ఎస్.పీ.బాలు గారి పాట ఎందరినో అలరించింది. ఆయన మాట ప్రతివారినీ ఆకట్టుకుంది. తామూ కూడా వారితో కలసి పాడాలని చిన్నపిల్లలు సైతం పాట నేర్చుకున్నారు. యువతలో ఒక క్రమశిక్షణ ప్రారంభమైంది. పెద్దలు భాషలో ప్రవర్తనలో తప్పులు తెలుసుకుని ఆయన అభిమానులయ్యారు. ఎల్లలులేని పాటకు పరవశించిపోయారు. ఆయన పాట కోసం పరితపించి ఎదురుచూసేరు. పసివారికి జోలపాట. సంగీతప్రియుల మనసులు కొల్లగొట్టిన గాయకుడు. మాటేమంత్రం పాటే ప్రపంచం అనుకుంటూ మైమరచిపోయారు.
ఆయన చెప్పే సూక్తులు ఆచరణీయాలు. మానసికోల్లాసాల నవరసాలను మించిన మేళవింపు. సినిమా పాటను ఆకాశమంత విస్తరింప చేసినవాడు.
వినేవారి ఇష్టాన్నిబట్టి ‘ఈ పాట నా కోసమే’ అనుకునేటంత పరవశమైపోయారు అభిమానులు. పరిచయస్తులకు ఆరాధ్యుడు. అనుసరించేవారికి మార్గదర్శి. లక్షల ప్రేక్షక హృదయాల్లో బాలూగారి స్థానం పరమ పదిలం. వారి పాటలు సమయానుకూలంగా గుర్తు వస్తూ ఉంటాయి అంటే మన నిత్య దైనందిక పనులలో వారు ఎంతగా లీనమైపోయారో. మనసును సేదతీర్చేది పాట. ఒద్దిక నేర్పింది బాలూ గారి మాట. స్టేజిమీద పాడుతూండగా చాలాసార్లు చూసేను. మాకు తెలిసిన స్నేహితుడు ఒకరు గేయాలు రాస్తారు. ఆ గేయాలు బాలుగారు ఆధ్వర్యంలో కీర్తన స్థూడీయోలో రికార్డు చేసినపుడు, ”ఒకటి నేను పాడుతాను, నాకు నచ్చింది” అంటూ చెప్పి ఉదారత చూపడం ఆయనకే సాధ్యం. అప్పుడు స్వయంగా కలిసాను. ఆ టైములో ఇంకా అంతగా కెమెరాలు లేవు. ఫోటో తీసుకోలేకపోయాము. ఆ జ్ఞాపకం అలా నిల్చిపోయింది మాకు వారి కానుకగా ..
బాలూగారికి దత్తపుత్రుడు పార్థు. అతను మాకు కూడా చాల ఆప్తుడు. ఎప్పుడు వీలు కుదిరినా బాలు గారి గురించే మాటాడుకునేవాళ్ళం. వ్యక్తిగతంగా పార్థుకి వారు లేనిలోటు ఆశనిపాతం. హైదరాబాదునుంచి వెళ్లి ఫార్మ్ హౌస్‌లో వారి దగ్గిర రాత్రంతా పాటలు పాడుతూ రుణం తీర్చుకోడం, అంజలి ఘటించడంతప్ప ఇక ఏమి చేయగలనంటూ వివశుడైన పార్థసారథికి ఓదార్పుగా ధైర్యం చేప్పేము. ఇలాటివారు ఎందరో… బాలూగారి ఆశీస్సులతోనే కోలుకోవాలి. వారి గురించి చెప్పాలంటే ఒక గ్రంథమే కాగల అనుభవాలెన్నో…. పెద్దల సూక్తులు పిన్నలకు మార్గదర్శకాలుగా భావించి మంచి నడవడిక నేర్చుకోవాలి. జీవితాలను తీర్చిదిద్దుకోవాలి. ఏ SP BALU పెద్దలకూ ఎన్నో సలహాలు ఇచ్చారో వాటిని మరువద్దు. అదీ వారికి నివాళి కాగలదు. ‘కలసి పాడుదాం.. తెలుగుపాట.. కలసి సాగుదాం మంచిబాట.’
బాలు ప్రవేశానికి ముందు ఒకరకం పాటలు వచ్చాయి. బాలుగారితో కొత్త ఒరవడికి నాంది పలికారు. ఇంతకాలం స్థిరపడినవారు ఎవరూ లేరు.
ఇక మీద ఎవరూ వుండరు కూడా…. రాబోయేకాలం ఇంత గొప్పగా వుండదు. ఎవరికీ ఇష్టంవచ్చినట్టు వారు పాటలు పాడించుకుంటారు. సాహిత్యం బాగుందా లేదా అని పట్టించుకోరు. పాటలో ఎలాటి అర్థాలున్నాయి అని ఆలోచించరు. తరం మారినప్పుడు తెలుగే రానప్పుడూ అర్థం ఎవరికి కావాలి? ఏమో ఊహించలేము. అదే అంతులేని విచారం కలిగిస్తోంది. బాలుగారున్నప్పటికీ తరువాతా మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
కొత్త రకం కావాలి అంటూ ఏ ఛండాలం నెత్తికి రుద్దుతారో అని భయంగా వుంది. కొత్త ప్రయోగాలను చేయడంలోనూ బాలుగారు ఒక ఒరవడిని తెచ్చారు.
అది ఎందరికి సాధ్యం? ఇప్పుడు ఆయన సారథ్యంలో నేర్చుకున్నవారు స్థిరపడినవారూ పెద్ద ఆసరా, సూచనలు సలహాలు కోలుపోయామన్న దిగులుతో దిక్కుతోచనట్టు వున్నారంటే వారిమీద బాలూగారి ప్రభావం ఎంతవుందో… వారు నిత్యం నేర్చుకుంటూనే వుండాలి అనడంలో ఎంత అర్థం వుందో… అవును ఆ వినయమే గాయకులకు స్ఫూర్తి. మరువద్దు.
ఏ. అన్నపూర్ణగారిది కాకినాడ. వారి నాన్నగారు పిఠాపురం రాజావారి కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేశారు. ఇంట్లో చాలా అమూల్య గ్రంథాలూ నవలలు, మాసపత్రికలు, ఎన్నో పుస్తకాలు ఉండడం వలన చిన్నప్పటి నుంచే బాగా చదవడం అలవాటైంది. బాల సాహిత్యంతో పాటు ఇతర పుస్తకాలు చదివేవారు. ఆ తరువాత చదువు, పెళ్లి పిల్లలు జీవితంలో అందరిలాగే పరిణామాలు జరిగినా ఏనాడూ చదవడం మానలేదు. పిల్లలు బాగా చదువుకుని మెరిట్లో అమెరికా వెళ్ళాక తీరిక లభించి రచనలు చేయాలనే ఆలోచన వచ్చింది. రంగనాయకమ్మ, వై.సులోచన రాణి, యండమూరి, మల్లాది అభిమాన రచయితలు. వారి ప్రభావమో ఉత్తరాలు రాసే అలవాటూ కలసి వారిని రచయిత్రిని చేశాయి. వారి మొదటి కథ ‘రచన మాసపత్రిక’లో వచ్చింది. మొదటి నవల ‘చతుర’లో ప్రచురితమయింది. వీరి రచనలను ఎక్కువగా – రచన, చతుర ప్రచురించాయి. ఏభై కథలు. మూడు చతుర నవలలు, ఇరవై అయిదు కవితలు వ్రాశారు. విపుల కథలు రెండు కన్నడంలో అనువదించారు. ఇంకా ఇతర పత్రికలు, వెబ్ మ్యాగజైన్లలోను ప్రచురితమయ్యాయి. మాజీ ఐఏఎస్ ఆపీసర్ డాక్టర్.జయప్రకాశ్ నారాయణగారు తొంభై ఏడులో హైదరాబాదులో స్థాపించిన ‘ఉద్యమ సంస్థ’లో ఇరవై నాలుగేళ్లుగా కార్యకర్తగాను; సంస్థ మాసపత్రికలో వ్యాసాలు రాసే రచయిత్రిగా గుర్తిపు రావడం వారికి సంతృప్తినిచ్చింది! అటువంటి అత్యుత్తమైన గొప్ప అధికారితో పనిచేసే అవకాశం రావడం అన్నపూర్ణ గౌరవప్రదంగా భావిస్తారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి భార్య ఇందిర అన్నపూర్ణగారికి మేనత్తగారే! ఇప్పుడు గత ఆరు సంవత్సరాలుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. చదవడం రాయడంతో కాలం ఆనందంగా గడిచిపోతోంది. వారి భర్త మేథ్స్ ప్రొఫెసర్‌గా హైదరాబాదులో పనిచేశారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™