సాయం సంధ్యవేళ.. వెలుగు వెళ్లిపోతూ, వచ్చె.. వచ్చె అంటూ చీకటి హడావుడిపడుతూ వచ్చేవేళ.. ముస్తాబు మార్చుకున్న ఆకాశం. ఇంటి దగ్గరే ఉండి ఇటువంటి సంధ్యా సౌందర్యాన్ని ఆస్వాదించి ఎన్నాళ్లయిందో. గేటుదాకా వెళ్లి వీధిలోకి తొంగి చూశా. వీధంతా నిర్మానుష్యం. ఎక్కడో పక్షులు చేసే చిత్ర ధ్వనులు తప్పించి అంతా నిశ్శబ్దం.. అందరూ ఇళ్ల తలుపులు మూసుకొని… ఉనికికి గుర్తుగా కిటికీలోంచి లైట్లు మాత్రం కనిపిస్తున్నాయి. ఇది మా వీధేనా.. అనుకుంటూ వెనక్కు తిరిగి వచ్చి గుమ్మం లోనే బైఠాయించాను.
ఏదో ఛానెల్లో ‘లవకుశ’ ప్రసారమవుతోంది కాబోలు. పాట వినిపిస్తోంది….
ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ.. కరుణామయులిది కాదనలేరా, కఠిన కార్యమనబోరా సాధువుల కెపుడు వెతలేనా, తీరని దుఃఖపు కథలేనా .. ॥ ఏ నిముషానికి॥
నిజమే! మనిషి ఎంతగా ఎన్నింటినో సాధించినా అతడి మేథకందనివెన్నో మిగిలేవున్నాయి. మరుక్షణం ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు?
అంతెందుకు ఈ కరోనా విషవలయంలో చిక్కుకుని ఇంతగా అల్లాడతామని ఎవరమైనా ఊహించగలిగామా? పాటతో నా ఆలోచనలు పరిపరివిధాలుగా ప్రయాణించసాగాయి.. ‘దేవుళ్లకే తప్పలేదు కష్టాలు.. మనుషులం మనమో లెక్కా’ అంటారెందరో. కష్టాలు అనగానే అందరికీ గుర్తొచ్చే దైవాలు సీతారాములు. సీతారామలక్ష్మణులు ముగ్గురూ వనవాసం చేశారు. సరే లక్ష్మణుడు అన్నగారి సేవలో తరించాలని వారిని అనుసరించాడు. ఇక సీతను రావణుడు ఎత్తుకుపోగా.. అశోకవనంలో సీత, అరణ్యంలో రాముడు తీవ్రంగా కుమిలిపోవటం.. ఆ పైన హనుమ సీత జాడను కనుగొనడం, వగైరా వగైరా.. రామరావణ యుద్ధంలో కడకు రావణ వధతో కథ సుఖాంతం కాలేదు. సీతకు అగ్నిపరీక్ష పెట్టడంతో సీత ఎదుర్కొన్న కష్టం పెద్దదయింది, ప్రత్యేకమైంది. అందులోనూ సీత నెగ్గింది. హమ్మయ్య సీతకు కష్టాలు తొలగిపోయాయి.. అయోధ్య చేరి పట్టాభిషిక్తులై హాయిగా ఉన్నారు అనుకునే లోపలే చాకలి కారుకూత, రాముడు దానికి ప్రాముఖ్యమిచ్చి సీతను అడవుల పాట్టేయడంతో సీత కష్టాలే మిన్నగా నిలిచాయి. అందుకే కష్టాలు అంటే సీతమ్మవే అన్నంతగా జనుల హృదయాల్లో నాటుకుపోయింది. రామాయణానికి సంబంధించి ఏ సినిమా వచ్చినా సీతమ్మ కష్టాలు చూసి కంటతడి పెట్టే ప్రేక్షకులెందరో. ఇక సత్యహరిశ్చంద్రుడి చరిత్ర అయితే అది కష్టాల కాణాచే. సత్యవాది అయిన హరిశ్చంద్రుడిని దేవతలు పరీక్షకు గురిచేస్తారు. ఫలితంగా విశ్వామిత్రుడి ఆగ్రహానికి గురై, దాన్ని చల్లార్చటానికి రాజ్యాన్ని సమర్పించుకుంటాడు హరిశ్చంద్రుడు. ‘మరి దక్షిణ మాటేమిటి?’ అంటాడు విశ్వామిత్రుడు. కొంత గడువిస్తే దక్షిణ పైకం సైతం చెల్లిస్తానని, సర్వస్వాన్ని కోల్పోయిన హరిశ్చంద్రుడు ఆలుబిడ్డలతో, కట్టబట్టలతో కాశీకి బయల్దేరుతాడు. కాశీ లోనూ ఏమీ సంపాదించలేక అర్ధాంగిని ఓ బ్రాహ్మణుడికి అమ్ముతాడు. కొడుకు సైతం తల్లితో వెళ్లిపోతాడు. అప్పటికీ ధనం సరిపోక హరిశ్చంద్రుడు తానూ ఓ చండాలుడికి బానిసగా అమ్ముడు పోయి, కాటికాపరి పనిచేస్తుంటాడు. అక్కడ తల్లివద్ద ఉన్నలోహితాస్యుడికి పాము కాటేసి మరణిస్తాడు. చంద్రమతి పుత్రశోకంతో కొడుకును తీసుకుని చీకటి సమయాన స్మశానానికి వెళుతుంది. ఆమె వద్ద చిల్లిగవ్వ ఉండదు. కాటికాపరి సుంకం చెల్లించాల్సిందేనంటాడు. ఆమె తనవద్ద ఏమాత్రం పైకం లేదంటుంది. నీ మెడలో పుస్తెనమ్మి చెల్లించమంటాడు. మెడలోని పుస్తె భర్తకు తప్ప వేరెవరికీ కనపడని కారణంగా కాటికాపరిగా ఉన్నది తన భర్తే అని గుర్తిస్తుంది చంద్రమతి. దాంతో భార్యాభర్తలిద్దరూ శోకంలో మునిగిపోతారు. అయినా విధి నిర్వహణ తప్పదని, చంద్రమతి తన చీరలో సగం ముక్కను సుంకంగా చెల్లిస్తుంది. కొడుకుతో పాటే తాము ప్రాణాలు వదలాలనుకున్న తరుణాన హరిశ్చంద్రుడి సత్యవ్రతానికి దేవతలు మెచ్చడం, లోహితాస్యుడు తిరిగి బతకడం.. కథ ఎట్టకేలకు కష్టాల కడలినుంచి, ఆనందతీరానికి చేరుతుంది. మరి భారతంలో పాండవుల కష్టాలు తెలిసినవే. కౌరవులు వంచనతో జూదంలో గెలిచి, ద్రౌపదిని నిండుకొలువులో వస్త్రాపహరణం చేసి అవమానించడం, వనవాసం, ఆ పైన అజ్ఞాతవాసం, అన్నీ అయ్యాక కూడా దుర్యోధనుడు, పాండవులకు రాజ్యంలో భాగం కాదుకదా, కనీసం ఐదు ఊళ్ళయినా ఇవ్వడానికి ఒప్పుకోడు. దాంతో మహాభారత యుద్ధం.. అన్నీ కష్టాలే.. మనో క్లేశాలే.. ఇక భాగవతంలో కృష్ణుడికి పుట్టుక తోనే కష్టాలు మొదలవుతాయి. హాయిగా ఇంట్లో దర్జాగా పుట్టవలసిన కృష్ణుడు, కంసుడి కారణంగా చెరసాలలో పుట్టిన పరిస్థితి. బిడ్డను కంసుడినుంచి రక్షించడానికి వసుదేవుడు నడిరేయి చిన్నికృష్ణుని తీసుకుని, యమునానదిని దాటి, వ్రేపల్లెలోని నందయశోదల యింటికి చేరుస్తాడు. ఆపైన పూతన, త్రినవర్తుడు, అఘాసురుడు, బకాసురుడు మొదలైన ఎందరో రాక్షసులు చిన్ని కృష్ణుని చంపటానికి ప్రయత్నించడం, బాలకృష్ణుడు వారిని అంతమొందించటం.. అవన్నీ కృష్ణలీలలుగా అభివర్ణించుకుని ఆనందిస్తాం కానీ ఒక చిన్ని పాపడు అంతమంది రాక్షస శత్రువులను ఎదుర్కోవలసిరావడం నిజంగా ఎంత కష్టం! ఇక నల దమయంతుల కష్టాలు, సత్యవంతుడి ప్రాణాలు దక్కించుకోవడం కోసం సావిత్రి కష్టాలు, దుష్యంతుడు తనను పెళ్లాడిన మాట మరిచిపోతే శకుంతల పడ్డ కష్టాలు.. యిలా ఎన్నెన్నో. కష్టాల కథలు మనకు పురాణాల నిండా కనిపిస్తాయి. దేవుళ్ల కష్టాలలో శివుడి కష్టాలు ప్రత్యేకమైనవి. బోళాశంకరుడికి కష్టాలన్నీ భక్తులకు అనుచిత వరాలివ్వడం వల్లే వస్తాయి. బోళాశంకరుడు గజాసురుడి భక్తికి మెచ్చి, అతడు కోరినట్లుగా కైలాసం మాటనే మరచి, అతడి ఉదరమందే ఉండిపోతాడు. పార్వతీదేవి శంకరుడు ఎంతకాలమైనా రాకపోవడంతో విష్ణువుతో మొర పెట్టుకుంటుంది. విష్ణువు విషయం గ్రహించి గజాసుర సంహారానికి గంగిరెద్దుల మేళంతో బయల్దేరుతాడు. గజాసురుడు గంగిరెద్దు విన్యాసాలకు ముగ్ధుడై ఏంకావాలో కోరుకోమంటాడు. అప్పుడు గంగిరెద్దు నాడించిన విష్ణువు, అతడి గర్భం నుండి శివుణ్ని విడుదల చేయమంటాడు. అలా శంకరుడు ఆ కష్టం నుంచి ఒడ్డెక్కుతాడు. భస్మాసురుడి విషయంలోనూ శంకరుడు భక్తికి లొంగి, కష్టం కొనితెచ్చుకుంటాడు. విష్ణువు, మోహిని వేషంలో వెళ్లి నాట్యం నేర్పే వంకతో భస్మాసురుడిని అతడి చేయే అతడిని భస్మం చేసేట్లుగా చేసి దేవతలకు ముప్పు తప్పిస్తాడు.
ఇక మానవుల విషయానికి వస్తే శీతోష్ణస్థితి దృష్ట్యా కాలాలు మూడు.. ఎండాకాలం, వానాకాలం, చలికాలం. అయితే మనుషులంతా ఏదో ఒక దశలో ఎదుర్కొనే కాలం మరొకటి ఉంది. అదే ‘కష్టకాలం’. ఈ కష్టకాలంలో రకాలున్నాయి. వ్యక్తిగత కష్టాలు, సమాజకష్టాలు, ప్రాంతీయ కష్టాలు, దేశ కష్టాలు, యావత్ ప్రపంచ కష్టాలు. వ్యక్తిగత కష్టాలు అంటే ఓ వ్యక్తికి తీవ్ర అనారోగ్యం లేదా అతడి కుటుంబంలోని వారి అనారోగ్యం లేదా ఆర్థిక కష్టాలు, కలహాల కాపురం వగైరాలు. సమాజ కష్టాలు అంటే మూఢాచారాల వల్ల, మూఢ నమ్మకాలవల్ల ఎదుర్కొనే కష్టాలు, ఆయా పరిమితప్రాంతాల్లోని దుర్భిక్షం.. అందరికీ సర్వసామాన్యంగా ఎదురయ్యే సమస్యలు వగైరాలు ఏవైనా కావచ్చు. ఇక ప్రాంతీయ కష్టాలు అంటే ఏ ఒక్క రాష్ట్రానికో ఎదురైన కష్టం.. ఉదాహరణకు కొన్నేళ్ల కిందట భోపాల్‌లో విషవాయువు విడుదలై అనేకులు మరణించారు. మరెంతోమంది రకరకాల ఆరోగ్య సమస్యలతో జీవచ్ఛవాలయ్యారు. దేశానికి సంబంధించిన కష్టాలంటే యుద్ధం, దేశం మొత్తంమీద నీటి కొరత, ఆకలి, అనారోగ్యం, నిరుద్యోగం, పర్యావరణ కాలుష్యం, ప్రకృతి వైపరీత్యాలు వంటివి తీవ్ర స్థాయిలో ఉండటం. ప్రపంచ కష్టాల విషయానికి వస్తే పర్యావరణ ప్రతికూలతలు, ద్రవ్యోల్బణం, మహమ్మారి వ్యాధులు వగైరాలు… ఇప్పుడు ప్రపంచంలోని చాలాదేశాలు మహమ్మారి కోవిడ్-నైటీన్ విషవలయంలో చిక్కుకుని పెను విపత్తులో పడ్డాయి. కష్టసుఖాలు జంటపదాలు. ఎవరైనా సుఖాలనే కోరుకుంటారు కానీ కోరి కష్టాల నెవరు ఆహ్వానిస్తారు. కానీ పరిశీలిస్తే మంచి, చెడులు కలిసే ఉంటాయి. ఎల్లకాలం ఒకేరీతి ఎప్పుడూ ఉండదు. ఇదే మాట రంగులరాట్నం చిత్రంలో పాట రూపంలో వినిపించారు.
భుజంగరాయశర్మ రాయగా, ఘంటసాల ఆలపించిన పాట..
కలిమి నిలవదు, లేమి మిగలదు కలకాలం ఒక రీతి గడవదు నవ్విన కళ్లే చెమ్మగిల్లవా వాడిన బ్రతుకే పచ్చగిల్లదా.. ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగుల రాట్నం.. త్యాగమొకరిది, ఫలితమొకరిది అమ్మ ప్రాణమాయిద్దరిదీ వ్యధలూ బాధలు కష్టగాథలు చివరికి కంచికి వెళ్లే కథలే.. ఇంతేరా ఈ జీవితం..తిరిగే రంగుల రాట్నము బ్రతుకే రంగుల రాట్నం …
కష్టాల్లో చిన్నవి, పెద్దవి ఉంటాయి. కానీ ఆయా స్థాయిలను బట్టి ఆయా వ్యక్తులు అవే పెద్దసమస్యలుగా భావించవచ్చు. అందుకే ‘పీత కష్టాలు పీతవి’ అనే సామెత వచ్చింది. పైగా ‘కష్టాలు మనుషులకి రాక మానులకు వస్తాయా’ అంటారు కొందరు, మానుల కష్టాలు అర్థంచేసుకోలేక.
కవులకు, కథకులకు కష్టాలు గొప్ప సబ్జెక్ట్. అయితే ఇందులో కూడా – కొంత తేడా ఉంది. ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అయితే, ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ’ అన్నారు.
శ్రీశ్రీ ‘బాటసారి’ కవితలో…
‘కూటికోసం కూలికోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం.. కూటికోసం॥ మూడురోజులు ఒక్క తీరుగ నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావ రీతిగ సంచరిస్తూ సంచలిస్తూ దిగులుపడుతూ దీనుడౌతూ తిరుగుతుంటే చండ చండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బుపట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మచీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం కళ్లు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్లో తల్లి ఏమని పలవరిస్తోందో.. కళ్లు వాకిట..‘
అంటూ…
‘వేగుజామును తెలియజేస్తూ కోడి కూసింది విడిన మబ్బుల నడుమనుండీ వేగుచుక్కా వెక్కిరించింది బాటసారి కళేబరంతో శీతవాయువు ఆడుకుంటోంది పల్లెటూళ్లో తల్లికేదో పాడు కలలో పేగు కదిలింది..‘
మనసును దుఃఖసంద్రంలో ముంచెత్తే ఓ చిత్రాన్ని అక్షరాల్లో అద్భుతంగా చూపారు శ్రీశ్రీ. ఇప్పుడు వలస కూలీలు సొంత ఊళ్లకు వెళ్లలేక, ఏకాకులుగా.. ఉన్నచోట తిండిలేక పడే తిప్పలు చూస్తుంటే ఈ కవితే మదిలో మెదులుతుంది.
గతంలో ఎన్నో సినిమాలు, సీరియళ్లు.. తాగివచ్చి కొట్టే భర్త, రోగంతో, ఖళ్ ఖళ్ మంటూ దగ్గే.. వృద్ధుడైన మంచంపట్టిన మామగారు, కోడలిని సాధించే అత్తగారు, పెళ్లికెదిగిన అర్ధమొగుడు ఆడపడుచు, ఆకతాయిగా తిరిగే మరిది, పాపంపుణ్యం తెలీని చిన్నపిల్లలు, ఉద్యోగం, ఇంటిపని, ఎక్కడా వెలుగే కనపడని జీవితం.. ఇలాంటి కథలతో వచ్చాయి. తన సంపాదనతోనే కుటుంబమంతటినీ పోషిస్తూ, తన పెళ్లిని వాయిదా వేస్తూ, చెల్లెళ్ల కోసం త్యాగాలు చేస్తూ, చివరకు ఒంటరిగా మిగిలిపోయి, బరువు బాధ్యతలకే అంకితమయ్యే ఓ అమ్మాయి కథ ‘అంతులేని కథ’ ఎంతగానో హిట్ అయింది. ఇలా ఎన్నెన్నో…
‘కష్టాలు కలకాలం ఉండవు’ అని పెద్దలేనాడో మనకు ధైర్యాన్ని నూరిపోశారు. నేడు కష్టపడవచ్చు, రేపు ఇంకా కష్టం ఉండవచ్చు. కానీ ఎల్లుండి మాత్రం కచ్చితంగా సుఖంగా ఉంటుంది అనుకుంటాడు ఆశాజీవి. అందరూ అలాగే అనుకోవాలి కూడా. ‘శభాష్ రాముడు’లో ఆశావాదాన్ని ప్రబోధించే పాటొకటుంది..
‘జయమ్ము నిశ్చయమ్మురా.. భయంబు లేదురా జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా.. సాగిపొమ్మురా.. కష్టాల కోర్చుకున్న సుఖాలు దక్కును.. సుఖాలు దక్కును గాఢాంధకారమలముకున్న భీతి చెందకు సందేహపడక వెలుగు చూపి సాగు ముందుకు, సాగు ముందుకు నిరాశలోనె జీవితాన్ని క్రుంగదీయకు, క్రుంగదీయకు జయమ్ము నిశ్చయమ్మురా….‘
అన్నట్లు మనవాళ్లు ‘అష్ట కష్టాలు’ అంటారు. అవి ఒకటి – దేశాంతర గమనం. ఏదో బలమైన కారణంవల్ల ఉన్నఊరు విడిచి బతకడానికి వేరేప్రాంతానికి వెళ్లవలసివచ్చే దుస్థితి. రెండు- భార్యా వియోగం. మూడు- ఆపద్బంధు దర్శనం, బీదరికం లేదా మరేదైనా కారణాలవల్ల తలెత్తిన ఆపదసమయంలో బంధుదర్శనం కావడం. నాలుగు- ఉచ్చి భక్షణం, గత్యంతరం లేక ఇతరుల ఎంగిలి తినే పరిస్థితి రావడం. ఐదు- శత్రు స్నేహం, అవసరం కోసం శత్రువుతో స్నేహం చేయక తప్పని పరిస్థితి రావడం. ఆరు- పరాన్న ప్రతీక్షణం, తనకున ఇది కోల్పోయి ఇతరుల పంచన చేరటం. ఏడు- భంగం, పదుగురిలో తలెత్తుకు తిరగలేని అవమాన పరిస్థితి కలగడం. ఎనిమిది దారిద్ర్యం, ఇవన్నీ.. లేదంటే వీటిలో కొన్నయినా ప్రతివారి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి.
‘విక్టర్ హ్యూగో’ బీదరికం అంశం పైనే ‘లే మిజరబుల్స్’ నవల రాశాడు. ఇది ఎంతో ప్రసిద్ధికెక్కింది. అదే తెలుగులో ‘బీదలపాట్లు’ సినిమాగా రెండుసార్లు నిర్మించారు. రెండింటిలోనూ అక్కినేని నాగేశ్వరరావుగారే నటించడం మరో విశేషం. మామూలుగా దైవాన్ని విస్మరించేవారు కూడా కష్టాలలో దైవాన్ని తలచుకుంటారు. ఆపద మొక్కులు ఎన్నో మొక్కుతారు. ఆపద మొక్కులవాడుగా ఏడుకొండలవాడు భక్తుల చిత్రాలలో కొలువు తీరిన సంగతి తెలిసిందే.
అసలు ప్రపంచంలోని ఆయాదేశాల్లో ప్రజల కష్టసుఖాలను సైతం ఏటా అంచనావేసి ‘మిజరీ ఇండెక్స్’ నివేదికను విడుదల చేస్తుంటారు. తొలిసారిగా పందొమ్మిదివందల అరవైలో ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్‌కు ఆర్ధిక వ్యవస్థ సులువుగా అర్థమయ్యేందుకు ఆర్ధికవేత్త ‘ఆర్ట్ ఒకూన్’ ఈ మిజరీ ఇండెక్స్‌ను రూపొందించాడు దేశంలోని సాంవత్సరిక ద్రవ్యోల్బణం రేటు, నిరుద్యోగం రేటును కలిపి దీన్ని తయారుచేశాడు. ఆ తర్వాత హార్వర్డ్‌కు చెందిన రాబర్ట్ బారో కొన్ని మార్పులు చేశాడు రెండువేల పందొమ్మిది మిజరీ ఇండెక్స్ ప్రకారం వెనిజులా మిజరీలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానం అర్జెంటినా అందుకుంది. ఇక మిజరీ తక్కువ స్థాయిలో ఉండి చిరునవ్వులు చిందించిన దేశాల్లో అగ్రస్థానాన థాయ్‌లాండ్ ఉంటే, ఆ తర్వాత స్థానం హంగేరీ పొందింది. భారత్ విషయ మానికి వస్తే నలభైనాల్గవ ర్యాంక్‌లో నిలిచింది. ఈ కరోనా పుణ్యమా అని ముందుముందు ఈ ర్యాంక్ లన్నీ కూడా దిగజారిపోతాయి.
‘కళారవి’ కవితలో
‘పోనీ, పోనీ, పోతే పోనీ సతుల్, సుతుల్, హితుల్ పోనీ పోతే పోనీ రానీ, రానీ వస్తే రానీ కష్టాల్, నష్టాల్ కోపాల్, తాపాల్, శాపాల్, రానీ వస్తే రానీ..‘
అంటాడు శ్రీశ్రీ. ప్రస్తుత సమయంలో మనిషి నిర్వేదానికి ఇది సరిగ్గా సరిపోతుంది.
కరోనా కష్టానికి పేద, ధనిక తేడా లేదు. ప్రెసిడెంట్, సర్వెంట్ తేడా లేదు. అసలు ఈ కరోనా నేపథ్యంలో తలెత్తుతున్న కష్టాలు ఎవరూ ఎన్నడూ ఊహించనివి. ఓ మహిళ భర్త సింగపూర్‌లో మరణిస్తే, ఇంటికే పరిమితమై అంత్యక్రియలను వీడియోలో చూడవలసిరావటం కనీ వినీ ఎరుగని కష్టంకదా. తమకు కరోనా సోకిందనే అనుమానంతో కొందరు ఆత్మహత్యలు చేసుకోవటం, నెల్లూరులో చిక్కుకున్న కొడుకును తన దగ్గరకు తెచ్చుకోవాలని ఓ తల్లి బోధన్ నుంచి స్కూటీపై వెళ్లి తెచ్చుకోవటం ఎంత కష్టం. అసలు కరోనా నుంచి బయటపడ్డాక కూడా మరెన్నో ఏళ్లు దీని ప్రభావం ప్రపంచం మొత్తంమీద, అన్నిరంగాలమీద ఉండబోతోంది. పేదరికం విశ్వరూపం ధరించనుంది. అయినా ధైర్యంగానే విపత్తు నెదుర్కోవాలి. ఇంటికే పరిమితమై భౌతిక దూరం పాటించడ మొక్కటే కోవిడ్-నైటీన్ నియంత్రణ మార్గమని ప్రభుత్వం, డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెపుతున్నప్పుడు దాన్ని అర్థంచేసుకుని పాటించాలి. బిజీగా ఉన్న కాలంలో ఒకింత తీరికను, సెలవును కోరుకుని, ఇప్పుడు కరోనా కారణంగా తీరిక చిక్కితే ఇంటిపట్టున సుఖంగా ఉండటాన్ని కూడా కష్టమనుకుంటే ఎలా? ఆర్థిక బాధలు, ఇతరత్రా బాధలు కొన్ని ఉండొచ్చు గాక. అవేవీ ప్రాణాలకంటే ఎక్కువకాదు. మానవాళిపై పగబట్టిన మహమ్మారి వీడే దాకా అందరూ స్వయం నియంత్రణతో మెలగవలసిందే. అయినప్పటికీ టీవీలు, కంప్యూటర్లు, మొబైళ్ళ అందుబాటులో ఉండగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఏమంత కష్టం? పరస్పర పలకరింపులకు, సమాచారాలకు ఎటువంటి కొదువలేదు. కరోనా నేపథ్యంలో ఎందరిలోనో దాగి ఉన్న సృజనాత్మకత వెల్లడవుతోంది కూడా. వాట్సాప్‌లో రకరకాల క్విజ్‌లతో జికె పెంచుకుంటున్నారు. పిల్లలు ఆన్లైన్లోనే పాఠాలు నేర్చేసుకుంటున్నారు. కొంతవరకు ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తున్నారు. పరిస్థితిని బట్టి నడుచుకోవలసిందే. ‘చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోక ప్రయత్నించి చిన్నదీపాన్ని వెలిగించు’ అని సినారె ఆనాడే అందించిన స్పూర్తిని అందిపుచ్చుకుని ముందుకు సాగవలసిందే.. సమీప భవిష్యత్తులో..
‘దేశమ్ము మారిందోయ్… కాలమ్ము మారిందోయ్ కష్టాలు తీరేనోయ్… సుఖాలు నీవేనోయ్..‘
అని పాడుకోగలమా? అనుకుంటుండగానే ఆకాశం ఉరిమి, కరోనా కష్టాల ఆలోచనల్ని తరిమికొట్టింది. అంతే.. కర్తవ్యం గుర్తొచ్చి కదిలానక్కడినుంచి.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 60కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. భూమిక కథల పోటీలో ఒకసారి బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన వంటి కాలమ్‌లు రాశారు.
Syamala garu is a versatile writer and highly knowledgeable.Her narration is so interesting that every paragraph interests me. I enjoy reading her episodes every fortnight. Congratulations Madam…
శ్యామలగారు వ్రాసిన వ్యాసం ” మృత్యోర్మా అమృతంగ మయ” బాగుంది. రామాయణ, భారత , భాగవత గాధలు, సత్యహరిశ్చంద్రుని కథలు అందులో ప్రజలు , ముఖ్య పాత్రలు పడిన కష్టాలు కళ్ళకు కట్టినట్టు శ్యామలగారు అభి వర్ణించారు. అష్టకష్టాలు అంటే చాలా మందికి తెలియవు. తెలియని కష్టాలను తెలియజేసారు. పడిన కష్టాలు కలకాలం ఉండవనీ తెలియజేసారు. అదే కరోనా కష్టాలు పడేవారికి శ్యామలగారి వ్యాసం ఓ ఓదార్పునిస్తుంది. బాధల్లోనున్న వారికి బాధల్లో లేనివారు ఓదార్చడం సహజం. మనందరితో పాటు శ్యామలగారూ కరోనా బాధితురాండ్రే. అయినా తన కరోనా బాధలు విడిచి పెట్టి మనల్ని ఓదార్పు చేయడం తల్లి పాత్రను ఆమె పోషించినట్టయింది. ఇంకా ఆమె తన వ్యాసం లో పాఠకులకు తెలియని విషయాలెన్నో తెలియ జేసారు. శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు.
శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660 252.
ఓదార్పలాంటిది అవుతుంది. బాధపడుతున్న వారు ఒకరుంటే ఆ ప్రక్కనే ఓదార్చేవారుంటారు. ఇక్కడ విచిత్ర మేమిటంటే కరోనా బాధితులకు సాటి బాధితురాలే ఓదార్చే సంఘటన శ్యామలగారి వ్యాసం.
కరోనా కష్టాల సమయంలో కష్టాలకు దేవుళ్ళు మానవులు అందరూ సమానమేనని చెబుతూఉదాహరణలతోసహా ఓదార్పుయాత్ర సాగించిన శ్యామలగారికి అభినందనలు..ఇటువంటి కష్టసమయంలో అటువంటి ఓదార్పు, భవిష్యత్ గురించి భరోసాయే ప్రతీవాడికీ కావాలి..సందర్భోచితమైన వ్యాసాన్ని అందించిన శ్యామలగారికి ధన్యవాదాలు.
Wonderful narration by smt syamala garu and filling the mind’s of readers with Positive vibrations and confidence Fantastic Performance by you Madam From J Guru Prasad
కరోనా సమయంలో వెలుగు రేఖలాంటి రచన ఈ మృత్యోర్మా అమృతంగమయ.అద్భుతంగావుంది మేడం.కవులకు కథకులకు కష్టాలు గొప్ప సబ్జెక్ట్ అని మీ రచనాద్వారా తెలుసుకున్నాం. మీ కలం నుంచి మరిన్ని రచనలు పాఠకులకు అందిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను మేడం.నమస్తే.
Ms Syamala garu has analysed the concept of fear in the backdrop of the dreaded Carona virus with with which every one world wide is seized with. Charlie Chaplin, whose very name evokes laughter, is reported to have famously told on ‘sorrows’ and difficulties: ” I like to walk in rain, because no one will notice my tears”. So as the author has rightly said that difficulties are a way of life; without which you will never know what happiness is. She has categorised fear at various levels: inidividual, societal, national and even international. A real mirror of what we are passing through right now. A very scholarly write up and the writer deserves hearty congratulations . S S Kandiyaped
రచయిత్రి శ్యామల రచనలు చదివిన ప్రతిసారీ కొత్త విషయం తెలుసుకోవటమో, తెలియని విషయం తెలుసుకోవటమో జరుగుతుంది! ప్రభాకరం గారు చెప్పినట్టు అష్టకష్టాలు అన్న మాటను వాడటమే కాని దాని అర్ధం తెలియని వాళ్ళలో నేనూ ఒకదాన్ని! “మృత్యోర్మా అమృతంగమయ!” ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాను. కరోనా వైరస్ ప్రజలందరినీ ఎక్కడి వాళ్ళను అక్కడ బందీలు చేసి భయాందోళనలకు గురి చేస్తోంది. అయితే దీని వలన మనుషుల్లో ఉన్న కరుణ, జాలి, పరస్పర గౌరవం, మానవత్వం తేటతెల్లంగా కనబడుతున్నాయి! శ్యామలాదేవి దశిక న్యూజెర్సీ- యు ఎస్ ఎ
ఆధునిక మానవుడు ఎంతగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచుకున్నప్పటికీ…”ఏ నిమిషానికి ఏమి జరుగునో…ఎలాంటిఉపద్రవం మనిషిని కబళించేందుకు ప్రకృతిని ఆవహిస్తుందో ముందస్తుగా తెలుసుకోలేక పోయాడు”అని శ్రీమతి శ్యామల గారు “మృత్యోర్మా అమృతంగమయ!”లో సవివరంగా తెలియజేసారు.మనం ఆధ్యాత్మికంగా ఆలోచించినా…సామాజికంగా ఆలోచించినా యిది వాస్తవమే కదా!ఇప్పుడు విశ్వవ్యాపితంగా సకల మానవాళిని మృత్యు భయానికి గురిచేస్తోన్న “కరోనా”ప్రభావంతో శ్రీమతి శ్యామల గారు సందర్భానుసారంగా ఈ రచన చేయడం ముదావహం.మానవ జీవితంలోని కష్టాలను ఉదాహరణగా చూపుతూ రామాయణ మహాభారతాలను,నల దమయంతులను,సతీసావిత్రి సత్యవంతులను,శకుంతలను,సత్య హరిశ్చంద్రుడు చరిత్రను….మొదలైన విభిన్న పౌరాణిక ప్రాచీన గాధలను ఉటంకించడంలో “పురాణ పురుషులకు…అత్యంత శక్తివంతులైన చక్రవర్తులకే కష్టాలు వచ్చి వారిని వివిధ పరీక్షలకు గురుచేసి వెళ్లి పోయాయి.కాబట్టి…ఇప్పుడు మనల్ని భయపెడుతున్న ఈ మహమ్మారిని గురించి భయపడవలసిన అవసరం లేదని ఈ రచన ద్వారా మనలో ధైర్యాన్ని,ఆత్మవిశ్వాసాన్ని నింపారు శ్రీమతి శ్యామల గారు.రచయిత్రి జ్ఞాపకశక్తికి ఓ మంచి ఉదాహరణ రంగులరాట్నం చిత్రంలోని “కలిమినిలువదు”పాట రచయిత భుజంగరాయ శర్మ గారిని ఈ తరం పాఠకులకు పరిచయం చేయడం.అంతేనా…శ్రీమతి శ్యామల గారిలో నిగూఢంగా ఉండిపోయిన మరో కోణం ఈ రచన ద్వారా వెలుగులోకి వచ్చింది. President Lindon johnson 1960లో ప్రపంచంలోనే తొలిసారిగా “మిజరీ ఇండెక్స్”ని విడుదల చేసిన విషయాన్ని మనకు తెలియ జేశారు.ప్రముఖ ఆర్ధిక వేత్త”ఆర్ట్ వొకూన్”రూప కల్పన చేయగా….”రాబర్ట్ బారో” మార్పులు చేసిన ఈ మిజరీ ఇండెక్స్ చరిత్ర ఈనాడు ఎంతమందికి తెలుసు?దీని ప్రకారం ప్రపంచ దేశాల ఆర్ధిక స్థితిని నిర్ణయిస్తారని మేధావులకు తప్ప ఎవ్వరికీ తెలియదు. దీని లెక్కల ప్రకారం వెనిజులా ప్రధమ స్థానంలో…భారతదేశం44వ స్థానంలో వున్నదని మనం తెలుసుకో గలిగాము.ఈ వ్యాసం ద్వారా రచయిత్రి ఆర్ధిక శాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టారని పాఠకులకు ఇట్టే తెలిసిపోయింది. ఒక విషయాన్ని వివరించడలో శ్రీమతి శ్యామల గారి మేధస్సు విభిన్న మార్గాలను ఎంచుకోవడం అభినందనీయం.సాహిత్యాన్ని లిఖించడంలో ఆమె ప్రత్యేకత అనన్య సామాన్యం. కళాభివందనములతో విడదల సాంబశివరావు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™