మా కార్తీక్ హిందీ టీచర్ గుణవతి మీద నాకు ఒళ్ళు మండి పోయింది. ఏడో క్లాసు టీచర్‌కి ఇంత అహంభావమా?
టీచర్స్ దినోత్సవం నాడు కార్తీక్ సొంతంగా హిందీలో రాసిన కవితని స్కూలంతా మెచ్చుకుంటే, ఈ గుణవతి మాత్రం మర్నాడు క్లాసులో వాణ్ణి నిలబెట్టి, “సినారె రాసినట్టు రాశావ్. ఎక్కడ కాపీ కొట్టావురా?” అని అర గంటసేపు ఏడిపిస్తుందా?
ఆంధ్రా నుంచి ఢిల్లీకి బదిలీ అయి వచ్చాం కాబట్టి వాడికి అసలు హిందీ రాదనుకుందా? కార్తీక్ నాలుగో క్లాసు నుంచే ఇంగ్లీష్, హిందీలో వాడి స్థాయిలో వాడు ఎన్ని కవితలు రాసాడు!
ఇప్పుడు క్లాసులో జరిగిన అవమానం భరించలేక వాడు రెండు రోజులనుంచి స్కూలుకే పోవటం లేదు. అన్నం తినటం లేదు. నాకు ఆఫీసు పనితో రాత్రి పదింటిదాకా ఆఫీసులో సరిపోతోంది…. రేపు ఆదివారం నాడు వాడి పాత కవితలన్నీ తీసుకొని, గుణవతి ఇంటికి వెళ్ళి, చూపించి వాయించి పారేయాలి…. ఆ రాత్రంతా నాకు ఇదే ఆలోచన.
మర్నాడు పొద్దుటే అనుకోకుండా మా పెద్దాయన శేషయ్య గారు దిగాడు. ఏదో పనిమీద వచ్చాడు. చూసిపోదామని మా ఇంటి కొచ్చాడు.
“కాస్సేపు కూర్చోండి” అంటూ నేను గుణవతి దగ్గరకెళ్తున్న విషయం చెప్పాను.
ఆయన పగలబడి నవ్వాడు. నన్నాపాడు.
కార్తీక్‌ని దగ్గరకి తీసుకున్నాడు.
“నీ కవిత మళ్ళీ చెప్పరా” అన్నాడు.
వాడు చేతులు కట్టుకొని హిందీలో చెప్పాడు.
“తరువు లాంటి వాడే గురువు కూడా.
అది పూలూ, పండ్లు ఇస్తుంది మనం నీళ్ళిస్తున్నామని,
ఆయన విద్య, జ్ఞానం ఇస్తాడు, మనం ఏమిస్తున్నామని?”
శేషయ్యగారు మళ్ళీ నవ్వాడు.
“ఒరేయ్ నిన్ను టీచర్ మెచ్చుకుంది గదరా! ఏడుస్తావెందుకు?”
వాడు ఏడుపు ఆపేశాడు.
“నువ్వు సొంతంగా రాశావంటే నమ్మలేనంత గొప్పగా రాశావురా. నిన్ను ‘సినారె’ స్థాయిలో చూసిందిరా. దానికి ఏడవటం ఎందుకు, స్కూలు మానేయటం ఎందుకు?…”
కార్తీక్ మొహం ఆనందంతో వెలిగిపోయింది.
గుణవతి దగ్గరికి నా ప్రయాణం ఆగిపోయింది.

వల్లీశ్వర్ సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు. ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రిక (2005-15) కు ప్రధాన సంపాదకులు.
‘జుగల్బందీ ‘ (అద్వానీ-వాజపేయిల బంధం), ‘నిప్పులాంటి నిజం’ (రాజీవ్ గాంధీ హత్య, దర్యాప్తు), ‘నరసింహుడు’ (పి.వి. నరసింహారావు సమగ్ర జీవిత కథ), ‘రిజర్వు బ్యాంకు రాతిగోడల వెనకాల…’ (ప్రజా జీవితాలపై ఆర్.బి.ఐ ప్రభావం) వీరి అనువాద రచనలు.
శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్, IAS, గారి – ‘నాహం కర్తా, హరిః కర్తా’; ‘తిరుమల లీలామృతం’, ‘తిరుమల చరితామృతం’, ‘అసలేం జరిగిందంటే …!’ – పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు.
‘ఇదీ యదార్థ మహాభారతం’ (బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి 18 రోజుల ప్రవచనాలకు) లిఖితరూపం ఇచ్చారు.
‘అయినా నేను ఓడిపోలేదు ‘ (జ్యోతిరెడ్డి ఆత్మకథ), ‘వైఎస్సార్ ఛాయలో … (సి.ఎం మీడియా సలహాదారుగా స్వీయ అనుభవాలు), ‘వాల్మీకి రామాయణం ‘ (పిల్లల కోసం 108 తైల వర్ణ చిత్రాలతో ఎమెస్కో ప్రచురణ) వీరి ఇతర రచనలు.
5 Comments
విరించి
బహుముఖ ప్రజ్ఞాశాలి వల్లీశ్వర్ గారి కొత్తప్రక్రియ 99సెకండ్ల కథ…చిన్న కథలో పెద్ద విషయాన్ని చెప్పే గోప్ప ప్రయోగం…మూసకథలకు భిన్నమైన కథనం…ఆకట్టుకున్న అక్షరయజ్ఞానికి వల్లీశ్వర్ గారికి అభినందనలు…
Valliswar
Dhanyavaadaalu.
sarat
alpa aksharalloo analpa ardham amte emitoo maroosari
chaticheppina chiru kadhanika *gunavati ahambhavam*. nitya naveenataku, niramtara
vaividhyaniki idi taajaa udaharana..sarat
గీత.కె
చిన్నకథలో పెద్ద భావం తెలియజేసారు ..కథ చాలా బాగుంది.అభినందనలు సర్ ..
డా.సుమన్ లత
కబీర్ దోహా ఒకటి ఉంది…
.రామనామ్ కే పటంతరే దేబే కో కఛు నాహీ
క్యా లే గురు సంతోఖియా హోస్ రహీ మన్మాహీ……
రామ నామం అన్న గొప్ప విద్యను అందించిన గురువుకు తిరిగి నేను ఏమి ఇవ్వ గలను ..అన్న వ్యథ మనసు లో ఉండి పోయింది కదా !అని.
మీ కార్తీక్ తనదైన ముద్ర లో అంత చిన్న వయసులోనే ఇలాంటి భావాలు పద్యం లా చెప్పడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. టీచరు గారి మాటలలో దాగిన ప్రశంస పెద్దాయన గనకే పట్టుకున్నారు.