నేటి అస్సాం సినిమాలు కూడా కమర్షియల్ లవ్ – యాక్షన్ –కామెడీలే. మజా చేయడంలో మునిగిపోండి, ప్రాంతీయ సమస్యలు మర్చిపోండి, అవి ప్రభుత్వాలు చూసుకుంటాయ్… మన సినిమాల పని ఎంటర్టైన్ చేయడమే… ఇదీ ఇక్కడి ధోరణి కూడా. ఇది నిర్మాతల, దర్శకుల తప్పేం కాదు. సామాజికంగా మార్పులొచ్చాయి. వినియోగదార్ల ప్రపంచం పెరిగిపోయింది. అరచేతిలో అంతులేని సినిమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ ఆకర్షణలతో సినిమాలు తీయకపోతే గల్లంతయి పోతారు. ఆకలి కేకలకి, నిరుద్యోగ వెతలకి ఇక ప్రాంతీయ సినిమాల్లో స్థానం లేదు. స్థానిక వినియోగదార్ల ప్రపంచం ప్రపంచీకరణ ఫలాలు అనుభవిస్తూ మజాలో మునిగితేలుతోంది. సినిమాల్లో ఆ మజా చిన్న రాష్ట్రం దాటుకుని, అలా అలా పర రాష్ట్రాల అద్భుత లొకేషన్స్‌లో, కమర్షియల్ హంగూ ఆర్భాటాలతో పైసా వసూల్‌గా వెర్రితలలు వేసేదాకా వచ్చింది. ‘ది వేవ్’ అని పైగా దక్షిణ తెలుగు తమిళ అట్టహాస కమర్షియల్ సినిమాల ‘మ్యాజిక్’కి విపరీతంగా ఫిదా అయిపోయి ‘ధౌ ది వేవ్’తో రుణమంతా తీర్చుకున్నారు. ఈ మూస ఫార్ములా లవ్ యాక్షన్‌లో తెలుగు తమిళ సినిమాల మసాలాలన్నీ వుంటాయి. రాజస్థాన్, చెన్నై. హైదరాబాద్, పాండిచ్చేరి లొకేషన్స్ చుట్టేస్తూ వీర ప్రేమికుల విహార యాత్రా పోరాటాలుంటాయి. చెన్నై ఫైట్ మాస్టర్ శైలేన్ రాయ్ రూఫింగ్ మెథడ్ అనే టెక్నిక్‌తో కార్లని మనుషుల్నీఎగరేసి బ్లాస్ట్ చేస్తూ ఫైట్లు సృష్టించాడు. ఇదింకా మన తెలుగు సినిమాల్లో ప్రవేశ పెట్టి మసాలా ప్రేక్షకుల్ని ఆనందింప జేయాల్సి వుంది.
2018 ఫిబ్రవరిలో విడుదలైన ఈ అస్సామీ మూస ఫార్ములా కథగా చెప్పుకోవడానికేమీ వుండదు. ప్రేమించుకున్న హీరో హీరోయిన్లని విడదీయాలని సౌత్ సినిమాటిక్ యాక్షన్ కుట్రలు పన్నే కుటుంబాల కథ తప్ప. కాసింత ప్రేమ, కాసింత కామెడీ, ఓ పాట, ఓ ఫైట్, మళ్ళీ కాసింత ప్రేమ, కాసింత కామెడీ, ఓ పాట, ఓ ఫైట్… తిరగలిలా అక్కడే తిరుగుతూ వుంటుంది సినిమా. ఈ కథనం, అవే సీన్లు ఒకదాని తర్వాత ఒకటి రిపీటయ్యే క్రమం పూరీ జగన్నాథ్ సినిమాలు చూసి మోజు పడ్డాడేమో దర్శకుడు లఖినందన్ పెగూ. కళ్ళు చెదిరే కాస్ట్యూమ్స్, హీరోయిన్ గ్లామర్, ఆరు పాటలు, వాటికి తెలుగు తమిళ టైపు గ్రూపు డాన్సులు… ఇంతా చేసి రెండు కోట్లలో తీశారు. వసూళ్లు రెండు కోట్లు దాటాయి. రెండు గంటల 40 నిమిషాల సుదీర్ఘ నిడివితో తీయాల్సినవన్నీ తీసేశారు. ఈ లవ్ యాక్షన్‌కి నేపధ్యంలో ఒక బాధ కూడా చూపించారు. ధీమాజీ వరదల్లో సర్వం కోల్పోయిన ఇద్దరు మిత్రుల ఉపకథ. ఇది కూడా బలంగా ఏమీ వుండదు. ఫార్ములా దృశ్యాలతో వుంటుంది.
ఈ సంవత్సరం ఇప్పటి వరకూ ఇరవై అస్సామీ సినిమాలు విడుదల అయ్యాయి. డిసెంబర్లో ఇంకో ఆరు విడుదల కాబోతున్నాయి. అస్సాం మార్కెట్‌ని ఈ తక్కువ సినిమాలే బతికిస్తున్నాయి. ఈ కమర్షియల్ సినిమాల సందడిలో కొన్ని అర్ధవంత వాస్తవిక సినిమాలు కూడా వస్తున్నాయి. క్యాలెండర్, రక్తబీజ్, విలేజ్ రాక్ స్టార్స్ వంటివి. రీమా దాస్ దర్శకత్వంలో తీసిన ఈ బాలల కథా చిత్రం వచ్చే ఆస్కార్ అవార్డ్స్‌కి విదేశీ చిత్రాల విభాగంలో నామినేట్ కూడా అయింది.
సికందర్ ప్రముఖ సీనియర్ సినీ జర్నలిస్ట్. సినీరంగానికి చెందిన అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉన్న విశ్లేషకుడు. ఎన్నో పత్రికలలో భారతీయ, అంతర్జాతీయ సినిమాలను విశ్లేషిస్తుంటారు. వీరు నిర్వహించే “సినిమా స్క్రిప్ట్ అండ్ రివ్యూ” అనే బ్లాగు ప్రసిద్ధి చెందినది.
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
తగ్గడమే నెగ్గడం
ఆకాశవాణి పరిమళాలు-42
జ్వాల
మా కొలంబియా పర్యటన
ఒక పర్యటన వంద అనుభవాలు-2
All rights reserved - Sanchika™