ఏదైనా సినిమా చూశాకా బావుందనిపిస్తే ఒకసారి చూడచ్చు లేదా తప్పక చూడాల్సిన సినిమా అనీ; నచ్చకపోతే బాలేదనో, టైమ్, డబ్బులు వేస్ట్ అని తోటివాళ్ళకి చెబుతాం. ఇంకాస్త ఎక్కువగా నచ్చితే మీడియాలో షేర్ చేసుకుంటాం. అలాంటిదే ఈ ప్రయత్నం. ఈ మధ్య కాలంలో నేను చూసిన ఓ థ్రిల్లర్ సినిమా నాకెందుకు నచ్చిందో చెప్పడమే నా ఉద్దేశం.
తమిళ హాస్య నటుడు వివేక్ ప్రధానపాత్రలో నటించిన ‘వెళ్ళయ్ పూక్కల్’ (Vellai Pookkal) అనే తమిళ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూశాను. గత ఏప్రిల్ నెలలో థియేటర్లలో విడుదలయింది ఈ సినిమా. నిజానికి సబ్ టైటిల్స్ లేకపోయినా సినిమా చాలా వరకు అర్థమవుతుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు విజయవంతమవ్వాలంటే – సినిమా నడిచినంత సేపూ ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేయాలి. కథనం గ్రిప్పింగ్‌గా ఉండాలి, సన్నివేశాలు లాజికల్‌గా ఉండి ఒకదాని తర్వాత ఒకటిగా బిగి సడలకుండా వస్తూ వీక్షకుడి దృష్టి మళ్ళకుండా చూడాలి. లేదా ప్రేక్షకుల ఊహకి అందని విధంగా విభిన్నంగా ఉండాలి, అప్పుడే అవి విజయవంతమవుతాయి.
ఈ సినిమా తమిళనాడులో కమర్షియల్‌గా విజయవంతమైందో లేదో నాకు తెలియదు. కానీ ఒకసారి చూడదగ్గ సినిమా. రన్ టైమ్ 120 నిమిషాలయినా బోర్ కొట్టదు.
వివేక్ ‘రుద్రన్’ అనే పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. వివేక్ అంటే తెలియని వాళ్ళకి, ‘శివాజీ’ సినిమాలో రజనీకాంత్ పక్కనుండే పాత్రధారి అన్నా, ‘రఘువరన్ బి.టెక్.’లో ధనుష్ పక్కన ఉండే పాత్రధారి అన్నా వెంటనే గుర్తొస్తుంది. హాస్యపాత్రలలో, హీరోల పక్కన సైడ్ కారెక్టర్స్ లోనూ కనబడే ఈయనని ప్రధాన పాత్రకి ఎంచుకోవడమే విశేషం. సీరియస్ పాత్రలో ఆయన బాగానే ఇమిడిపోయారు.
పోలీస్ అధికారిగా రిటైర్ అయిన రుద్రన్ తన తెలివితేటలతో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో జరిగిన హత్యలకు కారణమైన నేరస్థుడిని పట్టుకోవడంతో సినిమా ప్రారంభమవుతుంది. దాని తర్వాత డిజిపి రుద్రన్ని అమెరికాకి పంపుతాడు – పని మీద కాదు, కొన్నాళ్ళు అతని కొడుకుతో ఉండమని!
రుద్రన్ కొడుకు అజయ్ అమెరికాలోని సీటెల్‌లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తూంటాడు. తన అభీష్టానికి వ్యతిరేకంగా అజయ్ ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్ళి చేసుకోడంతో రుద్రన్ అజయ్‌తో మాట్లాడడం మానేస్తాడు. ఇన్నేళ్ళ తర్వాత కొడుకు దగ్గరకి వెళ్ళడమంటే రుద్రన్ వెనుకాడుతాడు, కానీ డిజిపి గట్టిగా చెప్పడంతో తప్పక, అమెరికా బయల్దేరుతాడు.
కొడుకు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి, ఇంటికి తీసుకెళతాడు. కోడలు అలైస్ 30 రోజులలో తమిళం నేర్చుకోడానికి ప్రయత్నిస్తూ చిన్న చిన్న తమిళ పదాలతో రుద్రన్ని పలకరిస్తుంది. కాని అతను ఆమెను పట్టించుకోడు. కోడలు ఎంత కలుపుకుపోదామన్నా, అతడామెని ఎవాయిడ్ చేస్తాడు. ఓ రోజు ఓ మాల్లో భారతీదాసన్తో పరిచయమవుతుంది. అతను అజయ్ కొలీగ్ రమ్య నాన్న అని తెలిసాక, రుద్రన్ భారతీతో కలిసి తిరుగుతుంటాడు. భారతీ పాత్ర ధరించినది మరో కామెడీ ఆర్టిస్ట్ చార్లీ. ఈయన కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించారు (నాగార్జున ‘నిర్ణయం’, సందీప్ కిషన్ ‘నగరం’). వీరిద్దరి మధ్య సంభాషణలు సరదాగా ఉండి కాస్త నవ్వు తెప్పిస్తాయి.
ఇదిలా ఉండగా వీరి ఇరుగుపొరుగున ఉన్న వారిళ్ళలో కిడ్నాపులు జరుగుతూ, కొంతమంది కనిపించకుండా పోతారు. హత్యలు జరుగుతాయి. రుద్రన్లోని పోలీసు మేల్కొంటాడు. స్థానిక పోలీసులకు సహకరిస్తానంటే, వాళ్ళు వద్దంటారు. ఇదిలా ఉండగా ప్రధాన కథలో ఉపకథల్లా మాదకద్రవ్యాలమ్మే ఒక గ్యాంగ్ ఎదురవుతుంది. వాళ్ళపైనా అనుమానం వస్తుంది. ఒక డ్రగ్ అడిక్ట్ తల్లీ కూతుళ్ళని హింసలకి గురిచేస్తూ, చిన్నపిల్లలని ఎత్తుకొచ్చి అఘాయిత్యం చేస్తుంటాడు. అతనో డంప్ ట్రక్ డ్రైవర్ కావడంతో అతని మీద అనుమానం వస్తుంది. అక్రమంగా అమెరికాకొచ్చిన ఒక సిరియన్ కుటుంబం ఆ నైబర్‌హుడ్‌లో రహస్యంగా నివాసముంటుంది. ఆ కుటుంబంలోని వ్యక్తే నేరస్థుడు అని భారతీ సంశయిస్తాడు. ఇక అజయ్ కూడా కిడ్నాప్ కావడంతో రుద్రన్ స్వయంగా రంగంలోకి దిగుతాడు.
పరిశోధన ఎలా సాగుతుంది? నేరస్థులని పట్టుకోడానికి లభించిన ఆధారం ఏంటి? నేరాలు చేయడానికి మోటివ్ ఏమిటి? అసలు నేరస్థులెవరు అన్నది తెలియడం కోసం సినిమా చూడాల్సిందే.
నేరస్థుడెవరో తెలుసుకోవడానికి రుద్రన్ తనదైన ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తాడు. ఒక్కోసారి తానే నేరస్థుడిగా అనుకుంటూ… ఆ పాత్ర ఎలా ప్రవర్తించిందో వివరిస్తాడు. మరోసారి తన మనస్సులోనే బాధితులందరినీ ఒక చోటకి చేర్చి ఆయా ఘటనలకు లింక్ ఏర్పాటు చేస్తూ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. ఈ పద్ధతి డిఫరెంట్‌గా ఉండి, బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఒక్కోసారి సంభాషణలు సుదీర్ఘంగా ఉండి విసుగనిపించే లోపు, మరో సన్నివేశంలోకి మార్చి ఆసక్తి సన్నగిల్లకుండా చేస్తాడు దర్శకుడు.
ఈ సినిమాకి ఛాయాగ్రహణం చేసిన జెరాల్డ్ పీటర్ సీటెల్ అందాలను అద్భుతంగా చూపించాడు. థ్రిల్లర్ సినిమాలకి కావల్సిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి బాగా కుదిరింది. ఈ సినిమాకి కథని షణ్ముగ భారతి, వివేక్ ఇలన్‌గోవన్ అందించారు. సీటెల్‌కి చెందిన ఇండస్ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. వివేక్ ఇలన్‌గోవన్ దర్శకత్వం వహించాడు.
వెళ్ళయ్ పూక్కల్ అంటే తెల్ల పువ్వులు అని అర్థం. సినిమా చూశాకా, ఆ టైటిల్ ఎంత సబబో అర్థమవుతుంది. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకు భిన్నంగా, ఇద్దరు హాస్య నటులను ప్రధాన పాత్రల్లో చూపిస్తూ నడిపిన సినిమా ఇది. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఈ దర్శకుడికి ఇది మొదటి సినిమానే అయినా ప్రేక్షకులని నిరాశపరచని రీతిలో తెరకెక్కించాడు!
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి హిందీ, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కథలను అనువదిస్తున్నారు. ఇప్పటి దాక 40 సొంత కథలు రాసారు, 125 కథలను, నాలుగు నవలలు అనువదించారు. మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నిస్తుంటారు. వివిధ ప్రచురణకర్తల కోసం పుస్తకాలను అనువదించారు. వివిధ పత్రికలలో పుస్తకాల పరిచయ వ్యాసాలు రాస్తూంటారు.
సోమశంకర్ గారూ, తప్పు పట్టాలని కాదు, seattleని సియాట్ల్ అని పలుకుతారు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™