[వల్లూరి విజయకుమార్ గారు రాసిన ‘సలహాల బామ్మ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


ఆఫీసు ఐదింటికి ఐపోతుందన్నమాటే కానీ తెమలడానికి దాదాపు ‘ఆరూ’ అవుతుంది. అదేంటో కానీ మా మేనేజరుకి సాధారణంగా ఐదింటికే పేపర్లు కదపడం సరదా.
ఈ రోజు కూడా రివాజు ప్రకారం ఆరింటికి బయటపడి, స్కూటరెక్కి, విసుగు, నీరసాన్ని వెంటపెట్టుకుని కొంప చేరాను.
“సుబ్బులు..” అంటూ హాల్లో కాలుపెడుతున్న నాకు మిగిలిన మాట గొంతులోనే వుండిపోయింది.
“రా నాయనా, రా” అంటూ, గుండు మీద ముసుగుని వోసారి పైకి లాక్కుని సాదరంగా ఆహ్వానించింది సలహాల బామ్మగారు.
ఆవిడ ఒళ్ళో మా ఆరేళ్ళ సుపుత్రుడు శ్రీకర్! వాడికి ఆవిడ ఒళ్ళు సోఫా, త్రీడీ సినిమా చూసినట్టు దగ్గరనుండి ఆవిడ గుండు పరిశీలిస్తాడు.
ఓసారి అడగానే అడిగాడు “బామ్మా, నీ జుట్టేమైంది?” అని.
మేం బిక్కచచ్చి పోతుంటే, ఆవిడ పడీ పడీ నవ్వడం! “ఓరి భడవా, మీ తాతయ్య పట్టుకు పోయాడ్రా” అంటూ..
“సుబ్బలక్ష్మి నాకు కాఫీ పట్టుకొస్తానని యిప్పుడే లోపలికెళ్లింది నాయనా. యిలా కూర్చో, మంచినీళ్లు దాహం పుచ్చుకుందువు గాని.” అంటూ.. “లేవరా భడవా, అమ్మని గ్లాసుతో నీళ్లు పట్రమ్మను నాన్నకి” అంది.
ఇంతకీ సలహాల బామ్మ గురించి చెప్పకపోతే, ఆవిడేదో నాకు నాయనమ్మో, అమ్మమ్మో, యింకా అత్తగారో అనుకునే ప్రమాదం కూడా వుంది మరి.
***
సుశీలమ్మగారు మా వీధికి మూడో వీధిలో వుంటారు. ఆవిడ పెద్దకొడుకు ఆవిడ మాటల్లోనే, లొట్టిపిట్టల సీమలో (సౌదీలో) వుద్యోగానికి వెళ్లి, అక్కడే వుండిపోయాడు.
రెండోవాడు యేదో కార్ల కంపెనీలో పెద్ద మెకానిక్కు. పెద్దవాడు పట్టించుకోడు, చిన్నవాడు ముట్టించుకోడు.
ఆవిడ భర్త బతికుండగా యేనాడు వోమూరెడు పువ్వులు తేలేదుట ఆవిడకి. అయన పోయాక ఆ అవసరమూ రాలేదు.
అప్పుడే ఆవిడ కష్టాల్ని చిరునవ్వుతో ఆహ్వానించింది, తనకి తోడుగా వుండిపొమ్మని.
***
అత్తగారు, ఆడపడుచు గొడవ లేకపోటం వల్లో యేంటో కానీ, సుబ్బలక్ష్మికి సలహాల బామ్మ బాగా నచ్చేసింది.
“పాపం పెద్దావిడ కాఫీ నీళ్లకి మొహం వాచిపోతుందండీ..
రేపు పండగొస్తుంది కదా బామ్మగారికి మంచి సైను పంచెకొనాలండోయ్..
కొడుక్కి పెళ్ళై పదేళ్లైనా కోడలికి కడుపు పండలేదని బామ్మగారికి ఒకటే బెంగ మరి..”
ఇలా మా మాటల మధ్యలో సుశీలమ్మ గారు రాని రోజు వుండదు కదా.
“లక్ష్మీ, నువ్వు అతిగా వెళుతున్నావేమో అనిపిస్తుంది.. యిలాటివాళ్లు మంచిరోజు చూసుకుని యే అప్పో సొప్పో అడుగుతారు, అప్పుడు తెలుస్తుంది” అన్నాను నేను. అప్పుడు, శ్రీమతి చూసిన చూపు మర్చిపోలేను.
***
‘ఏమండి, అబ్బాయికి నలతగా వుంది, జ్వరం వచినట్టు, త్వరగా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి” సుబ్బలక్ష్మి ఫోనుతో కంగారుగా బయల్దేరాను ఆఫీసునుండి.
‘నిన్నంతా బానేవున్నాడే, ఏమైందో.’ నాలో కంగారు.
శ్రీకర్కి కళ్ళు కొంచం ఎర్రపడ్డాయ్, ముక్కు కారుతోంది. జ్వరం కూడా వున్నట్టుంది, బయటేదో తిన్నట్టున్నాడు, వంటిమీద ఎర్రగా దద్దుర్లు.
“పద లక్ష్మి, త్వరగా తెములు,.. డాక్టర్ దగ్గరకి”, అంటుంటే సలహాల బామ్మ యెవరో రమ్మన్నట్టు వచ్చేసింది, “ఎక్కడికి లక్ష్మీ, వెడుతున్నారు” అంటూ.
అప్పటిదాకా మంచం మీద పడుకున్న శ్రీకర్ ఆవిడ గొంతు వినగానే “బామ్మా” అని ఆవిడని చుట్టేశాడు, “బామ్మా చూడు, వూష్టం వచ్చింది” అంటూ.
“వీడినోసారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి, ఆలస్యం ఐతే ఆయన బిజీ ఐపోతాడు. మేము వెళుతున్నాం” అన్నాను, యింక మీరు దయ చేయండి అన్నట్టు లేదూ నా జవాబు! కానీ ఆవిడ పట్టించుకోందే!
కుర్రాడిని మెడ ముట్టుకు చూసింది. “జొరం వుందిలే.. అన్నట్టు యీ దద్దుర్లేవిటో!” అంటూ శ్రీకర్ చొక్కా విప్పి చెయ్యి యెత్తి చంక కింద చూసింది. నుదుటి మీద రాస్తూ “లక్ష్మీ, కంగారు లేదు, వీడికి ఆటలమ్మ సోకిందంతే” అంది.
నాకైతే ఒళ్ళు మండిపోతోంది. ఈవిడేమన్నా డాక్టరా.. వెధవ డయాగ్నోసిస్సు యీవిడాను..
“లక్ష్మీ, పద సమయం సందర్బం లేకుండా మాటలు పెట్టుకోకు”. గట్టిగానే అన్నాను.
“ఎక్కడికర్రా చలిగాల్లో పిల్లాడితో..”
నా మాటలు ఆవిడేం పట్టించుకోలేదు. “నా మాట విను నాయనా” అంటూ మాతోపాటు బయకొచ్చిన ఆవిడ్ని అక్కడే వుంచేసి యిల్లు తాళం పెట్టి స్కూటర్ ఎక్కేసాను.
ఆటలమ్మట, ఆటలమ్మ.. సలహా కూడాను, ఎవడిక్కావాలి యీవిడ బోడి సలహా.
***
“చూడమ్మా, ఆటలమ్మ సోకింది, కానీ అదే తగ్గిపోతుంది. చల్లగాలిలో తిప్పకుండా యింటికెళ్లిపొండి. మరీ జ్వరం వస్తే యీ సిరప్ యివ్వండి చాలు” డాక్టర్ ఉవాచ!.. “అవునూ దశరథరావ్, యింట్లో పెద్దవాళ్లెవరూ లేరా, యిలాటప్పుడు తోడుగా!” లక్ష్మీ నేనూ మొహమొహాలు చూసుకున్నాం.
“మీకు తొందరెక్కువ. బామ్మగారు వినేలా యెంత విసుక్కున్నారు. పాపం ఆవిడకి శ్రీకరంటే పంచప్రాణాలూను” ఇల్లు సమీపిస్తుంటే వెనకనించి సుబ్బలక్ష్మి మాటలు వినిపిస్తున్నాయి.
మసకచీకట్లో, యింటిముందు యెవరో తచ్చాడుతున్నారు.. అవును యింటి బయట బామ్మగారు. ఆవిడ ఇంటికెళ్ళకుండా యింకా యిక్కడే!
తొందరపడ్డాను, కనీసం “బామ్మగారూ, మీరు కూర్చుని టీవీ, చూస్తూండండి మేము వచ్చేదాకా”, అని కూడా అనలేదు కదా. తాళం వేసిన యింటిముందు ఆవిడ కాపలాగా!
ఛ, తలొంచుకుని లోపలికి వెళ్ళాను.
“ఏమ్మా, ఏవన్నాడు డాక్టరు,.. నే చెప్పలే.. ఎందుకో యింటికెళ్లాలనిపించలేదమ్మా.. మీరొచ్చేదాకా వుండిపోయా”.
లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.
“ఏడవకే తల్లీ యింతమాత్రానికే, నేనులేనూ, చూసుకుంటాలే.. పదండి లోపలికి..”
***
సలహాల బామ్మ ఆటలమ్మ తగ్గేవరకూ శ్రీకర్ని అంటిపెట్టుకునే వుంది. వాడికి రెండోరోజు తట్లు వంటిమీద యెక్కువయ్యాయి. ఇదంతా మాకు కొత్త. అసలు బామ్మగారు యింటికెళ్ళేదా, పడుకునేదా అన్నట్టే వుండేది.
వేపాకు, పసుపు నూరి ఒంటికి రాయడం, చాపమీద వాడి పక్కనే కూర్చుని వేప మండలతో విసరడం, వొళ్ళంతా నిమరడం..
“మీకు తెలిదు, వూరుకోండి” అంటూ బామ్మ వాడిచేత అరటిపళ్ళు, దోసకాయ ముక్కలు తినిపించేది. కొబ్బరినీళ్లు, మజ్జిగ అన్నం యిదే వాడి ఆహారం.
పదిరోజులకు ఆటలమ్మ దిగిపోయింది. బామ్మే దగ్గరుండి వాడికి పసుపునీళ్లు వేపాకుతో కలిపి పోసి.. యిల్లంతా వేపాకు నీళ్లు జల్లి..
అమ్మే వుంటే యింతగా చెయ్యగలదా.. యేమో!
ఆటలమ్మ తగ్గి మూడునీళ్లు పోసేవరకు వంటిల్లు కూడా బామ్మే కబ్జా చేసింది. పోపులు వెయ్యకుండా వుడికించిన కూరలతో కడుపు నిండా భోజనం.
సలహాల బామ్మ శ్రీకర్కి పేదరాశి పెద్దమ్మ, లక్ష్మికి పెద్దదిక్కయింది, నాకు.. నాకు.. ఆవిడలో తల్లి కనిపించింది.
***
ఆ రోజు కూడా ఎప్పట్లాగే అంతా హాల్లో కూచున్నాం. శ్రీకర్ బామ్మ ఒళ్ళో.. ఆవిడ మెడలో గొలుసు అటూ యిటు తిప్పుతూ కబుర్లు.
“లక్ష్మి, బామ్మగారికి కాఫీ యిచ్చావా?” అడిగాను.
“ఆ యిచ్చింది నాయనా, సుబ్బలక్ష్మి చేతి కాఫీ భేషుగ్గా ఉంటుంది.. బాబూ నాదో సలహా..”
ఈసారి నాకు కోపం రాలేదు, విసుగూ రాలేదు. “చెప్పండి బామ్మగారూ” అన్నాను.
‘వెధవాయికి యేడో యేడు కదా, చిన్నప్పుడే వాడికి ఒడుగు చేస్తే మంచిది నాయనా. వద్దనకు. నాకు తెలిసిన శాస్త్రి గారు వాడి నక్షత్రం బట్టి ఒడుగు ముహూర్తం పెడతారు. రమ్మని చెప్పనా?”.
“అలాగే, మీ యిష్టం” అనేశాను.
ముహుర్తం ఇంకా మూడు నెలలుందనగా, సందడి బామ్మగారే. కొత్త పీట, బట్టలు, ఉద్దరిణి, పంచపాత్ర, వెండి దంజం.. తెప్పించారు.
“ఒరేయ్ శ్రీకరూ, ఒడుగులో పంచశిఖలు పెట్టుకోవాలోయ్..”
“అంటే యేంటి బామ్మా?”
“గుండుచేసి, ఐదు పిలకలు పెడతారు, అప్పుడు నీచేత గాయత్రి మంత్రం చదివిస్తాడు మీ నాన్న.”
“ఉహు గుండొద్దు బామ్మా, పిలకలు పెట్టుకోను..”
“మా బాబు కదూ, అలా అనకూడదు. చక్కగా పంచశిఖలు పెట్టుకుంటే నిన్ను చూడాలని వుందిరా. మీ తాతయ్యకి అలాగే పెట్టారుట. నామాట వింటే, నా మెడలో గొలుసు నీకిస్తాను సరేనా!”
శ్రీకర్ బామ్మనే చూస్తున్నాడు.
“నిజంగా!”
***
“సుబ్బలక్ష్మీ మా వాడు యే కళ నున్నాడో.. నన్నుబతికుండగానే కాశీ తీసుకెళ్తానన్నాడు. నేను, వాడు, కోడలూ యిలా కాశీ వెళ్లి ఆలా ఒడుగు ముహూర్తానికి ముందే వచ్చేస్తాం. కాశీలో ఆయనకి తర్పణాలు వదిలేస్తే అంతే చాలు నా జన్మకి”.
“అదేమిటి, యిప్పుడా ప్రయాణం, ఒడుగు అయ్యాక వెళ్ళండి” అంది సుబ్బలక్ష్మి .
“అలా కాదు తల్లీ, వాడికి మళ్ళీ సెలవు దొరకదు. వాడి మనసు మారేలోగా వెళ్ళొచ్చేస్తా. మనవడి ఒడుగు నేను లేకుండా అవుతుందా.. శుభంగా గంగాజలం తీసుకొస్తానమ్మాయ్ శుభకార్యానికి”.
భరోసాతో రైలెక్కింది సలహాల బామ్మగారు.
***
కాశీ వెళ్ళాక బామ్మగారు ఒక్కసారే మాట్లాడింది కొడుకు ఫోన్లో. “లక్ష్మీ అన్ని ఏర్పాట్లూ సవ్యంగా జరుగుతున్నాయి కదూ”, అంటూ.
ఆ తరవాత పనిలోపడి మేమూ మాట్లాడలేదు.
ఒడుగు ముహూర్తం రేపే. బామ్మ యింకా రాలేదు, ఫోన్ కలవట్లేదు.
‘ఈ కాలం కుర్రాళ్ళకి యెంత నిర్లక్ష్యమో. కనీసం యిందుకు రాలేకపోతున్నామనో, ఫలానప్పుడు వస్తామనో ఆ తల్లి చేతైనా మాట్లాడించవచ్చుకదా!’ నాలోనేనే సణుకున్నాను.
సలహాల బామ్మ లేకుండానే ఒడుగు జరిపించేసారు పంతులుగారు. శ్రీకర్ పంచశిఖలతో భలే వున్నాడన్నారు వచ్చిన వాళ్ళందరూ.
***
ఆ రోజు ఆదివారం. తీరిగ్గా నేను శ్రీకర్ చేత సంధ్యావందనం చేయిస్తున్నా. తలుపు శబ్దం ఐతే లక్ష్మి వెళ్ళింది.
వచ్చింది బామ్మగారి కొడుకు శంకర్, కోడలు జయ!
“ఒడుగై పోయాక వస్తారా? కనీసం ఫోనైనా చెయ్యరా. మీ అమ్మగారికోసం, మేం యెంత ఆత్రుత పడ్డామో తెల్సా?”. వచ్చినవాళ్ళని మాట్లాడనివ్వకుండా అడగాల్సినవి నాలుగూ అడిగేసాను.
“సారీ అంకుల్, అలా అనుకోకుండా జరిగిపోయింది. నిన్నరాత్రే వచ్చాము కాశీ నుంచి” ..జవాబు చప్పగా వుంది.
“బామ్మగారేరీ, వస్తున్నారా?”, పలకరించింది సుబ్బలక్ష్మి వాళ్లకి తాగటానికి గ్లాసులో నీళ్లిస్తూ.
అబ్బాయి తనతో తెచ్చిన గంగ చెంబు బల్లమీద పెట్టాడు నెమ్మదిగా, “అమ్మ మీకివ్వమంది” అంటూ.
కోడలు గుప్పిట్లో పెట్టుకున్న గొలుసు మా వాడి మెడలో వేసింది. అది బామ్మ గారి గొలుసు.
మాకైతే యేమి అర్థం కావట్లే.
“అమ్మని కాశీలో వదిలేసి వచ్చాము” డగ్గుత్తికతో అన్నాడతను.. వర్షిస్తున్న కళ్ళతో.
అప్రయత్నంగా మా కళ్ళలో నీళ్ళు.. లేచి శంకర్ని దగ్గరగా తీసుకున్నాను, గొంతు మూగపోయింది.
ఆ రోజే సాయంత్రం సలహాల బామ్మ ఫోటో మా యింట్లో గోడమీద కొచ్చింది.
ఫొటోలో బామ్మ నవ్వుతోంది, ‘మీకేం కావాలన్నా నేనున్నానర్రా!’ అంటూ.