గోరంట్లలో శ్రీ చంద్రశేఖర్ గారు చెప్పిన దానిని బట్టి 5 కి.మీ.ల దూరంలో మేరేడుపల్లిలో వేణుగోపాలస్వామి గుడి వుంది. అది వెయ్యి సంవత్సరాల క్రితంది అని చెప్పారు. వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన ఆలయాన్ని అక్కడిదాకా వచ్చి మేము చూడకుండా వెళ్ళటమా అనుకుని, “ఎలా వెళ్ళాలి” అని అడిగాము.
“ఆటోలో వెళ్ళి రావచ్చు. ఎక్కువ సమయం పట్టదు. పూజారి గారు అక్కడే వుంటారు, దర్శనమవుతుంది” అన్నారు.
సెంటర్లో ఆటో దొరుకుతుందన్నారు. వెళ్ళి అడిగితే 5 కి.మీ.లు వెళ్ళి రావటానికి రూ. 200 తక్కువ ఎవరూ చెప్పలేదు. రెండు మూడు ఆటోలున్నా అందరూ ఒకటే మాట. అవసరాలని కనిబెట్టి మాట్లాడుతారు ఆటోవాళ్ళు అనుకున్నాము. అవసరం మాది. చివరికి రూ.160కి ఒక ఆటో అతను వచ్చాడు. మేమక్కడ నుంచి రాగానే మళ్ళీ కదిరి బస్ ఎక్కాలి. వచ్చేటప్పుడు చౌరస్తాలో ఆపటం వల్ల ఆ బస్ ఎక్కడ ఆగుతుందో ఏమో తెలియదు. మళ్ళీ అవస్థలు పడటం ఎందుకని ముందే ఆటో అతనికి చెప్పాము.. “మేము కదిరి బస్ ఎక్కాలి.. ఆ బస్ స్టాప్ దగ్గర దించాలి. లేకపోతే ఊళ్ళో బస్ స్టాడ్ వుంటే అక్కడకి తీసుకెళ్ళాలి, సామాను తీసుకుని” అని. కొత్తవాళ్ళం కనుక మాకెంతో కష్టంగా అనిపించిన ఆ పని – ఆటో అబ్బాయి (చిన్నవాడే) “అలాగే.. ఇక్కడే ఆగుతుంది బస్ .. మిమ్మల్ని బస్ ఎక్కిస్తాను” అని హామీ ఇచ్చాడు. అమ్మయ్య అనుకుని మా తర్వాత మజిలీ మేరేడుపల్లి వేణుగోపాలస్వామి ఆలయానికి ఉదయం 11-20కి చేరాము. ఆటో అతనికి ఆలయం ముందే తెలుసుగనుక సరాసరి ఆలయానికే తీసుకు వెళ్ళాడు.
మేము వెళ్ళేసరికి ఆలయం మూసి వుంది. ఆటో అతను పూజారిగారిని పిలుచుకు వచ్చాడు. చిన్న ఊళ్ళల్లో మధ్యాహ్నం 12 గం. ల దాకా ఆలయాలకి ఎవరూ రారు గనుక తొందరగా మూసేస్తారనుకున్నాము.
పూజారిగారు వచ్చి తలుపులు తెరిచారు. చిన్న ఆలయమే. అయితే చాలా పురాతనమైనది. మాధవరాయల స్వామి ఆలయం, ఇదీ, ఒకేసారి కట్టించారన్నారు.
స్వామి విగ్రహం, పీఠం ఏకశిల అన్నారు. పీఠం కింద ఆవులు చెక్కి వున్నాయి. మకర తోరణంలో దశావతారాలు, పొన్న చెట్టు .. కింద వేణువునూదుతున్న వేణుగోపాలుడు ఐదు అడుగుల విగ్రహం. అటూ, ఇటూ రుక్మిణీ, సత్యభామల విగ్రహాలు.
మధ్యలో కొంతకాలం పూజలవీ జరగక మేకలని ఆలయంలోకి తోలేవాళ్ళుట. తర్వాత కొన్నాళ్ళనుంచీ పూజలు చేస్తున్నారు.
అక్కడనుంచీ తిరిగి వచ్చి సామాను తీసుకుంటుండగానే కదిరి బస్ వచ్చిందని ఆటో అబ్బాయి సామాను తీసుకొచ్చి అందిస్తే బస్ ఎక్కాము.
కదిరికి మనిషికి రూ. 40 టికెట్. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వసతికి గదులు వున్నాయి. అందులోనే ఒక గది తీసుకుని సామాను పెట్టి ఫ్రెష్ అయ్యేసరికి 1-30 అయింది. ఏం చెయ్యాలా అనుకుంటూ గుడి లోపల అంతా చుట్టూ తిరిగాము. నరసింహస్వామి ఆలయం మూసి వుంది. అలా తిరుగుతూ వుంటే చుట్టు పక్కల చూడవలసిన స్ధలాల బోర్డు కనబడింది. దానిలో కదిరి కొండ 2.4 కి.మీ.లు, తిమ్మమ్మ మర్రిమాను 24 కి.మీ.లు, వేమన సమాధి 10 కి.మీ.లు, ఆంజనేయ స్వామి ఆలయం సుమారు 15 కి.మీ.లు అని వున్నది. వెంటనే ఆలయం బయటకి నడిచి ఆటోని అడిగాము వాటిలో ఏమేమి చూడటానికి వీలుగా వుంటుందని.
తిమ్మమ్మ మఱ్ఱిమాను ప్రపంచ ప్రఖ్యాతి చెందింది, వేమన సమాధి సరేసరి, కదిరి కొండ ఈ మూడూ చూడవచ్చు సాయంకాలం లోపు అన్నాడు. రూ. 450. సరే భోజనానికి ఎక్కడన్నా ఆపమంటే దోవలో ఒక హోటల్ దగ్గర ఆపాడు. ఏమి తిన్నామో కూడా గుర్తులేదు. మధ్యాహ్నం 2-30కి ఆటో ఎక్కితే సాయంకాలం 5-20కల్లా గుడి దగ్గరకు తిరిగి వచ్చాము.
మరి మేము చూసిన తిమ్మమ్మ మఱ్ఱిమాను మీకూ చూపించాలికదా. పదండి వెళ్దాము.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™