ఉమా వివాహే శప్తోసి భృగునా త్వం గుణోత్తమః। అపూజితేన మానుష్యం తస్మాత్ భవితా ధృవమ్॥
భూతగణాలలో ఉత్తముడా, ఉమా వివాహ సమయంలో నువ్వు తనని సరిగా గౌరవించలేదని భృగు మహర్షి నీకు శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల శరీరం ధరించాల్సిన అవసరం వచ్చింది నీకు. నువ్వు ఈ శరీరంతోటే నా దగ్గరకు వస్తావు. శాపం అనుభవించాల్సిందే కాబట్టి ఈ శరీరంతోటే ఉంటావు. మానుష లోకంలో సంచరిస్తావు. నా దగ్గరకు వస్తావు. నిత్యం నన్ను అర్చిస్తావు. అత్యంత ఆనందాన్ని అనుభవిస్తావు.
శివుడు ఇచ్చిన ఈ వరం వల్ల నంది ఎల్లప్పుడూ భూతేశ్వరుడి సమక్షంలో ఉంటాడు. నిత్యం భగవంతుడిని ధ్యానిస్తూంటాడు.
ఇది విన్న గోనందుడు గాథలోని సారాంశం గ్రహించాడు.
పెద్దలను ఎట్టి పరిస్థితులోను గౌరవించాలి. వారిని తెలిసో, తెలియకో అవమానించినా దాని దుష్ఫలితం అనుభవించక తప్పదు.
“తరువాత ఏమైంది? నంది గణపతి ఎలా అయ్యాడు?” ప్రశ్నించాడు గోనందుడు.
“శిలాడుడు రాళ్ళను పిండిగా కొడుతున్నప్పుడు అతడికి శివుడు కనిపించాడు. అతడే నంది. ఏ గర్భం నుంచి జన్మించవద్దన అతడి కోరిక ఈ రకంగా తీరింది. శిలల నడుమ చంద్రవంకలా ఉన్న శిశువును తీసుకున్న బ్రాహ్మణుడు అతడిని స్వంత శిశువులానే భావించాడు. శిశు జననం తరువాత జరగాల్సిన తతంగాలన్నింటినీ జరిపించాడు. అలా సంబరాలు జరుగుతున్న సమయంలో, శిశువు దొరికిన సమయం ఆధారంగా అతడి భవిష్యత్తును గణించిన బ్రాహ్మణులు అతడు స్వల్ప జాతకుడని చెప్తారు. తనకు లభించిన శిశువు ఎక్కువ కాలం బ్రతకడని తెలిసిన శిలాదుడు రోదించటం ప్రారంభించాడు. అప్పుడు ధర్మం తెలిసిన శిశురూపంలోని నంది శిలాదుడిని ఓదార్చాడు.
“తండ్రీ… రోదించకు. ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్న సమయంలో అశ్రువులు రాల్చకు. నేను దీర్ఘకాలం బ్రతకాలన్నది నీ కోరిక. నీ కోరిక సిద్ధించి నేను దీర్ఘకాలం జీవించేట్టు వరం పొందేందుకు శివభగవానుడిని ధ్యానిస్తాను” అన్నాడు. తండ్రి అనుమతి సాధించి, తపస్సు కోసం, హిమాలయాలలో అత్యంత పవిత్రమైన ‘హేమకూట’ పర్వతం చేరాడు. ఆ శిఖరానికి ఉత్తరం వైపున, సకల పాపాలను నశింపజేసే ‘కాలోదకం’ అనే స్వచ్ఛమైన నీటి సరస్సు ఉంది. ఒక పెద్ద బండను శిరస్సుపై ధరించి, ఆ నీటిలో గొంతు వరకు నీరు వచ్చేట్టు నుంచుని శివుడిని ధ్యానించటం ఆరంభించాడు.
రుద్రుడి నామాన్ని జపిస్తుండటం వల్ల అక్కడ కాలం స్తంభించినట్లయ్యింది. వందేళ్ళు గడిచిపోయాయి. వందేళ్ళు పూర్తయిన తరువాత దేవి దేవుడితో సంభాషించింది.
పుత్రో సౌ భగవాన్ నందీ కాలోదే తపైత్య తపః। వరదానేన తం దేవం యోజయ స్వాషు మాం చిరమ్॥
నా సంతానం నంది కాలోదక సరస్సులో వందేళ్ళుగా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతడికి వీలైనంత త్వరగా వరాన్ని ప్రసాదించండి, అతడి కోరికను తీర్చండి.
దేవి మాటలు విన్న శివుడు వారణాసిలో తన వాహనాన్ని అధిరోహించాడు. దేవితో కలసి భూమార్గంలో ఎవరికీ కనపడకుండా ప్రయాణం ఆరంభించాడు.
ఇక్కడ శివుడు దేవితో కలసి ప్రయాణించిన మార్గాన్ని రక్షిస్తాడు బృహదశ్వుడు.
వారణాసి నుంచి బయలుదేరిన దేవీ దేవతలు ప్రయాగను దాటారు. పవిత్రనగరం అయోధ్యను దాటారు. నైమిశారణ్యాన్ని వెనుక వదిలి ముందుకు వెళ్ళారు. గంగ ద్వారం దాటారు. స్థానేశ్వర నుండి కురుక్షేత్ర చేరారు. పవిత్రమైన విష్ణుపాదం దాటారు.
ఇవన్నీ దాటిన వారు శతద్రు, విపాస, ఇరావతి వంటి పవిత్ర జలాలను దాటారు. దేవిక, చంద్రభాగ, విష్ణుపాద, విశోక, విజయేశ, వితస్త, సింధు నదుల సంగమం ద్వారా భరత పర్వతం చేరుకున్నారు.
ఆ పర్వత పాదం వద్ద అతడు దేవితో అన్నాడు.
“దివ్యభామినీ, నువ్వు మన వాహనం వృషభంతొ పాటు ఇక్కడే ఉండు. నేను ముందుకు వెళ్తాను. నీ సుకుమారమైన శరీరం ఈ కఠినమైన పర్వతారోహణను తట్టుకోలేదు. కాబట్టి నేను త్వరగా వెళ్ళి వచ్చేస్తాను” అన్నాడు.
(ఇంకా ఉంది)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™