధర్మాన్ని పోషించినట్లే బౌద్ధిధర్మాన్ని గూడా పోషించారు. ఈ సుంగవంశంలోనివారు 10మంది రాజులు బి.సి.ఇ. 1218 నుండి 918 వరకు పాలించారు. ఇక్కడ పతంజలి మహర్షి గురించి కొంచెం తెలుసుకుందాం.
పతంజలిమహర్షి చిత్రకూటప్రాంతంలో ఉండేవాడు. ఆయన వేదవేదాంగాలు నేర్చినవాడు, మహాకవి, పండితుడు, తత్వజ్ఞుడు. ఒకసారి కాశీలో జరిగిన శాస్త్రగోష్ఠిలో ఓడిపోయి, బాధపడి, శారదాదేవిని ఆరాధించి ప్రసన్నం చేసుకున్నాడు. తర్వాత ప్రసిద్ధికెక్కి గొప్ప శాస్త్రాలను రచించాడు. పతంజలిమహర్షి మనస్సు, వాక్కుకాయం అన్న మూడింటికి వ్యాఖ్యానం ఇచ్చాడు :
సంస్కృత భాషా స్వరూపాన్ని సూత్రాలతో అష్టాధ్యాయి అన్న పేరుతో పాణిని మహర్షి రచించగా, దానికి కాత్యాయన మహర్షి ‘వార్తికాలు’ అన్న పేరుతో వివరణ ఇచ్చాడు. పతంజలి వీటిపై మహాభాష్యాన్ని రచించాడు. పతంజలి గురించి ఒక విచిత్రమైన కథ ప్రచారంలో ఉంది. పతంజలి ఆదిశేషుని అంశ. ఆయనవద్దకు కొందరు శిష్యులు విద్య నేర్చుకోడానికి రాగా ఆయన కొన్ని నిబంధనలు పెట్టాడు :
ఇంకా పాఠం మొదలవలేదని ఒకడు లేచి బయటకు వెళ్ళాడు. తరవాత గురువు పాఠం ఎలా చెపుతున్నాడో చూద్దామని ఒకడు మధ్యలోనున్న తెర ఎత్తి చూసాడు. వేయి పడగల పాము కనిపించింది. ఆ పడగల నుండి విషపుగాలులు వీచి శిష్యులంతా కాలిబూడిదైపోయారు. ఇంతలో బయటకు వెళ్ళినవాడు తిరిగివచ్చి ఆ బూడిద కుప్పను చూసాడు. గురువునడిగి తెలుసుకున్నాడు జరిగినదంతా. వాడికి భయమేసింది. తరువాత గురువు ఆ శిష్యుడికి సంపూర్ణంగా వ్యాకరణవిద్యను అనుగ్రహించాడు. కానీ వాడు నియమాన్ని అతిక్రమించాడు కాబట్టి బ్రహ్మరాక్షసుడైపోయాడు. శాపవిమోచనం కోసం వేడుకున్నాడు.. దానికాయన చెప్పాడు : తాను నేర్చిన విద్యను ఎరికైనా చెబితే శాపవిమోచనం కలుగుతుందని తరువాత వాడు వింధ్యపర్వతాలవద్దకు చేరుకొని అడవిమార్గంలో ఒకరావిచెట్టు నాశ్రయించాడు. వింధ్యపర్వత శ్రేణి ఉత్తర దక్షిణ భారతాలకు మధ్యగా ఉంది. పూర్వం ఉత్తర దేశంలో ఉన్నవారు వ్యాకరణం నేర్చుకోవడానికి దక్షిణ దేశంలో ఉన్న చిదంబరం వెళ్ళేవారు. చిదంబరం నుంచి ఉత్తరాన గల పాటలీపుత్రం, అవంతి, ఉజ్జయినీ పట్నాలకు వెళ్తూండేవారు విద్యార్థులు. రావిచెట్టెక్కి కూర్చున్న బ్రహ్మరాక్షసుడు ఆ దారివెంట పోయే ఉపనయనమయిన బ్రహ్మచారులను వ్యాకరణంలోని ప్రశ్నలు వేస్తూండేవాడు. తప్పు చెప్పినవారిని చంపి తినేవాడు. ఈ విషయం పతంజలికి తెలిసి, వాడ్ని ఉద్ధరించడానికి పూనుకొని చంద్రశర్మ అనే బ్రాహ్మణుడుగా అవతరించి, అతనివద్దకు వచ్చి, వాడి ప్రశ్నకు సమాధానం చెప్పగా, అది సరికాదు, తాను అతనికి వ్యాకరణం చెప్తాను అని రావిచెట్టుమీదకూర్చోమని ఆహ్వానించాడు. చంద్రశర్మ చెట్టెక్కికూర్చుని, రావిఆకులమీద రావిపుల్లతో తన తొడనుచీరి అందులోని రక్తాన్ని సిరాగా వాడి, ఆ వ్యాకరణమంతా రాసాడు. ఇలా తొమ్మిది రాత్రులు, తొమ్మిది పగళ్ళు గడిచాయి. బ్రహ్మరాక్షసుడికి శాపవిమోచనం జరిగింది. అతనికి వైరాగ్యం వచ్చేసింది. హిమాలయాలకు వెళ్ళి శుకమహర్షిని ఆశ్రయించి సన్యసించి బ్రహ్మవిద్య నేర్చుకుని గౌడపాదాచార్యునిగా పేరుగాంచాడు. చంద్రశర్మ రావిఆకులమీద రాసుకున్న మహాభాష్యమంతా ఒక బట్టలో మూటగట్టుకున్నాడు. చాలారోజులు నిద్రాహారాలు లేకపోవడం వల్ల నీరసించి ఒక చెట్టుకింద ఆ మూటను తలక్రింద పెట్టుకొని నిద్రపోయాడు. ఇంతలో ఒక మేక అటుగా వచ్చి ఆ మూటలోని ఆకులని చూసి కొన్నిటిని తినేసింది. చంద్రశర్మ మిగిలిన ఆకులమూటను తీసుకొని ఒక గ్రామంచేరి ఒక వైశ్యుని ఇంటి అరుగుమీద పడుకోగా గాఢంగా నిద్రపట్టింది. ఆ వైశ్యుని కూతురు అతన్ని చూసి, ఇష్టపడి అతని నీరస స్థితి చూసి ఆ శరీరానికి పెరుగన్నం మర్దనతో చికిత్సచేసి, శక్తి, తెలివి వచ్చేటట్లు చేసింది. అతనికి శక్తి వచ్చాక ఇంక వెళ్ళిపోదామనుకుంటే, ఆ వైశ్యుడు చంద్రశర్మను, తన కూతుర్ని వివాహమాడాలని కోరాడు. చంద్రశర్మ బ్రాహ్మణేతర కన్యను వివాహమాడడానికి ఒప్పుకోలేదు. ఈ వ్యాజ్యం రాజుగారి వద్దకు వెళ్ళింది. రాజుగూడా అతన్ని చూసి తనకి అల్లుడయితే బాగుంటుందనుకున్నాడు. ఇలాంటి కొన్ని కారణాల వల్ల చంద్రశర్మ నాలుగువర్గాలకు చెందిన కన్యలను వివాహం చేసుకోవలసి వచ్చింది. తరవాత పిల్లలు పుట్టాక వారికి భాష్యాన్ని బోధించాడు. తరువాత గౌడపాదాచార్యుల వద్ద సన్యాసం స్వీకరించి, గోవిందపాదాచార్యులుగా పేరుగాంచి, ఆదిశంకరులకు సైతం గురువైనాడు.
మగధ సామ్రాజ్యాన్ని సుంగుల తర్వాత కాణ్వులు పాలించారు. కొంతకాలం. కణ్వవంశమూల పురుషుడైన వసుదేవకణ్వుడు (బి.సి.ఇ. 918-879=39 సం॥లు) మొదలు సుశర్మ వరకు 4గురు రాజులు 85 సం॥లు పాలించారు. ఆఖరి కాణ్వరాజైన సుశర్మను సంహరించి అతని సేనాని సింధుకుడు (శ్రీముఖుడు, శిశుకుడు) అన్న ఆంధ్రబ్రాహ్మణుడు రాజయ్యాడు బి.సి.ఇ. 833 సం॥లో వచ్చే అధ్యాయంలో ఆంధ్రసామ్రాజ్యం గురించి తెలుసుకుందాం.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™