(రంగస్థలం పైన ఖనా చేతిలో వెలుగుతున్న దీపంతో బొమ్మలాగ నిల్చుంది. రెండో వైపునుండి మేధ-ఆమె తల్లి వడివడిగా నడుచుకుంటూ ప్రవేశం. గాలివాన వలన వస్త్రాలు అస్తవ్యస్తమయాయి. తల్లి – మేధలకు
ఎదురు దిక్కు నుండి నాయనమ్మ కూడా వారితోనే రంగస్థలంపైకి ప్రవేశం).
నాయనమ్మ : ఇవాళ మీరిద్దరూ ఎక్కడికి వెళ్లిపోయేరు? భారీ వర్షంపడే సూచనలు చూసి నేను గాభరా పడ్డాను… మీ దగ్గర గొడుగు… రెయిన్ కోటు.. ఏవీలేవు అని!
తల్లి : ఔను, ఈ రోజు వాకింగ్ కొంచెం హెచ్చు దూరం వరకూ అయింది.
(వచ్చి, అలసినట్లు కూర్చుంటుంది)
మేధ : (ఏదో తన ఆలోచనలలో మునిగిపోయి స్వగతం) ఖనా ఏమంది?… ఇది నేపథ్యం… రంగస్థలంపైకి రావడానికి యుగాలు గడిచిపోతాయి అని కదా… (పైకి) వేల సంవత్సరాల పూర్వంకూడా కేవలం ఒక స్త్రీ అయినందువలన ఆమె మూల్యం చెల్లించవలసి వచ్చింది.
(తల్లి వంక తిరిగి) కాని అమ్మా! అలాటి యుగం ఎన్నటికైనా వస్తుందంటావా? … ఆషాఢ – శ్రావణ మేఘాలు వర్షించి… నేపథ్యం కేవలం ఒక నేపథ్యంగా మాత్రమే మిగిలిపోకుండా…
తల్లి : (తన పాదాలను నొక్కుకుంటూ) ఈమాట నువ్వు చెప్పాలి! ఉద్యోగస్తురాలివి… లేడీ ఆఫీసరువి ….
(నాయనమ్మ కిటికీలోంచి ఆకాశంలో కమ్ముకున్న మేఘాలను చూస్తూ నిల్చుంది.)
మేధ : లేడీ ఆఫీసరు… అదే కదా సమస్య!
(ఎక్కడో ఆలోచనల్లోకి మునిగిపోయి) వాళ్లు నన్ను అసలు అధికారిగా ఎక్కడ ఒప్పుకుంటున్నారు?…. నేను తీసుకునే చాలా నిర్ణయాలను కొట్టిపారేస్తారు. …నాలో ఎంతసేపూ తప్పులు వెతకాలన్న ప్రయత్నమే… వాళ్లు అదేంటోగాని దే ఫీల్ ఛాలెంజ్డ్!
తల్లి : ఏం చెయ్యగలం చెప్పు? వారికి ఇది వారసత్వంలో అందింది….. నేను మేజిస్ట్రీటుగా మొదటిసారి ఆఫీసుకి వెళ్లినప్పుడు నా అటెండరు… నా సబార్డినేట్లు… అందరూ నన్ను ‘సర్’ అని పిలిచేవారు. వారికి నేను మేడమ్‌ను కాదు, సర్ని!
నాయనమ్మ : (నవ్వుతూ) వాళ్లు పాపం ఏనాడూ అనుకుని ఉండరు, ఒక ఆడదాని కిందపని చెయ్యాల్సి వస్తుందని! ఆవిడ ఆజ్ఞలు పాటించాల్సి వస్తుందని అంతవరకూ ఉన్న ఆఫీసర్లను సర్ అంటున్నట్లే నిన్నూ సర్ అనేసారు అంతే!
మేధ : (తల్లితో) ఇంతకూ కథ ఎలా ముగిసిందన్నది చెప్పనే లేదు!
నాయనమ్మ : (ఉలిక్కిపడి) కథా? ఏం కథ?
మేధ : అబ్బా! నాయనమ్మా! నీకర్థం కాదులే!
నాయనమ్మ : (ఆశ్చర్యంగా) అర్థం చేసుకోలేనా? ఏం ఎందుకు?
మేధ : ఇదివేరే కథలే! (తల్లితో) తొందరగా చెప్పమ్మా!
తల్లి : (జాగ్రత్తగా కూర్చుని, గంభీరమైన కంఠంతో) కథ ఎలా ముగిసింది అన్నది ప్రశ్న కాదు… దానికి కారణం, ఆఖరికి ఏం జరిగింది అన్న యథార్థం ఎవరికీ తెలియకపోవడమే! ఏది ఏమైనప్పటికీ, ఖనా రాజాస్థానంలో సదస్యురాలు కాలేకపోయింది అంతే! (లేచి నిల్చుంటుంది.) కొందరేమంటారో తెలుసునా మేధా? వారే ఖనా నాలుకను ఖండించారని అంటారు. మరో కొంతమంది, తన కుటుంబానికి, మామగారికి అవమానం కలగకుండా, ఆమే స్వయంగా తన నాలుకను ఖండించుకుంది అంటారు.
మేధ : (బాధగా) ఓహ్! పూర్ ఖనా!
నాయనమ్మ : (ఆశ్చర్యంగా) ఖనా గురించేనా మీరు చెప్పుకుంటున్నారు?
(మేధ, ఆమె తల్లి కూడా నాయనమ్మ వంక ఆశ్చర్యంగా చూస్తారు)
ఆ వరాహుడి కోడలు ఖనా గురించేనా? అదే వరాహమిహిరుడు…
తల్లి : (అన్యమనస్కంగా) వరాహుడా?
(ఒక్కసారిగా ఆమెకి, నాయనమ్మ వరాహమిహిరుడిని గురించే చెప్తోంది అని అర్థం చేసుకుంటుంది) ఔను…
వరాహమిహిరుడి కోడలు ఖనా గురించే!
నాయనమ్మ : (ఉత్సాహం నిండిన గొంతుకతో) అయ్యో! తన నాలుకను తనే ఎందుకు కోసుకుంటుంది చెప్పు? మా నాయనమ్మ మరోలా చెప్పేదే?
మేధ : (చాలా ఆశ్చర్యంగా) మీ నాయనమ్మా? ఏం చెప్పేది?
నాయనమ్మ : ఏమని చెప్పిందా? ఖనా నాలుకను స్వయంగా వరాహమిహిరుడే ఖండించాడని అనేది.
మేధ : ఏంటి వరాహమిహిరుడా?
తల్లి : మైగాడ్! అంటే మరో రకమైన మాట కూడా ప్రచారంలో ఉందన్నమాట!
(తల్లి, మేధ ఇద్దరూ ఒక్కసారి ఉలిక్కిపడినట్లు అయి, నాయనమ్మ వంక చూస్తారు. వారి నోర్లు ఆశ్చర్యంతో తెరుచుకునే ఉండిపోతాయి.)
నాయనమ్మ : (చిన్న పిల్లలాగ) అదేమో నాకేం తెలుసు… మా నాయనమ్మ మాకు అలా చెప్పింది అంతే.
(నాయనమ్మ, తన నాయనమ్మ ప్రస్తావన తరవాత ఒక్కసారి ముడుచుకుపోతుంది. ఆమెకు ఒకవంక మేధ, రెండోవైపు ఆమె తల్లి నిల్చుని ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటారు. రంగస్థలానికి వెనక భాగంలో ఖనా చేతిలో ప్రజ్వలిస్తున్న దీపం పట్టుకుని, నిరీక్షిస్తున్నట్లు నిలబడి ఉంటుంది. ఆ నిరీక్షణ – ఎవరో వ్యక్తికోసం కాక, శ్రావణ మేఘాల స్వరలహరుల కోసం! వాటి గమకాలతో రంగస్థలం ప్రకాశవంతమవుతుందన్న ఆశతో నిరీక్షణ! రంగస్థలం పైని ప్రకాశం వర్తులాకారంగా ఖనా చుట్టూ తిరుగుతూండగా తెరపడుతుంది.)
(సమాప్తం)
ఇప్పటికీ ఆమె నేపథ్యరాగమే పాడుతోంది..
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™