బ్రాహ్మీ సభా కామరూపా విశేషణ సదానఘో। ధారయత్య చలం రూపమనిర్దేశ్యం మనోహరమ్॥
మహాశాంతి పూజ గురించి, ఆ పూజలో పూజించవలసిన దేవతలు, ఋషులు, పవిత్రస్థలాలు వంటి విషయాలను కూలంకుషంగా వివరించిన తరువాత నీలుడు దేవతల గురించి, ఋషులు మునుల గురించి, చైత్రమాసం ఆరంభంలో వారు ఎక్కడుంటారో, ఏం చేస్తూంటారో చెప్పటం ఆరంభించాడు.
“ఇంతవరకూ నేను చెప్పిన వాళ్ళంతా చైత్ర మాసం ఆరంభంలో బ్రహ్మ నివాసానికి వెళ్తారు. ఇష్టమైన రూపం భరించగల శక్తి కలిగిన బ్రహ్మ మనోహరమైన, ప్రసన్నకరమైన రూపం ధరించి ఉంటాడు. ఆ సభలోని వారందరూ భూలోకపు సంకెళ్లు తెంచుకొని సంతోషంగా, పవిత్రంగా బ్రహ్మ గుణగణాలు గానం చేస్తారు. వేల సంఖ్యలో అప్సరసలు, ముఖ్యంగా ఊర్వశి, మేనక, రంభ, మిశ్రకేశి, అలంబుష, విశ్వాచి, ఘృతాచి, పంచచూడ, తిలోత్తమ, సానుమతి, అమల, వృంద వంటివారు బ్రహ్మ సమక్షంలో దేవతలందరి ముందు నృత్యం చేస్తారు.ఆ సభలో బ్రహ్మ ఒక మానవ సంవత్సర కాలానికి గ్రహాలను నిర్దేశిస్తాడు. ఈ విశ్వ సృష్టికర్తను మనసు తీరా పూజించిన తరువాత దేవతలు తమ తమ కర్తవ్యాలు నిర్వహించేందుకు తమ తమ నిర్దేశిత స్థానాలకు వెళ్తారు.”
ఇక్కడ మనం కాస్త ఆగి ఆలోచించాల్సి ఉంటుంది.
దేవ లోక సభ బ్రహ్మ సమక్షంలో జరుగుతోంది. ఈ పురాణంలో బ్రహ్మ సభ వర్ణన చూస్తే మనకు అలవాటయిన ఇంద్రసభ గుర్తుకువస్తుంది. అప్సరసల నాట్యాలు ఇంద్రలోకాన్ని గుర్తుకు తేవడమే కాదు ఇది ఇంద్రలోకమే అన్న భావన కలిగిస్తుంది. ముఖ్యంగా విశ్వవసు, శలిసి, గంధర్వులు, హాహా హూహూలు, నారదుడి ఆధ్వర్యంలో భజనలు పాడతారనటం ఈ భావనను మరింత బలపరుస్తుంది.
‘నీలమత పురాణం’ రచన చదువుతుంటే మనసులో ఒక భావం తప్పక మెదులుతుంది. వీలైనప్పుడల్లా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకూ కశ్మీరుకీ ఉన్న సంబంధాన్ని ప్రస్ఫుటం చేయటం కనిపిస్తుంది.
నాగులకు రక్షణ లభించే ప్రాంతం ఇదేనని విష్ణువు అభయం ఇవ్వటంతో కశ్మీరులో నాగుల నివాసం ఆరంభమైంది. అప్పటి నుంచి కశ్మీర చరిత్ర ప్రారంభమవుతుంది. తరువాత శివపార్వతులను సరోవరంలో రాక్షసుడు చూడటం, జలోద్భవుడు ఉద్భవించడం, కశ్యపుడు కశ్మీరు ఏర్పాటు చేయటంతో చరిత్ర ప్రధాన ధార్మిక స్రవంతిలో భాగమవుతుంది. కశ్యపుడు పలు మాతలను నది రూపంలో కశ్మీర్లో ప్రవహించమని ప్రార్థించడం, అవి సింధూ నదిలో కలవటం… ఇలా ఎక్కడా కశ్మీరును ‘ప్రత్యేకం’ అనుకుని వీలు లేని రీతిలో ఉంటుంది నీలమత పురాణం. ఈ పురాణంలో ప్రతి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారో బ్రహ్మ గుణగణాలను గానం చేస్తారు గంధర్వులు అని చెప్తూ, హాహా హూహూ అనే ఇద్దరు గంధర్వుల పేర్లు చెప్పడంలో తెలుస్తుంది. హాహా హూహూ ఇద్దరూ గంధర్వులు. వీరి పేర్లతో విశ్వనాథ ఒక నవల రచించారు. హాహా హూహూ ఇద్దరూ కశ్యప ప్రజాపతి కుమారులు. వీరిద్దరిలో హూహూ ఇంద్రలోకంలో ఉంటాడు. హాహా కుబేరుడి సభలో ఉంటాడు. ఇక్కడ ఇద్దరూ ఉన్నారు అంటే ఇంద్ర సభలా ఉన్నా ఇది బ్రహ్మ సభ. కశ్యపుడు సృజించిన కశ్మీరం, వీరి బ్రహ్మ ప్రార్థనల వల్ల లాభం పొందుతుంది. ఇలా ఏ ఒక్క విషయంలోనూ ఎలాంటి సందేహం, ఎలాంటి అనుమానం రాకుండా సాగుతుంది నీలమత పురాణం. ప్రతి సందేహాన్ని ముందే ఊహించి దాన్ని అడిగే లోపలే సమాధానం ఇస్తుంది.
ఇటీవలి కాలంలో కశ్మీరు భారత్లో అంతర్భాగం అని చెప్పేందుకు కశ్మీర్ చరిత్ర శంకరాచార్యుల కశ్మీరు పర్యటన నుంచి ఆరంభమవుతుందని, భారత్తో కశ్మీర్ సంబంధాలను అది నిరూపిస్తుంది అని వాదిస్తున్నారు. కానీ నీలమత పురాణం కశ్మీర్ ఆవిర్భావం నుంచి భారతదేశంలో కశ్మీర్ అంతర్భాగమని నిరూపిస్తుంది. కశ్యపుడు నిర్మించిన మేరు కశ్మీరు. ఆ కశ్యపుడు దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నవాడు. అంటే నిన్న మొన్నటి వరకు కశ్మీరు భారత్ నుంచి ప్రత్యేకం అన్న భావన లేనే లేదన్నమాట. ఈ భావన కృత్రిమంగా ఏర్పరిచారు. అది ప్రాకృతికంగా సమసిపోతుంది.
బ్రహ్మ సభలో సంవత్సరానికి గ్రహాలకు గ్రహాధిపతిలను నియమించాలనటం గమ్మత్తయిన ఆలోచన. ఎలాగైతే, పాలనలో అధిపతులను నియమించటం, వారి పనితీరును విశ్లేషించి మరో సంవత్సరం అది పొడిగించటం, లేకపోతే వారి స్థానంలో మరొకరిని నియమించటం ఎలా జరుగుతుందో దేవతల విషయంలోనూ అలా జరుగుతుంది అనటం ఒక గమ్మత్తయిన ఊహను కలిగిస్తుంది.
(ఇంకా ఉంది)
ఆసక్తికరమైన వ్యాసం. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా రేగిన వివాదాలకు కశ్మీరు ఆదినుంచీ భారత్ లో భాగమే అనడానికి తగిన ఆధారాలు చూపే పురాతన సాహిత్య ప్రమాణాన్ని చూపించారు. అభినందనలు!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™