మంగాపురం అనే ఊర్లో వెంకటరంగయ్య చాలా ధనవంతుడు. తాను గొప్పవాడిననే గర్వమూ అతని ధనమంత ఉంది. ఎవ్వరికీ ఒక పట్టాన సహాయం చేసేవాడు కాదు. అందరూ అతడి వెనక గేలి చేసేవారు.
ఎవ్వరూ అతడితో మాట్లాడను పెద్దగా ఇష్టపడేవారు కాదు. వెంకటరంగయ్య మాత్రం అందరూ తాను గొప్పవాడైనందున తనకు భయపడి ఎవ్వరూ మాట్లాడటం లేదని భ్రమించేవాడు.
ఇలా ఉండగా ఆ ఊరి పాఠశాలకు మాధవ్ అనే మాస్టర్ ట్రాన్స్ఫరై వచ్చాడు. అతడు నివసించను ఇల్లు కోసం వెతుక్కుంటుండగా, ఆ ఊరి రైతు ఒకతను “పంతులు గారూ! మీకీ ఊర్లో నివసించను తగిన ఇల్లు దొరకడం కష్టం, అన్నీ పూరిళ్ళే! పట్నం నుండీ వచ్చానంటున్నారు. పైగా కరెంటు ఉన్న ఇళ్ళు తక్కువ, మాది చిన్నగ్రామం కదా! మీరు ఎలాగైనా వెంకటరంగయ్యగారి ఇంట్లో చేరితే బావుంటుంది. ఐతే అతగాడు ఎవ్వరితో కలవడు” అని చెప్పగా, తల ఊపాడు మాధవ్.
ఆ సాయంకాలం స్కూలయ్యాక, మాధవ్ మాస్టార్, ఒక డజను అరటి పండ్లు, పూలు తీసుకుని వెంకటరంగయ్య ఇంటికి వెళ్ళాడు. బయట తోటలో ఈజీ ఛైర్లో విశ్రాంతిగా కూర్చుని ఉన్నవెంకటరంగయ్య, తన ఇంటికి వచ్చిన కొత్త వ్యక్తిని చూసి “ఎవరయ్యా అది?” అని ప్రశ్నించాడు.
“నమస్కారం బాబూ! నేను ఈ ఊరికి క్రొత్తగా వచ్చిన మాస్టర్ని, నా పేరు మాధవ్. మీరు చాలా గొప్ప వారని, దయామయులనీ, అందరికీ సహకరిస్తారని, కొత్తవారికి అండగా నిలుస్తారనీ అంతా చెప్పుకుంటుండగా విని వచ్చాను.” అని చెప్పిన మాధవ్ మాటలు విని మహదానంద పడి “రా! రావయ్యా! కూర్చో!” అని కుర్చీ చూపించి “ఏ ఊరి నుండీ వచ్చావు? ఎప్పుడు వచ్చావు?” అని ప్రశ్నించాడు వెంకటరంగయ్య.
“మాది పక్కనే ఉన్న పట్నం. నాకు క్రొత్తగా ఈ ఊర్లో ఉద్యోగం వచ్చింది స్కూల్ టీచర్‌గా, ఇక్కడ నివసించను ఇల్లు కోసం వెతుకుతున్నాను. ప్రతిరోజూ పట్నంనుండీ రావడం కష్టం, పైగా పని చేసే ఊరిలోనే ఉండాలని ప్రభుత్వ ఉత్తర్వు. ఎక్కడ వెతికినా అన్నీ పూరిపాకలే! మీ ఇల్లొక్కటే మేరు పర్వతంలా కనిపిస్తోంది.” అన్నాడు, మాధవ్ మెచ్చుకోలుగా ఆ ఇంటి వైపు చూస్తూ.
ఉబ్బిపోయిన వెంకటరంగయ్య “రావమ్మా! మనూరికి కొత్తగా వచ్చిన మాస్టారు సార్ వచ్చారు, కాస్త చల్ల పట్టుకరా” అని లోనికి కేక వేసి, చిక్కని మజ్జిగ తెప్పించి ఇచ్చాడు మాధవ్‌కి.
“ఏమైనా మీది వెన్నలాంటి మనస్సండీ! అందుకే ఈ మజ్జిగలోనూ ఇంత వెన్న ఉంది. అంతా చెప్పుకుంటున్న విషయం నిజం. అసలు మీ వంశమే మహా గొప్పదని ఊరంతా చెప్పుకుంటున్నారు” అన్నాడు మాధవ్.
వెంకటరంగయ్య పొంగిపోయి”అవునవును. ఇంతకీ మీకేం కావాలి మాస్టార్ సార్! చెప్పండి తప్పక చేస్తాను.” అన్నాడు.
“ఏంలేదు మీలాంటి వారితో ఉంటే నాకూ కాస్త మంచి గుణాలు అబ్బి, పిల్లలకు ఆ మంచి గుణాలు నేర్పితే ఊరు ఊరంతా బాగై పోతుంది కదాని మీ ఇంట్లో ఓ గది నాకు అద్దెకు ఇప్పిస్తారేమోని వచ్చానంతే, అదీ మీకేం ఇబ్బంది లేకపోతేనే” అన్నాడు మాధవ్.
“దాందేముంది? లంకంత కొంప, మేమిద్దరమే కదా, మాకు పిల్లాజల్లా లేరు, మహద్భాగ్యంగా ఉండు సార్!” అని అంగీకరించాడు వెంకటరంగయ్య.
ఇంకేముంది మురళీ మురిపెంగా అతడి ఇంట్లో దిగిపోయాడు.
అలా వెంకటరంగయ్య ఇంట్లో మకాం వేసిన మాధవ్ ప్రతిరోజూ అతడ్ని పొగడుతూ, మంచి చేసుకుని, ముందుగా పాఠశాలలోని పిల్లలందరికీ నోటు పుస్తకాలు, పలకలు, పెన్నులు కొనిపించి స్వతంత్ర దినోత్సవం నాడు వెంకటరంగయ్య చేతనే ఇప్పించి, అతడి దానగుణాన్ని పొగిడి ఒక శాలువా కప్పి సన్మానించాడు. దాంతో వెంకటరంగయ్య పెరుగులో వేసిన ఆవడలా ఉబ్బితబ్బిబ్బై “మురళీ మాస్టర్! మీరు కోరినవన్నీఇస్తాను, మీ పాఠశాలకు ఏం కావాలో చెప్పండి” అన్నాడు.
“అన్ని దానాల్లోకీ విద్యాదానం గొప్పదంటారు, మీరు పాఠశాలకు ఒక పక్కా భవనం నిర్మించి మీ తండ్రి గారి పేరో తల్లిగారి పేరో పెట్టివారి ఋణం తీర్చుకోవచ్చు. పేద పిలల్లకు బట్టలు దానం చేస్తే స్వర్గంలో ఉన్న మీ తల్లిదండ్రులకు ఆ పుణ్యం వెళుతుంది. వారు మీవంటి బిడ్డను కన్నందుకు ఎంతో సంతోషిస్తారు. ఊరిలోనూ మీకెంతో పేరు వస్తుంది.” అని వెంకటరంగయ్యని తమ మధురమైన మాటలతో మెప్పించి, ఒప్పించి పాఠశాలకు ఒక భవనం నిర్మింపజేశాడు మాధవ్.
ఆ ప్రారంభోత్సవానికి విద్యాశాఖ పెద్దలను పిలిచి వెంకటరంగయ్య దాన గుణాన్నిపొగిడాడు.
పేపర్లలో తన పేరు, ఫొటో చూసుకుని వెంకటరంగయ్య తెగ సంబరపడి పోయి, తనవద్ద ఉన్నడబ్బు ఖర్చు చేసి మంచి పనులు చేస్తే లభించే సంతోషాన్ని రుచి చూపిన మాధవ్‌ని మెచ్చుకుని,ఇంకా ఇంకా మంచి పనులు చేయను సిధ్ధపడ్డాడు.
ఆ ఊరి పురాతన రామాలయాన్ని బాగుచేయించాడు, ఊర్లోకి చెరువు నుండీ కుళాయిలు వేయించి నీటి సరఫరా చేయించాడు. అంతా పొగుడుతుంటే దానం గొప్పదనం మధురిమా తెలిశాయి ఆయనకు.
ఊరివారంతా “మాధవ్ మాస్టర్ ఏం మత్రం వేశావయ్యా! ఊరివారి ముఖం చూడని వెంకటరంగయ్య చేత ఇంత డబ్బు ఖర్చు చేయించి, పాఠశాలను, ఊరిని బాగు చేయించిన ఘనత నీదేనయ్యా!” అని మెచ్చుకోగా, మాధవ్ “ఘనత నాది కాదు, మాటది. ఆయనలోని దయాగుణాన్ని, మంచితనాన్ని పొగడ్తలతో బయటికి తెప్పించిన మాటలది. మనిషిని బాగుచేసినా, చెడగొట్టినా మాటలకున్నంత ప్రభావం దేనికీ లేదు సుమండీ! అందుకే ‘మాటే మంత్ర’మన్నారు పెద్దలు.” అని చెప్పాడు .
నీతి: మంచి మాటలు కొండలనైనా కరిగిస్తాయి. అందరితో మంచిగా ప్రేమగా మాట్లాడం పిల్లలకు పసితనం నుంచే అలవరచను ప్రయత్నించాలి.
ఆ మాస్టారి పూర్తి పేరు మురళీమాధవ్ అని గమనించమనవి.
రచయిత మనవి. –ముడమూడవ పేరాలో – ఇలా ఉండగా ఆఊరి పాఠశాలకు ‘మురళీ మాధవ్ ‘ అనేమాస్టర్ ట్రాన్స్ ఫరై వచ్చాడు – అని ఉండాలి.దయతో గమనించగలరు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™