“అసలు ఎలా జరిగింది. ఏమి జరిగింది” ఎయిర్పోర్ట్ లోని డొమెస్టిక్ డిపార్చర్స్ లాంజ్‌లో కూర్చుని ఉన్న ప్రియాంక రాహుల్‌ని అడిగింది. పక్కనే ఉన్న సిద్ధార్థ్ తన మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు.
“ఏం జరిగిందో నాకు తెలీదు కానీ, ఎవరో ప్రసాద్ గారని మీ జె.హెచ్. పార్టీ ఎం.ఎల్.ఏ. అట. ఫోన్ చేశారు, బాగా సీరియస్ స్ట్రోక్ అయితే కామినేని హాస్పిటల్స్‌లో జాయిన్ చేసారని చెప్పాడు. నేను అంతకు మించి విషయాలేమీ తెలుసుకోలేదు. వెంటనే నీ గురించి వెతకడం ప్రారంభించాను” రాహుల్ సమాధానం ఇచ్చాడు.
ప్రియాంక, రాహుల్, సిద్ధార్థ్ వీళ్ళు ముగ్గురు చెన్నై లోని ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో విద్యార్థులు, ఇంకా మంచి స్నేహితులు కూడా. ప్రియాంక మరియూ రాహుల్ యొక్క తండ్రులు ఇద్దరూ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ బలగాలకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు, వీరిద్దరూ గతంలో కనీసం రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన దాఖాలాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రియాంక తండ్రి ప్రతిపక్షంలో ఉండడం వలన రాహుల్ తండ్రికి ప్రస్తుత ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలున్నాయి. చిన్నప్పటి నుంచీ రాజకీయాలకు దూరంగా తమ సంతానాన్ని మంచి స్నేహితులుగా పెంచారు. తాము ఎన్నటికీ తమ తండ్రుల బాటలో నడవకూడదు అని రాహుల్, ప్రియాంకలు నిర్ణయించుకున్నారు.
ఒక వైపు గత ఎన్నికల్లో తన తండ్రి ఎలెక్షన్ కాంపైన్‌కి మద్దతు పలికిన బడా పారిశ్రామికవేత్తల వొత్తిడి, మరో వైపు రోజురోజుకీ పెరుగుతున్న ప్రజా సమస్యలు, అసంతృప్తి, రాజకీయ హత్యలు ఇటువంటి అనూహ్య పరిణామాలు తనకు తెలియకుండానే తనని ఈ రొంపిలో దిగేలా చేస్తాయా? తమ తండ్రులు రహస్యంగా రాజకీయాల కోసం ఏదైనా చెయ్యడానికి ఆఖరికి హత్యలు కూడా చేయించడానికి సిద్ధమే అని బయట చెప్పుకుంటున్న మాటలలో ఎంత వరకూ నిజం ఉంది. వారసత్వ రాజకీయాలకు తాను పూర్తిగా వ్యతిరేకం అని నిరంతరం వాదించే ప్రియాంక తన తండ్రి పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించనుందా?
రాజకీయ పరంగా పదవిని కోల్పోయి ఇప్పటికే పీకల్లోతు కేసులలో ఇరుక్కుపోయిన కేంద్ర మంత్రి, తన తండ్రికి ఆప్తమిత్రుడు అయిన నేత ప్రియాంకకు ఏ విధంగా సహాయపడగలడు. సిద్ధార్థ తమ ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా మద్దతు తెలుపుతాడు. ముగ్గురు స్నేహితులు చివరికి బద్ధ విరోధులు కాబోతున్నారా. తెలుసుకోవాలంటే తప్పకుండా చదవండి ‘రాజకీయ వివాహం’.
రచయిత శ్రీ వేటూరి ఆనంద్ పూర్తి పేరు వేటూరి రామ బ్రహ్మానంద శాస్త్రి. ‘రాజకీయ వివాహం’ ఆయన రెండవ నవల. ఆనంద్ గతంలో ‘పైశాచికం’ అని ఒక థ్రిల్లర్ నవల రచించారు. ఇదే నవలని గోదావరి ప్రచురణలు అనే ముద్రణా సంస్థ త్వరలోనే ఇంగ్లీష్, తెలుగు భాషలలో ప్రచురించనుంది. ఇదే కాకుండా ప్రముఖ రచయిత మరియూ అబ్దుల్ కలాం గారికి సన్నిహిత విద్యార్ధి అయిన ‘శ్రిజన్ పాల సింగ్’ ఆంగ్లంలో రచించిన ‘what can I give’ అనే పుస్తకాన్ని తెలుగులోకి ‘నేను ఏమివ్వగలను’ అనే పేరిట ఆనంద్ అనువదించారు, అది కూడా గోదావరి ప్రచురణల ద్వారా ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలయ్యింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™