యు.పి.యస్.సి. ద్వారా అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ (ఎ.ఎస్.డి)గా సెలెక్ట్ అయిన తర్వాత కడపలోనే వుండటం ఇష్టం లేక హైదరాబాదు వేయించుకొన్నాను. అప్పట్లో హైదరాబాద్ డైరక్టర్‌గా యస్. రాజారాం పని చేస్తున్నారు. కేరళకు చెందిన యం.కె. శివశంకరన్ అసిస్టెంట్ డైరక్టరు. దాదాపు 10 సంవత్సరాలుగా రెండో ఎ.ఎస్.డి. పోస్టును భర్తీ చేయలేదు. నన్ను ఆ రెండో పోస్టుకు వేశారు. 1982 అక్టోబరు 5 న క్లాస్-I ఆపీసరుగా రూ.900/- బేసిక్‌తో ఉద్యోగంలో చేరాను. రాజారాం సంగీతజ్ఞుడు. మైసూర్ వాసుదేవాచార్ మనుమలు. సౌజన్యమూర్తి. శివశంకరన్ రెండేళ్ళుగా హైదరాబాద్‌కు ప్రమోషన్ మీద వచ్చి చేరారు. అప్పట్లో ఆకాశవాణి పాత భవనాలలో వుండేది. నిజాం నవాబుల రాచఠీవికి సరిపడేలా ఆకాశవాణి కార్యాలయము, స్టూడియోలు నగరం నడిబొడ్డున అసెంబ్లీకి ఎదురుగా వుండేవి. మెయిన్ బిల్డింగులో ఎస్.డి, ఎ.ఎస్.డి ఆఫీసుకు, స్టూడియోలు వుండేవి. బారక్స్‌లో మిగిలిన ఆఫీసర్లు కూర్చునేవారు. వెనుక వైపు బారక్స్‌లో నాకొక గది కేటాయించారు. దాదాపు 11 మంది కార్యక్రమ నిర్వాహకులుండేవారు. అందరూ అతిరథమహారథులు. ఆకాశవాణిలో కనీసం 20 సంవత్సరాల అనుభవం వున్నవారు. వయసులో నాకంటే పెద్దవారు. వారితో కలిసి పనిచేయడం సదవకాశం.
వారిలో నాకు ఈనాటికీ పరిచయమున్నవారిని ఉటంకిస్తాను. సుప్రసిద్ధ రచయిత డా. రావూరి భరద్వాజ, అజర్ అఫ్సర్, సునందినీ ఐపీ, తురగా జానకీరాణి, యన్.యన్. శ్రీనివాసన్, వై.వి.రాఘవులు వివిధ శాఖల ప్రొడ్యూసర్లు. కె.వి. సుబ్బారావు వ్యవసాయ విభాగాధికారి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివులుగా వి.వి.శాస్త్రి, ఏ.వి.రావు చౌదరి, రమేష్ పాత్రో, నరసింహాచార్యులు, బి. భీమయ్య, యస్.పి. గోవర్ధన్, టి.వి.జె. కృష్ణమాచారి, డా. కె. గోపాలం, యం. అరుణాచలం, హెచ్. హనుమంతరావు, ఎన్.వి.ఎస్. ప్రసాదరావు తదితరులుండేవారు. వీరిలో చాలామంది తర్వాతి కాలంలో డైరక్టర్లు అయ్యారు. వీరికీ, డైరక్టరుకూ మధ్య అనుసంధానం నా ఉద్యోగం.
ఇద్దరు అసిస్టెంట్ డైరక్టర్ల బాధ్యతల పంపకాన్ని మాకే అప్పగించారు డైరక్టరు రాజారాం. ఆయన మరో నాలుగు నెలల్లో రిటైరు కానున్నారు (1983 జనవరి 31న). శివశంకరన్‌కు తెలుగు రాదు గాబట్టి సంగీతము, కోఆర్డినేషన్ తదితర శాఖను తాను చూస్తానన్నారు. మేజర్ శాఖలు నాకు అప్పగించారు. నా వ్యవహార సరళి రాజారాం బాగా మెచ్చుకొన్నారు.
దత్తాత్రేయ కాలనీ (అసిఫ్‌నగర్)లో ఓ అద్దె ఇల్లు మాట్లాడుకొని అక్టోబరు నెలాఖరుకు కుటుంబ సమేతంగా స్థిరపడ్డాను. ఇంటికి ఆఫీసు ఫోన్ ఏర్పాటు చేశారు. సూపరింటెండెంట్ ఇంజనీరుగా టి.యన్.జి.దాస్ పనిచేసేవారు.
ప్రాంతీయ వార్తా విభాగంలో సుబ్బారావు, గోవాడ సత్యారావు, మల్లాది రామారావులు అధికార హోదాలో వున్నారు. భండారు శ్రీనివాసరావు రిపోర్టర్‌గా ప్రజాదరణ పొందారు. వార్తలు చదివేవారు సరే సరి. ఇంజనీరింగు, వార్తా, ప్రోగ్రామ్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలు నాలుగు – ఆకాశవాణికి నాలుగు స్తంభాలు. వాణిజ్య ప్రసార విబాగానికి కృష్ణమూర్తి, ప్రాంతీయ శిక్షణా విభాగానికి డి. యు. ఆయూబ్‌లు అసిస్టెంట్ డైరక్టర్లు. వారి కార్యాలయాలు ఏ.సి.గార్డ్స్ లోని భవనంలో ఒకే బంగాళాలో క్రిందా, పైనా వుండేవి. అది రాష్ట్ర ప్రభుత్వ భవనం. అద్దె చెల్లిస్తూ వచ్చారు.
1982 అక్టోబరు నుండి 1985 జనవరి వరకు నేను ఆకాశవాణి మెయిన్ స్టేషన్లో పనిచేశాను. రాజారాం నాలుగు నెలలు, కేశవ్ పాండే నాలుగు నెలలు, ఆ తరువాత లీలాబవ్డేకర్ నాకు డైరక్టర్లు. డ్యూటీ ఆఫీసర్లు, అనౌన్సర్లు, ఇంజనీర్లు, పరిపాలానా విభాగంతో పాటు క్యాజువల్‌గా దాదాపు 40 మంది యువకులు ఏళ్ళ తరబడి అనౌన్సర్లుగా, ప్రొడక్షన్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ఆర్. వి. చంద్రవదన్ తర్వాతి కాలంలో ఆర్.డి.ఓ.గా సెలెక్టు అయి, ఐఎఎస్ అధికారిగా 2018లో పదవీ విరమణ చేసారు. కె.సి.అబ్రహం గవర్నరుగా వుండేవారు. ఆయన పి.ఏ. కుట్టి నాకు పరిచితుడు కావడం వల్ల వారం రోజుల్లోనే మర్యాదపూర్వకంగా గవర్నరును కలిశాను.
1983 జనవరి 5న సాధారణ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలు అన్నింటికీ రేడియో, దూరదర్శన్లలో ప్రసంగాలు చేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. తెలుగు ప్రసంగ శాఖ ప్రొడ్యూసర్ భరద్వాజ, నేను పార్టీల ప్రసంగాల పాఠాలను ఎన్నికల నియమావళికి అనుగుణంగా సరిచూసి రికార్డింగు చేశాము. దానికిగా బయటి ప్రముఖులతో ఒక కమిటీ కూడా నియమించారు. అన్ని ప్రధాన పార్టీల హేమాహేమీలు దాదాపు 20 రోజుల పాటు రికార్డింగులకు వచ్చారు. మాకినేని బసవపున్నయ్య ప్రసంగంలో ఏదో విమర్శ కనిపిస్తే, భరద్వాజ తన మాట నేర్పరితనంతో, “బావా! ఈ వాక్యం తీసేద్దాం!” అని కొట్టివేశాడు. ఆయన మారు పలకలేదు. కాంగ్రెస్ తదితర పార్టీల ప్రధాన నాయకులంతా రికార్డు చేశారు.
ఎన్నికల ఫలితాలు జనవరి 9న ప్రకటించారు.
ఏడో తేదీ సాయంకాలం 5 గంటలకు నేను ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరబోతున్నాను. ఒక పార్టీకి చెందిన స్థానిక నాయకులు నలుగురు నా రూమ్‌లోకి దూసుకొచ్చారు. నేను వారిని నా పక్కనే ఉన్న డైరక్టర్ రాజారాం రూమ్ వద్దకు తీసుకువెళ్ళాను. నగరానికి చెందిన ఒక అభ్యర్ధి పలితాలు ఎన్నికల సంఘం ప్రకటించకుండా ఆపింది. అందువలన ఆ రోజు ఎన్నికల ఫలితాల ప్రసారంలో ఆయన పేరు ప్రకటించలేదు. ఆ విషయం వార్తా విభాగం అధికారితో మాట్లాడడానికి రాజారాం, నేను వారిని న్యూస్ రూమ్‌కి తీసుకెళ్ళాం. అక్కడ ఉద్రేకంతో ఆ పార్టీ అభ్యర్థి రాజారాంను చెంప దెబ్బ కొట్టాడు. వెంటనే ఆ బృందం వారు బయటికెళ్ళిపోయారు. 33 ఏళ్ళ సర్వీసు చేసిన రాజారాం చివరి నెలలో తీవ్ర దిగ్భ్రమ చెందారు.
1983 జనవరి 9న నందమూరి తారకరామారావు వైభవంగా హైదరాబాదు లాల్బహాదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. వేలాదిమంది జనసందోహం సమక్షంలో నూతన మంత్రులు పదిహేనుమంది ప్రమాణం చేశారు. ఆశ్చర్యకరంగా మాతో కడప కో-ఆపరేటివ్ కాలనీలో షటిల్ బ్యాడ్మింటన్ తరచూ ఆడిన యస్. రామమునిరెడ్డి వైద్యశాఖామంత్రి అయ్యారు. ఆ సభకు నేనూ, మా నాన్నగారు హాజరయ్యాము.
వెంటనే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల నుద్దేశించి ప్రసంగించడానికి ఆకాశవాణి స్టూడియోలకు విచ్చేశారు. వారి వద్ద సెక్రటరీగా అప్పుడే చేరిన మోహన్ కందా వారి ననుసరించి వచ్చారు. ప్రసంగ పాఠం ప్రతి సాధారణంగా ముమ్దుగా అందజేస్తారు మాకు. సరాసరి రామార్వు స్టూడియో రికార్డింగు గదిలోకి ప్రవేశించారు. వారికి రాజారాం, నేను, మా ఇంజనీరు దాస్ స్వాగతం పలికాము.
అద్దాల గదికి ఇటువైపు నేను, మా రికార్డింగు ఇంజనీర్లు వున్నాం. సహజ గంభీర స్వరంతో రామారావు ప్రసంగపాఠం మొదలుపెట్టారు. “అభిమాన ఆంధ్రులారా! 35 సంవత్సరాల స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మనం సాధించింది ఏముంది?” అంటూ నాలుగు వాక్యాలు చదివి ‘కట్’ అన్నారు. ఆయనకు నచ్చితే తప్ప, ఆ ‘కట్’, ‘ఓకే’ అనరు. వెంటనే నేను, రాజారాం – గదిలోకి వెళ్ళి మోహన్ కందా చెవిలో “మొదటి వాక్యం ప్రభుత్వ విమర్శ అవుతుందేమో!” అన్నాము. అది గమనించిన ముఖ్యమంత్రి ‘ఏమిటి వారి సందేహం’ అన్నారు గంభీర స్వరంతో మోహన్ కందాతో.
“మొదటి వాక్యం కేంద్ర ప్రభుత్వంపై విమర్శ అవుతుందని…” అన్నారు మోహన్ కందా.
“అది వాస్తవమైన మాట!” అన్నారు ముఖ్యమంత్రి.
“వాళ్ళది కేంద్ర ప్రభుత్వ సంస్థ గదా!” అన్నారు మోహన్.
“సార్! ‘స్వాతంత్రానంతరం 35 సంవత్సరాల తర్వాత గూడా మనం సాధించవలసింది ఇంకా ఎంతో వుంది’ అని వాక్యం మారుద్దాం” అన్నాను ధైర్యం కూడగట్టుకుని.
“ఓ.కే! నో మోర్ ఎడిటింగ్” అంటూ సహజ సినిమా ధోరణిలో కట్లు చెబుతూ, నలభై నిముషాల్లో 12 నిమిషాల ప్రసాంగం పూర్తి చేశారు. ఆ రాత్రికే అన్ని కేంద్రాల నుంచి ఆంధ్ర ప్రజలు తమ అభిమాన నాయకుని ప్రసంగం విన్నారు.
1983 జనవరి నెలాఖరుకు రాజారాం రిటైరయ్యారు. కొత్తగా ఎవరినీ వేయలేదు. శివశంకరన్ ప్రోగ్రామ్ హెడ్, సూపరిండెంట్ ఇంజనీరు టి.యన్.జి. దాస్ స్టేషన్ హెడ్. నేను అసిస్టెంట్ డైరక్టరు. శివశంకరన్ కేరళకు ట్రాన్స్ఫరు కోసం ఎదురుచూస్తూ తన తన ప్రయత్నాలు తాను చేసుకొంటున్నాడు. ఒంటరిగా వుండేవాడు. మేమిద్దరం స్టేషన్ బండి సాఫీగా నడుపుతున్నాం. జ్ఞాన వైరాగ్య యోగం బాగా తెలిసిన ఆయన పనిభారం నామీద పడేశాడు.
1976 ఆగస్టులో ప్రొడ్యూసర్‌గా ట్రైనింగుకు 70 రోజులు హాజరయ్యాను. మళ్ళీ కొత్తగా సెలెక్టయిన ఎ.ఎస్.డి.లకు 1983 ఫిబ్రవరిలో వారం రోజులు ఆకాశవాణి భవన్లో శిక్షణ ఇచ్చారు. నేను మాజీ మంత్రి పార్థసారథి బంగళాలో బస చేశాను. ఫిబ్రవరి 14న కేంద్ర హోం శాఖ సహాయమంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య ఇంట్లొ విందు చేశాను. ఆయన నా మీద ఎంతో ఆదరం చూపేవారు. ఆ దఫా ఢిల్లీ ఆంధ్ర సంఘం వారి మీటింగులో నన్నయ గూర్చి మాట్లాడాను. ఆంధ్ర సంఘం అధ్యక్షులు డా. వి. కృష్ణమూర్తి సాహిత్యాభిమాని. అప్పట్లో ప్రసారశాఖల ఉపమంత్రిగా మల్లికార్జున్ వున్నారు.
1983 జూన్‌లో రాష్ట్ర యన్.జి.ఓ.లు దీర్ఘకాలం సమ్మెపై వెళ్ళారు. జూలై 16న ముఖ్యమంత్రి రామారావు స్టుడియోకి వచ్చి సమ్మె చేస్తున్న ఉద్యోగులకు విరమించవలసిందిగా కోరుతూ సందేశం ప్రసారం చేశారు. 17న కాంగ్రెస్ పార్టీకి చెందిన గోవర్ధన రెడ్డి బృందం, ఆ తర్వాత యన్.జి.ఓ.ల నాయకులు నా దగ్గరకు వచ్చి తమ ప్రసంగాలు ప్రసారం చేయవలసిందిగా పట్టుపట్టారు. కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే ఆ అవకాశం వుంటుందనీ, ఇతరుల అభ్యంతరాలు వార్తావిభాగంలో ప్రసారమవుతాయనీ సర్దిచెప్పాను. కేంద్ర ప్రసార శాఖ నుండి ఆదేశాలు వస్తే మీవి కూడా ప్రసారం చేస్తానని సూచించాను.
18వ తేదీ ఉదయం దినపత్రికలలో రాత్రి 8 గంటలకు ముఖ్యమంత్రి సందేశ ప్రసారమని అడ్వర్టయిజ్మెంట్ సమాచార పౌర సంబంధాల శాఖ విడుదల చేసింది. నెను మా డైరక్టరు జనరల్ కార్యాలయంలో అడిషనల్ డి.జి. అమృతరావు షిండేకు ఫోన్లో ఆ విషయం, ముందు రోజు కాంగ్రెస్ వారి ప్రతిఘటన తెలిపాను. ఉదయం పది గంటలకు రికార్డింగుకు వస్తామన్న ముఖ్యమంత్రి 1 గంట వరకు రాలేదు. మమ్మల్ని సెక్రటేరియట్ వద్దకు వచ్చి రికార్డింగ్ చేయవలసిందిగా సమాచారశాఖ మంత్రి హరిరామజోగయ్య నాతో ఫోన్లో చెప్పారు. సెక్రెటేరియట్ ఎదుట యన్.జి.ఓ.లు బైఠాయించారు కాబట్టి మా రికార్డింగ్ యూనిట్ రాలేదని వారికి వివరించాను. మరో అరగంటలో సమాచారశాఖ డైరక్టరు ఎ. వనజాక్షి ఆగ్రహోదగ్రురాలై వచ్చి హుకుం జారీ చేశారు. ఇంతలో మా డైరక్టర్ జనరల్ యస్. యస్. వర్మ వద్ద నుండి నెగటివ్ సంకేతాలు ఫోన్లో నాకందాయి. ముఖ్యమంత్రి కోపోద్రేకులై అధికార సమావేశం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీకి టెలెక్స్ మెసేజ్ పంపి – ఇది ఆంధ్రుల నాయకుని అవమానంగా పేర్కొన్నారు. ఆ సాయంకాలం 6 గంటలకు నేను ఇల్లు చేరాను. అప్పుడు మా డైరక్టర్ జనరల్ ఫోన్ చేసి, సి.యం. ఇంటికి వెళ్ళి రికార్డు చేయమని ఆదేశించారు. హుటాహుటిన నేను ఆఫీసుకు చేరుకుని ముఖ్యమంత్రి పి.ఎ.ని సంప్రదించగా ప్రతికూల సమాధానం వచ్చింది. అప్పుడు పార్లమెంటు ఉభయసభలలోనూ వాడిగా, వేడిగా ఆరు గంటలు చర్చ జరిగింది. అప్పటి సమాచార మంత్రి హెచ్.కె.ఎల్. భగత్ చర్చకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి ఎన్నిసార్లయినా రేడియో/దూరదర్శన్లలో ప్రసంగించవచ్చుననే ఆదేశాలు అమలులోనే ఉన్నాయని సమర్థించారు. ఆ తుఫాను తీరం దాటింది.
తొలుత లెక్చరర్‌గానూ, తరువాత ఆకాశవాణి, దూరదర్శన్లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించి అడిషనల్ డైరక్టర్ జనరల్, దూరదర్శన్గా ఉద్యోగ విరమణ చేశారు. పద్యంపై మక్కువ కలిగిన అనంతపద్మనాభరావు 150కి పైగా అవధానాలు చేశారు. కథలు, నవలలు వ్రాశారు. అనువాద బహుమతులు పొందారు. ‘దాంపత్య జీవన సౌరభం’, ‘మన పండుగలు’, ‘తలపుల తలుపులు’, ‘అలనాటి ఆకాశవాణి’, ‘అంతరంగ తరంగం’, ‘కథామందారం’, ‘గోరింట పూచింది’ వంటి పుస్తకాలను వెలువరించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పలు అవార్డులు పొందారు.
శరత్
చదువుతున్నంత సేపూ ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. ఇంత అలవోక వ్యక్తీకరణను ఎలా సొంతం చేసుకున్నారండీ…
Chaala baaundhi..appudu nenu inter mediate chadive rojulu. NTR prasanginchadam Radio lo CM ga vinnamu..
aasaktikarangaa saagindi.mee column baagundi sir
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™