హేమంతంలో ఓ ప్రశాంత, నిశాంత సమయం.. కలల లోగిలిలో నేను. ఏదో కథ చకచక రాసేస్తున్నాను. థాట్ భలేగా ఉంది. యమ స్పీడుగా కలలో కదులుతున్న నా కలానికీ కాలింగ్ బెల్ పుల్‌స్టాప్ పెట్టింది. చక్కటి కల కరిగిపోగా లేచి, తలుపు తీసి పనిమనిషితో పాటు నేనూ నా పనికి ఉపక్రమించాను. పని చేస్తూ కలను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఉహూ.. లీలగా నాంది మాత్రమే గుర్తుంది. నిజంగా ఆ కల మొత్తం గుర్తుండి ఉంటే మంచి కథ రాసేసుకునేదాన్ని కదా.. ప్చ్. టీ తాగుతూ పేపరందుకున్నాను. ఫలించిన కల.. చెదిరిన కల.. అంటూ ఎన్నికల్లో గెలుపు ఓటముల విశ్లేషణ కనిపించింది. ఇక్కడా కలల ప్రస్తావనే అనుకుంటూ పేపర్ పక్కన పడేశాను. నా మది కలల ఊసుల్ని మొదలెట్టింది. మనిషికి ఉన్న అదృష్టాలలో ఒకటి కలగనటం. కలలకు ధనిక, పేద, ఆడ, మగ, వీరుడు, భీరుడు, చిన్న, పెద్ద తేడాలేం లేవు. కల ఓ అద్భుత జగత్తు. కలలలో బ్లాక్ అండ్ వైట్లు, ఈస్ట్‌మన్ కలర్లు కూడా ఉంటాయి. ఆ కలల్లో మనిషి నింగిలో, నీళ్లల్లో, నిప్పుల్లో, అగాధాల్లో, పాతాళంలో, కీకారణ్యంలో, చీకటి గుహల్లో, ఉద్యానవనాల్లో, మరుభూముల్లో, ఫైవ్ స్టార్ హెూటల్లో, మురికి కాలువ పక్కనే ఉండే పాక హెూటల్లో, స్వర్గంలోనో, నరకంలోనో ఎక్కడైనా – ఎలాగైనా ఉండొచ్చు. చిరుద్యోగిని ఆఫీసర్ కలలో కూడా యముడై వేపుకు తినొచ్చు. అమాయక ఆఫీసర్‌ను కిలాడి సబార్డినేట్ కలలోనూ షంటుతుండవచ్చు. పైసా ఖర్చులేని ‘వినోద నిద్ర’! అఫ్ కోర్స్, మంచి కలలైతే వినోదం. పీడకలలైతే అమ్మో! భయం.. భయం.. కలల ప్రపంచంలో బిచ్చగాడు బిలియనీర్ కావచ్చు, గుడిసెలో ఉండే సామాన్యుడు దేశాధినేత కావచ్చు, చిటికేస్తే… అది కూడా అవసరంలేదు.. సదా వెన్నంటి ఉండే సేవకులు, రక్షకులు రాజవైభోగం అనుభవించవచ్చు.. పామరుడు, మహాపండితుడై పుంఖానుపుంఖాలు కావ్యాలు గిలికేయవచ్చు, కురూపి, జగదేకసుందరి.. నేటికాలానికి సూటయ్యేటట్లు చెప్పాలంటే మిస్ యూనివర్స్ కావచ్చు, బక్కప్రాణి, పహిల్వాన్ కావచ్చు.. మొత్తం మీద ఏమో గుర్రం ఎగరవచ్చు.. కాదు.. ఏనుగైనా ఎగరవచ్చు. కల కరిగిపోతుందని తెలిసినా ఆ కలలోనే మరికొంత సేపు విహరించాలనుకుంటాడు మనిషి.
అన్నట్లు కలలకు వేళాపాళా కూడా ఉండాలంటారు. తెల్లవారుఝామున వచ్చే కలలు నిజమవుతాయట!? పగటి కలలు మాత్రం ఉత్తుత్తివే అని కూడా ఉంటారు. అందుకే ‘పగటి కలలు కంటున్న మావయ్యా.. గాలిమేడలెన్నో నువ్వు కట్టావయ్యా.. మావయ్యా.. రావయ్యా.. డాబుసరిగ కూచుంటే డబ్బులొస్తాయా, మాటలు దులిపేస్తుంటే మూటలొస్తాయా, మావయ్యా నీ సంగతి తెలుసులేవయా, పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవయా..’ అని మావను కోప్పడుతుంది ఓ సినిమాలో నాయిక. కాబట్టి పగటివేళ ముసుగుతన్ని పడుకొని కలల ప్రపంచంలో విహారం మంచిదికాదన్నమాట. ముఖ్యంగా పగలనేది పనివేళ.. (నైట్ షిఫ్ట్‌లు కొన్నిచోట్ల నడుస్తున్నా ప్రధాన పనికాలం పగలే) పని మానుకొని కలగనడమే పనిగా పెట్టుకుంటే పని దండగ.. కల సైతం కల్లగానే మిగులుతుంది. అదీసంగతి. అయితేనేం కుర్రకారుకి కలలతో నిద్రించడమే ఇష్టంగా ఉంటుంది. పెద్దలు మేలుకొలుపు అందుకుంటే ‘అబ్బబ్బ! మంచి కలపాడు చేశావ్’ అంటూ విసుక్కోవటం మామూలే. కొందరు తల్లులు ‘కలలుగనే వేళ యిదే కన్నయ్యా.. నిదురలో ఎంతో హాయి చిన్నయ్యా… కలత మాని తీపి నిదురపోవయ్యా’ అంటూ బద్ధకిస్టు పుత్రరత్నాలకు వత్తాసు పాడుతారు. ఆ.. ఆ.. వెనుకరోజుల్లో డ్రీమ్ గర్ల్ అని హేమమాలినిని అనేవారు. ఆ తరువాత ఎందరెందరున్నా కలల సుందరి శ్రీదేవి మాత్రమే అని కొందరు.. ఇప్పుడైతే అభిరుచులు అనేకాలు.. రోజుకో కలల సుందరి కామన్.. అదేమంటే కలలో అయినా వెరైటీ ఉండొద్దా అంటారు.
కల.. ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. అదే ‘త్రిజట స్వప్న వృత్తాంతం..’ రావణుడు, సీతను ఎత్తుకుపోయి అశోకవనంలో ఉంచటం తెలిసిందే. అయితే రావణుడి కోరికను ఆమోదించమని అక్కడి రాక్షస స్త్రీలు సీతను వేధిస్తుంటే సీతకు కావలిగా ఉండే ‘త్రిజట’ అనే వృద్ద రాక్షసి, వారిని వారించి, తనకు రాత్రి.. సీతాపతి, మహాపరాక్రమవంతుడైన శ్రీరాముడు విజయం సాధించినట్లు, రావణుడు వినాశనం చెందినట్లు కల వచ్చిందని, మహాసాధ్వి సీతను బాధించటం మంచిదికాదని వారికి హితవు పలుకుతుంది. భాగవతంలోనూ పోతనగారు కలను ప్రస్తావించారు. చిన్నికృష్ణుడు మన్నుతిన్నాడని తెలిసి, యశోదమ్మ అతగాడి చెవి మెలేసి, నోరు చూపమంటుంది. కృష్ణయ్య అమాయకంగా నోరు తెరుస్తాడు. ఇంకేముంది.. ఆ నోట బాపురే.. పదునాల్గు భువనభాండాలు – గోచరించాయి. నివ్వెరపోయిన యశోదమ్మ తాను చూస్తున్నది నిజమా, కలా అన్న యోచనలో పడిందట. ఆ సందర్భాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తూ పోతనగారు ‘కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో! తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో.. అని ఆమె తలపోసిందని యశోద మనస్థితిపై చక్కని పద్యం రాశారు. అదేనా.. భక్త రామదాసు చరిత్రలోనూ తానీషాకు రామలక్ష్మణులు కలలో కనపడి.. తాము రామోజీ, లక్ష్మోజీలమంటూ పరిచయం చేసుకొని, రామదాసు కట్టవలసిన పైకం మూటను అందించి, రామదాసును చెరసాల నుంచి విడుదల చేయమని చెప్పడం ఉంది. ఆ రామదాసుగారే భక్తి పారవశ్యంతో ‘పలుకే బంగారమాయెనా.. కోదండపాణి! పలుకే బంగారమాయెనా..’ అంటూ ‘పలుకే బంగారమాయె పీలచిన పలుకవేమి, కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి’ అని గానం చేశాడు. దేవుళ్లు, చాలా మంది భక్తులకు కలలో కనపడి తాము ఫలానా చోట వెలిశామని చెప్పడం, భక్తులు ఆయా చోట్ల దేవాలయ నిర్మాణాలు చేయడం కూడా తెలిసిందే. ‘వరలక్ష్మీ వ్రత’ కథలో చారుమతికి వరలక్ష్మీదేవి కలలో కనిపించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వ్రతం చేయమని చెప్పటం తెలిసిందే. భాసమహాకవి విరచిత ‘స్వప్న వాసవదత్త’ నాటకంలో… ఉదయనుడి కల వృత్తాతం.. ఉంది.
వ్యక్తులను బట్టి, వారివారి పరిస్థితులకు, మానసిక స్థితులకు, కోరికలకు తగ్గట్లుగా ఆయా కలలు ఉంటుంటాయి. వియోగ బాధలో ఉన్న నాయిక ‘నీవు లేక వీణా పలుకలేనన్నది.. నీవు రాక రాధ నిలువలేనన్నదీ..’ అంటూ, ‘కనులనైన నిన్ను కనుల చూతమన్నా, నిదుర రాని నాకు కలలు కూడ రావే..’ అని చింతిస్తుంది. ఇంకో సినిమాలో నాయిక.. ‘తుషార శీతల సరోవరాన.. అనంత నీరవ నిశీధిలోన.. ఈ కలువ నిరీక్షణ.. నీకొరకే రాజా… వెన్నెల రాజా..’ అంటూ. ‘కలనైనా నీ తలపే, కలవరమందైనా నీ తలపే..’ అంటుంది. కన్నెపిల్లల కలల్లో రాకుమారుల సంచారం మామూలే. ‘రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో, అనురాగము, సరాగము ఇదేమి లోకమో…’ అంటూ ‘కలలో ఒక అందగాడు కన్నుకలిపి నవ్వెనె.. కను కలుపగ నా వన్నెలు కడలి పొంగులాయెనే, కన్నె మనసు పొంగించిన వెన్నెల రాజ్వెవరే ఆ నరా.. తనెవ్వరా.. వరించు నాథుడే’ అంటూ ఓ చిత్రనాయిక వీనులవిందు చేస్తుంది. మరో చిత్రంలో హీరోయిన్.. ‘కనులు కనులతో కలబడితే… ఆ కలలకు పేరేమి?’ అని ప్రశ్నిస్తే… ‘కలలే’ అంటాడు హీరో. ‘ఆ కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి?’ అని మరో ప్రశ్న సంధిస్తుంది.. ‘మరులే’ అంటాడు హీరో.. ఇలా కలల నుంచి మొదలెట్టి ఆ నాయిక తనకు కావలసిన జవాబును తెలివిగా నాయకుడి నుంచి రాబట్టుకుంటుంది. జీవితం ఎంతో విలువైనదంటూ, దాన్నో కలలా కరిగిపోనివ్వవద్దంటూ ఓ సినీకవి.. ‘కలకానిది, విలువైనది.. బతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు..’ అని మంచి సందేశం అందించాడు. కలగనటమనేది ఉన్నప్పుడు మంచివి, చెడ్డవీ కూడా తప్పనిసరిగా ఉంటా యంటాడు మరో కవి… ‘స్వరములు ఏడైనా.. రాగాలెన్నో, హృదయం ఒకటైన భావాలెన్నో… కనులున్నందుకు కలలు తప్పవు.. కలలున్నపుడు పీడకలలు తప్పవు.. కలల వెలుగులో కన్నీరొలికే కలతల నీడలు ఎన్నెన్నో…’ అన్న పాట ఎంతగానో హిట్ అయింది.
అయితే దేవతలు అనిమేషులు కదా.. అనగా వారి కనులకు రెప్పపాటు ఉండదు. రెప్పపాటు లేకుండా నిద్ర ఎలా? రామాయణంలో లక్ష్మణుడి అర్ధాంగి ఊర్మిళాదేవి పధ్నాలుగేళ్లు సుదీర్ఘంగా నిద్రించి, యెడబాటు తెలియకుండా కాలం గడిపేసింది. కానీ ఊర్మిళకు కలలగోల ఉన్నట్లు కనిపించదు. ‘కీలుగుర్రం’ చిత్రంలో అక్కినేని, సఖితో కలిసి ఆకాశంలో గుర్రంపై ప్రయాణిస్తూ పాడే ‘కాదు సుమా కల కాదు సుమా, అమృత పానమును, అమరగానము, జగని యానమును కల్గినట్లుగా, గాలిని తేలుతు సోలిపోవుటిది….’ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. ‘పాండురంగమహాత్యం’లో ‘కలవరపాటున కల అనుకొందు, కాదను కొందు కళా నీ ముందు’ అని పుండరీకుడు అంటే, కళ బదులిస్తూ ‘కాదు సఖా కల నిజమేలే’ అంటుంది. ‘స్నేహం’ చిత్రంలో అంధుడు, తన దోస్త్‌తో తన కల గురించి ఇలా చెపుతాడు.. ‘నిన్న రాత్రి ఓ కల వచ్చింది.. ఆ కలలో ఒక దేవత దిగివచ్చింది.. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా… అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా అంటూ అడిగింది.. దేవత అడిగింది.. అప్పుడు నేనేమన్నానో తెలుసా, నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావి… నా పాటలోని మాటలు నీవి’ ఎంత చక్కటి భావ వ్యక్తీకరణ!
విషాదానికి ‘విలాసం’ అయిన పాత దేవదాసు (అక్కినేని) ‘కల యిదనీ, నిజమిదనీ.. తెలియదులే.. బ్రతుకింతేనులే.. ఇంతేనులే..’ అని పాటందుకుంటే, కొత్త దేవదాసు (కృష్ణ సినిమా) ‘కల చెదిరింది.. కథ మారింది.. కన్నీరే ఇక మిగిలింది.. కన్నీరే ఇక మిగిలింది..’ అంటూ వ్యథ చెందుతాడు. ఇలా కలల మీద ఎందరెందరో కవులు.. ఎన్నెన్నో పాటలు.. ‘తాతమ్మ కల’ అని ఓ చిత్రం వచ్చింది. కథంతా నడిచి చివరకు తాతమ్మ కల ఫలిస్తుంది. ఇక వ్యక్తిగత కలలేగాక దేశం గురించి, ప్రపంచం గురించి, సమాజం గురించి, వ్యవస్థ గురించి కలలుగనే వారెందరో. గాంధీజీ స్వతంత్ర్య భారతాన్ని గురించి ఎన్ని కలలు కన్నారో. ఆరుగురు దిగంబర కవుల్లో ‘మహాస్వప్న’ ఒకరు.
కలలకు సంబంధించి ఎన్నో నవలలు ప్రపంచవ్యాప్తంగా విఖ్యాతి చెందినవి ఉన్నాయి. మచ్చుకు – ఎలిస్’స్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్, హారీ పాటర్, ఎమిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్.. వగైరాలు. రచయితలు కథలను చిత్రవిచిత్రంగా నడిపి చివరకు అదంతా ‘కల’ అని ముగించడం మామూలే.
మనిషికి కలలు ఇష్టమేకానీ పీడకలలు వచ్చినపుడే ‘ఇదెక్కడి పీడ రా బాబూ!’ అనిపించేది. ఆ భయంకరమైన కల నిజమవుతుందేమోనన్న భయం వెంటాడుతుంది. భయ పెట్టే కలలు వస్తే కొంతమంది నిద్రలోనే ముచ్చెమటలు పట్టి, భయంతో వణికిపోతూ అరుస్తారు.. అరిచామనుకుంటారు కానీ అస్పష్టంగా ఏదో కలవరిస్తుంటారు. నిజానికి చాలా కలలకు తల, తోక ఉండదు. మనిషి మస్తిష్కంలో అట్టడుగున చేరిన అనేకానేక ఆలోచనలు, భయాలు కలగాపులగమై కలలుగా పరిణమిస్తాయంటారు. కొంత మంది తమకు సీరియల్ కలలు వస్తున్నట్లు చెప్పటమూ ఉంది. వెంటాడే కలలు కొందరివి. కొంతమంది నిద్రమగతలో ఉండి, వాస్తవాన్నే కలలుగా భ్రమించే సందర్భాలూ ఉంటాయి. ఓ మిత్రుడు తనకు బాల్యంలో కాముడి పున్నమి రోజున నిద్రిస్తుండగా తమ ఇంటి తలుపునెవరో విరగ్గొట్టి, పట్టుకెళ్తున్నట్లు కలవచ్చిందనీ, తీరా ఆ తర్వాత మేల్కొని చూస్తే నిజంగానే తలుపు గాయబ్ అనీ, కామదహనానికి తమ తలుపు చెక్క ఆహుతయిందని అర్థమయి.. ‘అరెరె.. నేను కల అనుకున్నానే’ అని వాపోయానని చెప్పారు. అయితేనేం.. ఆ వృత్తాంతం గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుల పూలు పూయిస్తూనే ఉంది. అసలు ఏ కల ఫలితం ఎలా ఉంటుంది అని వివరించే కలల శాస్త్రమూ ఉంది. చందమామ కథల్లో అయితే కొన్నింటిలో… రాజుగారికి స్వప్నం రావటం, ఆయన కలవరపడి మర్నాడు పండితుల్ని రావించి, వారికి దాని గురించి చెప్పటం, పండితులు ఆ స్వప్నాన్ని విశ్లేషించి, ఫలితాన్ని వివరించటం వగైరాలుంటాయి.
ప్రతీరాత్రి ఎందరెందరికీ ఎన్నెన్ని కలలో! ఎంతటి ఫాంటసీ.. రచయితల కలాలకు సైతం సులభంగా అందని ఫాంటసీ. ‘మేరె సపనోంకీ రాణి కబ్ ఆయేగీ తూ….. ఆయి రుత్ మస్తాని కబ్ ఆయేగీ తూ, బీత్ జాయే జిందగాని కబ్ ఆయెగీ తూ.. చలీ ఆ… తూ.. చలీ ఆ’ అంటూ పాడుకోవటం హుషారుగానే ఉన్నా, కళ్లు తెరిచి కూడా, కలల నింగిలోనే ఉండిపోతే కష్టాలు తప్పవు. నిశితంగా చూపు సారించి నిజాలు గ్రహించి కర్తవ్యోన్ముఖులు అయితేనే జీవితానికి సార్ధకత. మన మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత సైంటిస్ట్, విజ్ఞాన ఖని.. అబ్దుల్ కలాంగారు ‘కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోండి’ అని పిలుపునిచ్చారు. లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటి గురించే కలగంటూ, వాటిని నిజం చేసుకునేందుకు నిరంతరం నిబద్ధతతో కృషి చేస్తే కలలు సాకారమవుతాయని ఆయన ఉద్బోధ. అది గుర్తుంచుకొంటే జీవితం ఫలించిన కలగా, కమ్మగా, కమనీయంగా సాగిపోతుంది.. ‘ఆకుకూరలమ్మా, ఆకుకూరలు..’ అరుపుతో నా తలపులకు చెక్… నా మదిలోని కలల సౌధం తలుపులు మూసుకున్నాయి. ప్రస్తుతంలోకి వచ్చాను. కర్తవ్యం కళ్ల ఎదుర నిలిచి కదిలాను నేను అక్కడినుంచి!
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 60కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. భూమిక కథల పోటీలో ఒకసారి బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన వంటి కాలమ్‌లు రాశారు.
Wonderful explanation regarding dreems by smt J syamala gaaru J Guru Prasad
Excellent Syamala garu…
మనిషి జీవితం పై కలల ప్రభావం ఏ రూపంలో ఎలా ఉంటుందో ,మనిషికీ కలలకూ గల ఆవినాభావ సంబంధాన్ని శ్యామల గారు అధ్బుతంగా వివరించారు. శ్యామల మేడమ్ గారికి ధన్యవాదాలు. శివ్వాం. ప్రభాకరం. బొబ్బిలి.
Mrs. Syamala garu has written an excellent article on dreams.
SIVVAM. PRABHAKARAM, Bobbili.
Excellent performance by syamala garu..
Mahathi
Wonderful Performance by smt Syamala garu J kameswari
The write up on dreams by J Syamal is an excellent piece with thought provoking appropriate references from literature to music from movies to dramas and what not. Her presentation is so lucid that it remain in the minds of the reader for ever.
Andamaina kala lanti shyamalagari katha adbhutam.madam and inches prati kathalo edo speciality vuntundi.that is shyamala madam.
శ్రీమతి శ్యామల గారి మానససంచరరె శీర్షిక విభిన్నంగా ప్రత్యేకతను సంతరించుకుని నా హృదయాన్ని అలరిస్తోంది. ఈ సంచికలో ఆమె మనసు కలల అలలపై తెలియాడింది.ప్రతి నిత్యమూ మన దైనందిన జీవితంలో మనం అనుభూతించే విషయాల లోతులలో ఉన్న ప్రత్యేకతలను తనదైన శైలిలో హృదయరంజకంగాచెప్పడంలో శ్రీమతి శ్యామల గారు సఫలీకృతులయ్యారు.మానవ జీవితంలో కలల ప్రత్యేకతను భావుకతను జోడించి విశదీక రించడం ద్వారా పాఠకుల మనసులను రంజింప జేశారు….శ్రీమతి శ్యామల గారికి అభినందనలు.
‘Manchi’ Kala ni raasaaru Syamala garu.
‘స్వప్న శ్యామలీయం’ సింప్లీ సూపర్బ్. రచయిత్రి గారు పాఠకులను కూడా స్వప్నలోకాల్లో విహరింపజేసారు. చదువుతున్నంతసేపూ ఎంతో బాగుంది. చివరలో అప్పుడే అయిపోయిందా అన్పించింది. తీసుకున్న టాపిక్ పాఠకులకు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది. మధ్యలో చక్కటి సాహిత్యంతో కూడిన ‘ఆపాత మధురాలు’ ఎంతో బాగున్నాయి. రచయిత్రి శ్యామల గారికి అభినందనలు…💐💐💐
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™