పెళ్లి కాని కుర్రాళ్ళు పెళ్లి కాని అమ్మాయిల కంటే మహా హుషారుగా ఎప్పుడూ నవ్వుత్తూ, నవ్విస్తూ ఉంటారు. పెద్ద వాళ్ళు దేనికో దానికి కంగారు పడుతూ ఉంటే “ఓస్ దానికేనా ఇంత టెన్షన్? నేనున్నాను కదా మీకు. చిటికెలో పని చేసి పెడతా” అంటూ తల్లి తండ్రులకీ, అక్క చెల్లెళ్ళకీ భరోసా ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఉత్సాహానికి కారణం వాళ్ళ ఊహ ప్రేయసులే!
పైకి చెప్పుకోరు కానీ అసలు అబ్బాయిలకు రాబోయే జీవిత భాగస్వామి పట్ల బోలెడు కలలుంటాయి. ఎన్నెన్నో లలితమైన భావాలుంటాయి. అవి అలా అలా అలల్లా వారి మనసులో వస్తూ ఉంటాయి. క్లాస్‌లో దూరంగా కూర్చునే అమ్మాయిలో, బస్సు స్టాండ్‌లో అప్పుడప్పుడూ కనబడే అమ్మాయిలో ఆ కలల ఆనవాళ్లు కనబడతాయి. కాస్త తేరి పార చూద్దామంటే అబ్బాయిలకి మొహమాటంగా ఉంటుంది. వీడెవరో ఆశపోతులా చూస్తున్నాడే అనుకుంటుదేమో అనీ ఆ అమ్మాయి దృష్టిలో రౌడీ నైపోతానేమో అనీ భయంతో సరిగా చూడలేకపోతారు. అందుకే ఆ ఆడపిల్లలు వీళ్ళకి మరీ అందంగా కనబడి రాత్రిళ్ళు తిన్నగా తియ్యని స్వప్నాలుగా వచ్చేస్తూ ఉంటారు. దాంతో ఈ కుర్రాళ్ళు మరీ భావుకులుగా మారిపోయి కలల ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. ఉదయాలు దుప్పట్లు తియ్యకుండా ముసుగులో ఉంటారందుకే. లేస్తే దుప్పట్లోంచి కలలు రాలిపోతాయని వారికి భయం పాపం.
ప్రతి సినిమాలోనూ ఒక ముద్దొచ్చే హీరోయిన్ ఉంటుంది. ఆ పిల్లను చూడగానే యువకులకి ఆహ్లాదంగా ఉంటుంది.ఆ పిల్ల బాధలూ, కష్టాలూ వీళ్ళు సరిగా చూడరు. ఆ హీరోయిన్ డ్రెస్, హెయిర్ స్టైల్, మాట్లాడే తీరు, నడకలో వయ్యారం, మైమరపించే చిరునగవు, కళ్ళలో మెరుపు, వేసే స్టెప్పులు మాత్రమే వీళ్ళను ఆకర్షిస్తాయి. అందుకే మరి యువకులు ఒకే మూవీ అన్ని సార్లు చూడగలుగుతారు కేవలం తమ కలల రాణుల ఆచూకీ కోసం.
అబ్బాయిల ఆరాధన మౌనంగా ఉంటుంది. నిజంగా లోతుకు దిగి ఆ పిల్లను ప్రేమించడానికి వీళ్ళకి ధైర్యం సరిపోదు. ఒక వేళ ప్రేమించినా ఆ విషయం సదరు అమ్మాయికి చెప్పాలంటే వీళ్లకి అరికాళ్లనుంచీ చెమటలొస్తాయి. ఎందుకంటే ఒకసారి ప్రపోజ్ చేసాడంటే ఇంక వాళ్ళు గుదిబండలే వీళ్ళకి. తమ ఇంట్లో పెద్దవాళ్ళ నొప్పించే రభసలు అవతల ఆ పిల్ల ఇంట్లో ఒప్పించే సమస్యలు వీళ్ళ పీకకి చుట్టుకుంటాయన్న జడుపుతో నోరు విప్పరు. కాలం కలిసొచ్చి తనకి నచ్చిన అమ్మాయిల్లో ఎవరో ఒకరు పెళ్ళిచూపుల్లో కూర్చునే పిల్లలా ఎదురైతే బావుండునని గుళ్ళకి వెళ్లి బొట్టూ, చెవిలో పువ్వూ పెట్టుకుని కొబ్బరి ముక్క నములుతూ ఎవరైనా వధువుని దేవుడు పంపేడేమో అన్నట్టు ఆశగా చూస్తూ ఉంటారు. పరిణామాలు ఆలోచించకుండా సిన్సియర్‌గా ప్రేమించే మగపిల్లలు ఒక్క శాతం కూడా ఉండడం కష్టమే.
తీరా పెద్దవాళ్ళు గోత్రాలూ, నక్షత్రాలూ, జాతకాలూ చూసేసుకుని బోలెడు బేరాలాడేసుకుని ‘ఒక పిల్లని చూద్దాం పదా’ అంటారు. అంతా నిర్ణయమై పోయే ఉంటుంది. ఊరికే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలా రబ్బర్ స్టాంప్ కోసం పెళ్లి చూపులు అంతే. పాపం మనబ్బాయి కోటి ఆశలతో దేవుడికి దణ్ణం పెట్టుకుని పెళ్ళిచూపులకి వెళతాడు. అమ్మాయి స్పెషల్ కేర్‌తో అందంగానే కనబడుతుంది. అబ్బాయికి మదిలో వీణలు మోగుతాయి. అబ్బాయి మీ ఆఫీస్ ఎక్కడ? మీ పోస్ట్ ఏమిటి? లాంటి ఒకట్రెండు చిన్న ప్రశ్నలడుగుతాడు. ఆ పిల్ల కాస్త సిగ్గుపడుతూ చెబుతుంది. వెంటనే అబ్బాయిలో హీరో ఆనందపడతాడు. ఆ పిల్ల కూడా ఏవో ముద్దుగా అడుగుతుంది. ఏమడిగిందో ఇతని బుర్రలోకి ఎక్కదు. ఇంత అందమైన పిల్ల నా భార్య కాబోతోందా! అన్న ఉక్కిరిబిక్కిరిలో ఏదో చెప్పేస్తాడు. ఇంటి కొచ్చాక పెద్దవాళ్ళు పెళ్ళికి రెడీ ఐపోతూ ఉంటారు. ఏరా! పిల్ల నచ్చిందా ? అని ఎవరూ అడగరు. ‘ఏడిసాడు వాడికేం తెలుసు!’ అన్న ధీమాలో ఉంటారు వాళ్లంతా.
ఇక పెళ్లి చూపుల్లో తల ఎత్తడానికి సిగ్గుపడ్డ అమ్మాయి తాననుకున్నంత సిగ్గరి ఎంత మాత్రమూ కాదనీ ఏదో సంప్రదాయం కదా అని ఆ రోజు సిగ్గు పడింది అంతే అని గ్రహించడానికి ఓ వారం పడుతుందా అబ్బాయికి. అసలామె ప్రశ్నల బాణాలకి దీటైన జవాబు బాణాలు తన దగ్గర ఉండబోవని నిశ్చితాభిప్రాయానికి కూడా ఓ నెలరోజుల్లోనే వచ్చేస్తాడు కూడా. ఆ తర్వాత వారి కొత్త కాపురం సినిమాలూ, పార్కులూ, రెస్టారెంట్లూ, మాల్స్‌లో ములుగుతూ కర్రీ పాయింట్ల దగ్గర తేలుతుంది. అదీ బోర్ కొట్టాక స్వయంపాకం మొదలై ఎవరు ఎంత పని చెయ్యాలీ అన్న దగ్గర వాదవివాదాలు మొదలై చిన్నగా జీవిత సంగీతంలో తీపి తగ్గుతూ ఉంటుంది. బాగా నచ్చిన పాట పది సార్లు వింటే అందులో శ్రావ్యత పోయినట్టు.
“మీకే పువ్వులిష్టం అండీ” అనడుగుతుంది హానీమూన్‌లో అమ్మాయి. “నాకు చేమంతులిష్టం” అని అతనంటాడు. “నిజమే ఎంతబావుంటాయో అవి!” అంటుందామె. ఒకట్రెండు సార్లు ఆ పూలు ధరించి ఆపై “ఎవరికన్నా, మల్లెలూ, జాజులూ ఇష్టం ఉంటాయి కానీ గడ్డిపువ్వుల్లాంటి చేమంతులేం అందమండీ బాబూ” అనేస్తుంది. ఇంకోసారి పెళ్లయిన కొత్తలో పెళ్ళాం చిలక పలుకులు పలికే రోజుల్లో “ఏవండీ మీకే రంగంటే ఇష్టం?” అనడుగుతుంది. అబ్బాయి గబుక్కున “నాకు పసుపు రంగంటే ఇష్టం” అన్నాడనుకోండి.”ఓహో! అలాగయితే నేను ఆ రంగుచీరె కొనుక్కుంటా” అంటుంది. అబ్బాయి ఒక ఇంచి ఎత్తు ఎదిగినట్టు మురుస్తాడు. ఒకటో రెండో పసుపు చీరలు కొనుక్కుని ఆ తర్వాత “ఈ పసుపు రంగేమి బావుంటుందండీ! బొత్తిగా వెర్రెత్తినట్టు లేదూ? ఏమిటో మీ టేస్టు” అంటుంది పెదవి విరుస్తూ. ఆ విరుపుతో అతనికి పసుపు రంగంటేనూ, చేమంతి పూలంటేనూ విరక్తి కలిగేట్టు చేస్తుందామె. అప్పుడా అబ్బాయి నా మనసులో సున్నిత, సుకుమార భావాలు ఎన్నటికీ చెప్పకూడదు. చెబితే వాటిని ఈమె నలిపి నాశనం చేసేస్తుంది అని గ్రహించినవాడై ఇక నుంచి నా అభిరుచులు (ఉంటే గింటే) ఏ సహృదయ మిత్రురాలితోనో పంచుకుంటే గౌరవం దక్కుతుంది అనుకుంటాడు. ఆ తర్వాత “నీ అభిరుచే నా అభిరుచి డియర్” అని పరువు కాపాడుకోవడం మొదలెడతాడు.
కొత్త దంపతులుగా ఉండే రోజుల్లో భర్త క్యాంపులకి వెళ్లినప్పుడతను తన కొత్త భార్యకి ఓ చక్కని ఉంగరమో, ఖరీదైన చీరో తెస్తాడు మురిపెంగా. ‘నా మీదెంత ప్రేమండీ మీకు!’ అన్నట్టు కళ్ళతోనే కితాబులిస్తుందామె.కానీ ఆ తర్వాత క్యాంపు కి బయలుదేరేముందు “ఇదిగో చూడండీ! డబ్బులు తగలేసి ఆ మెరవని బంగారాలూ, నా వంటికి నప్పని చీరలు తేవాకండి. డబ్బులివ్వాలనుంటే నాకివ్వండి పక్కింటావిడా నేను వెళ్లి కొనుక్కుంటాం” అంటుంది. సర్ప్రైజ్ గిఫ్టులు తెచ్చి భార్యల కళ్ళలో మెరుపు చూడాలనుకున్న భర్తలకు ఆ ముచ్చట అలా ముగుస్తుంది.
మగవాళ్ల కుండే బాధలు చెప్పుకోవడానికి వీలుగా ఉండవు. ఒక వేళ చెప్పినా ఎవరూ హర్షించరు. శ్రోత మగైనా ఆడయినాకానీ కానీ వీరికి సానుభూతి ఖచ్చితంగా దొరకదు. మగవాళ్ళకి చెబితే గట్టిగా నవ్వుతారు. ఆడవాళ్ళకి చెబితే కిసుక్కున నవ్వుతారు అంతే తేడా. ఫలితం ఒకటే. మరంచేత వీళ్ళే తమ బాధల్ని గురించి ఆట్టే ఆలోచించకుండా అన్-జాన్ కొడతారు. అంటే చూసీ చూడనట్టుంటారు. ఇక వీరి సమస్యలకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? సో.. దొరకదన్నమాట. ఇలా మగవారి బాధలు పురాణాలంత పాతవి.
ఏతా వాతా చివరికి జరిగేది అతని మౌనం ఆమె అధికారం. పోనీ ‘అంతా నీ ఇష్టం’ అని అబ్బాయి మనశ్శాంతిగా ఉందామన్నా ఆవిడ ఒప్పుకోదు. ఇంట్లో అంతా నా మాటే నడుస్తోంది అని ఆమెకి రూఢిగా తెలిసినా ‘నాకేం తెలుసు అన్నీ మీరే చూస్తున్నారు కదా’ అన్నప్పుడు అబ్బాయి బిక్క మొహం వేస్తాడు. అప్పుడామెకి వళ్ళు మండుతుంది. కోపంగా చూస్తుంది. అప్పుడీ అబ్బాయి “నిజమే నువ్వు నా మాట జవదాటవు. నా మాటే చెల్లుతుందిక్కడ” అన్నప్పుడు ఆ అమ్మాయి మొహం విప్పారుతుంది. ఈ లాజిక్ ఏమిటో అతనికి ఎప్పటికీ అర్థం కాదు.(ఆ మాట కొస్తే జన్మ జన్మలకీ అర్థం కాదనుకోండి.)
తనకేదో తోస్తే అది చేసేసి ఇతనికి చెబుతుండావిడ. “అలా ఎందుకు చేసావు అది తప్పు కదా!” అంటే అలా చెయ్యడానికి గల కారణాలను (ఉద్దండ లాయర్ లాంటి కపిల్ సిబ్బల్కి కూడా తోచనన్ని పాయింట్స్) ఏకరువు పెడుతుంది. నిజమే కదా అని ఈ అబ్బాయి తలూపక తప్పదు. ‘భర్తల్ని గెలవడం ఎలా?’ అని వాళ్ళేమీ ఓ పుస్తకాన్ని రెండొందలు పెట్టి కొనుక్కోనక్కర్లేదు. అది వారికి వెన్నతో పెట్టిన విద్య. చిన్నప్పటినుండీ అలవోకగా వచ్చిన గ్రహింపన్న మాట. భర్త ఆమెకే ఎక్కువ తెలివితేటలున్నాయి నాకేమీ లేవు అన్నట్టు హిప్నటైజ్ చెయ్యబడతాడన్న మాట. అదొక చిత్రమైన ట్రైనింగ్. ఒక మాయ. అది తీసుకున్నట్టూ, అందులో ఉత్తీర్ణులైనట్టూ కూడా ఆ భర్తలు పసికట్టలేరు.
అలా అని బంధు మిత్రులతో ‘నాదేమీ లేదు అంతా ఆవిడదే’ అన్నాడా చచ్చాడే ఆ రోజు. చెవులు గింగిర్లు పడే ఆరోపణలు సాక్ష్యాధారాలతో సహా అతనన్నది తప్పని నిరూపింపబడుతుంది, సాక్షులు ఎవరో కాదు వాళ్ళ పిల్ల కాయలే. అలా అని ఆవిడ కొంగట్టుకుని తిరిగినట్టు పబ్లిక్‌గా కనబడ్డాడా అయిపోయాడే ఆ భర్త. అలా ఆవిడకి లొంగి పడి ఉంటూ కూడా నా దే పై చేయి అని అందరి ముందూ నటించాలి (ఇది కదా పెద్ద నరకం!). ఎప్పుడైనా ఆవిడ అడిగినప్పుడు నటించినట్టు కనబడకుండా “అవును అంతా ఇక్కడ నాదే పెత్తనం” అని నొక్కి వక్కాణించాలి. అప్పుడావిడ చిరునవ్వు నవ్వుతుంది (లోపల ఏమనుకుంటుందో ఫాలాక్షుడికి కూడా తెలీదనుకోండి).
ఇంకా ట్రైనింగ్ ఫలితాలు ఎలా ఉంటాయంటే ఆవిడకి ఆకలేస్తే ఇతను గ్రహించి ‘అమ్మా రాధకు ఆకలేస్తోందేమోనే’ అనాలి. అంత అండర్‌స్టాండింగ్‌తో ఉండాలి. లేదంటే భార్య మనసెరిగి వాడు కాదమ్మా అన్న నెపం మీద పడుతుంది. అతని కాకలేస్తే మాత్రం నోరు విప్పి అడుక్కోవాలి. తప్పదు. ఎందుకడుగుతారు చెప్పండి? కడుపు చించుకున్న చందం అనుకోండి మగవాళ్ల పాట్లు.
అతని చెల్లెలొస్తే ఎంత డబ్బు పెట్టాలి అన్నది ఆవిడే నిర్ణయిస్తుంది. ఆవిడ చెల్లెలొస్తే అటువంటి మాటలే రావు. వాళ్ళు వెళ్ళిపోయాక ఓ నాలుగు రోజుల తర్వాత మెల్లగా “మొన్న మీరు పండక్కిచ్చిన డబ్బు మా చెల్లికి పెట్టేశా కదా మళ్ళీ ఇవ్వండి” అంటుంది. దీనికి జవాబేమి ఉంటుంది పాపం ఆ భర్తపుంగవులవారి దగ్గర? ఒక వేళ రిస్క్ చేసి ఏదోవొకటి నోరు జారినా చివరికి ఏం మిగులుతుంది అతనే సారీ బాకీ పడతాడు. ఆపై లెంపలు వేసుకోవాలి. ఆబోరు దక్కాలంటే ఇటువంటి సందర్భాల్లో భర్తలు నోరు తెరవకూడదు. ఇదీ సంగతి.
సోదర/మిత్రులారా! నేనిలా అన్నానని మీరు శ్రమపడి ఫ్లాష్‌బ్యాక్ రీల్ తిప్పుకుని అవీ ఇవీ గుర్తు చేసుకుని మనసును కష్టపెట్టుకోకండి. నే చెప్పేది ఏమిటంటే కలల రాణి వేరు. ఇలలో ఇంటిలోని గృహలక్ష్మి వేరు. ఇద్దరినీ కలిపి ఒకటి చెయ్యాలనుకోకండి. అది వీలు కాదు. అసాధ్యం. అసంభవం.
ఇప్పుడిదంతా విన్న జ్ఞానంతో మీరేదో పాత పాట నమ్మి “ఆడువారి మాటలకూ.. అర్ధాలె వేరులే” అనేసుకుని ఆవిడ కాదంటే ఔననీ, అవునంటే కాదనీ అర్థం చేసుకున్నారంటే పెను ప్రమాదంలో పడతారు. మీ శ్రీమతి ఎస్ అంటేనే.. యస్. నో అంటే నో నే! తిరుగులేదు. పంచాయితీయే లేదు. ఈ నిజమెఱిగి మసలుకోండి. సుఖశాంతులు గ్యారంటీ. శుభం.
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, మూడు నవలలూ,రెండు కవిత్వ సంకలనాలూ,ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు. APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
మొత్తానికి ఆడవారిదే పై చేయి అని తేల్చారు. ఏ మాట కా మాట చెప్పుకోవాలి మా ఇంట్లో నేనే బాస్ ను అలా చెప్పుకోవడానికి నాకు నా భార్య అనుమతి ఇచ్చింది
పెళ్లీడుకొచ్చిన అబ్బాయిల కలలను, మనస్తత్వాన్ని, పెళ్ళి కోసం ఎదురుచూపులని.. చమత్కారధోరణిలో వెలువరించారు. గృహస్థులయాక వారికి ఎదురు గిల్లికజ్జాలు, సర్దుకుపోయే నైజం, సర్దుకుపోకతప్పదని సోదాహరణంగా సరదాలొలికిస్తూ… హెచ్చరిస్తూ అందించిన అల్లూరి గౌరీలక్ష్మి గారికి అభినందనలు…
పెళ్లీడుకొచ్చిన అబ్బాయిల కలలను, మనస్తత్వాన్ని, పెళ్లి కోసం ఎదురుచూపులని… చమత్కారధోరణిలో వెలువరించారు. గృహస్థులయాక దంపతులకు ఎదురు గిల్లికజ్జాలు, సర్దుకుపోయే నైజం, సర్దుకుపోకతప్పదని సోదాహరణంగా… సరదాలొలికిస్తూ.. హెచ్చరిస్తూ అందించిన అల్లూరి గౌరీలక్ష్మి గారికి అభినందనలు.
మీ రంగుల హేల లో మగువల మనస్సులలోని ఇంద్రధనస్సు లాంటి indirect domination ని ఆవిష్కరిస్తూనే మగవారి ఆలోచనా డోల్లతనాన్ని సమర్ధవంతంగా బయట పెట్టారు…very nearer to truth. సరస సంభాషణలతో most practical గా ఉంది. మీరు రాసింది చదివిOచినట్టు కాకుండా పాఠకుడిని ఎదురుగా కూర్చోబెట్టి చెప్పినట్టు ఉంది కాబట్టి సంభాషణ అనే పదం వాడాను. my best wishes to you. కళా కృష్ణ..Hyderabad
కలల రాణి వేరూ…. గృహలక్ష్మి వేరు. పరిస్థితుల ప్రభావం చక్కగా వివరించారు. ఈవిధమైన ఆలోచింపజేసే రచనలు మీరు మాత్రమే రాయగలరు. అభినందనలు🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐 P.V.Ramana..Hyderabad
సరదాగా గా నిజంగా వుంది పెళ్లి వేరు ప్రేమ వేరు. ఆడవాళ్లు గయ్యాళులు అని మెత్తగా చెప్పారు. Goteteti Lalitha
ఎంత బాగా చెప్పారో అర్జెంట్ గా మా అబ్బాయితో ఇంటికెళ్ళగానే చదివిస్తా G.Lakshmi..Vijayawada
ఈ రచన ఎవరో రచయిత ఒక రచయిత్రి పేరుతో వ్రాసిన అత్యంత అద్భుతమైన ‘ కడుపు చించుకుని కాళ్ళ మీద వేసుకోవడం ‘ అనే మారు పేరు గల వ్యాసం. అలా కాదంటే ఈ రచయిత్రి కి పరకాయ ప్రవేశం బా… గా…. తెలిసుండాలి. ఈ రచన ఎంత బాగుందంటే, ఇది చదివాక ‘కలలో రాజకుమారులు – ఇలలో రాజీ కుమారులు ‘ అనే మ్యూజింగ్ రాయాలనిపించేటంత. కానీ, ఆడవాళ్ళకు మగవాళ్ళ గురించి తెలిసినంతగా, మొగవాళ్ళకు ఆడవాళ్ళ గురించి తెలియదే! Golla Narayana Rao..Vijayawada
Yadardham ga jaruguthunnadi kallaku kattinattu unnadhi.
అసలుసిసలైన నిజాన్ని అంతే హృద్యంగా చెప్పారండీ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™