అంపశయ్య నవలతో ప్రసిద్ధులైన నవీన్ గారికి ఆ నవలే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అంపశయ్య నవీన్ నవలాకారుడిగానే కాదు, కథకుడిగా కూడా ప్రఖ్యాతిగాంచారు. వీరు ఇంతకు ముందు అయిదు కథా సంపుటాలు వేశారు. ఇప్పుడు వచ్చిన ఆరో కథా సంపుటం “కొత్త నీరొచ్చింది” లో 15 కథలున్నాయి.
ఇందులో కుటుంబ సంబంధాల్లో వస్తున్న మార్పులు, కుటుంబ సంభ్యులలో చోటు చోసుకుంటున్న స్వార్థచింతన, దుర్మార్గాలను వివరించే కథలున్నాయి. మనిషులలో పెరుగుతున్న అరాచకత్వం, విశృంఖల ధోరణిని వివరించే కథలున్నాయి. లోకతీరు, మానవ మనస్తత్వ విశ్లేషణ, రాజకీయాలపై విసుర్లు కూడా మరికొన్ని కథలలో కనిపిస్తాయి.
మహిళల పట్ల కొనసాగే గృహహింస ఎన్ని రకాలుగా వుంటుందో “ఆ ఇంట్లో ఒక ఉదయం”లో చూడవచ్చు. కడుపు గట్టుకుని, వున్న ఆస్తిపాస్తులన్నీ అమ్మి కొడుకును ప్రయోజకుడ్ని చేస్తే వాడు ఆ ముసలి తల్లిదండ్రుల్ని ఎంత మోసపూరితంగా వదిలించుకున్నాడో తెలిస్తే మనకీ బాధ కలుగుతుంది. ఒకప్పుడు “అపుత్రస్య గతిర్నాస్తి” అన్నారు. ఇప్పుడు “పుత్రస్య గతిర్నాస్తి” అనుకోవాల్సి వస్తంది. ఇంకో కథలో నలభై ఏళ్ళు లండన్‌లో పని చేసి చివరకు స్వస్థలానికి వచ్చి సెటిల్ అవుదామనుకుంటాడు అరవిందరావు. కోట్లు కొద్ది సంపాయించుకొచ్చాడని తెలిసిన బంధువులంతా “రాబందుల్లా” చుట్టుముడతారు వారికి పిల్లలు లేరని పెద్దన్నయ్య, దుర్వసనాలకు లోనయిన తమ కొడుకును దత్తత తీసుకొమని ఒత్తిడి చేస్తుంటారు. బాల్యంలో తన గురించి తన చదువు గురించి ఏ మాత్రం పట్టించుకొని అన్నలంతా తమకు సహాయం చేయమని పీడిస్తుంటారు. చిన్నప్పుడే తనకు కొండంత అండగా నిలచిన తన విధవ అక్కయ్య తన ఆస్తులన్నీ అమ్మి అతడ్ని ప్రయోజకుడ్ని చేస్తుంది. ఇప్పుడు అరవిందరావు ఆస్తి గురించి బంధువులంతా ఆ అక్కాతమ్ముళ్ళను పీడిపిస్తుంటారు. బ్లాక్‌మెయిల్‌తో పాటు చంపడానికి కూడా వెనుదీయమని హెచ్చరిస్తారు. అన్నలు ఒక వైపు, భార్య వైపు బంధువులు ఇంకో వైపు తమకు ఆస్తి పంచివ్వమని పోరు పెడుతుంటారు. ఇంతటి ఉద్రిక్త పరిస్థితులలో సున్నిత హృదయిడైన అరవిందరావు గుండె ఆగి చనిపోతాడు. ఆ షాక్‌లో ఆయన భార్య కూడా చనిపోతుంది. బంధులులంతా సంతోషపడుతున్న వేళ లాయర్ వచ్చి వీలునామా చదువుతాడు. అరవింతరావు నిజానికి అందరికి ఎంతో కొంత సహాయం చేయాలనుకుంటాడు. వాళ్ళ నిజ ప్రవర్తన చూసిన తర్వాత తన ఆస్తినంతా అనాథశ్రమాలకి రాశాడని చెప్పేసరికి అంతా కుప్పకులిపోతారు.
ఈ రోజుల్లో సెల్ పోన్ కనీసావసర వస్తువుగా మారిపోయిది. ఎక్కువ ఫీచర్లు కలిగిన మొబైల్ ఫోన్ల కోసం వెంపర్లాడటం పిల్లలకు అలవాటై పోయింది. అలాంటి ఫోన్లు కొనివ్వమని తల్లిదండ్రులను వేధిస్తుంటారు. ఇంట్లో వాళ్ళు కొనివ్వకపోతే బయట దొంగిలించడానికి కూడా వెనుదీయరు. ఒక రచయిత దగ్గర వున్న స్మార్ట్ ఫోన్‌ను కొట్టేసి దిరికిపోయిన విద్యార్ధి “వ్యామోహం” లో కనిపిస్తాడు. “క్రికెట్ ఫీవర్”లో పడి యువతరం ముఖ్యంగా విద్యార్థులు తమ భవిష్యత్తును ఎలా నాశనం చేసుకుంటున్నారో ఇంకో కథ వివరిస్తుంది.
మోసం చేసిన ప్రేమికుడు, ఆ అమ్మాయి హాయిగా కాపురం చేసుకుంటే వచ్చి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టి ఆ దంపతుల ఆత్మహత్యకు కారకుడవుతాడు, వాడు “ప్రేమికుడా ప్రతీకార కాముకడా” పాఠకులే తేల్చుకోవాలి. ముందుచూపు లేకుండా విలాసవంతమైన జీవితం గడిపిన రఘ ఆస్తి పోగొట్టుకుని, అనారోగ్యం పాలయి దిక్కుమాలిన చావు చావడం “ సౌండ్ అండ్ పూర్” లో కనిపిస్తుంది.
భర్త చాటున వ్యభిచారిస్తున్నదని చుట్టుపక్కల వాళ్ళంతా చులకనగా చూస్తారు. ఆమె హఠాత్తుగా చనిపోతే “పునిస్త్రీ”గా చనిపోయింది, అదృష్టవంతురాలని ఆమెను పొగుడతారు. మన సామాజిక విలువలు ఎంత త్వరగా మారిపోతుంటాయో, చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అవినీతి, లంచగొండితనం గురించి మాట్లాడుతూ “దేశాన్ని రక్షించేది ఎవరు?” అని వాపోయే పెద్దమనుషులు చాలా మందే కనిపిస్తారు. వారు తమ విషయానికి వస్తే ఎంత అరాచకానికయినా వెనుదీయరు. లోకతీరు అలాంటిది.
మనం కంప్యూటర్ యుగంలో ప్రవేశించామని, అన్ని ప్రభుత్వ వ్యవస్థలను – పాలనను కంప్యూటర్‌తో అనుసంధించాలనీ ప్రజలంతా టెక్నాలజని లవరుచుకోవాలని బోధించిన ముక్యమంత్రులని చాశాం. ఈ ఆధునిక టెక్నాలజీ కూడా మనుషులను ఎలాంటి ఇబ్బందుల్లో నెట్టివేస్తుందో తెలుపుతూ నవీన్ గారు ఒక కథ రాశారు. ఇందులో రచయిత మిత్రుడొకడు, రచయిత అకౌంట్లోకి పదివేల రూపాయల చెక్ పంపిస్తే, దాన్ని డిజానర్ చేయడమే కాకుడా, అతడి అకౌంట్ నుంచి 1770 రూపాయలు అపరాధ రుసుంగా కత్తిరిస్తారు. ఈ విషయంమై బాంకుకు వెళితే ఎవరు పట్టించుకోరు సరికదా చివరకు అది కనెక్టివిటీ ఫెయిల్ అని చెప్పి తప్పించుకుంటారు. “మా సిస్టమలో నుండే సర్వర్ ఆ రోజు పని చేయలేదు. అందువల్ల మీ ఫ్రెండ్ అకౌంట్‌కు మీ అకౌంట్‌తో కనెక్ట్ చేయలేకపోయాం. అందువల్ల మీ ఫ్రెండ్ పంపించిన చెక్‌ను డిజానర్ చేయాల్సి వచ్చింది. అందుకని మీ అకౌంట్ లోంచి 1770 రూపాయలు మా సిస్టమ్‌లో అటోమెటిగ్గా డెబిట్ అయిపోయింది. దానికి మేమేం చేయలేం” అని చేతులెత్తేస్తారు. వారి నిర్లక్ష్య ధోరణికి ఒళ్ళు మండిన రచయిత కన్స్యూమర్ కోర్టుకు వెళతాడు. ఆరు నెలల తర్వాత కోర్టు బ్యాంక్‌కు పెనాల్టీ వేసి దాన్ని రచయితకు అందచేయమని తీర్పును ఇస్తుంది. ఆ మధ్య దేశాన్ని అల్లకల్లోలం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను స్తంభింప చేయడంలో పెద్ద నోట్ల రద్దు ప్రధాన పాత్ర వహించింది. నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నారో “కొత్త నీరొచ్చింది” కథ హృదయవిదారకంగా తెలియజేస్తుంది.
మనం చేసే పనులన్ని మన అహాన్ని తృప్తి పరుచుకోవడం కోసమే చేస్తామని మనస్తత్వ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇది మనని గురించి మనకు తెలియని నిజం. మనల్ని అందరు మంచి వాడనే గొప్పవాడనే, నిస్వార్ధపరుడని అనుకోవాలని కోరుకుంటాం. మన గురించి అందరూ అలా అనుకుంటున్నారని తెలుసుకున్నప్పుడు మనలోని అహం తృప్తి పడుతుంది. ఈ కథలో వున్న రచయిన గొప్ప ఉపన్యాసకుడని పిలిచిన చోటకల్లా వెళ్ళాలనుకోవడం, దాన్ని రెస్పాన్సిబిలిటిగా ఫీలవడం ఇవన్నీ కూడా అతని ఇగోను, అహాన్ని తృప్తిపరుచుకోవడం కోసమే. ఇటువైపు నుండి చూస్తే రచయిత ఈ మీటింగులకి, ఉపన్యాసాలకు అలవాటు పడి రాయడమే తగ్గించేస్తాడు. ఐదారేళ్ళ నుండి ఏమి రాయలేకపోతాడు. దీని వల్ల రచయితలో వున్న సృజనాత్మకత మరుగైపోయే ప్రమాదముంది. ఇవన్నీ కూడా ఆ రచయిత ప్రమాదంలో చిక్కుకుని అస్పత్రులో చేరి ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు తెలుసుకోగలుగుతాడు. వయసు మీద పడిన తర్వాత అనవసర పనులను, దూర ప్రయాణాలను తగ్గించుకోవడమే ఉత్తమమని గుర్తిస్తాడు. మనసు చంచలమైంది. మనకు అందని వాటిని, మనకు దక్కని వాటి గురించి వక్రీకరించడమో, చెడుగా ఆలోచించి మన అహాన్ని తృప్తిపరుచుకోవడమో చేస్తుంటాం. పార్టీలలో, పబ్బులలో కొంత మంది మగాళ్ళు చేరినప్పుడు ఎన్నో గాసిప్స్ మాట్లాడుతుటారు. డబ్బున్నవాళ్ళ గురించి, పదవులలో వున్న వాళ్ళ గురించి ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం కనిపిస్తుంది. అనుకోకుండా మన రచయిత ఆ గాసిప్ వలయంలో చిక్కుకుని మాట తూలాడని తర్వాత గ్రహించి మథనపడటం “మనసు కోతి లాంటిదేనా” లో చూడవచ్చు. మంచి పొజిషన్లో వున్న వాళ్ళు, మంచి పలుకుబడి కలిగిన వాళ్ళలో రచయితలు కూడా వుంటారు. వాళ్ళ అభిమానులమంటూ కొంత మంది చేరి, వాళ్ళని బుట్టలో వేసుకుని తమ పనులను చక్కదిద్దుకునే “ఈనాటి గిరీశం”ల పట్ల జాగ్రత్త వహించమని సూచిస్తారు.
రచయిత తాను విన్నవి కన్నవి అన్నీ కలిపి ఇలా కథలుగా రూపొందించారు. చాలా కథల్లో రచయిత ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కనిపిస్తారు. అందుకనే కథలన్ని ఉత్తమ పురుషలో సాగుతాయి. ఏమి రాసినా ఎలా రాసినా ఆద్యంతం ఆసక్తిగా చదివింపజేసే గుణం నవీన్ స్వంతం. ఈ కథలని మొదలు పెట్టారంటే చివరి వరకు అవే మిమ్మల్ని తీసుకువెళతాయి.
కొత్త నీరొచ్చింది
అంపశయ్య నవీన్ కథలు
ప్రత్యూష ప్రచురణలు, వరంగల్లు
పేజీలు: 167, వెల: రూ.200/-
సోల్ డిస్ట్రిబ్యూటర్స్: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™